మహాత్ముల చేతిలో మరబొమ్మనైనాను,మంత్రాలయగురుని మహిమగన్నాను.
>> Wednesday, July 8, 2009
.
సద్గురుని సేవించుట ఎంత అదృష్టమో .పరీక్షానిష్టులైన ఆసద్గురువుల లీలలను అర్ధం చేసుకుని వారి బోధలను గ్రహించటం అంత కష్టం . ఆమహితాత్ముల సన్నిధానం లో వుండాలని ,వారిని గురుపౌర్ణమి రోజు సేవించాలని నేనుపడ్డ ఆశ వృధాగాపోలేదు. విశ్వవ్యాపితమైన వారి కరుణను పొందాలంటే ,వారి వునికిని గ్రహించాలంటే ఎంత జాగ్రత్తగా వుండాలో పాఠం నేర్పారు. తామే అన్ని రూపాలలో ఎక్కడ ఎవరిని ఏరూపంలో అనుగ్రహిస్తామో తమ సంకల్పానుసారమే జరుగుతుంది తప్ప నీ ఆలోచనలకు అనుగుణంగా కాదురా ! అని గురుపౌర్ణమి రోజు గుర్తు చేశారు.
నేను గురుపౌర్ణమికి గాణ్గాపురం వెల్లాలనుకున్నతరువాత మా అమ్మ గారు,మామేనత్త గారు మేమూ వస్తామని బయలు దేరారు ,దూర ప్రయాణం పెద్దవాల్లను మీ వసతులు చూసుకోవటమే సరిపోతుంది నాకు అని తప్పుకుందామనుకున్నా మాఆవిడకూడా వీల్లు వస్తున్నారు కదా వీళ్ళకు తోడుగావుంటానని బయలు దేరటం తో తీసుకెళ్లక తప్పలేదు. వినుకొండ నుంచి గుంతకల్లు వెళ్ళి అక్కడనుండి చెన్నై-బాంబే రూట్ లో గుల్బర్గా దగ్గర దిగి అక్కడనుండి గాణగాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నాము. రైల్లో అయితే వీల్లకు కొంత సౌకర్యంగా వుంటుందనిఆలోచన.
అయితే వినుకొండనుండి గుంతకల్లుకు ఎక్స్ ప్రెస్ భోగీలు ఎక్కువగా వుండవుకనుక , ఆదివారం రాత్రికి పాసింజర్ ఎక్కి బయలు దేరాము.దొనకొండ ,గిద్దలూరు లో ప్రయాణికుల వత్తిడి ఎక్కువైనది .ఆదివారం కనుక సోమవారానికి హైదరాబాద చేరుకోవాలనుకునే ఈప్రాంతం వారు ఆరోజు ఎక్కువగావుండటం వలన సీట్లు దొరికినాగాని వత్తిడిగానేవుంది.పాపం చంటిపిల్లలను వేసుకుని వస్తున్నవారికి మాసీట్లలోనే కొద్దిగా జాగా ఇచ్చి సర్దుకోవటం వలన ప్రయాణం లో నిదురలేక అలుపు వచ్చినది.డోన్ లోదిగి అక్కడనుండితెల్లవారు ఝాము కు గుంతకల్లు వెళ్ళాము. అక్కడనుండి గుల్ బర్గా వెల్లటానికి సుమారు ఆరుగంటలు పైగా పడుతుందని ,అక్కడనుండి మరొక అరవై మైల్ల ప్రయాణం చేయాలని వివరాలు తెలిసాయి. ఇక అప్పటివరకు మా ఆలోచననలో లేని మా మంత్రాలయం ముసలాయన[రాఘవేంద్రస్వామి] తన లీల సాగించారు .
రాత్రల్ల నిదురగాసి ,మరలా ఏడుగంటల ప్రయాణం ,అదీ స్నానం పానం లేకుండా కష్టమే కనుక ,అక్కడకెల్లిన దాకా నావెంటవున్న పెద్దవాల్లిద్దరు ఇబ్బంది పడతారు ఏంచేయాలా అనుకుంటుండగా ,ఈ దారి లోనే వున్న మంత్రాలయం స్తేషన్ లోదిగి అక్కడకు వెల్లి స్నానం పూజ దర్శనం చేసుకుని మరలా పన్నెండు గంటలకల్లా బండి వున్నదికనుక ఎక్కి గుల్బర్గా పోవచ్చు అనే ఆలోచన వచ్చినది. వెంటనే మంత్రాలయం స్టేషన్ వరకు టిక్కెట్ లు తీసుకుని మూడుగంటలు ప్రయాణించి అక్కడ దిగాము. అక్కడనుండి బస్సులో మంత్రాలయం వెళ్ళి తుంగభద్రలో స్నానం చేసి నదీపూజ చేసుకుని మఠలోనున్న స్వామిని దర్శించేందుకు బయలు దేరాము. ఇక అక్కడనుండి నడచినది స్వామి బోధ ,లీల . వెంటనే వెల్లటమే గనుక రూమ్ కూడా తీసు కోలేదు.
లోపల గురు సార్వభౌముడైన రాయరును దర్శించుకోగానే మనసు నిరామయ మయినది. చెప్పలేనంత ప్రశాంతత
పావన బృందవన వాసుడైన స్వామి ప్రేమానుగ్రహ దృష్టి ప్రసరిస్తున్నందువలనేమో ఆస్థలమంతా దివ్య చైతన్యము ,ప్రశాంతతా తొణికిసలాడుతున్నాయి. ఆక్కడ కూర్చుని గురు చరిత్రలో కొంత భాగాన్ని పారాయణం చేసుకుని వెళదామని లేవగనే ఎక్కడలేని నిద్రమత్తు ,నీరసం వచ్చినది.ఇక కదలలేను అని అనిపించినది. ఎక్కడకెళతావు ఇక్కడనుండి అని ఎవరో అంతున్నట్లు అనుభూతి కలుగుతున్నది. దీనికి తోడు అప్పటిదాకా బాగున్న మా అమ్మగారికి జ్వరం వచ్చినది వల్లు కాలి పోతున్నది. ఇంతనీరసం లో ప్రయాణమ్ చేసి గానగాపురం వెల్లినా ప్రశాంతం గా పూజ చేసుకోగలవా అని మా అత్తగారు సందేహం వ్యక్తం చేశారు. అప్పటికే ఒంటిగంటైనది. ఇక లాభం లేదనుకుని వెల్లి ఒక రూము తీసుకుని వాలి పోగానే గాఢ నిద్ర ఆవరించినది. మెలకువ వచ్చేసరికి ఐదు .అప్పటికే పౌర్ణమి ఘడియలు ప్రవేశించాయి ,త్వరగా స్నానం ముగించుకుని మఠానికి వెళ్ళిఅర్చనకు టిక్కెట్ తీసుకుని వెల్లాను.అయ్యా ఇలా గాణగాపుర యాత్ర చేస్తూ వెళుతున్నాను తమకోశం కూడా పూజ చేపించమనిన భక్తులకోసం కూడా మీరు సంకల్పం చెప్పి పూజ జరుపమని కోరాను. ఆ అర్చకస్వామి కూడా సంతోషముతో నేను ఇచ్చిన గోత్రనామాల లిస్టు గల పేపర్ తీసుకుని అందరి పేర్లతో సంకల్పం చెప్పి పూజ జరిపారు. అందరికీ శుభం కలగాలని సంకల్పం చెప్పి బృందావన సన్నిధి లో కూర్చుని పారాయణం చేసుకుంటుంటే స్వామి చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్న భావన కలుగుతున్నది. నేనెక్కడలేను ? గాణ్గాపురమైనా, మంత్రాలయమైనా ,మనసుపెట్టి చూస్తే అన్ని చోట్లావున్నది నేనే అని ఎవరో బోధిస్తున్నట్లుగా భావన కలుగుతున్నది. అయ్యో ! గాణ్గాపురం చేరలేక పోతినే ? ప్రయాణం ఆగి పోయినదే అని నా అజ్ఞానపు ఆలోచనలు తెరలుగా వచ్చి కమ్ముకుంతున్నది కొద్దిసేపు. ఓరి నీ అమాయకత్వం చల్లగుండా శ్రీగురుని లీలను అర్ధం చెసుకోకుంటివే ? అని మరొక వైపు అంతరాత్మ సర్ది చెపుతున్నది. ఇలా ఆదివ్యసన్నిధిలో మనసు ఊగిసలాడి వుయ్యలలూగినది. ఇక కొద్ది సేపు తలపై కాషాయ వస్త్రం కప్పుకున్న శ్రీగురుని చిత్రం , అదేస్థితి లో కూర్చుని అలానే చిరునవ్వులు చిందిస్తున్న గురు రాయరు చిత్రం రెండూ కొద్దిసేపు మనోఫలకం మీద దోబూచు లాడినవి. గురు చరిత్ర పారాయణం వలన గురు సన్నిధికి చేరతారనే వాక్యం గుర్తుకు వచ్చినది .ఆతరువాత మనస్సులో రెండు రూపాలు ఒకటై , అంతటా నిండిన సద్గురువు ఆజ్ఞవలననే ఇక్కడకు లాక్కు రాబడ్డానన్న వాస్తవం గుర్తుకు వచ్చి మనసు లో శంకలు తీరి పోయాయి. రేపు ఇక్కడే గురు పౌర్ణమి జరుపుకోవాలనే ఆజ్ఞ సద్గురులు ఇచ్చారని నమ్మకం కుదురినది.
ఇక ఏడవతేదీ మంగళవారం గురుపౌర్ణమి రోజు మఠాని కెళ్ళి ప్రదక్షణలు చేసుకునే సరికి ఆరోజు ప్రత్యేక కార్యక్రమం మొదలైనది. ఈరోజు తులసి కోటనుండి మూల మృత్తికని తెచ్చి బృందావనం న స్థాపిస్తారని చెప్పారు. అప్పుడు జరిగిన వూరెగింపులో పాల్గొన్నాను.మరలా గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున సంకల్పం చెప్పుకుని పారాయణం పూర్తి చేసుకున్నాను. ఆరోజు మంగళవారం కూడా కనుక గురు రాయరు ఆరాధ్య దైవము ,మాబాస్ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. పంచామృతాలతో విశేషం గా . రాఘవేంద్ర గురు రాయరు తమ మహాసమాధికి [బృందావనం] నకు కావలసిన రాయిని శిష్యులకు చూపి ,వనవాస కాలం లో శ్రీరాముని పాద స్పర్షతో పునీతమైన రాయి అది అని చెప్పారట. బృందావనం నిర్మించగా మిగిలిన రాయి తో హనుమంతుని శిల్పం చెక్కించి బృందావనానికి అభిముఖంగా ప్రతిష్టింపజేసారు. అటువంటి స్వామి మూర్తికి అందరూ అన్నిరకాల పల్లు మామిడి కాయలతో ఆభిషేకం చేస్తున్నారు.అక్కడ అరటి పళ్ళు కనపడలేదు. అయ్యో !స్వామి వారి కిష్టమైన అరటి పళ్ళు లేవే అని నేను బజారుకు పరుగెత్తు కెళ్ళి అరటి పండ్లు తెచ్చాను. ఆషాఢం లో ఇక్కడ అరటి పళ్ళు వాడము మామిడి కాయలతోనే అభిషేకాలుంటాయి అని అర్చకుడు వారించాడు నన్ను. స్వామీ కనీసం ఇవి స్వామి వారికి నివేదనలలోనైనా ఉపయోగించమని కోరగా వారంగీకరించారు. ఆతరువాత గురు సార్వభౌమా గోవిందా....... గోవిందా అని స్మరిస్తూ ఆయన బృందావనం ఎదురుగా కూర్చుని ఆదివ్యసన్నిధాన ప్రభావాన్ని అనుభవిస్తూ గడిపాను.పొద్దుటునుంచీ నన్ను మధ్యలో కదిలించవద్దని హెచ్చరించాను గనుక మా ఆవిడ మా అమ్మ వాల్లు దీపారాధనలు చేసుకుని వారి పూజలు వాల్లు చేసుకున్నారు. బయటకు రాగానే స్వయంగా పీఠాధి పతులవారు మండపంలో కూర్చుని మంత్రాక్షతలు ప్రసాదాలు ప్రసాదిస్తున్నారు. వెళ్ళి స్వీకరించి ఆసద్గురు సార్వభౌముని కృపను తలచుకుంటూ తిరుగు ప్రయాణమై నాను . ఆ శ్రీగురుని ఆశీర్వాదం ,అనుగ్రహం మీ అందరి పై సదావర్శించాలని కోరుకుంటూ ...ప్రార్ధన చేస్తున్నాను.
శ్రీపాద శ్రీవల్లభ ,నృసింహసరస్వత్యై నమోనమ:
గురు సార్వభౌమా .. గోవిందా .. గోవింద .
5 వ్యాఖ్యలు:
నిజమే మాష్టరూ
భక్తితో కొలవాలేకానీ భగవంతుడు ఎక్కడ లేడూ?
శ్రీపాద శ్రీవల్లభ ,నృసింహసరస్వత్యై నమోనమ:
బాగుంది. మరి మీరు "పంచముఖి" వెళ్లి రాలేదా? అది మంత్రాలయం నుంచి గంట ప్రయాణమే!
Sarve janaa sukhinobavantu.
జయగురుదత్త
పది సంవత్సరాలక్రితం వెళ్ళినప్పుడు పంచముఖీ యాత్ర కూడా చేసాను, ఈ సారి వీలుకాలేదండి.
Post a Comment