శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమను తమలపాకులతో పూజించుట.

>> Wednesday, March 1, 2017

హనుమకు తమలపాకులతో పూజ చేయడం అన్నది సర్వ సాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనపడుతూ ఉంటుంది. తమలపాకుకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని ఒక నిర్ధారణ. ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తనయొక్క వాహనమైనటువంటి ఐరావతం అనబడే ఏనుగును ఏ స్తంభానికి వేసి కడతాడో ఆ స్తంభానికి ఒక లత పుట్టింది తనంత తానుగా. ఆ పుట్టిన లత నాగవల్లి. నాగ అంటే ఏనుగు. ఏనుగును కట్టిన స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు. బేసి సంఖ్యలో పెట్టాలి తాంబూలం పెడితే. మూడు ఆకులు పెట్టండి అని అర్థం.  అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దానిని పరమ పూజనీయ స్థానములు ఏవి ఉంటాయో ఆయా స్థానముల యందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను. పరమ మర్యాద, పరమ గౌరవం నేను వ్యక్తం చేయాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు తాంబూల ప్రదానం చేస్తారు. అందుకే ఇంటికి ఎప్పుడైనా పెద్దలు వస్తే తాంబూలం ఇస్తారు. విరాటపర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వచ్చినప్పుడు విరాట రాజు గారికి అనుమానం వస్తుంది. చూడడానికి పేడి వాడు, కానీ తేజస్సు సామాన్యంగా లేదు. అరివీర భయంకరుడిగా ఉన్నాడు. విశేషమైన పరాక్రమ వంతుడిలా ఉన్నాడు అని ఉత్తరను పిలిచి అర్జునునికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమన్నాడు. బృహన్నలను చూడగానే అంత గౌరవం వచ్చింది.
రెండు ఉత్తరకు నాట్యాచార్యుడు కాబోతున్నాడు. ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం. అందుకే ఏ మంగళకార్యం అయినా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది. తాంబూలాలు పుచ్చుకున్నారు అన్న మాటకు అర్థం మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు.
అటువంటి తమలపాకులతో హనుమకు పూజ చేస్తారు విశేషంగా. ఎందుచేత అంటే హనుమ యందు ఉండేటటువంటి గుణాలు అన్నీ కూడా ఏ గుణాన్ని చెప్పినప్పటికీ ఆ గుణానికి చిట్టచివరి హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒక్కడే అయి ఉంటాడు. ఏ మంచి గుణమైనా సరే దాని చిట్టచివరి హద్దు ఏదో అదే హనుమ. అపారమైన వేగం ఉన్నవాడు అంటే హనుమ. ఎప్పుడూ భక్తులను రక్షించేవాడు ‘పరిత్రాణాం భయంకరో మిత్రాణాం అభయంకరః” అంటే హనుమ. చాలా తేలికగా ప్రసన్నం అయ్యేవాడు హనుమ. ఇంత వేగంగా వెళ్ళగలిగిన వాడు నిశ్చలంగా కూర్చుని జపం చేయగలిగిన వాడు హనుమ. ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వాడు హనుమ. గొప్ప బుద్ధిమంతుడు హనుమ. నవవ్యాకరణ పండితుడు హనుమ. గురువుగారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడిన వారు ఎవరూ లేరు. సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు. సూర్యుడు భూమికి ప్రదక్షిణగా వెళ్తున్నప్పుడు తానూ వెళ్ళి చదువు నేర్చుకున్నాడు. ఆయన తేజస్సును ఓర్చుకున్నాడు. అందుకే ఆయనంత గురు భక్తి తత్పరుడు లేడు. గురుభక్తి అంటే హనుమ పేరే చెప్పాలి. అలాగే పరోపకారం కోసం అని చెప్పి దీనివల్ల నాకేం వస్తుంది అని అడగకుండా ఎంత ఉపకారం అయినా చేయాలి అంటే ఆయనే. తీవ్రమైన స్థితి హనుమ.
రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం.
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి!!
అంటారు మహర్షి. ఎవరికోసం నూరు యోజనాల సముద్రం దాటాలి? ఎవరికోసం అంత కష్టపడి అన్వేషణ చేయాలి? అంటే రాముడికోసం, వానరుల కోసం. పరోపకారం కోసం అంత కష్టపడడం అంటే హనుమ అద్భుతమైన వాగ్వైభవం అంటే హనుమ. బుద్ధిని ఇవ్వగలిగిన వాడు అంటే హనుమ. రోగనాశనం చేయగలిగిన వాడు అంటే హనుమ.  అసలు ప్రాణం పెట్టేవాడు అంటే హనుమ. రామాయణంలో హనుమ ఎక్కడ కనపడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి. అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వాడు హనుమ. అంత బలపరాక్రమాలు ఉండీ, అంత బుద్ధి ఉండీ తనకోసమని తాను ఒకపని చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కడే.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే భార్యను స్వీకరించి కూడా కామం కోసం భార్యను స్వీకరించని ఏకైక వ్యక్తి సృష్టిలో హనుమ. లోకంలో ఎవరు భార్యను స్వీకరించినా కామము ధర్మ బద్ధం చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు. సువర్చల వరం అడిగింది. కామం లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్న వాడు ఎవరైనా ఉంటే వానికి ఇల్లాలు అవుతాను అన్నది. లోకంలో కామం లేనివాడు, సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు గనుక అందుకొరకు భార్యను స్వీకరించాలి అనుకున్నవాడు భార్యకు మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెను స్వీకరించి ఆమెయందు సంతానాన్ని పొందకపోతే మళ్ళీ అది మహా పాపమై హింస క్రిందకి వస్తుంది. ఇద్దరియందు అదే ప్రవ్రుత్తి. ఆమెకూ సంతానాపేక్ష లేదు, కామము లేదు. ఆయనకూ కామము లేదు, సంతానాపేక్ష లేదు. గృహిణిగా, ఒకరికి ధర్మపత్నిగా ఆయనకు యజ్ఞాధికారం కల్పించాలి. ఆవిడ కోరిక. గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక. అందుకే రామకృష్ణ పరమహంస శారదా దేవిలా ఇద్దరూ కలిసి ఉన్నారు. అసలు కామం అన్న మాటకు జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ. అందుకే ఏ గుణమును చూసినప్పటికీ ఆ గుణములు అన్నింటిలో కూడా చిట్టచివరి స్థితిని ఇన్ని గుణములు కలిగిన వాడు ఎవరు? అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ఏ మంచి గుణం అయినా దానికి చిట్టచివరి హద్దుగా నిలబడే వారు హనుమ. అంతటి మహానుభావుడు, అంతటి త్యాగనిరతి కలిగిన వాడు, అంతటి స్వామిభక్తి పరాయణుడు. ఇంత గొప్పవాడు అయి ఆయనను పిలిస్తే ఆయన వస్తాడా అంటే చెప్పడం కష్టం. ఆయనను పొగిడితే సంతోషిస్తారా? అంటే చెప్పడం కష్టం. కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరుగెత్తుకు వచ్చేస్తారు.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం.
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్.
భాష్పవారి పరిపూర్ణ లోచనం.
మారుతిం నమత రక్షసాంతకమ్!!
అందుకే ఆయనకు మహావీరుడు అని పేరు. వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు. వీరుడు అంటే అంతటి వేదాంతి. అందుకే రామచంద్రమూర్తి వీరాసనం వేసుకుని కూర్చుంటే వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు. ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు.
వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితమ్
ఆగ్రేవాచయతి ప్రభంజసుతే తత్త్వం మునిభ్యాం పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిహి పరివృతంరామం భజే శ్యామలం !
అంటారు. అనేకమంది మునులు ఉన్న సభ. భరతాదులు కూడా ఉన్నారు. భరతుడు యువరాజు. కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి. కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్త్వ ముద్రలో ఉన్నాడు అంటే వేదాంతం చెప్తున్నాడు. అంటే రాముడు గురు స్థానంలో ఉన్నాడు. గురువుకీ, గురు పత్నికీ, గురు పుత్రుడికీ అభేదం. మూడూ గురు స్థానముల క్రిందే నిర్ణయింపబడ్డాయి. అందుకని గురువుగారు వేదాంత ముద్రలో కూర్చుని ఉంటే సాంసారిక బుద్ధితో గురు పత్ని ఉండదు. సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది.  అందుకే జానకి, సీత అనలేదు. వైదేహీ సహితం –విదేహవంశంలో పుట్టినది. అంటే దేహ భ్రాంతి లేనిదై ఆమె ఉన్నది. అంటే ఆత్మగా ఆవిడ కూర్చుని ఉంది. ఆత్మారాముడై రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నాడు. అప్పుడు యువరాజు అయినా భరతుడు కూర్చోడు. ‘ఆగ్రేవాచయతి ప్రభంజసుతే’ – వాయు పుత్రుడు అయిన హనుమ కూర్చుంటారు. అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు. రాముడిని సేవించిన వారెందరో ఉంటారు. కానీ ఎప్పుడూ రామ పాదాల దగ్గర నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే. అందుకే ఆయనకు మహావీరుడు అని ఒక పేరు. మహావీరుడు అంటే శరీరబలం ఉన్నవాడు అని కాదు. అంతటి వేదాంత ప్రజ్ఞకలిగినటువంటి వాడు అంతటి నిశ్చలమైన మనస్సు ఉన్నవాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, ఇంద్రియములను గెలిచిన వాడు, ఇన్ని గుణములు కలిగిన వాడు అన్ని గుణములు కలిగిన మహా వీరునికి తమలపాకుతో పూజ చేస్తారు. ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్ధం గనుక, నాగవల్లి అని పేరు ఉంది గనుక అటువంటి వారికి తమలపాకుతో పూజ. అందుకే హనుమ ఒక్కరికీ తమలపాకులతో పూజ చేయుట అనే ప్రక్రియ లోకంలో రావడానికి కారణం అయింది. తమలపాకుతో ఆయనను పూజ చేశాము అంటే ఆయనకు ప్రీతి అని కాదు ఆయన యొక్క గుణముల యందు మనకు ప్రీతి. ఎవరు హనుమ యందు, రాముని యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళను ఆయన సర్వ కాలముల యందు రక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మ్యత పొందాడు అనడానికి గుర్తు హనుమను తమలపాకులతో పూజించుట.

[peddala maata]

1 వ్యాఖ్యలు:

anyagaami March 2, 2017 at 8:47 AM  

మనోజవం, మారుత తుల్యవేగం, బుద్ధివరిష్టం అయినా శ్రీరామదూత గురించి రమ్యమైన వ్యాసం.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP