ఆదియోగ శివుడు
>> Friday, January 22, 2016
యోగం మొదటి భాగాన్ని శివుడు తన సతీమణి పార్వతికి అత్యంత విపులంగా బోధించాడు. ప్రతి యోగసూత్రంలోనూ దేవిని అత్యంత తేజోమయ మూర్తిగా వర్ణించాడు. అతిలోక సౌందర్య రూపంగా భావించాడు. ‘పరమ కారుణ్యమూర్తి’ అని ఆమె గురించి విశదీకరించాడు. యోగసూత్రాలకు సంబంధించిన రెండో భాగాన్ని సప్త మహర్షులకు ప్రబోధించాడు.
ఇక్కడ ‘యోగ’ అంటే, వూపిరి బిగపట్టడం కాదు. శరీరాన్ని విభిన్న భంగిమల్లో మెలికలు తిప్పి చేసే యోగాసనం అంతకన్నా కాదు. ఇది సృష్టి శాస్త్రం. సృష్టిలోని ఒక శకలమే మనిషి. ఈ మానవ చైతన్యాన్ని ఉన్నత శిఖర స్థాయికి, అనంత ఆనంద తన్మయ స్థితికి తీసుకొని వెళ్లడమే యోగ లక్ష్యం.
మానవ జీవితంలో పరిపూర్ణత్వం సాధించడానికి యుగయుగాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. సృష్టి, ప్రళయం, జీవన్మరణాలు- వీటన్నింటికీ అతీతంగా మనగల మార్గం కోసమే మనిషి అన్వేషిస్తున్నాడు. అతడి పరిణామ స్థాయి ఏదైనా, ఎదుట ఒక మణిద్వారం తెరుచుకునే ఉంది. ప్రతి వ్యక్తికీ ఒక నిశ్చిత మార్గం కనిపిస్తుంది. అదే ఈ యోగం వల్ల కలిగే పరమ ప్రయోజనం!
ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి యోగ ప్రణాళిక కేదార్‌నాథ్ సమీపంలోని కాంతి సరోవరం వద్ద రూపొందింది. మానవజాతికి అందిన పరమోన్నత యోగ విజ్ఞానమది.
ప్రస్తుతం అనేకుల దృష్టి యోగంపై ప్రసరించింది. ఆధ్యాత్మిక సాధనకు అనువుగా అది ఒక సాంకేతిక విజ్ఞాన రూపంలో అందుతోంది. అందువల్ల ఆసక్తిగలవారు చాలా త్వరగా అటువైపు ఆకర్షితులవుతున్నారు.
సృష్టి అంతమయ్యేవేళ శివుడు ప్రళయ తాండవం చేస్తాడని, అది వినాశన కారకమని కొందరు భావిస్తారు. ఆ భావన సమంజసం కాదు. యుగాలు శ్రమించి రూపకల్పన చేసిన సృష్టి ఇది. ఇందులోని ప్రతి అణువులోనూ శివతత్వం అంతర్భూతమై ఉంది. కోట్లాది ఆత్మలకు ఆనంద తన్మయత్వం కలిగించడానికే శివతత్వం ఆనందమయ నాట్యం చేస్తుంది. బాధాగ్నితప్తమైన ఆత్మల అంతర్నేత్రాలకు గోచరించే ఆనంద సుధామయ కాంతి దృశ్యం అది. ఆ ఆనందాన్ని చిట్టచివరగా సర్వమానవాళికీ అందించడం కోసమే భగవంతుడు (శివుడు) ఈ అద్భుత విశ్వాన్ని సృష్టించాడు. ఆయనే ఇన్ని యుగాలుగా కాపాడుతూ వస్తున్నాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ‘మృత్యోర్మా అమృతంగ మయ’ అని రుషులు అందించే దీవెనలోని అంతరార్థం అదే!
- కె.యజ్ఞన్న
from eenadu daily paper
0 వ్యాఖ్యలు:
Post a Comment