.నేను నడిచే దారి సరైనదా ? కాదా? చూసి చెప్పండి [అసలేం జరుగుతోంది....2 వభాగం]
>> Tuesday, March 9, 2010
.
భగవంతుని అనుగ్రహం చేత నాకు తిండికి లోటు లేదు.పరమాన్నం కాకున్నా వచ్చినవారికి పచ్చడి మెతుకులతోనైనా నాకున్నది పెట్టి తృప్తి పరచగలననే నమ్మకముంది. పొట్టబోసుకోవటానికి ధర్మ మార్గం లో సంపాదించుకునేందుకు ఒక ఉద్యోగం ఉంది. ఉన్నదానితో సంతోషపడగల సంతృప్తి పడగల శక్తి ఉంది. రేపనేది ఏమి జరగాలో అది భగవంతుని చేతిలో నిర్ణయం అనే నమ్మకముంది. ఏ మయ్యా ! పిల్లలకోసం ఏమి సంపాదించటం లేదు రేపు వాల్ల గతేమిటి అనే బంధువులు స్నేహితులతో మానాన్నగారంటుండేవారు "నాకు ముగ్గురూ మొగపిల్లలు .కాళ్లుచేతులు అన్నీ సక్రమంగా ఇచ్చాడు భగవంతుడు వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతకలేకపోతారా ? మొగపిల్లలే కాబట్టి గోచి గుడ్దకట్టుకున్నా దిగులు లేదు .ఆడపిల్ల లైతే నాకు కష్టమే .వాళ్లకు ఏది ప్రాప్త మవుతుమ్దో అది వస్తుంది అనేవాడు. మా తాతగారు కూడా ఎప్పుడూ అన్నదానాలని పూజలని అమ్మవారి సంతోషం కోసం ప్రయత్నించాడే తప్ప ఆస్తులకోసం వెంపర్లాడలేదు. ఇక నాకిప్పుడు ఇద్దరు మగపిల్లలు . వాళ్లు చదువులో ప్రతిభకనపరుస్తూ నాతోటి ఉద్యోగస్తుల పిల్లలు కార్పోరేట్ సంస్థలలో చదివితే నాపిల్లలు మెరిట్ మీదనే ప్రభుత్వం కల్పిస్తున్న మంచి విద్యను పొందగలుగుతున్నారు. కాబట్టి చదువు చెప్పించటం వరకు నాబాధ్యతేగాని మిగతా వాని జీవితరేఖలన్నీ నేనే దిద్దాలనే వెర్రి వ్యామోహం లేదు . నేను చేసే పనులకు నాతమ్ముళ్లిద్దరూ చేదోడుగా ఉన్నారు. ఈరోజుకూ నామాట కెదురు చెప్పరు. నానిర్ణయాలను వ్యతిరేకించాలని నా సహచారిణి ఏనాడు ఆలోచించదు.
వీటన్నింటికంటే పెద్దసంపద నాకుంది . చదువు సంధ్యలు లేకున్నా అమ్మ అనుగ్రహాని కి పాత్రుడై మా తాతగారు నెలకొల్పిన శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో స్థిర నివాసియై విరాజిల్లుతున్న మా బంగరు కొండ " అమ్మలకమ్మ దుర్గమ్మ" నాకు ఎనలేని సంపద. ఏ పూర్వజన్మలో పుణ్యమో ఆతల్లి మమ్మలను సదా తన చల్లని చూపులతో పోషించి లాలిస్తుంది. తాను ఇక్కడున్నాను అనే నిదర్శనమిస్తూ నా జీవితాన్ని నడుపుతూ మాచేత దివ్యమందిరాన్ని నిర్మింపజేసుకుని మాసేవలను స్వీకరిస్తున్నది. మాజన్మలకు సార్ధకత చేకూరుస్తున్నది. ఆవివరాలు ఇక్కడ చూడండి
http://durgeswara.blogspot.com/2008/11/blog-post_20.html
పైన చెప్పినదంతా నాకు వ్యక్తిగతంగా సుఖమే , కానీ చుట్టూ చూస్తే తీవ్ర అశాంతి ,దు:ఖము .వేదనలు రోదనలు. నాడు ఎకరానికి పదిబస్తాలు పండిననాడు లేని కరువు నేడు ఎకరాకు ఏభై బస్తాలు పండేరోజు కనపడుతుంది .నాడు గుడెసెలో నివసించినా ఉన్నభద్రత నేడు మేడలో లేదు. నాడు ప్రతిమనిషిలో కనిపించిన సంతృప్తి స్థానం లో ఇప్పుడు అసంతృప్తి తిష్టవేస్తుంది . నాడు చదువులేకున్నా సంస్కారాలకు కొదవలేదు .నేడు సంస్కారాల్లేని చదువులు మెదల్లలో నిండిపోతున్నాయి , చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని పెద్దలుచెప్పగా మోసాలు చేసేవాళ్లలో తొంభైశాతం నేడు చదువుకున్నవాల్లే కనబడుతూ ఉన్నారు. తాను తినలేనంత సంపాదించినా తృప్తిపడక ఇంకా పోగేయాలనే తపనతో మిగతా జీవులనోటివద్ద నుండి లాక్కుంటున్న వాళ్లొకవైపు , తమకు ప్రాప్తం లేనిది ఇంకొకరికి దక్కకూడదన్న ఆలోచనతో విధ్వంసానికి తెగబడుతున్న తెగలొకవైపు అల్లకల్లోలాలు సృష్టిస్తున్నాయి. కామితార్ధప్రదాయిని అగు దైవంతో సమానంగా చూసిన స్త్రీలను కామదృష్టితో మాత్రమే చూసే సంస్కృతి పెరిగిపోతోంది . ఉఛ్ఛనీచాలు , వావి వరుసలు లేని ,తాగుబోతు,తార్పుడుగాళ్ల గుంపులు సంస్కృతులు మనపిల్లలపై శరవేగంగా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి . జనంలో దైవభక్తి ,పాపభీతి నశించి పోతోంది . దీని సరిదిద్దాలని ప్రయత్నిస్తున్న మహత్ముల ఆవేదనలు కల్లముందు కనపడుతున్నాయి . స్వర్గతుల్యమైన ఈ భూమి క్రమేపీ రాక్షసాంశల ఆక్రమణలో వందల ఏళ్లతరబడి బందీ అయిపోతూ దేవ సంస్కృతి ధ్వంసమొనరించబడుతున్నది. దీనిని రక్షించుకోవలసిన వారసులు "కలి " మాయా ప్రభావానికి లోనై తమ సంస్కృతిని ధర్మాన్ని తామే అవహేళన చేసుకుంటూ , నిర్వీర్యులై ,శక్తిహీనులై ,తాగుబోతులై తార్పుడుగాళ్లై ఈ భరతమాత కు కన్నీళ్లు పెట్టిస్తున్న సంతానంగా తయారవుతున్నారు. ఒకవైపు ఆవేదనతో రగిలిపోతూ ఈ ధర్మాన్ని రక్షించుకోవటానికి పోరాడుతున్న ధర్మ వీరులు ఆశాజ్యోతులుగా కనపడుతున్నారు. జాతి మనసులో విపరీతమైన పిరికితనాన్ని నింపి జీవఛ్ఛవాలుగా మార్చే కలి ప్రచారాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి . ఇలా జరుగుతుందని భవిష్యపురాణాదులు ఏమని హెచ్చరించాయో , ఆ దృశ్యాలు నా కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి. ఇప్పటిదాకా నేను సంతోషంగా సాటిజీవులతో సహజీవనం చేయగలగటానికి మూలమైన ధర్మము, సంస్కృతి నా బిడ్డలకు ,తరువాత తరాలకు అందుతుందా ? ఏమో ! సందేహమే . ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మీదే నని పరమగురువులు వేదనతో చేస్తున్న హెచ్చరికలు వినకుండా పోతున్న వారిలా చెవిటివాళ్ళలా నటించలేను. నాకేబాధ్యతా లేనట్లు నిష్క్రియాపరత్వంతో జీవచ్చవంలా బ్రతకలేను .
కనుకనే దీనికి కారణమేమిటా అని ఆలోచిస్తే యుగధర్మము అని అర్ధమవుతున్నది. ,యుగయుగాలుగా భగవద్భక్తులు సాగించిన పోరాటాలు పరిశీలిస్తే వారి వేదనకు అర్ధం తెలుస్తున్నది. రాక్షసులు ప్రబలినప్పుడల్లా లోకానికి అశాంతి ప్రజ్వరిల్లింది . అప్పుడు భగవంతుడు స్వయంగా అవతరించవలసి వచ్చింది . రాక్షసులు జళం లో నివసించినప్పుడు మత్స్య,కూర్మాది అవతారాలు ధరించాడు స్వామి . వాళ్లు నీల్లమధ్యలో హిరణ్యాక్ష ,రావణాది అవతారాలలో ఉన్నప్పుడు వాళ్లను నారసింహ, రామాది అవతారాలలో నిర్మూలించాడు ఆయన . ఇలాకదనుకుని మానవుల బంధువుల రూపంలో ,జరాసంధ, దుర్యోధన .కంసాది రాక్షసులను కృష్ణా వతారం లో పరిమార్చాడు ,మానవులను శక్తివంతులుగా చేసి. ఇహ లాభం లేదు ప్రత్యక్షంగా కనపడకూడదనుకుని రాక్షసులు ఇప్పుడు మనుషుల మనసులలో తమ నివాసం ఏర్పరచుకుంటున్నారు.మనుషులలో తమ భావాలను విస్తరిల్లజేసి వేదనలకు గురిచేస్తున్నారు. వీళ్ళ సంఖ్య ప్రబలుతున్నసూచనగా లోకంలో అల్లకల్లోలాలు పెరిగిపోతున్నాయి. ఆ తాకిడి కి ఈ పుణ్యభూమికూడా తల్లడిల్లిపోతోంది.
వీళ్లతో మనకెందుకు మనజపమేదో మనపూజేదో మనం చేసుకుందాం అని వారి జోలి పోకుండా వాల్లకు దూరంగా బ్రతుకుదామనుకోవచ్చు కొందరు. కానీ అది సాధ్యం కాదు. ఉదాహరణకు చూడండి పూర్వం ఋషులు ఎక్కడో అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నారు కదా అని వదలలేదు. వెళ్ళి వాళ్ల యజ్ఞవాటికలలో రక్తమాంసాలు గుమ్మరించేవారు. ఋషివాటికలను ధ్వంసం చేసి ,మునులను హిసించి చంపేవారు . ఎందుకని సాధు హింస వాల్లకు ఆనందం . భగవంతుని నమ్మినవారిని ద్వేషించి వధించటం వారికి కర్తవ్యం . ఇప్పుడు ఎవడే మతాన్ని నమ్మితే మనకేమిటి ? ఎవడీ ధర్మాన్ని వీడిపోతే మనకేమిటి ? అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండే వాళ్లకోహెచ్చరిక . మహాభారత యుద్ధంలో దుర్యోధనాదులను చంపటం సరే . ధర్మాత్ములైన భీష్మ,ద్రోణ కర్ణాదులను చంపించటం అదీ భగవంతుడూ దగ్గరుండి అని సందేహం కొందరికి వస్తుంది . మీకు నోరిచ్చాను ,ఆలోచిమ్చగల మెదడునిచ్చాను. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్నిచ్చాను ఒక స్త్రీకి అవమానం జరుగుతుంటే కనీసం నోరెత్తి ఇది తప్పు అని నివారించటానికి మీకు రకరకాల కారణాలు అడ్డువచ్చాయా ? అధర్మానికి పాల్పడటమే కాదు .ధర్మహాని జరుగుతుంటే చూస్తూ మిన్నకుండటమ్ కూడా పాపమే కనుక ఆపాపానికి శిక్ష. ఇది అని దగ్గరుండి అడ్డం పెట్టి నరికించాడు పరమాత్మ. దానినే వీరబ్రహ్మేంద్రుల వంటి సద్గురువులు " రామా! అననివాడెల్లా రాలి పోయేను " అని హెచ్చరించారు. ఎక్కడ ఈ ధర్మానికి దూరంచేస్తూ జనాన్ని పెద్దసంఖ్యలో మార్చబడతారో అక్కడ నిత్యం అగ్నిగుండంలా గొడవలు ,హింసాకాండ కొనసాగుతుంన్నాయి .గమనించి చూడండి .ఇది ఆరోపణ కాదు వాస్తవం. కాబట్టి రెండే మార్గాలు మిగిలాయి మనకు, ఒకటి "కలి" బలానికి లొంగిపోయి ఇతరులనుసరించే ధర్మాలను ద్వేషిస్తూ .దైవానికి దూరంగా జరగటమా ? లేక " కల్కి" గా పరమాత్మ అవతరించి దుష్ట శిక్షణను జరుపుతారనే భాగవతాది సత్ గ్రంథాలలో చెప్పబడిన సత్యాన్ని గ్రహించి భగవంతుని సైన్యంగా మనలను మనం మలచుకుని సాటి వారిలో ,మనలో ను భగవద్భక్తిని ,ప్రేమ త్యాగం లాంటి దైవీభావనలను పెంచుకోవటమా ? ఏమి చేయాలో నిర్ణయించుకోవలసిన సంధి కాలమిది. భగవంతుని నమ్మి శరణాగతులమై మనచుట్టుపక్కల వ్యాపిస్తున్న రాక్షస భావాలను ఎదుర్కుని వాటిని అరికట్టటానికి మనం సిద్దమై ఉండాలి . అందుకు కావలసిన శక్తిని ప్రసాదించగల సామాగ్రిని మన ఋషిపరంపర మనకు అపారంగా అందించింది.అవే నవవిధ భక్తిమార్గాలలో సాధనచేయవలసిన యజ్ఞయాగాది క్రతువులు,మంత్ర,పారాయణ,జప తపాది మార్గాలు. వాటిని వినియోగించి మనలో ను ,సాటివారిలోనూ రాక్షసధర్మాలైన స్వార్ధచింతన,దైవద్వేషము,ధర్మనిర్మూలన చేయాలనే తలంపు ,ఇలాంటి ఆసురీ భావాలను ఎదుర్కొనవచ్చు.
కాబట్టి మహాత్ములైన మన పరమ గురువులు చూపిన ఈ బాటలో పోరాడటానికి గొప్ప సాధకులు, యోగులు ,స్వామీజీలు మాత్రమే అర్హులుకాదు . సాధారణమైన మనలాంటి అల్పజీవులన్నీ తమ స్థాయిలో పోరాడవచ్చు. రామ కార్యానికి సహాయ పడ్ద ప్రాణులన్నీ అల్పజీవులే . ఉడతలు,కోతులు కొండముచ్చులు,భల్లూకాలు ఇవన్నీ ఎలా పోరాడాయి ? తమ శారీరిక బలాన్ని నమ్మికాదు. భగవంతుని తరపున పోరాడుతున్నాము కనుక మన భారమంతా ఆయనే చూసుకుంటాడు అనే సంపూర్ణ విశ్వాసమ్ .శరణాగతి . ఇదేనామార్గం .అలనాడు హిరణ్యకశిపుని ఎదిరించిన ప్రహ్లాదునికి అండ ఎవరు ? అడవులపాలైన పాండవులకు దిక్కెవరు.? కోతిమూకలకు శాశ్వత కీర్తిని తన సాన్నిధ్యాన్నిచ్చిన స్వామి ఎవరు ? భక్తజన రక్షణకోసం కల్కిగా ఆకాశమునించి శ్వేతాశ్వారూఢుడై ఖడ్గపాణియై భువిని కాపాడనున్నదెవరు ? ........ ఎవ్వరిచే జనించు .జగమెవ్వని లోపల యందునుండు లీనమై ........... అని స్తుతింపబడిన ఈశ్వరుని సేనలో ఒక సిపాయిగా నన్ను నేను మలచుకునే పనిలో ఉన్నాను. నన్ను నేను స్వామి సేవకునిగా మార్చుకుంటున్నాను . అ మార్గం లో నడుస్తున్నాను .
[ నేను చేస్తున్న పోరాటమెలా సాగుతున్నది ? మరో పోస్ట్ లో విన్నవిస్తాను ]
తక్కువేమి మనకూ రాముడు ఒక్కడుండు వరకూ ........................................................
2 వ్యాఖ్యలు:
అయ్యో.... ఎవరో ఏదో అన్నారని ఇంత పెద్ద వివరణలు రాయాలా?... మీరు చేస్తున్నది మంచి పని అని మనస్సాక్షి చెబితే చాలదూ...ఈ ఆలోచనలన్నీ పక్కన బెట్టి నిశ్చింతగా ఆధ్యాత్మిక మార్గంలో సాగిపోండి...
జగన్మాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.....
I second Ravi Chandra gaaru.
Post a Comment