శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ భిక్ష ఈ జీవితయానమ్

>> Thursday, November 20, 2008

శ్రీవెంకటేశ్వర జగన్మాత పీఠ స్థాపకులు వెంకయ్య గోవిందమ్మ దంపతులు ధన్యజీవులు



ఇది 80 సంవత్సరాల క్రింద ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కనికరించి కదలివచ్చి భక్తజనరక్షణ చేసిన ప్రత్యక్ష గాథ ఇది.
ఇందులో నమ్మ లేని నిజాలు ఏభేషజము లేకుండా భగవంతుని శరణాగతి పొందగలిగినవారికి మాత్రమే అర్ధమవుతాయి. అనుమానాస్పద జీవులకు ఆలీలలు అర్ధముకావు. దయచేసి మన చిన్న ప్రమాణాలతో వీటిని కొలవటానికి ప్రయత్నించకండి. అపార కరుణారాశి అమ్మప్రేమకు హద్దులు వుండవని గమనించండి.

మాజేజినాయన [నాన్నగారితండ్రి] బల్లేపల్లి వెంకయ్య గారి స్వగ్రామము గంగన్నపాలెం. ఇది గుంటూరుజిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట మధ్యలో రహదారి మీదనేవున్నగ్రామము. కోటప్పకొండకు దగ్గరే . ఈయన తల్లిగారు కోటమ్మగారుశివభక్తురాలు. మాలకిచ్చన్న అనేసిధ్ధపురుషుని గురువుగా భావించి రామలింగేశ్వరుని కొలచేదట. ఈ మాల కిచ్చన్నగారు బహిర్భూమికి వెళ్ళిన సమయములో సహితము శివనామ స్మరణ ఏమరక చేసేవారట. తనదగ్గరున్న చెంబులో నీళ్ళను అక్కడున్న ఏ రాయిపైనో పోస్తూ నమశ్శివాయాని జపిస్తూ వుండేవారట. సర్వముభగవన్మయముగా దర్శించిన అవధూత స్థితి అది. తక్కువకులము వాడని , తగనిపనులు చేస్తున్నాడని ఆక్షేపించిన పండితులకు ఆత్మబోధగావించిన మహాపురుషుడు మాల కిచ్చన్నగారిని మా పూర్వీకుల గురు పరంపరను స్మరించుకుని ముందుకు సాగుతున్నాను. మాజేజినాయనగారితండ్రిగారిపేరు ఓబయ్య పరమ అమాయకుడట.

మాజేజినాయన గారికి రవ్వవరములో పెద్దరైతులైన కొమిరిశెట్టి పెదబ్రహ్మయ్య చిన బ్రహ్మయ్య గారల చెల్లెలు గోవిందమ్మ [మా నాయనమ్మ] గారలతో వివాహమయి మానాన్న గారు కాక మరి ముగ్గురు పిల్లలు కలిగారట. ఈయన స్నేహితులతో తిరుగుళ్ళూ నాటకాలు వేస్తూ గ్రామములో సరదాగా తిరిగే వాడట. పూర్వకాలములో చదువు పట్ల అంతగా శ్రధ్ధ చూపరుగనుక ఈయనకూడా ఏదో అక్షరాలు గుర్తుపట్టేవరకు చదువుసాగించారు. శనివారము మాత్రము వేంకటేశ్వరునికి పూజచేస్తూ వుండేవాడేగాని పెద్దగా భక్తిభావన కలిగినవాడుకూడా కాదు.
కొతకాలము సాగిన తరువాత ఈయన జీవితములో అనుకోని కష్టాలు ప్రా రంభమయ్యాయి. ఈయన కు విరోధిగా ముద్రపడిన ఈయన బాబాయి ,పిన్నిలు మరణించగా మనిషితో శత్రుత్వము మరణానంతరము మరచిపోయే పాతకాలము వారుగనుక ,నీటమునగవలసిన దాయాదిగనుక ఈయన కూడా పెద్దఖర్మకు హాజరయి నాడు .అంతేకాక తన పిల్లలను కూడా మానాయనమ్మ వద్దంటున్నా వినకుండా తీసుకెళ్ళి వారి ఖర్మ కాండలో పాల్గొన్నాడు. మానాన్న గారికి మాత్రము ఆరోజు జ్వరముగా నున్నందున మా జేజి పంపకుండా ఇంటివద్దే వుంచినదట. పెద్దఖర్మకు వెళ్ళి వచ్చిన సాయంత్రమునకు పిల్లలకు జ్వరము వచ్చి అదిపెరిగిపోయి ఒకరి వెంట మరొకరు నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురుపిల్లలు మరణించటముతో దంపతులు గుండెలు పగిలేలా రోదించారు. వారు జీవచ్చవాలుగా మారినారు. బంధువులు వాల్ల అమ్మగారు వీరిని ఎలా కాపాడాలో తెలియక తల్లడిల్లినారట. ఈదుః ఖముతో మానాయనమ్మ గారు అపస్మారక స్థితిలో కిజారుకున్నది. ఇది మరొక ఘాతమయినది ఆయనకు .రోదిస్తూ తనభార్య అయినా దక్కుతుందో లేదోనని తల్లడిల్లుతున్న ఆయనకు వాళ్ళ అమ్మగారు. నాయనా! ఇది పిశాచ రూపులయిన మీ బాబాయి వాళ్ళు కల్పిస్తున్న కష్టం. దీనిని మానవ మాత్రులము మనమేమీ చేయలేము .అయినవోలు దగ్గరున్న పెద్దవరములో దేవీ భక్తులయిన బ్రాహ్మణులు వున్నారు వెళ్ళి వాళ్ళను ఆశ్రయించమని పంపినది.
ఆ దుః ఖంతోనే ఆయన పెద్దవరము వెళ్ళగా అక్కడవున్న బాలా ఉపాసకులగు ఆమహాను భావులు, అయ్యో! ఎంత పనిచేసుకున్నావయ్యా ఇప్పటికయినా తెలుసుకున్నావు అని వోదార్చి అమ్మవారి కుంకుమను ఇచ్చి, ఇది నీ భార్యకు పెట్టు , ఇది ఆపదసమయం .నీభార్యకు మెలకువ రాగానే కట్టుబట్టలతో ఆవూరినుంచి బయటకు వచ్చేయి. మరలా ఇప్పటిలో ఆ గ్రామము వెళ్ళకు అని చెప్పి దీవించి పంపారట. ఆయన ఇంటికి వచ్చి కుంకుమ పెట్టగానే మరుసటిరోజు తెల్లవారు ఝామునకు మానాయనమ్మ గారికి మెలకువ వచ్చినదట. దాంతో ఆయన వున్న ఇంటిని తల్లిని తన ఇద్దరు అన్నదమ్ముల కప్పగించి అప్పటికప్పుడే బయకుదేరి నరసరావు పేటలో రైలెక్కి అయినవోలు స్టేషనులోదిగి 15 మైళ్ళు నడచి రవ్వవరము చేరుకోవటము, అదీ మూడురోజులుగా తిండిలేక మనసృహలో లేని మనిషి, అమ్మ అనుగ్రహముకాక మరింకేమిటి.
 ఆతరువాత రవ్వవరము లోనే ఒక ఇల్లు తీసుకుని ఒక నెల గడచిన తరువాత ఆమెకు ఆరోగ్యము కుదుటపడిన తరువాత గంగన్న పాలెం వెళ్ళి ఇల్లూ వాకిలీ సరిచూసుకుని వెంటనే వచ్చేద్దామని బుద్ది పుట్టినది. ఇద్దరూ మా నాన్న గారిని ఇక్కడ మేనమామల దగ్గరే వుంచి మరలా గంగన్న పాలెం వెళ్ళారు. వెళ్ళిన రోజు సాయంత్రానికే మా నాయనమ్మకు ఐదవనెల గర్భము స్రావముజరిగి మనసృహలో లేకుండా తీవ్రజ్వరములోకి వెళ్ళినది. ఇక ఈయన ఏడుపు మొదలుపెట్టాడు. వాళ్ళమ్మగారు దుఃఖించి ,వద్దని చెబితే వచ్చావేమిరా నాయనా? ఇప్పుడెవరురా దిక్కు అని ఏడుస్తుండగానే ఆయన లేచి పెద్దవరము బయలుదేరి వెళ్ళాడు. అక్కడకు వెల్లగనే వాళ్ళు కోప్పడి, చెబితే వినక పోతివి. మేము ఇప్పుడల్లా ఆ గ్రామము వద్దని చెప్పాము కదా ? చేయగలిగినది ఏమీ లేదు అమ్మను నమ్మ టము తప్ప .ఈకుంకుమ తీసుకెళ్ళి పెట్టు .ఎప్పుడు నీ భార్య స్పృహ లోకి వస్తే అప్పుడూ క్షణము ఆలస్యము చేయకుండా బయలుదేరు అని జాగ్రత్తలు చెప్పి పంపినారు. మైల, నిష్ట గురించి చూసే సమయము కాదిది అని హెచ్చరించినారు. ఆయన కుంకుమ తీసుకుని వచ్చేసరికి పరిస్థితి తీవ్రముగా వున్నది. అక్క డున్న నాటువైద్యులు, తమకు తోచిన వైద్యము అం దించినా ఆమె మన సృహలో లేదు. రాత్రి గడుస్తున్నకొద్దీ ఈయన వేదన పెరిగిపోతున్నది. అమ్మా నాచేతులారా నా పెళ్ళాన్ని చంపు కుంటున్నానమ్మా!. వద్దని చెప్పినా వచ్చాను అని విలపిస్తున్నాడట. అర్ధరాత్రి సమయానికి బాహ్యస్మృతి లో లేని ఈమెకు స్వప్నములో కొన్నిదృశ్యాలు గోచరిస్తున్నాయి .కనులువిప్పి చూడలేకపోతున్నా తన భర్తవిలపించటము ,బంధువుల మాటలు వినిపిస్తూనే వున్నాయట. వాళ్ళున్న ఇంటిపక్కనే ఖాళీ స్థలము, చిన్న మురుగునీటిగుంట ,చెట్టు వున్నాయ. ఆచెట్టుక్రిద నిలబడి న చనిపోయిన మా జేజినాయన గారి బాబాయిఆత్మ తన భార్యతో దీనికోసం ఎంతసేపు చూడాలి? వెళ్ళి లాక్కురాపో అనగానే ఎక్కడినుండో నలుగురు విచిత్రవేషధారులు వచ్చి ఈమె మంచముదగ్గరకు వచ్చి రావేంది, ఈమొగుడేనా దిక్కు అంటూ కాలి వేళ్ళు పట్టుకుని లాగుతున్నారట. ఎక్కడికిరా వచ్చేది ? అంటూ ఈమె కాలు విదిలించి తన్నుతున్నదట. అయితే మాజేజినాయన గారు వాళ్ళ అమ్మతో ,అమ్మా! దీనికి సంధికూడా సోకినట్లుంది, చనిపోతుందేమోనమ్మా కాళ్ళు కొట్టుకుంటున్నది అని పెద్దగా ఏడవట ము మొదలు పెట్టాడట. అయితే ఆమెకు నాడిచూడటము బాగావచ్చు. మృత్యునాడికూడా పసిగట్టగల నైపుణ్యము వున్నదగుటవలన నాడి పట్టి చూసి. లేదురా నాయనా! ఈ అమ్మాయికి చావు భయంలేదు. ఏదో జరుగుతున్నది .నువ్వు కొంచెంధైర్యం తెచ్చుకో అని ఓదారుస్తున్నదట. ఇవన్నీ మా నాయనమ్మకు వినబడుతూనే వున్నాయి. ఇకస్వప్నములో ఆ ఆత్మల వికటవిన్యాసాలు చూస్తూ భయపడుతుండగాహఠాత్తుగా  తళుక్కుమని ఆకాశమంత ఎత్తున పెద్ద కాంతి మెరిసినది. అందులో శంఖు చక్ర దివ్యాయుధాలతో 18 చేతులతో అమ్మ జగన్మాత దుర్గాదేవి గోచరించి ఆ ఆత్మలను జుట్టుపట్టుకుని నేలకు వేసి కొట్టి తన కాలితో అక్కడున్న నీటిమడుగులో తొక్కి వేసినది. బ్రతికుండగా ఈ దృశ్యాన్ని వర్ణించి చెప్పే తప్పుడు మానాయనమ్మ. ఎంతో భావోద్వేగానికి గురయ్యేది. ఈదృశ్యము చూచి ఆనందము పెరిగి ఆమె బిగ్గరగా నవ్వటము ప్రారంభించినదట.
 మాజేజినాయన గారేమో .అమ్మా నవ్వుతున్నదే ! ఇక నాకు దక్కదు  అని భయపడుతూ ఆందోళన చెందుతున్నాడు.
ఇక అమ్మవారు తన రూపు మార్చుకుని మగవానిలా పంచె తలకట్టు కట్టుకుని తన ఆభరణాలన్ని మూటగట్టుకుని ఆదారిన నడచి వెళ్ళుతున్నట్లుగా ఆమెకు స్వప్నములో కనిపిస్తుండతముతో ఆమె, అన్నా! అన్నా !అని పిలుస్తున్నది .బయటేమో తనభర్త అమ్మా వాళ్ళ అన్నగారిని వాళ్ళను తలుచుకుం టున్నదమ్మా. ఇంకేమి చేయాలమ్మ అని ఏడవటము వినిపిస్తున్నది. ఈమెపిలుపు వినగానే వెళ్ళుతున్న

పురుషరూపములో వున్నఅమ్మ తిరిగివచ్చి అక్కడున్న ఒక మొండిగోడమీదకూర్చుని ఏమికావాలని అడిగినది. అప్పుడు ఈవిడ నువ్వు అన్నవా? లేక అమ్మవా? ఎలా పిలవాలి అని అడిగినదట. ఎలా పిలిచినా పరవాలేదు. నేను మీ అమ్మనే అనుకో అన్ననే అనుకో బాధలో వున్నప్పుడు నన్ను తలచుకో ఇదిగో పట్టు అని తన దగ్గరున్నా బంగారు రూపాయలు ఈవిడ దోసిలిలో పోసి అదృశ్యమయినది. ఈమె ఆనందముతో ఆ రూపాయలన్నీ పోగుచేస్తున్నట్లుగా చేతులు లాక్కుంటున్నది.
ఇదిచూసి మాజేజినాయన అంతా అయిపోతున్నదమ్మా! అని బాధపడుతూ వుండగా, వాళ్ళ అమ్మగారు ఏమి కాలేదురా ఏడవకు, అంతా శుభమే జరుగుతున్నది అని వోదార్చటము వింటూ ప్రశాంతముగా నిద్రలోకి జారుకున్నది. ఉదయాని కల్లా జ్వరము తగ్గి పోవటము తో అమ్మా! ఈవూరితో నాకు ఋణము తీరిపోయింది అని తల్లికి చెప్పి భార్యను తీసుకుని అత్తగారివూరు రవ్వవరం వచ్చాడు. ఇక్కడే బావమరుదుల దగ్గర వుండటము ఇష్టములేక ప్రక్కన ఖాళీ వున్న స్థలములో చిన్న గుడిసె నిర్మించుకుని కాపురము పెట్టాడు. ఆయన పొగాకు తెచ్చుకుని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకుంటూ కాలము గడుపుతున్నారు. తెచ్చిన కుంకుమను మట్టి గోడల లోనున్న గూట్లో దాచివుంచి కొంతకాలానికి అసలా విషయాన్నే మరచిపోయింది. కాలం గడుస్తున్నది .మానాన్నగారు కాక మరలా ముగ్గురు పిల్లలు కలిగారు. మామూలు వ్యవహారిక ధోరణిలో సాగుతున్నది కాపురము. మా నాన్నగారు రామలింగయ్య గారు పక్కనే వున్న తిమ్మాపురం అగ్రహారం లో బ్రాహ్మణుల దగ్గరకెళ్ళి చదువుకునే వారు. పక్కవాళ్ళ పుస్తకాలు చూసి చదుకోవలసిన కష్టకాలము.ఈస్థితిలో కరువులు రావటము ,భార్యా పిల్లల కోసం సంపాదించాలని వ్యాపారము కోసం దూర ప్రాంతాలకు కూడా వెళ్ళాడట మాజేజినాయన.. ఇక్కడేమో పిల్లలు ఆకలి అని అల్లాడుతున్నా ,పుట్టింటికెళ్ళి యాచిస్తే భర్తకు అవమానమని అభిమానవతి అయిన మానాయనమ్మ వెళ్ళేది కాదు. అక్కడ బావి తవ్వకము జరుగుతుంటే గర్భవతి అయికూడా. కూలిపనికి వెల్లేది. .16 సంవత్సరాలవాడు అయిన మనాన్న గారుకూడా పగలు కూలికి వెళ్ళి ,రాత్రి నడచి దరిశి వెళ్ళి కూరగా యలు తెచ్చుకుని పక్కనే పెట్టుకుని అమ్ముకునే వాడట. ఈ కష్టాలు చూడలేక తల్లి బాధను తగ్గించాలని అరోజులలో మిలటరీలో చేరాలని చెప్పా పెట్టకుండా ఇంటినుండి వెళ్ళా డు. .
ఇంకేముంది పొద్దున్నే బిడ్డలేకపోవటం తో మా నాయనమ్మ గుండెలవిసేలా ఏడుస్తున్నదట. స్నేహితులు కొందరు రామలింగయ్య మిలటరీ చేరాలని వెల్లాడుఅని చెప్పటముతో ఆతల్లి దుః ఖముతో తల్లడిల్లుతూ ఏడుస్తున్నది. ఈవూరికి దగ్గరలోనే రాముడుపాలెం గ్రామములో ఈవిడ మేనమామ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడొకాయన వుండేవాడు. ఆయనకు  రాత్రి నిదుర లో స్వప్నములో బంగారు వర్ణములో 8 సంవత్సరాల వయస్సుండే చిన్న పాప కన పడి ఒరే! నీ మేనకోడలు నన్ను గోడలో గూట్ళో పెట్టి మరచిపోయింది. నీవు వెళ్ళి గుర్తుచేయి అని పలికినదట అబంగరు తల్లి .ఆయన వులిక్కి పడి లేచి తన భార్యను లేపి తనకొచ్చిన కలగురించి చెప్పాడు. ఆవిడ విసుక్కుని సింగినాదమేమికాదూ! పనీ పాటాలేకపోతే ఇలా నే కలలొస్తాయి పనుకోవయ్యా ,అని కసురుకున్నది. మరలా నిద్రలో ఆపాప కనపడి నవ్వుతూ, ఒరే! అది పిచ్చిది దాని మాట నమ్ముతావా? నామాట నమ్ముతావా? రవ్వ వరము వెళతావా లేదా? అని అడుగుతుండటముతో ఆయన  ఇదేదో స్వప్నం కాదు అనుకుని లేచి తెల్లవారు ఝాముననే రవ్వవరము వచ్చి అమ్మా గోవిందూ! ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఇలా అంటున్నదమ్మా !ఏమిటి సంగతి అని వివరమడిగాడట.
 అప్పుడు గుర్తు కొచ్చినది ఆవిడకు అమ్మవారి సంగతి. అయ్యో మరచిపోయాను మామా .అని జరిగిన విషయం చెప్పినదట.
అయ్యో ! ఎంతపనిచేశావమ్మా ? అమ్మ తరలివచ్చింది , అలా ఆతల్లిని నిర్లక్ష్యము చేయకమ్మ అని చెప్పి వెళ్ళాడట.  ఇక దుఃఖిస్తున్న మా జేజి కి ఆరాత్రి అమ్మవారు అలా పసిపాపలానే కలలో కనపడి నీబాధ చూడలేకుండా వున్నాను గానీ! నాపూజచేసుకో నిన్ను రక్షిస్తాను అనినవ్వుతూ చెప్పినది,. అప్పుడీవిడ. అమ్మా! దీపారాధనకునూనెకు కూడా దిక్కులేని దరిద్రురాలిని నేను! ఎలా చెయ్యాలమ్మా నీపూజ? ఏమిపెట్టగలనమ్మా నీకు ప్రసాదము ? అని ఏడ్చినదట. అప్పుడు ఆతల్లి కరుణతో పక్కనున్న బావి చూపి అందులో నీళ్ళు చాలు నాకు. భక్తితో నా బిడ్డలు ఏమిచ్చినా నాకు తృప్తి కలిగిస్తుంది ,అనిపలికి అదృశ్యమయినది. పొద్దుననే లేచి తలారా స్నానము చేసి స్వప్నములో ఆతల్లి చెప్పిన విధముగా ఆనీళ్ళే తెచ్చి ఆ కుంకుమ భరిణనే దేవతగా తలచి సమర్పించుకున్నదట.
 బిడ్డకోసం దుఃఖిస్తూనే పూజ చేస్తున్నది. ఈలోపల గ్రామాంతరము వెళ్ళిన మాజేజినాయన వచ్చి పిల్లవాని కోసం కన్నీరు మున్నీరవుతూ వెతకటానికి వెళ్ళాడు.

అక్కడ విజయవాడలో మిలటరీ సెలక్షన్ కెళ్ళిన మా నాన్న గారి ని చేతి ఎముకలో ఏదో లోపమున్నదని తీసుకోకుండా పంపించారు. అయితే డబ్బులేకుండా వెళ్ళి తల్లికి ముఖము చూపించటము ఇష్టములేక మానాన్నగారు అక్కడే ఒక హోటల్ లో పనికి కుదిరాడు. ఆన్ని చోట్లా వెతుకుతూ విజయ వాడలో వున్న తన చుట్టాలను కలిసి హోటల్లన్నీ వెతుకుతూ వచ్చిన మా జేజినాయనకి కొడుకు కనపడటముతో ఇద్దరూ ఏడ్చుకుని ఆయనను తీసుకునివచ్చాడు. అక్కడనుండి మాజేజినాయనకు అమ్మవారిపట్ల భక్తి కలిగి తీక్షణముగా నామము చేయటము అలవాటయినది. దానితోనే ధ్యానము లో గంటల తరబడి వుండటము జరుగసాగింది. ఈ లోపల జ్యోతిష్యము ,హస్తరేఖలు చూసి భవిస్యత్ చెప్పగలిగిన శక్తి వచ్చాయి.
 ఈలోపల మా నాన్న గారికి వినయాశ్రమములో హయ్యర్ గ్రేడ్ టీచర్ ట్రయినింగ్ రావటము ,ఎంతో కష్టపడి ఆయన దానిని పూర్తిచేసుకుని వుద్యోగములో చేరటము జరిగింది. అమ్మ అనుగ్రహముంటే మూగవాడు మహా పండితుడవుతాడన్నట్లు, ఈయనకు జ్యోతిష్యములో అఖండ ప్రజ్ఞ కలగటము జరిగింది వెంకయ్యగారు జ్యోతిష్యము వెంకయ్య గారు గురువుగారుగా గుర్తించబడ్డారు. ఇప్పటి పౌర సరఫరాల మంత్రి కాసు క్రిష్ణారెడ్డిగారి తండ్రిగారైన కాసు వెంగళ రెడ్డిగారు, భవనం వెంకటరాం గారూ అప్పటి ఎస్.పి. శ్రీకాంతరెడ్డిగారూ .మాజీ రాష్ట్రపతి కీశే. నీలం సంజీవ రెడ్డిగారలకు ఈయనంటే గురుత్వము ఏర్పడినది. రాష్ట్రములో ప్రముఖులతో సంబంధాలు వున్నా ఏ రోజూ తన స్వా ర్ధానికి వాడుకో లేదు. ఎప్పుడూ పూజలు ,సలహాలంటూ నాచిన్నప్పుడు. మా పల్లెటూరిలో కార్లు వస్తూవుండేవి ఈయన కోసం . ఎప్పుడూ అన్నదానాలు సంతర్పణలు అని ఎవరన్నా ఇచ్చిన దంతా ఖర్చు చేసేవాడేగాని మిగిల్చాలి! పిల్లలకు ఆస్తులు కూడబెట్టాలని ఏరోజూ ప్రయత్నించలేదాయన.
 అలానే భగవత్ సేవలో ఆయన కాలము పూర్తిచేసుకున్నాడు. నేను ఇంటర్ మీడియట్ చదువుతుండగా వారు దైవ సన్నిధానానికి వెళ్ళిపోవటముతో ఆతరువాత అమ్మ పీఠ సేవా భాగ్యం నాకు సంక్రమించింది. తరువాత శ్రీ పీఠ నిర్మాణము ఎలా జరిపి ఆలయ ప్రతిష్ఠ ఎలా లీలలుగా జరిపినదో అమ్మ కరుణ ఎలా ప్రసరించినదో చూడండి.

శ్రీమాత్రేనమః నాకు చిన్నతనమునుండి భగవత్ కార్యక్రమములతో పరిచయము అవటము వలన అదీ,భక్తిసాంప్రదాయము నకు చెందినవవటమువలన సంకీర్తన అన్నా, భగవంతుని కీర్తించే కీర్తనలన్నా చాలా ఇష్టము. మా నాన్నగారు నాకు చిన్నతనములోనే తిరుపతినుండి రాజాజీ మెచ్చిన భాగవతము అనే పుస్తకాన్ని తెచ్చి ఇచ్చాడు అది చదవటము, ఆయన చెప్పే మహాభారత, రామాయణ గాధలను వినటము వలననో , పూర్వజన్మ సంస్కారమో తెలియదు. హరిభక్తి మనసులో నాటుకుపోయినది. భక్తుల గాథలు చదువుతుంటే ఒళ్ళు పులకరించి పోతుంది. భగవంతుని కథలు విన్నా, సినిమాలలో చూసినా మనసు భావలోకములోకి వెళ్ళిపోతుంది కళ్ళవెంట నీళ్ళు ఆగవు. మావూరి శివాలయములో నాచిన్నప్పుడు ఋత్విక్కులు చేసే రుద్ర పారాయణాన్ని విని మనసు వురకలు వేసేది. నేనుకూడా నా మనసారా నీళ్ళుతెచ్చి స్వామిమీద పోసి స్నానము చేపించాలని మనసు తహతహ లాడేది. అయితే ఇవన్నీ ఆ జగన్మాత కు పలురూపాలుగా తప్ప అన్యము అనేభావన ఇప్పటివరకు నాకు కలగటములేదు.
 "పురుషేచ విష్ణుః క్రోధేచ కాళీ ,సమరేచ దుర్గ, భోగ్యేచ భవానీ" అమ్మ పలు రూపాలలో తనలీలా విలాసాలు సాగిస్తున్న దిగా కనపడుతుంటున్నది. వుదాహరణకు మీ అమ్మగారికి ఎర్రరంగు చీర, పచ్చరంగుచీర, నీలిరంగుచీర ఇలా పలురంగుల చీరలున్నాయను కుందాము .వాటిలో ఏరంగు చీరలో చూసినా మీఅమ్మగారు మీకు ఒకేరకముగా ఎలా కనపడతారో ,నాకూ ఏరూపాన్ని చూసినా అమ్మ అలాగే భావనలోకొస్తున్నది.
ఇక మన ఫేవరేట్ హీరో మనగురువుగారు ఆంజనేయ స్వామివారు. ఆయన నడచిన విధముగానే భక్తుడు భగవంతుని సేవచెయ్యలనేది నామనసుకు వచ్చిన బోధ. ఇలా క్రిష్ణరాసకేళిని అమ్మలీలతో సమన్వయంచేసుకునేవిద్య ఎలా నేర్పినదో నాకింకా ఆశ్చర్యమే. అయితే ఆధ్యాత్మిక మార్గములో ఎవరికి వారే అనుభవం తో తెలుసుకోవలసినదే .మరొకరు వివరిస్తే గందరగోళముగా వుంటుంది. వదిలేద్దాం.

ఇంటర్మీడియెట్ నుండి పీఠములో సేవా కార్యక్రమాలు నాకు లభించిన అదృష్టముగా భావిస్తూ నిర్వహించే వాడిని. నా చిన్నతనము నుంచీ ఏదో నామస్మరణ ప్రసాదము, హారతి కీర్తనలతో నిర్వహించటమె తప్ప శాస్త్రీయముగా పూజా విధి తెలియదు. ఒక సారి పుస్తకాల షాపులో గాయత్రీ పూజా విధి చూసికొని దానిప్రకారము పూజా కార్యక్రమాలు జరుపుకొనటం మొదలుపెట్టాను. మానాన్న గారు నాకు చిన్నప్పుడు చెప్పిన బాలాత్రిపురసుందరీ మంత్రాన్ని నిష్టగా జపించేవాడిని. ఖడ్గమాల ,తీక్షణముగా పఠించేవాడిని.
ఇక అమ్మ శిక్షణప్రారంభమయినది. లలితా సహస్రనామ పారాయణము చేయమని ప్రేరణ మొదలయి అది,గీతా పారాయణము సాగినది. దసరా నవరాత్రులు వైభవముగా సాగుతున్నాయి. పెళ్ళిజరిగినతరువాత ,నాన్నగారు చనిపోయినతరువాత,మా గ్రా మము నకు 1 కి.మీ. దూరం లోవున్న మాపొలములో చిన్నపాకలు నిర్మించి హిందూ పబ్లిక్ స్కూల్ పేరుతో చిన్న స్కూలు ప్రారంభించాను. ఆస్కూలు ప్రారంభసమయములో అక్కడి స్థలాన్ని పరిశీలించిన మా పురోహితుడు ఒరే దుర్గా ! ఈస్థలము తులసి, దర్భలు పెరిగివున్నది . ఈస్థలము చాలా పవిత్రమయినది అని అన్నాడు. అలా స్కూలు జరుగుతున్న సమయములో ఉపాద్యాయ పోష్టు రావటము అమ్మలీలగా యెలా జరిపినదో ముందుపోష్టులో తెలియజేశాను. ఈసమయములో అమ్మ దయవలన లక్ష్మీ దేవికి ఇష్టమయిన కనకధారా స్తవం , సరస్వతీ మాతకు ఇస్టమయిన శ్యామలా దండకం పారాయణ చేస్తుండటం అలవాటయినది. ఈసమయములో ఒకసారి ఋషిక్షేత్రములో జరిగిన గాయత్రీ హోమము, చూశాను. చేయాలనిపించింది అంతే భవానీ దీక్షలో వున్న నేను త్రిపురాంతకం వెళ్ళినప్పుడు అక్కడ గాయత్రీ పరివార్ సభ్యులతో పరిచయం యజ్ఞ క్రియను నేర్చుకోవడము అంతా అమ్మ చెప్పిన పాఠములా జరిగింది . అంతకు ముందే రుద్రసూక్తము సుస్వరముగా చేయటము వచ్చింది. ఎలా సాధ్యమయిందో అమ్మకే ఎరుక. అన్నిసాంప్రదాయాలకు చెందిన మహాత్ముల జీవితాలు, వారిబోధనలు, సాధనా పద్దతులన్నీ అనేక పుస్తకాల రూపేణా నాకు అందుబాటులోకి రావటము, నేనుచదవటము, ఇవన్నీ అమ్మ ఇచ్చిన శిక్షణలో భాగముగానే జరిగాయనుకుంటున్నాను. ఇక నేను మాగురువుగారుభాస్కరుని  ప్రకాశమయ్య గారినిని రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నప్పుడు., ఆయన ఒరే! నీ నోరుమూపించే మహానుభావుడు బృందావనములో వున్న శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారే వెళ్ళి ఆయనను ఆశ్రయించు. ఆయన కొంతకాలము గుంటూరులోని ఆశ్రమము నకు వస్తారు. వెళ్ళి కలవమని చెప్పారు. మూడుసంవత్సరాలు ప్రయత్నించిన తరువాత ఆమహా పురుషుని దర్శించే భాగ్యములభించింది. భారతభూమిలో వున్న మహాసాధకుడు ,సాక్షాత్తు రాసనాయకి శ్రీరాధాదేవి కృష్ణసహితముగా ఎవరితోనయితే నిత్యము ఆటలాడుకుంటుందో ఆ మహానుభావుని ఆశ్రయించటం ,నిజముగా నాపూర్వజన్మ సుకృతం. ఆ రాధాసఖీస్వరూపాన్ని గురించి మరొక పోస్ట్ లో వ్రాస్తాను. మొదటిసారి చూడగానే వారు నన్ను ఆదరించి దగ్గరకు చేర్చుకున్నతీరు, పూర్వజన్మలో ఎప్పుడో ఆ మహానుభావుని సేవించిన ఫలితమాఅని అనిపించినది. ఆకరుణామూర్తి దయ నాపైవుండి . రాధా షడక్షరీ మంత్ర రాజాన్ని. నాచెవివినగలిగింది .చిన్నారి కృపకు నేనుపాత్రుడనయ్యాను. అయితే అమ్మ శిక్షణలో ఇన్నిమలుపులెందుకున్నాయో నాకిప్పుడు అర్ధమవుతున్నది. మూలప్రకృతి అయిన అమ్మ మొదట అయిదు రూపాలుగా వ్యక్తమయినదని దేవీ భాగవతము చెబుతున్నది. భగవంతుని హ్లాదినీశక్తి రాధ, క్రియాశక్తిదుర్గ, ఐ శ్వర్యశక్తి,లక్ష్మి , విద్యా జ్ఞానశక్తి సంకేతాలయిన సరస్వతి, సావిత్రి{గాయత్రి} గా వ్యక్తమయినదట. అందుకనే కాబోలు ఆతల్లి నాచేత తన విభూతులన్నింటినీ తెలుసుకునేలా చేసింది. ఏమిటో ఆతల్లి దయ. నేనా గొప్ప సాధనలు, యోగాలు జపాలు, తపాలు చేసిన వాడినికాను. నిజంచెప్పాలంటే పట్టుమని గంటసేపుకూడా ధ్యానములో కూర్చొని ఎరుగనే, మరేమిటీ ఆతల్లికి ఈ అపారప్రేమ? అమ్మా! అని పిలిచిన ఒక్కపిలుపుకే కరిగిపోయి పతనమయ్యి జారి పడబోయినప్పుడల్లా చేయిపట్టుకు ని నడుపుతున్న ఆతల్లి ప్రేమ ను ఎలా వర్ణించాలి?
 ఒక హీనుడను,దీనుడనయిన నాపట్లే ఇంత కరుణ చూపే ఈతల్లి నిజమయిన సాధకుల నింకెంత గా కరుణిస్తుందో చెప్పనక్కరలేదు. ఇంత చిన్న సేవకే కరుణించి తన మందిర నిర్మాణము జరిపే లీలలో నాకుప్రధానపాత్రనిచ్చిన ఆలీల వివరిస్తాను

అది 1999 సంవత్సరములోవిజయదశమి పర్వదినము. పూర్ణాహుతి, కలశఉద్వాసన చెప్పి ప్రశాంతముగా కూర్చొనివున్నాము. మనసులో ఒక సంకల్పము తళుక్కునమెరిసింది. మందిరనిర్మాణము ప్రారంభించాలి అనిభావన మనసును వూపేస్తున్నది. పక్కనున్న నాతమ్ముళ్ళను. మిత్రులను అడిగాను చేయగలమా ?అని . అమ్మసంకల్పముంటే అది పెద్దలెక్క కాదు అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అప్పటికప్పుడు కాగితాలమీద కార్యక్రమం ప్లాన్ తయారు చేసాము. ముహూర్తము నిర్ణయించాము. ప్రతిష్ఠ కు మూడురోజులుముందునుండి జపాలు, హోమాలు ప్రారంభించాము. ఆమూడురోజులు ఆప్రాంతమంతా అవ్యక్తమయిన ఆనందం అందరిమనస్సులలో తాండవించింది. పూర్ణాహుతి హోమము జరిగినప్పుడు తీసిన ఫోటోలో అగ్నికీలలు ఓం కార రూపములో దర్శనమిచ్చి అమ్మ కరుణను ప్రత్యక్షముగా చూపినది ఈఫోటో ఇంతకు ముందు పోస్టులో ఇచ్చాను. తరువాత నాదగ్గరున్న కొద్ది డబ్బుతో పునాదులు తీసి పనిప్రారంభించాము. నాకుతెలిసిన మిత్రులు బంధువులు సహాయము కోరాను. అయితే ముందే నిర్ణయించుకున్నాను ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా అదంతా అమ్మ లీలలో భాగముగానే భావించాలి. అమ్మకిష్టములేకుంటే వారిని ఇవ్వనివ్వదు. అందువలన మనసులో ఎటువంటి బాధకు గురికారాదు అని. నిజముగా ఎన్నిలీలలో ఇవ్వకూడని వాళ్ళను డబ్బు ఇవ్వనివ్వలేదు. నేనెంత ప్రయత్నించినా. అప్పుడు ఇలా ఎందుకుజరిగిందా అని ఆలోచిస్తే తెలిసినది అలా ఎందుకు జరుగుతున్నదో . ఒక రు వెయ్యిరూపాయలిస్తానని ప్రతిరోజూ కనపడ్డప్పుడు రమ్మంటాడు .ఏదో కారణము అతనికి అడ్డువస్తుంది ఇవ్వటానికి ఒక నెల ఆగినాక పోలిసులు అరెస్ట్ చేసారు అతను దొంగసామానులు ఆభరణాలు కొన్న కారణము మీద. ఆతరువాత అతను చాలా సార్లు అన్నాడు,ఎందువలనో నేనివ్వలేకపోతున్నాను అని. అలాంటి సొమ్మును తన మందిర నిర్మాణానికి అమ్మ రానివ్వలేదు
. ఒక డి.. ఎస్.పి.గారు నేను విషయము చెప్పినప్పుడలా రండి తప్పనిసరిగా అంటాడు. నాకు ఆయన దగ్గరకు బయలుదేరదామనుకున్నప్పుడల్లా ఏదోవొక అడ్డంకి వస్తుంది అలా గడచిపోతుండగా ఆయనను ఎ.సి.బి. వాళ్ళుపట్టుకున్నారు అని వార్త పత్రికలో చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడర్ధమయింది నన్ను వెళ్ళకుండా ఏశక్తి అడ్డుకున్నదో. కేవలము తమ శ్రమశక్తి చేత నిజాయితీగా సంపాదించిన డబ్బులను మాత్రమే ఈ కార్యక్రమములో పాల్గొన్న వారిచేత సమర్పింపజేసినది.
 తీగల రవీంద్ర బాబుగారు అని సర్కిల్ ఇన్ స్పెక్టర్గారు మా పత్రికా విలేఖరులు వెళ్ళి అడగగానే ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మింపజేయడానికి ముందుకువచ్చారు. ఆంధ్రజ్యోతి విలేఖరి దారా మల్లిఖార్జునరావు, కుమారస్వామి ప్రతిష్ట , చండ్ర సాంబశివరావు దంపతులు దత్తాత్రేయ స్వామిని అలాగే అయ్యప్ప, మహా గణపతి నవగ్రహ ప్రతిష్టలు చేయాలని సంకల్పించాము .ప్రధాన దేవతలుగా, శ్రీ వేంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి మధ్యలో జగన్మాత శ్రీ కనకదుర్గాదేవిని ప్రతిష్టించాలని , అమ్మవారిని దేవీ భాగవతములో వర్ణించిన పంచ రూపాలుగా {దుర్గ, రాధ,లక్ష్మి , సరస్వతి, గాయత్రి స్వరూపాలుగా} ప్రతిష్ఠజరపాలని అమ్మద్వారా భావన పొందాము. పాఠశాల మీద వస్తున్న ఆదాయము ఈ కార్యక్రమము కోసం వెచ్చించాము. ఇక స్వామి అనుగ్రహం మాపై ప్రసరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి మూర్తిని ప్రసాదించారు. స్వామివారి ఖర్చుతో, స్వామివారి శిల్పశాలలో తనకు తానే సృష్టింపజేసుకుని ముసిముసి నవ్వుల మూర్తిగా శ్రీవారు వేంచేశారు .

ఇలా ఆరు సంవత్సరాల కాలం గడచింది. ఈ కాలములో కొన్నిసారులు తీవ్రమయిన బాధలకు గురయ్యాను. వివాదాలు ,ఆర్ధిక ఇబ్బందులు . ఈకార్యక్రమం పూర్తిచేయగలనా అనే నిరాశ ఇలా అనేక వత్తిడులు తో గడచి పోయినది. ఇక ఈకార్యక్రమము నేను చేయగలనా? అనే అనుమానం పెరిగిపోతున్నది. ఎవరన్నా డబ్బున్నవారు సానుకూలముగా నున్నా వారి సంపాదన సరయినది కాకపోతే వాళ్ళను ఇవ్వ నివ్వదు. నేను అడగటము వాళ్ళు చూద్దాము చూద్దామంటూ దాటవేయటము. కూలీ .వ్యవసాయం చేసుకునే వారు ఇచ్చే పదులు,వందలతో ఇది ఎప్పుడుపూర్తవుతుందనే బాధ. నాకొచ్చే కొద్ది ఆదాయము తో ఎన్నేళ్ళకు పూర్తిచెయ్యగలుగుతాము అనే ఆవేదన. ఈలోపల రిటయిర్డ్  ఎం. ఆర్వో ఒకాయన అమ్మవారి విగ్రహం చేపిస్తానని తయారు చేపించారు తే ఆరూపము చూస్తే నాకు అమ్మవారి కళ ఏమూలనా కనపడలేదు. అందువలన ఆవిగ్రహము ప్రతిష్ట చేయనని చెప్పాను. ఇంతకీ ఆవిడ ఎక్కడవున్నదో అంతులేదు. ఇలా 2006 డిశంబర్ దాకా గడచిపోయినది.

 ఆ సంవత్సరము డిశంబరులో మాపూజ్యగురుదేవులు శ్రీరాధికా ప్రసాద్ మహరాజ్ గారిని 1 00 సంవత్సరాలు పూర్తయినదాకా తల్లిలా సాకి గురుసేవ చేసుకున్న ,మహా యోగిని గురుసమానురాలు అంజనీ మాత బృందావనము నుంచి గుంటూరు వచ్చారని తెలిసి మాట్లాడివద్దామని వెళ్ళాను. ఆమహా యోగిని చూడటానికి చాలా సామాన్యురాలిగా కనిపిస్తారు పైకి.కానీ అపార శక్తివంతురాలు  వెళ్ళగానే ఆదరముగా పిలచి విషయాలు అడిగారు . అమ్మా ఈ కార్యక్రమము పూర్తిచేయగలుగుతానా ? అని అడిగాను. అమ్మ ముహూర్తము చూసి వచ్చే మాఘమాసము 2007 జనవరి 28 వ తారీఖున ముహూర్తం నిర్ణయించారు . అమ్మా! నాదగ్గర ప్రస్తుతము డబ్బులేదు. నాలుగు నెలల క్రితమే లక్షరూపాయలు పోగుచేసుకుని గోపురాలు పూర్తిచేసాను. ఇప్పుడు ప్రతిష్ట అంటే మాటలా? అని అన్నాను. మరేమి ఫర్వాలేదు అన్నీ అమ్మ చూసుకుంటుంది. నీ ప్రయత్నము నీవుచేయి. అని దీవించింది.
నాకు వున్న సమయము ఒక నెల. కావలసిన డబ్బు సుమారు ఆరు లక్షలు. దీనికంటే మరొకపెద్దపని అమ్మవారి మూర్తి ఎక్కడవున్నదో తెలియదు. భారం మనగురువుగారు ఆంజనేయస్వామిని తలుచుకుని ఆయనకు చెప్పుకున్నాను స్వామీ అసాధ్యాలు సాధ్యం చేసే వాడివి నువ్వు రంగం లోకిదిగితే తప్ప ఈ కార్యక్రమం సాధ్యంకాదు అని. అటునుంచి అటే తూర్పుగోదావరి జిల్లా పందల పాకలో వున్న వీరభద్రరావు అనే మాకు తెలిసిన ప్రతిష్టాచార్యులు ఒకాయనను కలవాలని వెళ్ళాను. అక్కడికి వెళితే ఆయన సంగతివిని ఈముహూర్తం ఈ సంవత్సరమంతటిలోకి చాలా ప్రసస్థమయినది. ఆరు నెలలక్రిందే మాకు కార్యక్రమాలు ఒప్పుకుని వున్నాము. పిచ్చిబ్రాహ్మణుడుకూడా రోజుకు 500 లుఇచ్చినా దొరకడు. ఆరోజు కనుక ముహూర్తము మార్చుదాము అన్నారు .గుంటూరు ఫోను చేస్తే ముహూర్తము మార్చవద్దు అన్నారు.
 అయ్యా! మహాత్ముల నోటినుండి వచ్చిన మాట జరిగి తీరాలి . కనుక ముహూర్తము మార్చలేను అని చెప్పాను. అక్కడనుండి రాజమండ్రి వచ్చి అమ్మవారి విగ్రహము కోసము ప్రయత్నించాను .కానీ అక్కడ రూపాలు నాకు తృప్తికలిగించలేదు. సరే అక్కడనుండి బయలుదేరి విషయాన్ని మాతమ్ముళ్ళకు ఫోనులోతెలియజేసి మహాబలిపురం వెళ్ళాను. అక్కడ శిల్పులు అమ్మ వారి రూపము నేను కోరినట్లు మలచాలంటే రెండు నెలల సమయము కావాలని అడిగారు. తిరిగి వచ్చాను. నెల్లూరులో ఒక దిన పత్రికలో పనిచేస్తున్న నా చిన్న తమ్ముడు శ్రీనివాసరావు, వినుకొండ మండల పరిషత్లోపనిచేస్తున్న పెద్ద తమ్ముడు నామాట ను తలదాల్చి ప్రయత్నాలలోకి దిగారు. తెనాలి వెళ్ళి ప్రయత్నించాను, ఆళ్ళగడ్ద .చిలకలూరిపేట ఇలా పిచ్చికుక్కలా దేశమంతా తిరుగుతూ విగ్రహం కోసం ప్రయత్నించాను, జైపూర్ వెళ్ళి పాలరాతి విగ్రహము తెప్పిద్దామని అనుకుని ప్రయత్నించినా అభిషేకాలకు పాలరాతి విగ్రహాలున శ్రేష్ఠంకాదని తేలడముతో విరమించుకున్నాను.

విగ్రహంకోసము ప్రయత్నము చేస్తూనే అసలు కావలసిన లక్ష్మీ ప్రసన్నత కోసం ప్రయత్నము ప్రారంభించాను. గ్రామాలలో అడుగుదామనుకుంటే ఇది వ్యవసాయపనులు జరుగుతున్న సమయం పంటలింకా రాలేదు. అందువలన అడిగినా ప్రయోజనముండదు. ఈ సమయములో నాకు హైదరాబాదులో లలిత్ మనోహర్ గారు గుర్తుకొచ్చారు. మేము శ్రీ అన్నదానముచిదంబర శాస్త్రి గారి ఆద్వర్యములో సికిందరాబాద్ లోని వారి స్వరాజ్ ప్రెస్ లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం జరిగినప్పుడు పాల్గొన్నాను. రాష్ట్రమంతా హనుమద్ భక్తులు కో టిచాలీసా పారాయణము జరుపగా పూర్ణాహుతి అక్కడ జరిపినప్పుడు, స్వామి నాసేవలను వుపయోగించిన తీరు మరొకసారి తెలియ పరుస్తాను. నేను ఈసమయములో దీక్షలో వున్నాను. హైదరాబాద్ లో మాబంధువు అమ్మవారి మహిమలను అనుభవపూర్వకముగా తెలుసుకున్న వీరనారాయణ అనే భక్తుడు బ్రతుకుతెరువుకు అక్కడకు చేరివున్నాడు కనుక ఆయనను సంప్రదించాను నేను హైదరాబాద్ లో వుండే నాలుగు రోజులు కాస్త నా నిష్టకు భంగము కలగకుండా ఏర్పాట్లు చేయాలని. ఆయన సంతోషముగా ఒప్పుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళాను . అక్కడ చాలీసా కార్యక్రమము లో పరిచయమయిన కొందరిని కలసినా పెద్దగా ప్రయోజనము లేక పోయినది. లలిత్ మనోహర్ గారిని కలవాలని వారి ఆఫీస్ కెల్లాను.  మధ్యాహ్నం వస్తానని చెప్పారు. . తరువాత ఆఫీస్ కు వెళ్ళి, మనోహర్ గారిని కలసి విషయము వివరించాను. ఆయన సంతోషపడి తప్పనిసరిగా సహాయము చేస్తానని మాటయిచ్చారు. ప్రతిష్టకు వచ్చే ఋత్విక్కులకయ్యే ఖర్చు భరిస్తారని ఆశపడ్డాను. ఇక విగ్రహము కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి కానీ అమ్మ ఎక్కడినుండి వస్తున్నదో. ఋ త్విక్కులకోసం ఎక్కడప్రయత్నించినా అందరూ బిజీ
. ఒకపక్క ఆహ్వానపత్రికలు తయారయి అందరికీ అందుతున్నాయి. 9 సంవత్సరాల క్రితం గుంటూరు రైల్లో వెళుతుంటే ఒక దేవీ భక్తురాలు పరిచయ మయ్యారు .పేరు ఝాన్సీగారు. వారిచ్చిన అడ్రస్ నాదగ్గరున్నది హైదరాబాద్ లో లొత్తుకుంట. వారి నివాసం. నాపక్కన వున్నాయనకు కూడా హైదరాబాద్ కొత్త ,ఆఅ డ్రస్ కనిపెట్టలేక పోయాము. చివరకు సిటీబస్సూలో వెళుతూ నిద్రపోయాను మెలుకువ వచ్చేసరికి ఒక షాప్ పై లోతుకుంటా అనే నేమ్ బోర్డ్ కనపడింది. అక్కడదిగి ఝాన్సీ గారి అడ్రస్ కెళ్ళగా వారు ఎంతో సంతోషించి తన సహాయం అందిస్తానని మాటిచ్చారు. అక్కడనుండి నెల్లూరు వెళ్ళి మాతమ్ముడిని తీసుకుని ఆత్మకూరు లో వున్న శివకుమార్ గారిని కలసి వారిని ఈకార్యక్రమానికి బ్రహ్మగా ఎన్నుకుని మిగతా ఋత్విక్కులను ఏర్పాటుచేసుకోమని బాధ్యతలప్పగించాము. అమ్మ నిర్ణయమేమో గానీ జొన్నవాడ కామాక్షిదేవి ఆలయ అర్చకులు, నెల్లూరు రాజరాజేశ్వరిదేవి ఆలయ అర్చకులు తో బృందము తయారయ్యినది.
 ఇక అమ్మవారి విషయము తేలలేదు .మరొకసారి  హైదరాబాద్ వెళ్లాను. పదిరోజుల అనంతరం. నేను లలిత్ మనోహర్ గారి ఆఫ్ఫీసుకు వెళ్లగనే అక్కడ వారు లేరు .వారి పియే గారు బాంబులాంటి వార్త పేల్చారు. సార్ ! అమెరికా వెల్లాల్సొచ్చినది . ముహూర్తం వాయిదావేసుకోండి అన్నారు. నాకు నోట మాటరాలేదు. ఇదేమిటండీ ! ఇదేమన్నా బావుంటుందా ! పదిమందికి చెప్పి .పిలచి అన్నీ తయారవుతుండగా ఇలా చెప్పటం వీలవుతుందా అన్నాను . అయితే మీ ప్రయత్నాలు మీరు చేసుకోవలసినదే అని నిష్కర్షగా చెప్పి వెల్లిపోయారాయన . నాకైతే మనసు మొద్దుబారి పోయింది. ఈయన అండ ఉంటూంది  కదా అని గంపెడాశతో ఉన్నాను ఇదేమిటీ ? ఇలా జరిగింది అంటూ కాళ్ళీడ్చుకుంటూ రోడ్డునపడ్డాను .
అప్పటికే నిరాశ తో వున్న నేను అనాలోచితంగా అలానడుస్తూ వెళుతుండగా ఆరోజు గురువారంకనుక భక్తులతో కిట కిట లాడుతున్న ఒక సాయి దేవాలయానికి చేరుకున్నాను. అది ముషీరాబాద్ లో సాయి ఆలయ మనుకుంటా. లోనికి వెళ్ళి ధునికి కొబ్బరికాయ సమర్పించుకుని సాయి ముందు కూర్చుని తాతా! ఏమిటీ పరీక్ష ,ఎలా జరగాలి ఈ కార్యక్రమం అని ప్రార్ధిస్తూ గడిపాను. తరువాత బయటకు రాగానే ఫోన్ వచ్చింది ,నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ విష్ణు భక్తుడు, ,ధార్మికుడు ,గోవర్ధన రెడ్డిగారు,సహాయమందిస్తానని చెప్పారు అని. మహాత్ముల సహాయము వెన్నంటివుందని ధైర్యము

ఒకపక్క సమయము వేగముగా దగ్గరకొస్తున్నది. భోగిపండుగరోజు నేను నె ల్లూరులో వున్నాను 13వ తేదీ .ప్రతిష్ఠఏమో 28 . ఇక ఆరోజు సాయంత్రం మాతమ్ముని పత్రికాఫీసులో కూర్చొని దీనిపై మాట్లాడుతున్నాము . మావాడు అన్నా! నీవేమో అమ్మవారు ఎక్కడో వున్నది , ఇలా లీలజరిపి వస్తున్న దంటావు. అవతల సమయము దగ్గరపడుతున్నది. ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి కాని వాస్తవానికి చాలాఇబ్బంది కలుగుతుంది. రేపు విగ్రహము లేకుండా ప్రతిష్ట ఎలా చేయగలము? ఏ దో వొక రాయిని నిలబెట్టలేముకదా? విగ్రహము లేకుండా. ఇ దేమన్నా ఆటా? అని అడుగుతారు వచ్చినవాళ్ళు. ఇక సందేహించకుండా మహాబలిపురము వెళ్ళి అమ్మవారి ఏదో వొకరూపము, తయారు చేసివున్న శిల్పము కొంచెము ఎక్కువ ఇచ్చయినా తీసుకురావటము మంచిది అని బాధగా చెప్పాడు.
 ఇలా మేముమాట్లాడుతుండగా వాళ్ళకొలీగ్ వెంకటేస్వర్లు గారువచ్చి విషయమేమిటనగా మాతమ్ముడు చెప్పాడు. వెంటనే అమ్మవారి విగ్రహానికయ్యే ఖర్చు నేనుభరిస్తాను అందుకోసం 20 వేలు ఇస్తాను మరొక పదివేలు ఏర్పాటుచేస్తాను తీసుకోండిఅని అన్నాడు. మేము ఆశ్చర్యపోయి ఏ మిటీ మాయ మనం అడగకుండానే అమ్మ ఈయనచేత ఇప్పిస్తున్నదేమిటి అనుకుంటుండగా దానికి ఆయన మరొక ఆశ్చర్యకరమయిన కారణాన్ని చెప్పాడు,. నాలుగుసంవత్సరాలక్రితం రాత్రి పూట హైదరాబాద్ నుండి నేను కారులో వస్తుండగా కారంపూడి ఏరియా లో కారు ఆగిపోయినది చుట్టూ చిమ్మ చీకటి. అసలే నక్సలైట్ల సమస్యతో సతమవుతున్న ప్రాంతం ఎలా చెయ్యాలా అని ఆందోళన పడుతున్నాను ,అంతలో అటుగా ఒక కారువస్తే ఆపాను. అందులోవున్నతను ఒక మెకానిక్ ఆయన నాపరిస్తితినిగమనించి తనకారుకు నాకారును కట్టుకుని తన వూరిలోని తనషెడ్కు తీసుకు వచ్చాడు. అయ్యా! ఈకారు గుంటూరు పంపి బాగుచేయవలసినదే మీకు అంత అర్జంట్ అయితే నాకారు తీసుకెళ్ళి పొద్దుననే ఎవరినన్నా పంపించ0డి అనిచెప్పి తన ఇంటిలోకి తీసుకెళ్ళీ మంచినీరు ఇచ్చాడు. రేకులు కప్పివున్న ఆ చిన్న షెడ్లో పెద్ద అమ్మవారి కాళికా రూపం. హనుమంతుని విగ్రహం వున్నాయి .తాను అమ్మవారి ఆలయం కట్టించాలని సంకల్పముతో పనిచేస్తున్నానని అతను వివవరించాడు. అమ్మా నన్ను ఈ గండమునుండి కాపాడావు. నీకోసం ఏదోవొకటిచేస్తానని మొక్కుకుని వచ్చి ,కారు మరసనాడు వేరే వారిచేత తెప్పించుకున్నాను. కానీ మరలా నాలుగైదు సారులు ఆరూట్ లోవచ్చినా ఆ ప్రాంతము నాకు కనిపించలేదు .మీరుమాట్లాడుతుంటే అమ్మవారు గుర్తుకొచ్చారు. అందువలన అమ్మకు ఈసేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పగా మాకు నోటమాట రాలేదు. మరుసటిరోజు ఇక విగ్రహము కోసము ఎదురుచూస్తూ కాలము గడపటము మంచిదికాదని, 10 రోజులలో ఎలా ఏర్పాటుచేయగలమనే మా వాళ్ళ మాటకు నేను కూడా ఆలోచనలో పడ్డాను ఒకపక్క అమ్మ ఎక్కడోవున్నది వస్తున్నది అని మనసులో ఒక చలించని నమ్మకమేదో స్థిరపడిపోయింది. కానీ దానిని వ్యక్తము చేసినా నలుగురూ నవ్వుతారేతప్ప ప్రయోజనమేమున్నదని నాకు నేను సర్ది చెప్పుకుని,సంక్రాంతిరోజున అన్నంతిని మధ్యాన్నం బస్సెక్కాను మద్రాసు వెళ్ళటానికి .నాతమ్ముడు శ్రీనివాస్ నన్ను నెల్లూరు బుస్ స్టాండ్ లో బస్సెక్కించి వెళ్ళాడు ద్రైవర్ వాళ్ళు టీ తాగుతూ పావుగంట లేట్ చేసారు. ఈలోగా మావాడు మళ్ళీ తిరిగివచ్చి అన్నా! ఇప్పుడు నీవు మద్రాసు వెళ్ళే సరికే రాత్రవుతుంది. అక్కడనుండి మహాబలిపురం వెళ్ళటం సాధ్యంకాదు. 40 వేలు చేతిలో వుంచుకుని ఇబ్బంది పడతావు. నీవుతిరుపతి వెళ్ళీ అక్కడ చక్రధర్ వడయార్ గారని శిల్ప కళాశాల మాజీ ప్రినిసిపాల్ గారున్నారు ఆయనను కలసి సలహా తీసుకుని పొద్దునే మద్రాస్ వెళ్ళు అని అన్నాడు. ఆబసు దిగి తిరుపతి బస్ ఎక్కాను
. బస్ బయలు దేరినది నాపక్కనే కూర్చున్న వ్యక్తి మీరెవరు ఎక్కడకు వెళుతున్నారు అని అడిగాడు. నేను విషయము చెప్పాను. ఆయన తనపేరు వెంకటరెడ్డి అ ని ,తాను పూలు హోల్ సేల్ వ్యాపారినని తనది కడప జిల్లా అనిచెప్పాడు. అంతేకాక తాను ఎన్నిసార్లు తిరుమల పూలుపంపాలను కున్నా కుదరలేదని మీకెన్ని పూలుకావాలో చెప్పండి? విజయవాడ బస్లో వేస్తాను మీరు వినుకొండలో దించుకోవచ్చు. నాతరపున స్వామికి సమర్పించ0డి ఈకార్యక్రమానికయ్యే పూలు మొత్తము నేనే పంపుతాను అన్నాడు. అంతే నాకర్ధమయిపోయింది. అమ్మ తిరుపతిలో వున్నది అని. పూలుఎదురొచ్చాయి కనుక అమ్మ అక్కడే వున్నదనే సంకేతము అందినది.

ఆయన అడ్రస్ తీసుకుని తిరుపతిలో దిగాక చక్రధర్ గారి ఇంటికి వెళ్ళాను . అయితే ఆయన తన మనుమరాలి పెళ్ళి పెట్టుకుని,పిలుపులకు బెంగళూర్ వెళ్ళారని ఆయన నాలుగైదు రోజులకుగానిరారు అని వాళ్ళమ్మాయి ,చెప్పినది.  హా ! మళ్ళీ నిరాశ . అమ్మా! మీకుతెలిసిన శిల్పులు ఇంకెవరన్నా వున్నారా అని అడిగాను. లేదండీ!ఇప్పుడు పండగ సెలవలవటము వలన శిల్ప కళాశాలలో ఎవరూ వుండరు. మహతీ ఆడిటోరియం దగ్గార ఎవరో వున్నట్లు చెప్పుకునేతప్పుడు విన్నాము అన్నదా అమ్మాయి. ఏమిటితల్లీ నీలీల! అని అమ్మనుతలచుకుని అక్కడకు వెళ్ళి విచారిస్తే నాగరాజు గారని ఒక శిల్పి అడ్రస్ దొరికింది. వాళ్ళ ఇంటికెళ్ళాక ఆయన భార్య ఆయననుఫోన్ చేసి పిలిపించింది. ఆయన వచ్చి విషయమంతావిని మాష్టర్ గారూ! మీరు ఇంతకార్యక్రమము ఇలా విగ్రహం లేకుండా పెట్టుకుని ఎలా చెయ్యాలనుకున్నారు, మీరుకోరిన జగన్మాత రూపమును మలచాలంటే కనీసము రెండు నెలలు కావాలి .ఎక్కడా తయారుచేసి వుంచుకోరు.మాదగ్గ ర తమిలనాడు వాళ్ళు ఎక్కువ వస్తుంటారుకనుక మారియమ్మన్ రూపము [చేతిలో కత్తి,రక్తపాత్ర} కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది. మీరు మహా బలిపురము వెళ్ళినా లలితా దేవిలేక రాజరాజేశ్వరీ రూపమో దొరుకుతుంది పొద్దున్నేవెళ్ళి ఏదో ఒక రూపము అమ్మవారే కనుక తెర్చ్చి ప్రతిష్టిన్ చటం మంచిది ఆంతకంటే వేరు మార్గములేదు అని వివరించాడు.
 అమ్మవారు ఇక్కడే ఎక్కడో వున్నదని నామనసు చెబుతున్నది .దయచేసి నీకుతెలిసినవాళ్ళందరినీ విచారించి చూడమని బ్రతిమిలాడాను. ఆయన నవ్వుకుని ఆనక నామీదజాలిపడి. తన బండిమీద తనకు తెలిసిన ప్రయివేట్ వర్క్ షాపులన్నింటికి తిప్పాడు. తిరుపతి స్వామివారి శిల్పకళాశాలలో పనిచేసే శిల్పులు ప్రయివేట్గా శిల్ప తయారీకేంద్రాలునిర్వహిస్తుంటారు. ఎక్కడా అమ్మరూపం లేదు. మరికొందరిని ఫోనులో సంప్రదించాడు. వాళ్ళందరినుండి ఒకటే సమాధానం ఆరూపము మనమెందుకు తయారు చేసుకుని వుంచుకుంటాము. ఎవరన్నా ఆర్డరిస్తే తయారు చేస్తాముగాని అని. ఆయనకు విసుగొచ్చినది. చూశారుగా మాష్టర్గారూ ,మీరు పొద్దున్నే మహాబలిపురం వెళ్ళటం మంచిది అన్నాడు. నేను నిరాశపడకుండా చివరిసారిగా ఇంకెవరన్నా వున్నారేమో చూడండి అన్నాను ఆయన నన్ను వెర్రివాన్ని చూసినట్లు చూశాడు. మరలా గుర్తుతెచ్చుకుని ఒకరిని మరచిపోయానని చెప్పి ఫోన్ చేసి  ఫోన్ లో మామా! నీదగ్గరేమన్నా అమ్మవారి విగ్రహము రడీగావున్నదా అని అడిగాడు. అవతలనుంచి విజయవాడలొ రూపము వున్నది కావాలా అని సమాధానము విని నామనస్సు గాలిలో తేలింది, క్షణము ఆలస్యము చేయకుండా అక్కడకు వెళ్ళివాలాము. చిత్రము శ్రీ వేంకటేశ్వరుని ఎక్కడనుంచి తెచ్చామో ఆ శ్వామివారి శిల్ప కళాశాలప్రక్కననే గోడవెంటవున్న నేత్రానందము అనే శిల్పకారుని ఇల్లుఅది. ఆయన చెప్పినదివి0టే అమ్మలీలేమిటొ అర్ధమవుతున్నది.

 నాలుగు సంవత్సరాల క్రితము నావద్దకు ఒక వ్యక్తి వచ్చి విజయవాడలో మూలమూర్తిరూపము చెక్కుతావా అని అనిగాడు. నేను సరేనన్నాను అతను అమ్మవారి అలంకరణ లేని మూలరూపము ఫోటోలిచ్చి అడ్వాన్స్ ఇచ్చివెళ్ళాడు తన అడ్డ్రస్ ఇవ్వలేదు నేను రాయిమీద రఫ్ గా రూపము తెచ్చివదలివేశాను అనిచెప్పాడాయన. నాపరిస్థితి చెప్పాను ఇంత త్వరగా ఎలా ఇవ్వగలము. పొరపాటున ఏచిన్న దెబ్బ పొరపాటుగాతగిలినా విగ్రహము మొత్తము వ్యర్ధమవుతుంది. మీరిలా అనాలోచితముగా ,విగ్రహము లేకుండా ఏలా పెట్టుకున్నారు కార్యక్రమాన్ని ? అని అన్నాడు. అయ్యా! ఇది అమ్మలీల నన్నుపిచ్చికుక్కను తిప్పినట్లు తిప్పి ఇక్కడ ప్రత్యక్షమయినది . అని వివరించాను

.ఆయనకుకూడా ఈ విగ్రహము తయరుచేయాలనే పట్టుదలవచ్చి నేనూ, నాకొడుకులూ రాత్రింబవాళ్ళూ పండగా మానుకుని కష్టపడితే మీకు 25 వతారీఖుకల్లా అందించగలుగుతాము . అన్నాడు. ఎంతివ్వ మంటారు అని అడిగితే 18వేలు ఇవ్వమని అడిగాడు. అది అమ్మవారి సంఖ్య {18} పైసా కూడా తగ్గవద్దు అని చెప్పి 10వేలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను. ఎట్టి పరిస్థితిలో 25కల్లా విగ్రహము వచ్చేలా చూడాలని,లేకుంటే కార్యక్రమం గందరగోళముగా మారుతుందని చెప్పాను.ఇంటికిరాగానే మా మందిరానికి ప్లాన్ ఇచ్చిన ప్రసాద్ గారి అబ్బాయి శంకర్ వచ్చి చూశాడు. నాన్నగారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము విగ్రహము మూడున్నర అడుగులకు మించకూడదు అని చెప్పాడు. ఇదెక్కడ గొడవరా దేవుడా! అక్కడ నాకు విగ్రహము నాలుగున్నర అడుగులు వుంటుందని శిల్పి చెప్పాడు,ఎలాచేయాలనుకుని, ఇప్పుడు చేయగలిగినది ఏమీలేదు. తప్పయినా ఒప్పయినా నేను చేయలేను మార్పులు జరిపే అవకాశములేదు ,కనుక ఏమిజరిగినా ఎదుర్కోవటము సరిచేసుకోవటము నీదేభారమని అమ్మకు చెప్పుకున్నాను. విగ్రహము రాగనే ఆత్రుతతో కొలిచి చూస్తే ఖచ్చితముగా పాదాలనుండి శిఖవరకు మూడున్నర అడుగులే వుంది మిగతా అడుగు పీఠము వున్నది. అమ్మ సంకల్పానికి తిరుగేమున్నది



ఇక మిగతా సరంజామా గూడా సిద్దమవుతున్నది. రామలింగేశ్వర స్వామి లింగము,నరసరావుపేటలోను, నవగ్రహాలు, అయ్యప్ప,కుమారస్వామి, లక్ష్మి,సరస్వతి, గణపతి విగ్రహాలు పురుషోత్తమ పట్నములో తయారయ్యాయి. శ్రీ పెంచలరెడ్డిగారు [సి.ఇ.ఓ.] గారు గణపతి, శ్రీ యుగంధర్ కుమార్ దంపతులు శివ, ప్రతిష్ఠ తీగలరవీంద్రబాబు, సి.ఐ. హనుమంతుని ప్రతిష్ట లకు ముందుకు వచ్చారు. నెల్లూరు వాసులు వెంకటేశ్వర రెడ్డిగారుఅన్నదానమునకు
బియ్యము ఇప్పించారు అనూహ్యముగా ఎక్కడెక్కడినుండో కావలసినవి కొరతలేకుండా వచ్చి పడుతున్నాయి. వినుకొండలో స్వాతి డ్రసెస్ అధినేత సూరి, అన్నయ్య మాకు చెప్పలేదేమిటి ?అని అడిగిమరీ నాతమ్ముడు క్రిష్ణతో కలసి సరుకులూ వెచ్చాలు,పోగుచేసారు, వినుకొండ డాల్ మిల్స్ వాళ్ళు కందిపప్పు అందించారు. వీళ్ళెవరినీ నేను ప్రత్యక్షముగా కలవక పోయినా అమ్మ కు వారిపైగల ప్రేమకు నిదర్సన మేమోగాని అందరూ తమయింటిలో పెళ్ళిలాగా ఈకార్యక్రమానికి తలా ఒకవైపునుంచి సహకార మందించారు.   అని చెప్పారు. ఇదేమిటి ఇందులో ప్రధానమయిన ఖర్చు భరిస్తారనుకున్న వారు ఇలా? నాకు తల తిరుగుతున్నది. ఒకవైపునుంచి అడగకుండానే కొన్ని వస్తుంటే సంతోషించాలా ,అనుకున్నవి అందకపోతే బాధపడాలా? మళ్ళీ అమ్మలీల మొదలయినది. నెల్లూరు జడ్.పి. చైర్మన్, శ్రీ గోవర్ధన రెడ్డిగారు వేంకటేశ్వర స్వామివారికార్యక్రమము కనుక ముందుకువచ్చి ఇచ్చారు. ఎక్కడి నెల్లూరు ఎక్కడి రవ్వవరం. డబ్బున్నా ఇలా భగవంతుని కోసం ఖర్చుపెట్టగల వారు ఎందరున్నారు? అందులో తనకు తెలియని ప్రాంతములో . నేనుఖచ్చితముగా చెప్పగలను ,ఇదిస్వామివారిలీల అని. తనవాళ్ళు ఎక్కడున్నా తనసేవకు పిలిపించుకుని మరీ చేపించుకుంటాడు,ఆ కొండలరాయడు. గంగినేని బాబు , నెల్లూరునుండి చక్రపాణి, దారామల్లి ఖార్జునరావు,చండ్రసాంబశివరావు మరెందరో వారందరికీ పేర్లువ్రాయటానికి ఇదివేదికకాదుకనుక కృత జ్ఞ తలు తెలుపుకుంటున్నాను తలా ఒకచేయి అందించారు. ఇంతపెద్ద కార్యక్రమము కనుక పెద్దలు శ్రీఅన్నదానం చిదంబర శాస్త్రిగారిని వచ్చి ఈకార్యక్రమము పర్యవేక్షించవలసినదిగా కోరాను. అయితే చీరాలలో ధర్మసమ్మేళనము వున్నది కనుక వారురాలేకపోతున్నానని కానీతన మనస్సంతా అక్కడేవుంటుందని అన్నారు. నాదగ్గరున్న మొత్తాలను పోగుచేసుకుని సిద్దపడ్డాను ఒక వంక నాతమ్ముళ్ళిద్దరూ నిద్రాహారాలు మాని పరుగులుపెడుతున్నారు. వూర్లోచూస్తే ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. కూలీలుదొరకక రైతులు తీవ్రమైనఇబ్బందులతోవున్నారు. నీవు ఈకార్యక్రమన్ని వేసవిలో పెడితే అందరమూ నిలబడేవాళ్ళము,ఇలా చేసావేమిటి అని నిస్ఠూరాలాడారు కొందరు. నేనేమిచేయగలను అమ్మకు కూలీవాడిని ,ఆమె ఎన్నుకున్నపని ఆమె ఇష్టమువచ్చినప్పుడుమాత్రమే చేయాల్సివుంది ఇవన్నీ నేననుకున్నానా? అని సర్ధిచెప్పాను . ఇక కార్యక్రమాలకు అవసరమగు యజ్ఞ శాల నిర్మాణము నకు ఎవరినిపిలిచునా రావటము లేదు,పనివత్తిడులు అలావున్నాయి. ఎలాచేద్దామురా అన్నాను ,అంతే మా పాఠశాలలో పిల్లలు బాల హనుమంతులై విజృంభించారు. స్తంభాలు పాతటం వాసాలు కట్టటం, తాటాకు కప్పే మనిషికి అందివ్వటం, సాయంత్రానికల్లా రెడీచేసారు. ఇక ఋ త్విక్కులు వచ్చారు. 26వతేదీ కార్యక్రమాలు మొదలుపెట్టారు, ముందుగా ఈకార్యక్రమానికి యజమాని ఎవరు? కంకణధారణ చెయ్యటానికి అని అడిగారు. నేను వెంటనే చూపించాను క్షేత్రపాలకుడైన హనుమంతులవారిని, అడుగో ఆయనే ఈకార్యక్రమం అంతా చేపిస్తున్నవాడు,కనుక ఆయనకే కంకణధారణ జరపండి అని చెప్పారు. దానితోవారు వుత్సాహంగా ఈ కార్యక్రమమే చిత్రముగానున్నది అనుకుని,స్వామువారి మూర్తికే కంకణధారణ జరిపి వస్త్రాలు సమర్పించారు. నాబ్లాగులో మీరుచూస్తున్న ఆంజనేయస్వామి ఆయనే. ఇక కార్యక్రమానికొచ్చిన ప్రతివొక్కరిలో వుత్సాహం కట్టలుతెంచుకున్నది. పనుల సీజన్ అని చెప్పాను కదా .జలాధివాసానికి మూర్తులను తీసుకెళ్ళటానికి కూడా జనము సమయానికి రాలేకపోతే ,పెద్దవాళ్ళమే ఎత్తటానికి గిజగిజ లాడే బరువున్న ఆ విగ్రహాలను పిల్లలే జై శ్రీరాం అంటూ నినాదాలుచేస్తూ దగ్గరలోవున్న సాగర్ కెనాల్ వద్దకు మోసుకెళుతుంటే,జొన్నబెండ్లులాగా తేలికకా పిల్లలచేతిలో జలాధివాసానికి వెళుతున్న  దివ్యమూర్తులను చూసి ,వెళుతున్న ఆమూర్తులను,ఆపిల్లలను చూసి ఋత్విక్కులు ముక్కున వేలు వేసుకున్నారు. మేము ఇన్ని కార్యక్రమాలు చేశాము గానీ ,ఈపిల్లలేమిటి ?,ఇంత కార్యక్రమాన్ని అలవోకగా చేసెయ్యడమేమిటి, ? నిజంగా ఆంజనేయుడు వీరిలో దూరి చేస్తున్నట్లేవుంది. అని ఆశ్చర్యపోయారు. చీరాలలో కార్యక్రమముఅనూహ్యంగావాయిదాపడినదంటూ,చిదంబర శాస్త్రిగారు రెండవరోజు వచ్చారు. అమ్మ సంకల్పం మరి. ఇక పుట్తపర్తి సాయి భక్తుడయిన మా బంధువుల అబ్బాయి రాయలు, మా మేనత్తకొడుకు శ్రీను, కార్యక్రమానికి ముందుకువచ్చినసూరి మాతమ్ముళ్ళు క్రిష్ణ ,శ్రీను తదితరులు నిద్ర అంటే తెలియనట్లు ఈమూడురోజులూ యంత్రాలులాగాపనిచేశారు.

 ప్రతిష్ఠ రోజు 70 మంది వంటవాళ్ళ ట్రూపు అన్నదానంకార్యక్రమాలు చూస్తున్నది. ఆయేర్పాట్లు ,టెంట్లు చూస్తున్న చిదంబర శాస్త్రిగారు ఈ పల్లెటూరిలో ఎంతమంది వస్తారు? ఎందుకింత పెద్ద ఎత్తున ఏర్పాట్లు? అని అనుకున్నారట. ఆయన నాతో తరువాత చెప్పారు. ఇక 28 వతేదీ  ప్రతిష్ఠకు ఎక్కడెక్కడినుండో జనం తండోపతండాలుగా రాసాగారు. విపరీతమయిన జనం రాకతో ఆపరిసరాలన్నీ కిటకిటలాడాయి. అంతమందికి కూడా ఏ ఇబ్బందీ కలగ కుండా పిల్లలు అన్నపానాదులు,ఏర్పాట్లు చేస్తున్న తీరుచూసి జనం వీళ్ళు పిల్లలు కాదు నాయనా పిడుగులు అని అంటున్నారు. ఎ క్కడా చిన్న పొరపాటు జరగకుండా, అత్యద్భుతమ గా ,ఆదివ్య ముహూర్తానికి, గోవిందా..గోవిందా, ఓమ్ కాళిమాతాదుర్గకూ జై ఓంకనక దుర్గకు జై ,హరహర మహాదేవశంభో అనే భక్తుల నామస్మరణ లతో పరిసరాలు మార్మోగుతుండగా, వేదఘోషలు మిన్నుమిట్టుతుండగా మంగళవాద్యాలు మనసును వురకలెత్తిస్తుండగా ఆదివ్యశక్తి భక్తజన రక్షణార్ధమై దిగివచ్చి ఆలయములో  కొలువైనది . ఆసమయములో అమ్మ ఎన్నిలీలలుగా ఈకార్యక్రమాన్ని నడిపినదో మైకులో చెబుతుంటే భక్తులు కన్నీరు కార్చారు ఆనందముతో, ఇక కార్యక్రమానంతరం దర్శనమునకు ఋత్విక్కులు అనుమతిచ్చారు. మొదటగా నన్ను పిలచి అద్దములో అమ్మను చూడమని ఇచ్చారు, అప్పుడునాకు పిల్లలు పుడితే ఆలయములో శాంతులుచేసి వాళ్ళముఖము చూడమంటారుకదా అలాంటిభావన కలిగినది . చూద్దును కదా అక్కడ మా  చిన్నారి దివ్యప్రభలతో వెలుగొందుతూ... అహో.. మహాద్భుతం .....జన్మ ధన్యమయిపోయినది. అమ్మా!.. నీవుజగత్తుకుతల్లివా? ఇప్పుడు నాకు కూతురువయ్యావా? నామనసు ఈలోకములోలేదు ..మాటలు రావటములేదు.. కళ్ళవెంటధారా పాతముగా నీళ్ళు. ఇక నిభాళించుకొని శ్రీవారిని చూద్దునుకదా.. అహో ఏమిటా .. సొగసు.ముసిముసినవ్వుల మోహనరూపం . చూస్తున్నవారందరికీ స్వామివారి మోములో చిరునవ్వులు స్పష్టంగా కనపడుతుండటముతో ఆనందముతో వెర్రెక్కి పోతున్నారు. గోవిందా.. గోవిందా అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు ఇటుచూస్తే . రామలింగేశ్వరులు ప్రశాంతగంభీర సాగర సదృశములా... బయట కలియుగములో భక్తజన రక్షణార్ధము దీక్షాధారులయిన పార్వతీ నందనుడు,గణపతి, శివపుత్రుడు కార్తికేయుడు,అత్రిపుత్రుడు, దత్తాత్రేయస్వామి , హరిహరసుతుడు అయ్యప్ప, వాయునందనుడు హనుమంతుడు. , నవగ్రహదేవతలు  భక్తరక్షణదీక్షాధారులైనట్లుగా నిలుచున్నారు. శాంతిమంత్రాలు మనస్సులకు ప్రశాంతిని కల్గించగా దర్శనమునకు బారులుతీరిన జనం సాయంత్రమువరకు సాగుతానే వున్నారు. అన్నదానం జరుగుతూనే వున్నది సాయంత్రము చూస్తే ఇంకా రాశులుగా అన్నం కూరలు మిగిలాయి . మేము ఐదువేలమంది వస్తారని అంచనావేస్తే  ఎనిమిదివేల విస్తర్లు  ఖర్చయ్యాయివచ్చిన జనానికి వండినవి చాలవేమోనని వంటవాళ్ళు భయపడ్డారు. కానీ ఇదేమిటి ? వండివార్చిన అన్నం రాశులు ఇంకా అలా మిగిలే వున్నాయి ?!!!!!.. ఇలా రాశులు రాసులు మిగిలి వుండటము ఆశ్చర్యము

. ఆరాత్రల్లా మేము,పిల్లలు కలసి. అన్నపు రాసులను, దగ్గరలోని సాగర్ కెనాల్ కు మోసుకెళ్ళి నీటిలో కలుపుతూనే వున్నాము. జలచరాల ఆకలి సహితము తీర్చాలని అమ్మ అనుగ్రహము కాబోలు. ఎంతప్రతిష్ఠ జరిగినదో అంత అన్నదానము జరిగినది,చాలా గొప్పగా జరిగినది అమ్మ సంకల్పము అని శాస్త్రిగారు వెళ్ళేటప్పుడు చెప్పారు. అంతా కలలో లాగా జరిగినది. ఇప్పటికీ ఈఅల్పుడు అంతకార్యక్రమము అన్నీ సమకూర్చుకుని ఎలా జరిగినదో అర్ధముకాక తికమక పడుతూనే అంతా అమ్మ అనుగ్రహమని సమాధానము చెప్పుకుంటున్నాడు.

అలాగే 16రోజుల పండుగ సందర్భముగా కళ్యాణోత్సవములు,40రోజులకు యజ్ఞపూర్ణాహుతి వైభవముగా జరిగాయి. తరువాత వచ్చిన వేసవిలో మిగిలిన సరుకులతో ఆంజనేయదీక్షతీసుకున్న భక్తులకు అన్నదానము 21రోజులపాటుసాగినది. ఈసంవత్సరము నవరాత్రులు,కార్తీక మాసములో 40రోజులు అయ్యప్పదీక్షలు తీసుకున్నవారికి అన్నదానము వంటికార్యక్రమాలు జరిగాయి.భక్తుల కొరకు వారి గోత్రనామాలతో పూజలు జరుపబడుతున్నాయి. శఠారిలో డబ్బులు వేసే పద్దతికి ఇక్కడ స్వస్తి పలికాము, భక్తులెవరూ జేబులోంచి డబ్బులుతీసి పళ్ళెములో వేయవలసిన అవసరము లేదు. సమర్పించాలని కోరిక వున్నవాళ్ళు బయటనున్న హుండీలో వేయవచ్చు .ఆలయములో మాత్రము ప్రశాంతమనస్కులయి దర్శనము చేసుకోవాలి .స్వయముగా అర్చన అభిషేకము చేసుకోవాలను కునేవారిచేత అర్చామూర్తులకు, పూజలు చేపిస్తారు. యజ్ఞము కూడా స్వయముగా యజమానుల చేత జరిపించబడుతున్నది. వచ్చి సేవించిన వాళ్ళెందరో అయ్యా! ఇక్కడకు వచ్చి పూజ చేసుకుని వెళ్ళిన తరువాత మా సమస్యలు తీరిపోయాయి,మాకిలా మేలు కలిగినది అని, చెబుతూ వుంటారు. వాళ్ళందరికీ మేము ఒక్కవిన్నపము చేస్తుంటాము. మీకు మేలుజరిగినదికదా! మరికృతజ్ఞతగా మీరు మీకున్న 24 గంటల సమయము లో 23 గంటలు మీకోసము వాడుకుని ఒక్కగంట భగవంతుని,పూజ,ధార్మిక గ్రంధాల పఠనము, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించ0డి అని.

 ...చేరీకొలువరో ఈతడు శ్రీదేవుడూ. . ...






7 వ్యాఖ్యలు:

లక్ష్మి November 20, 2008 at 2:50 AM  

మనం నమ్మలేని నిజాలెన్నో మన చుట్టు ఉంటాయి అనటానికి మీ జీవితమే సాక్షి. బాగుంది గురువుగారు

విరజాజి November 20, 2008 at 5:25 AM  

గురువుగారూ

మీరు రాసిందంతా చదివితే, ప్రతిష్టా మహోత్సవం నాడు మేము కూడా అమ్మ దగ్గర ఉన్నట్లుగా అనిపించింది. ఆ జగన్మాత ఎవరిని ఎలా అనుగ్రహిస్తుందో తెలీదు. "అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే" అని మరో సారి తెలియజెప్పారు. చాలా సంతోషం. మీ పీఠానికి రావాలని చాలా ఆశగా ఉన్నది. ఇక అంతా అమ్మ దయ. ఆ అవకాశం ఆ తల్లి ఎప్పుడు కలిగిస్తుందో మరి ? "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః"

సుజాత వేల్పూరి November 20, 2008 at 5:40 AM  

ఈ సారి నేను NRPT వచ్చినపుడు తప్పక వస్తానండి మీ పీఠానికి. ఎలా రావాలో చెప్పండి. వినుకొండ నుంచి బస్సులుంటాయా?

durgeswara November 20, 2008 at 7:05 AM  

అమ్మా నేనింకా గురువుల స్తాయికి ఎదగలేదు.నన్ను మాస్టారు అని పిలవండిచాలు.

వినుకొండనుంచి బస్ లో అరగంట మాత్రమె ప్రయాణమమ్మా.మనపీఠము ముందలే ఆగుతుంది.

Anonymous November 20, 2008 at 9:32 AM  

చాలా చక్కగా వివరించారు
మనకు తెలియని విషయలని అబద్దం అనుకొవడం మనవ సహజం.
అసలు పీఠామ్ ఆంటే ఎమిటి

durgeswara November 21, 2008 at 2:49 AM  

devaalayam lo aagama saastraaniki anugunamugaa bhagvat sevalu jarugutaayi.

bhagavamtuni vividha saampradaayaalalo saadhakulu vividharakaalugaa poojistoo sevalu jarapatamu,alaage bhakti shaastara vishayaalapatla satsamgaalu,taditaraalu anustaanaadulanu jarupukune vidhaanaalumtaayi peetam lo

రాఘవ March 12, 2010 at 1:20 AM  

అద్భుతమండీ. ఇంకేమి చెప్పాలో తెలియటం లేదు.

నమస్సులతో భవదీయుడు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP