అసలేం జరుగుతోంది ? ఎందుకు జరుగుతుంది ? [మొదటిభాగం]
>> Monday, March 8, 2010
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
నేను నిన్న ఇద్దామనుకున్న వివరణ ఈరోజు మొదలెడుతున్నాను . ఎక్కడనుండి మొదలెట్టాలనే సందేహం వస్తున్నది. ప్రస్తుతం ధర్మం మీద జరుగుతున్న దాడుల గూర్చి ముందుగా వివరిస్తే నేను చెప్పబోయేదానికోసం సమర్ధింపుకొరకు ముందస్తుగా చెబుతున్నానని అనుకోవచ్చు. లేదా వ్యక్తిగతంగా నావివరణ ఇచ్చినా అది మూలకారణాన్ని తెలుపలేక పోతే ప్రయత్నం వృధా కావచ్చు. . సరే ! ఎటో ఒకపక్కనుంచి మొదలెట్టాలిగనుక బుద్ధిబలాన్ని ప్రసాదించమని నానోట సత్యాన్నే పలికించమని పవనసుతుని వేడుకుంటూ మొదలెడుతున్నాను.
ప్రస్తుతం భూమ్మీద అతి ప్రాచీనము.మానవాళి కి సంపూర్ణ మానవతేమిటో అందించ గల హైందవము ను ధ్వంసమొనరించటానికి కలి పురుషుని ప్రయత్నములు తీవ్రంగా సాగుతున్నాయి. ఎందుకంటే ఇది ధర్మం కనుక. ధర్మాన్ని ధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం కనుక. అదేమిటి ఇది మతం కదా అని ఎవరైనా అనవచ్చు. మతమంటే ఒక అభిప్రాయం .లేదా ఒకరు లేక కొద్దిమంది ద్రష్ట లు దర్శించిన సిద్దాంతముతో కూడుకున్న మార్గం . ఈ కోణం లో చూస్తే మిగతామతాలకు వలె దీనికి ఒక ప్రవక్త మాత్రమే గాని, ఒక సిద్ధాంతం మాత్రమేగాని ఒక గ్రంధము మాత్రమే గాని ప్రమాణం కాదు. పలువురు మహర్షులు తపస్సు చేత భిన్నమార్గాలలో దర్శించిన సత్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది సత్యం .అది సార్వజనీనం .సర్వకాల సర్వావస్థలలోనూ ఏ మార్పుకూ వీలుగాని సత్యం . కనుకనే దీనిని ధర్మ మన్నారు . ధర్మం కనుకనే ప్రపంచం లో మానవాళి ఔన్నత్యానికి పాటుపడే ప్రతి సిద్దాంతాన్ని గుర్తించి గౌరవించింది . ఆయాప్రవక్తలను వారి బోధలను సైతం మన్నించి తనలో మమేకం చేసుకోగల ఔన్నత్యాన్ని ఈజాతిలో పాదుకొల్పినది. భగవంతుని వివిధమార్గాలలో ఎలా దర్శించవచ్చో ,మానవునికి సంపూర్ణ స్వేచ్చనిస్తూ వివరించింది. మానవాళికి మార్గదర్శకమైనది. అందువలనే ఈ ధర్మం లో మార్గదర్శకులైన సద్గురువులుంటారే తప్ప , శాసకులు కనపడరు. ఇలానే దర్శించాలి ,ఇదే పాటించాలనే శాసనాలతో మనోవికాసాన్ని అరికట్టదు ఈధర్మ మార్గం . కనుక మనసుకున్నస్థాయీ బేధాలననుసరించి వివిధమార్గాలలో భగవంతుని చేరగలరు భక్తులు తమ తమ సాధనారీతుల ద్వారా.
మరి కలి ఎలాంటివాడు ? భగవంతుని ,గాని సదాచారాలనుగాని ,సచ్చరిత్రనుగాని అంగీకరించడు మనిషి పతనావస్థకు చేరి పశువుగా మారడమే అతని ధ్యేయం . కనుక ఈధర్మాన్ని ధ్వంసం చేయడానికి తనదైన "ఈ యుగం" లో తీవ్రం గా శ్రమిస్తున్నాడు. ఆయన ప్రయత్నాలు వ్యూహాలు బహుళములు. బయట దాడిని కాచుకునే లోపలే లోనుండి దాడిచేసి మానవున్ని పతితునున్నిచేయడానికి మానవునిలో అంతర్గతంగా ఉన్న కామ క్రోధాది అంతశ్శతృవులనొకవైపు రెచ్చగొడుతూ , ,తనకు లొంగి తన లక్ష్యానికి తోడ్పడే మానవులనొకవైపున మొహరించి విజయవంతంగా తన కార్యక్రమాన్ని జరుపుతున్నాడు.
భవిష్య పురాణం , భాగవతాది గ్రంథాలలో మన మహర్షులు కలి వ్యూహాలను అతను ఎక్కడ ఎప్పుడు ఎలా భగవద్వేషాన్ని పెంచుతాడో, శివకేశవులు లేరు ,యజ్ఞయగాదులు వృధా, ఇంద్రియ సుఖాలు పొందటం కంటే మానవునికి ఉన్న అత్యున్నత లక్ష్యమింకేముందని ? వితండవాదాలను ఎలా ప్రసారం చేయగలడో దానికి తోడ్పడగల వివిధ సిద్దాంతాలు ఎలా విస్తరిల్లుతాయో , వివరంగా వివరించి హెచ్చరించారు .
సరే ఇక్కడ ఆయన పోరాట వ్యూహాన్ని చూద్దాం .కొందరు తినటం సుఖించటం అనే ఎండమావులవెంత పరిగెత్తేలా చేసి ధర్మం వైపు తలెత్తి చూడనివ్వడు. ఇక్కడ ధర్మాన్ని అనుసరించే వారిలో కామ క్రోధాదులు రెచ్చగొట్టి ,మనసును విషయవాంఛలమీదకు తిరిగేలా చేస్తాడు. మొదట్లోనే ఈ తాకిడికి తట్టుకోలేని వారు మొగ్గదశలోనే తమ సాధనలు వదలి జారిపోతారు. ఇంకా కొద్దిమంది సాధకులు పైకెదగగానే వారి చుట్టూ స్వార్ధపరమైన ఆలోనాపరుల గుంపులను చేర్చి , వారి భావాలతో కలుషితమైన మనస్సుతో ఆసాధకుడు క్రమంగా కామినీ ,కనకాలపట్లనో కీర్తి కాంక్షలపట్లనో అనురక్తుడయి తల్లకిందులుగా పల్టీలు కొట్టుకుంటూ పాతాళానికి జారేలా చేస్తాడు . నేలపైనడుస్తూ పడ్డవాన్ని గూర్చి అందరికీ పెద్దగా తెలియదుగాని కొండమీదనుంచి దొర్లి నవాణ్ని గూర్చి మాత్రం పెద్దచర్చ జరుగుతుంది . వాడి ఖర్మగాలి వాడుపడ్డా డని అనరు.వాడికెంత బలుపు అంటారు. ఇక వాడు పదిమందిని నడిపే వాహనచోదకుడైతే నమ్ముకున్నవాళ్లంతా నట్టేటమునుగుతారు.
కాబట్టే యత్యాశ్రమము వంటి అత్యున్నత వ్యవస్థలో కఠినమైన నిబంధనలు విధించారు పెద్దలు. అతడు వస్తు సంచయనం చేయరాదు .అరచేయి పళ్ళెంగా ఎక్కడదొరికినది అక్కడ ఎప్పుడు లభించినది అప్పుడుమాత్రమే స్వీకరించాలని .స్త్రీలను తమ సాన్నిధ్యంలో ఉండనీయరాదు . ఎక్కడా మూడుపూటలకంటే [చాంద్రాయణ వ్రతం లో తప్ప] నిదురించరాదనే నియమాలు ఏర్పరచారు . ఎప్పుడైతే యత్యాశ్రమాన్ని ఆశ్రయించినవారు పెద్దలమాటలను పక్కనబెట్టడమో లేక తమ మానసిక శక్తిపైన అతినమ్మకంతోనో తాము చేయబోయే సత్కార్యములకొరకని డబ్బు సేకరించిపోగేయటం ,తమ నివాసలని శాస్వతంగా ఉండేలా చేయడం ,భగవత్ కార్యక్రమాల కు పాల్గొనవచ్చే స్త్రీల ను ఆశ్రమాలలో బసచేయనీయడం ,వారితో ఎక్కువగా సంభాషించడం వంటివి చేస్తారో అప్పుడు "కలి" తన ప్రభావాన్ని చూపుతాడు. బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లా సంచయనం చేసిన ధనం కోసం ,వదిలివేసిన బంధువర్గాలో .అభిమానులో చేరికూర్చుంటారు. ఇక వీరిద్వారా మిగతావారు చేరుతారు .వెరసి ఏసంసారాన్నైతే వదలుకుందామని సన్యాసాన్ని స్వీకరించారో ఇంకో రూపంలో అది చుట్టూ చేరుతుంది . ఇక భగవంతుని తాము దర్శించేందుకు వెచ్చించాల్సిన సమయము మిగతా వాటిపైకి కర్చుచేసి తమ సాధనాశక్తి వృధాఅయి స్వయంకృతాపరాధంగా పతనమవుతుంటారు.
ఇక ఇక్కడ ఎవరి నియంత్రణలు లేవుగనుక డైరెక్ట్ గా " కలి " సేన ఫ్యాన్సీ డ్రస్ లా కాషాయాన్ని ధరించి దుకాణాలు ప్రారంభిస్తుంది. వివిధ క్షుద్రసాధనలతో లభించే అల్పశక్తులతో వీళ్ళు భక్తులను ,స్వార్ధపరతతో భగవంతుని అశ్రయించి లబ్దిపొందుదామనే వారిని మాయజేయటం నిలువునా ముంచటం చేస్తుటారు.వీరిని గూర్చే వీరబ్రహ్మేంద్రుల వంటి మహాత్ములు " ఉల్లిగడ్డకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టేరయా " అని హెచ్చరించారు. సద్గురువుగూర్చి అన్వేషించేవారు జాగ్రత్త అని ఎరగక మోసగాన్ని ఆశ్రయిస్తే గుడ్డివాడు మరో గుడ్డివాడిచేయి పట్టుకుని నడచిన చందంగా అవుతుందని హెచ్చరించాయి శాస్త్రాలు . శుష్కవాదాలతో ఆద్యాత్మిక చర్చలు జరిపేవారు పెరుగుతారని భాగవతం చెబుతుంది . . సాధకులు తక్కువ బోధకులెక్కువ . పుణ్యక్షేత్రాలన్నీ వ్యాపార్రక్షేత్రాలుగామారి ఆయాక్షేత్రాల పవిత్రత దెబ్బతిని దైవశక్తి అనుగ్రహ ప్రభావం అక్కడ తగ్గి పోతున్నది .మరికొందరు మహారుషులు కనుక్కోలేని గొప్ప ఆథ్యాత్మిక రహస్యాలు తమకు తెలుసని కాబట్టి తమ సిద్దాంతాలే నిజమైన మార్గమని కొత్తరకం బోధలు మొదలవుతున్నాయి ,రామకృష్ణాది భగవదవతారాలను గూర్చి తమ స్వల్ప బుద్దితో వ్యాఖ్యానిస్తూ ఆయా అవతారాలపట్ల మానవులలో భక్తిని క్షీణింప జేసి క్రమేపీ పతనమయ్యేందుకు తోడ్పడుతున్నాయి.
ఏది నిజమో ఏది అబద్డమో అర్ధంగాక అసలు ఆథ్యాత్మిక పథమే అబద్దమని శారీరిక సుఖాలే ప్రధానమనము అదే నిజమనే భౌతికవాదమే ఖచ్చితమైనదనే భావన పెరిగిపోతుంది. తద్వారా కలి పురుషుని లక్ష్యం నెరవేరుతున్నది.
ఇక బాహ్యంగా దాడి ఇంకా విస్తృతంగా జరుగుతుంది. భూమి మీద వివిధప్రదేశాలలో పుట్టి మానవాళి కి జ్ఞానాన్ని ప్రసాదించాలని తమ సర్వశక్తులను ధారబోసిన మహాత్ముల పేరు తో వారి మార్గాలను మతాలుగా మలచుకుని తమ ఆక్రమణ సిద్దాంతాలను శరవేగంగా ప్రచారం చేయగలుగుతున్నది కలిసేన . దయ ప్రేమ ను సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రవచించినన మహానుభావుల బోధకు వక్రభాష్యాలు చెబుతూ తాము బోధించినది తప్ప మిగతాది సత్యం కాదని ,కాబట్టి మిగతా మార్గాలద్వారాకూడా భగవంతుని చేరవచ్చు అనే సిద్దాంతాన్ని గాని, ఆసిద్ధాంతాలననుసరిస్తున్న ఈ ధార్మిక జాతిని మానసికంగాను, అడ్దమొస్తే భౌతికంగా నిర్మూలించాలనే యత్నం దీర్ఘకాలిక ప్రణాలికలతో సాగుతున్నది. ముందుగా దేవభాషను ,ఆభాషద్వారా లభ్యమవుతున్నా జ్ఞాన సంపదను నిర్మూలించటానికి మ్లేఛ్ఛ భాషాభి వృద్ధితో ప్రారంభమై మానవుని స్వభాషలను అంతం చేయటం ద్వారా తమయొక్క భావ పరంపరను సంస్కృతిని మెదళ్ల్లోకి ఎక్కించేపని వరుసగా జరిగిపోతున్నది. తద్వారా ప్రేమ స్థానం లో ద్వేషం ,త్యాగం స్థానంలో స్వార్ధం .జ్ఞానం స్థానం లో కామాది వికారాలు తిష్టవేసి నేడు మనం చూస్తున్న అనర్ధాలన్నింటితో మానవ జాతి మొత్తం తల్లడిల్లి పోతున్నది. ఇందుకోసం ధనం వెదజల్లి దానికోసం తల్లికి కూడా కీడుచేయడానికి వెనుకాడని బలహీనులను లొంగదీసుకుని ,మరికొందరిని వివిధప్రలోభాలతో ప్రేరేపించి ఈ ధర్మం పట్ల విరక్తి కలిగే .గౌరవం తగ్గించే సాహిత్యాన్ని,ప్రచారాలను సాగిస్తూ దీని ధ్వంసం చేయటమే లక్ష్యంగా కలి ప్రభావం సాగుతోంది. మానవులలో సదాచారాలన్నీ వృధా అని ఇంద్రియాలను సుఖపెట్టడమే ప్రధానమని ,భ్రాంతిని పెంపొందిస్తూఉన్న యత్నాలు మనకల్లముందే కనపడుతున్నాయి . ఇక ఇది తప్పు అని తెలుసుకుని తెలివిలోకి రాకుండా సిద్దాంత రాధ్ధాంతాలతో మనుషులను గందరగోళపరచి అధర్మాన్ని ఎదుర్కోవాలనే సృహకూడా లేనట్టి మానసిక బలహీనులను పెంపొందించే వ్యూహం దిగ్విజయంగా నడుస్తోంది. దీనికి అలంబనగా ఉండేందుకు బతుకుపై విపరీత మమకారాలను పెంచుకునేలా చేసి భయంకరమైన పిరికితనం మనిషి మనసులో తిష్ఠవేయబడేలా చేయబడుతున్నది. దాని ఫలితమే కళ్లముందు అన్యాయం జరిగినా స్పందించలేని హృదయాలు, ధర్మాన్ని రక్షించుకోవాలనే పౌరుషాగ్నులు చల్లారిపోతూ కనపడుతున్నాయి ఈ పుణ్యభూమిలో . ఇదంతా ఒకరోజు కాదు ఏళ్లబడి సాగుతున్న కలి ప్రణాళిక. ఇక తాము తరించటమేకాదు మానవజాతిని కూడా దివ్యమార్గం లో నడపాలనే సత్సంకల్పంతో తమ ముక్తి కంటే ధర్మోద్ధరణముఖ్యమని శ్రమిస్తున్న సద్గురువులను వివిధ రీతులలో వేధిస్తూ వారిపై దురభిప్రాయాలను కలిగిస్తూ ,నిజమైన సత్ పురుషులను సాధువులను కూడా అనుమానించేలా , అవమానించేలా ఈధర్మపథాన పుట్టినవారుకూడా తయారవుతున్నారు కలి ప్రభావాన. పరిగెత్తి పాలుతాగాలనే తపనతో నిలబడి ఆలోచించనీయనంత యాత్రిక వేగం జీవితంలోపెంచి తామేది చెబితే అది నిజమనుకునేలా భావించే స్థితి కల్పించబడుతుంది కలిసేనద్వారా .
నేను సర్వసంగ పరిత్యాగిని కాను. ఒక గొప్ప సాధకుడినో ,యోగినో కాను . సామాన్య మానవులలో ఒకడిని . కానీ ఈ ధర్మం .దాని ఆధారంగా పుట్టిన సంస్కృతి నాకు గొప్పవారసత్వాన్నిచ్చాయి. భగవంతుడు స్వయంగా అవతరించిన ఈ పుణ్యభూమిలో నాకు జన్మ వచ్చింది. నాకంటూ కొన్ని ఆత్మీయతా బంధాలను , ప్రేమ,త్యాగాది దైవీభావాలను ఇచ్చింది . మానవునిగా పుట్టినందుకు మహోన్నతునిగా ఎదగాలని ప్రయత్నించటానికి కావలసినంత సాధనాసామాగ్రి నిచ్చింది . నేను సుఖంగా ఉండలి నాతోటి ప్రాణులన్నీ శుభకరంగా వర్ధిల్లాలని కోరుకోగల మనసును, సంస్కృతినీ నిచ్చింది సృష్టిలో ప్రతిప్రాణీ నాకు పరాయిది కాదు అనే భావన ప్రసాదింపబడింది ఈ ధర్మం ద్వారా . . ఇన్ని ఇచ్చిన భగవంతుని ఉనికిని , ఈ ఆథ్యాత్మిక వారసత్వాన్ని కూలగొట్టాలని కలి పురుషుడు యత్నిస్తున్నప్పుడు నేనేం చేయాలి ? నాకెందుకు నాసుఖం నాకు చాలదా చిన్నినా పొ్ట్టకు శ్రీరామ రక్ష అని అనుకోవాలా . అదంతా భగవంతుడు చూసుకోవలసిన పని అని మిన్నకుండాలా ? లేక భగవంతుడు స్వయంగా గీతగా బోధించిన నీతిని మానవ జన్మ అనే అవకాశంతో సక్రమంగా వినియోగించుకోవాలా ?! చెప్పండి . దానికొరకు నేను అనుసరిస్తున్న మార్గమేమిటో మీకు మరో పోస్ట్ లో విన్నవించుకుంటాను .
[ ఇది మొదలు మాత్రమే దయచేసి నా మనసులో మాట పూర్తిగా వినటానికి కొద్ది సమయం కేటాయించి మిగతా భాగం కూడా చదవండి ఒకే సారి పెద్దపోస్ట్ గావ్రాసి మీ విలువైన సమయాన్ని వృధాచేయనీయగూడదనే తలంపుతో చిన్నచిన్న భాగాలుగా వ్రాస్తున్నాను. మన్నించగలరు]
4 వ్యాఖ్యలు:
చక్కటి క్లారిటీతో వ్రాస్తున్నారు. మనకీ మనోదౌర్బల్యం ఎందుకు కలుగుతోందో దాన్నెలా జయించాలో కూడా తెలపండి. మీ ప్రయత్నం ఫలవంతం కావాలని ఆశిస్తున్నాను.
>>అదంతా భగవంతుడు చూసుకోవలసిన పని అని మిన్నకుండాలా ? లేక భగవంతుడు స్వయంగా గీతగా బోధించిన నీతిని మానవ జన్మ అనే అవకాశంతో సక్రమంగా వినియోగించుకోవాలా ?! చెప్పండి .
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము బొంకు చేత చెడబారిన దైన యవస్థ....అనే నన్నయ్య పద్యం గుర్తుకొస్తోంది
ఎవరి భావాలు వారు చర్చకు పెట్టుకోవడం, దానికి౦త ఖాళీ ఇవ్వడం ప్రజాస్వామికం. ఏది సరైనది అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఒకరిపై ఒకరికి అసహన౦తో దాడి పూర్వక వాదనలు సత్యాన్ని మరుగుపరుస్తాయి. ఇది నా ఆలోచన. నేను నమ్మిన వాదాన్ని ఇలానే రాస్తున్నా. కావాలని నా పై కూడా వ్యంగ్య, బూతులతో కూడా రాస్తున్న వారున్నారు. కానీ అది వారి సంస్కారాన్ని బయటపెడుతు౦ది అని నా భావన. అలా అని నా ఆలోచన మార్చుకోను. ప్రజలకు ఏది మేలునొనకోర్స్తు౦దో వారికి చెప్పే౦తవరకే తెలిసిన వారి పని. ఇది నా మార్గం. అందుకే మీతో స్నేహం చేయగలిగాను. ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చూస్తే తీవ్రమైన ఆవేశం తో పాటు ఆవేదన కూడా కలుగుతు౦ది. అది వారి మూర్ఖత్వం మాత్రమె. వదిలేయ౦డి. మీరు నమ్మి౦ది ఆచరి౦చ౦డి. ఎవరికీ స౦జాయిశే ఇచ్చుకోనక్కరలేదు. మీకు వత్తాసుగా రాస్తున్నవాళ్ళు ఇ౦కో దగ్గర పరమ బూతు రాస్తున్నారు. కాబట్టి మీ పని మీరు చేయ౦డి.
మంచి చేద్దామనుకున్నవారికి విఘ్నాలు కల్పించడం వారిపై మానసికంగా దాడి చేయడం కూడ ఈ కలిప్రణాళికలో భాగమేనండీ. ఏది ఏమైనా సరే, ధర్మో జయతే జయతే సత్యః. శుభమస్తు.
Post a Comment