అసహనంపై నిరసనలో అసమానత
>> Wednesday, November 18, 2015
నేరాలు శాంతి భద్రతలు
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని భారత రాజ్యాంగం రెండో జాబితాలో
స్పష్టంగా ఉంది. ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతంలో దాద్రీ వంటి నేరం
జరిగితే కేంద్ర హోం మంత్రిని బాధ్యుడిని చేయవచ్చు. రాష్ట్రంలో జరిగిన
నేరాలకు ఆ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తిరిగి ఇవ్వడం సమంజసం. కాని దానికి
కేంద్రం బాధ్యత వహించాలనడం రాజ్యాంగేతర విమర్శ. బాబ్రీ వంటి తీవ్ర నేరరూపం
ఏర్పడితే తప్ప కేంద్రం జోక్యం చేసుకోరాదు. చేసుకుంటే అది భారత రాజ్యాంగ
సమాఖ్య స్వరూపానికి వ్యతిరేకం. దారుణమైన మత అసహన దాద్రీ సంఘటనకు ఉత్తర
ప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. రచయిత కళాకారుడు మేధావి
కల్బుర్గీని అన్యాయంగా హత్యచేయడానికి పాల్పడిన దుండగులను పట్టుకోవడంలో
అలసత్వం వహిస్తే దానికి కర్ణాటకలోని ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాజ్యాంగ
అధికార విభజనలో బాధ్యత లేని కేంద్రాన్ని నిరసించడం ఏ మాత్రమూ రాజ్యాంగ
సమ్మతం కాదు. కొందరు ఆరోపించినట్టు బీహార్‌లో బీజేపీ వ్యతిరేక ప్రచారం కోసం
ఆ విధంగా కేంద్రాన్ని నిందించాలనుకుంటే అది మేధావుల విజ్ఞతకే వదిలేయవలసి
ఉంటుంది.
దాదాపు వందమంది మేధావులు తమకు ప్రభుత్వాలు
ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చి వేయడం ద్వారా నిరసన వ్యక్తం చేయాలని
అనుకున్నారు. అది వారి స్వేచ్ఛలో భాగం. వారు భారత ప్రభుత్వం, కేంద్ర
సాహిత్య అకాడమీలు ఇస్తున్న అవార్డులను తిరిగి ఇచ్చివేయడంలో ఔచిత్యాన్ని
విమర్శిస్తున్నారు. విమర్శా స్వేచ్ఛ ఎంతుందో ప్రతివిమర్శా స్వేచ్ఛ కూడా
అంతే. నిరసనను నిరసించే స్వేచ్ఛ కూడా ఆర్టికిల్ 19(1)(ఎ) నుంచే వస్తుంది.
మూకుమ్మడిగా
అవార్డుల వాపస్‌పైన విమర్శలో మూడు అంశాలు గమనించవలసినవి. 1. ఇదివరకు
ఇంతకన్నా ఘోరమైన సంఘటనలు జరిగినప్పుడు ఈ విధంగా నిరసించలేదు. ఇది పనికిరాని
విమర్శ. ఎప్పుడో విమర్శించలేదు కనుక శాశ్వతంగా నోరుమూసుకుని ఉండాలనా?
రెండో అంశం. నిరసన ఎవరి మీద? (రాజ్యాంగ బాధ్యత ఎవరిమీద అని పైన ఇచ్చిన
వివరణే దీనికి సమాధానం). ఇక మూడో అంశం. అటువంటి సంఘటనలే హిందువులపై జరుగుతూ
ఉంటే వాటిని పక్కన బెట్టి కేవలం ముస్లింలపైన జరిగిన దాడులను మాత్రమే
నిరసించడం న్యాయం కాదు. ఇది చర్చించాల్సిన విషయం.
కర్ణాటక
రాష్ట్రంలో విద్యావేత్త కల్బుర్గిని దారుణంగా చంపేసారు. ఆయన ప్రాణాలకు
ప్రమాదం ఉందని తెలిసిన తరువాత భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం
విస్మరించింది. ఆయన భద్రతా సిబ్బందిని తిరస్కరించారంటూ తప్పించుకునే
వీల్లేదు. ఈ హత్యను ప్రభుత్వ నిర్లిప్తతను, మతఛాందసుల అసహనాన్ని
ఖండించవలసిందే. ఏ రూపంలోనైనా. ఖురాన్, భగవద్గీత, రవీంద్రుని గీతాంజలిని
కశ్మీరీ భాషలోకి అనువదించిన నిజమైన సెక్యులరిస్టు కవి సర్వానంద్ కౌల్
ప్రేమి అనే కశ్మీరీ పండితుడిని అమానుషంగా దోచుకుని, అనంతనాగ్ గ్రామంలోని
ఇంటి నుంచి ఎత్తుకుపోయి టెర్రరిస్టులు 1990లో ఆయనను ఆయన కొడుకును దారుణంగా
హత్యచేశారు. ఈ హత్య వివరాలు మతకలహాలను రేపేంత హీనంగా భయంకరంగా ఉన్నాయి.
కశ్మీర్లో హిందువులు బతికి ఉండే పరిస్థితి లేదనే టెర్రర్ సందేశాన్నిచ్చిన
దారుణం ఇది. దాద్రీ కన్నా దారుణమైన సంఘటన ఇది. హిందువులంతా కశ్మీర్ నుంచి
పారిపోక తప్పదనే బెదిరింపు ప్రకటన. ఆనాటి నుంచి ఈనాటి వరకు కశ్మీరును
పాలించిన పాలకులందరూ దోషులుగా బోనులో నిలబడవలిసిన సంఘటన. ఇది చాలా పాత
సంఘటన అంటారేమో. కాని దాద్రీలో జరిగిన క్షమించరాని దురాగతం వలె ఇది కూడా
తీవ్రమైన అసహనానికి నిదర్శనం. రచయిత్రి తస్లిమా నస్రీన్ తల నరికిన వారికి
రూ. 5 లక్షల బహుమానాన్ని ముస్లిం మతపెద్దలు ప్రకటించడం, హైదరాబాద్‌లో ఆమె
పాల్గొనే సమావేశంపై దాడిచేయడం మరికొన్ని దారుణ అసహన సంఘటనలు. సుధీంద్ర
కులకర్ణి ముఖాన హిందువులు, రాందేవ్ బాబా ముఖంపైన ముస్లింలు నల్లసిరా పోయడం
కూడా సమానంగా విమర్శించతగినవి. ఇవన్నీ ఒక ఎత్తు, దేశం మీద సాగుతున్న
టెర్రరిస్టు దాడులు, పార్లమెంటు చొరబాటు, వరసబాంబు దాడులు, అన్నీ హిందూ మతం
మీద, భారత్ మీద కేవలం ముస్లిం మతస్థులు జిహాద్ పేరుతో సాగిస్తున్న
యుద్ధం. పాకిస్థాన్, ముస్లిం మత వర్గాలు, భారత్‌లో ఉన్న కొన్ని మత వర్గాలు
కలిసి సాగిస్తున్న మారణకాండ. నిజంగా సెక్యులరిస్టులైన ముస్లింలు ఈ
మారణకాండను నిరసించవలసిందే. అవి వినపడవు. దానిగురించి సెక్యులరిస్టులెవరూ
మాట్లాడరు. భారత నాగరికులు, అందులో పొరబాటున కొందరు ముస్లింలు ఉన్నా
తీవ్రంగా ఖండించే వారు కనపడరు. నిరసనలు చేసినా చేయకపోయినా వేరే విషయం,
హిందువుల ప్రాణాల మాటేమిటి? వారికి బతికే హక్కు లేదా? లేక మతంమారి బతకాలా?
మైనారిటీ హక్కులంటే- ముస్లింలు హిందువులను హత్య చేయడం అనే అభిప్రాయాన్ని
పరోక్షంగా సమర్థించడం వల్ల అటువంటి దాడులు పెరుగుతున్నాయనే ప్రశ్నకు
జవాబేమిటి? కాదని జనంలో భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అన్ని
సంఘటనలను సమానంగా చూడాలని ఈ ప్రశ్నలు వేసినందుకే అడిగిన వాడు హిందూ మత
చాందసవాది అయిపోడు. బీజేపీకి చెందని సామాన్యుడికి కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయి.
ముస్లింలపైన దాడిజరిగితే విరుచుకుపడి విమర్శిస్తున్నారు, ముస్లింలు
దాడిచేస్తే నోరుమూసుకుని మౌనంగా ఉంటున్నారు ఎందుకు? అంటే జవాబు చెప్పాల్సిన
బాధ్యత మేధావులపైన ఉంది. హిందువుల ప్రాణాలు ముస్లిం తీస్తే ప్రభుత్వమే
బాధ్యత వహించాలి, మేము నిరసించం అనేవారు ఉంటే వారికి అవార్డులు పొందే అర్హత
ఎంతవరకు ఉన్నట్టు?
ఈ దేశంలో ఆత్మహత్య చేసుకునే
రైతులు మనుషులు కారా, మతపరమైన హత్యాకాండలో చనిపోయే హిందువులు మనుషులు కారా?
వారు కొన్ని అంకెలేనా? ఆ ప్రాణాలు టీవీ స్ర్కోలింగ్‌లో పత్రికల్లో మరణపు
అంకెలు. ఓటర్ల సంఖ్యలు అనుకోవాలా. దేశ పౌరుల్ని మతపరమైన కులపరమైన ఓట్ల
సంఖ్యగా లెక్కించే రాజకీయాలు మన సమాజానికి రాచపుండ్లు. వీరి అసహనం పట్ల,
అమానుష అధికార అవకాశవాద రాజకీయాల పట్ల నిరసన ఏ విధంగా తెలపాలి? ఎన్ని
అవార్డులు తిరస్కరిస్తే బాగుంటుంది?
దరఖాస్తులు
పెట్టుకోకుండా నమస్కారాలు, సిఫారస్‌లు చేయకుండానే వీరికి కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వచ్చాయా? ఆ దరఖాస్తు చేయడానికి
ముందు ఆయా ప్రభుత్వాలు చేసే అసహన రాజకీయాలు వీరికి కనిపించలేదా? సీవీలు
పంపి, పైరవీలు చేసి, సంపాదించిన తరువాత సన్మానాలు, అభినందనలు అందుకున్న
తరువాత దేనికి ఎవరికి, ఏ కారణంగా తిరిగి ఇస్తున్నారు, నిజంగా అందిన
గౌరవాన్ని, పొందిన అభినందనల్ని శాలువల్ని పూర్తిగా తిరిగి ఇవ్వడం సాధ్యమా?
కనీసం వీరు తిరిగి ఏ అవార్డులూ తీసుకోబోమనే ప్రమాణ పత్రం జతచేశారా?
హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులందరిలో ఎవరి రక్తమూ పారడానికి
వీల్లేదని ఎలుగెత్తి చాటే ధైర్యం సాహసం వీరికి లేదా? ముస్లింల మీద జరిగిన
దాడులకు నిరసనగా మాత్రమే అవార్డులు తిరిగి ఇస్తే అది అసహనంపై నిరసనలో
సహించరాని అసమానత కాదా?
-మాడభూషి శ్రీధర్
andhrajyothi daily
0 వ్యాఖ్యలు:
Post a Comment