శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమెరికాలో సంకల్పం గా మొదలై ఆంధ్రాలో పూర్తయిన కోటి పంచాక్షరీ జపయజ్ఞం

>> Monday, December 1, 2008

భగవంతునిలీలలు చిత్రాతి చిత్రంగావుంటాయి. . భగవత్ కార్యక్రమాలు ప్రారంభం కావటం మనమనసులోనుంచికాక సంకల్పంగా ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో రూపం తీసుకుని ఎవరికి ఫలితాన్ని ప్రసాదించాలో వారికి చెందుతాయో చిత్రంగావుంటుంది గమనించి చూస్తుంటే. నాకైతే తరచూ అనుభవమ్లోకి వస్తూనేవున్నాయి. గుడి నిర్మాణం వద్దనుంచి,ప్రతిస్థమరియు వరుసగా జరుగుతున్న కార్యక్రమాలను చూస్తున్నప్పుడు. ఎవరు ఎప్పుడుకలుస్తారో తెలియదు. ఎలా వచ్చి చేరి ఈ కార్యక్రమాలను నడిపిస్తుంటారో విచిత్రంగా వుంటుంది. వాళ్ళంతా నాకు పరిచయస్తులా?అంటే కాదు. కొందరు నాముఖం కూడా చూసివుండరు.అయినా వచ్చి భగవత్ కార్యక్రమాలకు ముందుండి నడపటము ఆ జగన్మాత లీలలను ఆతల్లి కరుణను నిరంతరం గుర్తు చేయటానికేనేమోనని పిస్తుంటుంది.

మొన్న దసరా ఉత్సవాలనులను చేసేసరికే మనకు సరిపోయినది కార్తీక మాసములో ప్రత్యేక కార్యక్రమాలు మళ్ళీచేయాలంటే కష్టమేమో నని నాతమ్ముళ్ళిద్దరూ కార్తీకానికి ప్రారంభమునకు ముందు అనుమానం వ్యక్తం చేశారు. మనపీఠమునకు ఒక ఆచారం వున్నది. ఎవరో ఒకరు ముందుకు వచ్చి అడిగేదాకా ఎవరినీ ఇదివ్వండి అని అడిగి యాచించము. మా ఉద్యోగాలతో సంపాదించుకునే వాటిలోనే కొంత పక్కనబెట్టి వానితో కార్యక్రమాలు మొదలు పెట్టటం,తరువాత ఎక్కడో ఎవరో నిర్ణయించి వున్నట్లు తత్సంబంధిత భగవద్ బంధువులు మాతో చేరటం జరుగుతూవుంటుంది. నిరుడు కార్తీక మాసములో 40 రోజులు అయ్యప్ప,భవాని,శివ,హనుమత్ దీక్షలు తీసుకున్న చుట్టుపక్కల అన్ని గ్రామాలలో నున్న దీక్షధారులకు అన్నదానం నిర్వహించాము . చిన్న సంకల్పంగా మొదలై ఎక్కడా ఇబ్బంది పడకుండా జరిగిపోయినది.

ఈసంవత్సరం కార్తీకమ్లో అన్నదానం మొదలు పెట్టటానికి ఆపనులమీద ఆలోచిస్తున్నము అని అన్నాను నాకు ఈ బ్లాగర్ లలో లభించిన మిత్రుడు శివభక్తుడైన రామరాజు భాస్కర్ గారితో ఒకరోజు మాటలసందర్భంగా చాట్ లో .నిజంగా పరమేశ్వరుని సంకల్పమేమో వెంటనే ఆయన మాస్టర్ గారూ నేను కూడా ఈకార్యక్రమమ్లో పాల్గోవచ్చా అని అడిగారు. అర్ధమయిపోయినది పరమేశ్వరుని లీల మొదలయినదని. ఆయన తాను పాల్గొంటానని చెప్పి తానే తన అన్నగారిని ఇతర మిత్రులను సంప్రదించి ఐదుగురము తలా 501 డాలర్లు పోగుచేసి పంపుతున్నామని అన్నదానము నిర్వహించమని కోరారు. ఆరాత్రి నాకు మనసులో మరొక సంకల్పము మొదలయినది భగవత్ ప్రేరణగా .కేవలము అన్నదానము చేస్తే దీక్షాధారులకే పరిమితమవుతుంది. కనుక పవిత్రమయిన కార్తీక మాసములో ఎక్కువమంది చేత పంచాక్షరీ జపం చేయించటం ద్వారా ఆఫలితం మరింతమందికి చేరుతుందని భావన కలిగి కోటి పంచాక్షరీ మహామంత్రం జపింపజేసి యజ్ఞము జరపాలని కార్యక్రమము నిర్ణయము మనసులోకి వచ్చినది. దానిని బ్లాగ్ లోకి పెట్టిన తరువాత అనేకమంది జపం చేయటానికి ముందుకువచ్చారు.కృష్ణ భక్తులైన విజయ్ మోహన్ గారు వారి సత్సంగము సభ్యులు తాడిపత్రినుంచి జపము ప్రారంభించారు. అమెరికా, దక్షణాఫ్రికా మొదలు ఆంధ్రావరకు పెక్కుమంది జపం ప్రారం భించారు. ఇక్కడ వినుకొఁడ ,మరియు గ్రామాలలో నున్న శంకర సత్సంగ, శివ భక్తబృందం ,పలువురు సత్సంగాలు చేస్తున్న భక్తులు, పలు గ్రామాలలోని దీక్షాధారులు భజన బృందాలు,పాఠశాలల విధ్యార్ధులు కార్యర్క్రమములో చేరుతూనే వున్నారు. అలా పరమేశ్వరేచ్చగా కోట్లసంఖ్యలో జపం జరిగినది. గోత్రనామాలు పంపిన వారందరి పేరునా శివాభిషేకాలు పూజలు జరిగాయి .
26 వతేదీ న జరిగిన యజ్ఞానికి వరల్ద్ టీచర్స్ ట్రస్ట్ సభ్యులు కోట మల్లి ఖార్జునరావుగారి వద్ద వేదాధ్యయనం చేస్తున్న దాదాపు 50 మంది మహిళామతల్లులు వచ్చి చేరారు. వారి వేదగానంతో ,భక్తుల హరహరమహాదేవ శంభోఅనే నామస్మరణతో పీఠప్రాంణము పులకించి పోయినది. ఆబోలా శంకరుడు పరవశించిపోయివుంటాడని నానమ్మకము. కార్య క్రమానికి గుంటూరు జిల్లాపరిషత్ ముఖ్య కార్యక నిర్వహణాధికారి శ్రీ దుర్గాప్రసాద్ దంపతులు వచ్చి భక్తిశ్రధ్ధలతో పాలపంచుకున్నారు. మాస శివరాత్రి సందర్భంగా ఇలా స్వామి కార్యక్రమములో పాల్గొన్నందుకు మాకు ఆనందంగావున్నదని పలువురు భక్తులు తన్మయత్వంతో వెల్లడించారు. ఈకార్యక్రమానికి ప్రేరణ కలిగించి ముందుకువచ్చి నిలచిన అమెరికాలో నివసిస్తున్న శ్రీయుతులు రామరాజు భాస్కర్,రామరాజు, ఉమాశంకర్,జడ్చర్లశ్రీనివాస్ ,చెరుకూరి దుర్గాప్రసాద్ ఉప్పులూఱి శ్రీనివాస్ ఇంకా అమెరికాలో నే చదువుతున్న డాక్టర్ శ్రీమతి రజని లాంటివారే కారణమని భక్తులందరికీ వివరించాను. వారంతా అన్నదాతా సుఖీభవా అని ఆశీర్వదించారు ఆరోజు.

వీరేకాక ఇక్కడ మరికొందరు భక్తులు ముందుకు వచ్చి పాల్గొనటముతో కార్తీక మాసములో అన్నదానము. పరమశివునికి ప్రీతి పాత్రముగా పంచాక్షరీ జపయజ్ఞము జరిగి పరమేశ్వరుని అనుగ్రహము ఇందరికి కలిగేలా చేసినది ఎవరు? నాదగ్గర కావలసినంత డబ్బులేదు. ముందుగా మీరివ్వండి అని నేనెవరిని అడగలేదు. పంచాక్షరీ యజ్ఞముద్వారా ఇంతమందిచేత శివనామస్మరణ ఈకార్తీక పవిత్రదినాలలో జరుపాలని మొదటనాకు ఆలోచనలేదు. అన్నీ టైంటేబుల్ ప్రకారం జరిగిపోయాయి. మొత్తం స్క్రిప్ట్ అంతా సిద్దం చేసి పాత్రధారులనందరినీ ఆయాసమయాలలో నటింపజెసిన ఆ నటనసూత్రధారి లీలకాక
మరెవరిసంకల్పమన్నా ఇందులో వున్నట్లు కనిపిస్తున్నదా? నాకైతే వేరే అనుమానం లేదు.ఇదిభగవత్ లీలే అని నా విశ్వాసము సత్యము కూడా. హరహర మహాదేవ .

































.

2 వ్యాఖ్యలు:

Bhãskar Rãmarãju December 1, 2008 at 9:47 AM  

ధన్యవాదాలు మాష్టారు. నాకు తోచింది నేను చేసా.
జై భవాని

Anonymous December 1, 2008 at 11:27 PM  

బ్లాగు ద్వారా తెలిపిన మీకు , జపం చేయించిన ఆ పరమేశ్వరుడికి చాల ధన్యవాదములు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP