శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అరటి చెట్టు ప్రాముఖ్యత…………

>> Sunday, July 5, 2015

అరటి చెట్టు ప్రాముఖ్యత………….
మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం నిర్వహించబడినా అరటిచెట్టు, అరటి ఆకు, అరటి పండు అనేవి లేకుండా ఉండవు. అరటిని ‘కదళీ’, ‘రంభా’ అనే పేర్లతో కూడా పిలుస్తారు. రామాయణంలో అరటి ప్రాముఖ్యత వివరించబడితే, భాగవతంలో అరటి ఆవిర్భావమును గురించి వివరించబడింది.
అరటి జన్మ వృత్తాంతం
సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, రాధ,దుర్గ, వాణి, సావిత్రి, అనే పంచ శక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ, సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించడం ప్రారంభించడం విరాట్ మూర్తి ఆమెను “బీజం లేని చెట్టు” గా భూలోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదళీ (రంభ) పేరుతో అరటిచెట్టుగా జన్మించింది. తన శాపవిముక్తి కోసం ఐదువేల సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర చేసింది. కదళీ తపస్సును మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై, ఆమెకు పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతే కాకుండా అం అంశ రూపమైన కదళిని మానవ, మాధవసేవ నిమిత్తం భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘకృష్ణ చతుర్థశి. దీనినే అరటి చతుర్థశి అని కూడా అంటారు.
రామాయణంలో అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉండి. మాఘ చతుర్థశి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, పెరటిలోనున్న అరటినిగానీ, లేదా అరటి పిలకనుగానీ పూజ చేయవచ్చు. పసుపుకుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి, దీపారాధన చేయాలి. దూపానంతరం పెసరపప్పు బెల్లం, 14 తులసీ దళాలు (నాలుగు ఆకులు ఉండాలి) నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి, వారికఇ అరటిదవ్వ, ఐదు అరటి పండ్లను దానమివ్వాలి. ఈ పూజను చేసినవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన పిమ్మట భోజనం చేయాలి. ఈ అరటి పూజ చేసిన వారికి చక్కని సంతానము కలుగుతుంది. ఆ సంతానానికి ఉన్నత కలుగుతుంది. రామాయణంలో అరటిపూజను సీతారాములు చేసినట్లు తెలియుచున్నది. రావణాసురుని వధానంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతుని పంపాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి, తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటిఆకు కరువైంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పదనాన్ని అక్కడివారికి తెలియ జేయడానికి, తన కుడివైపున మారుతిని కూర్చోమని ఒక సైగ చేసాడు. భరద్వాజ మహర్షి చేసేదిలేక ఆ అరటి ఆకులోనే ఒక ప్రక్కన హనుమంతునికి వడ్డన చేసాడు. భోజన కార్యక్రమం ముగిసిన తరువాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈవిధంగా వివరించి చెప్పాడు.
“శ్రీరాముని పూజలోగాని, మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో, వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా, జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే పైవిధంగా ఇద్దరికీ సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి”.
పూజార్హమైన ఫలాలు ఎన్ని ఉన్నా అరటిపండును పూర్ణఫలం అనంటారు. ఎందుకు?
భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరి కాయకు మాత్రమే అగ్ర తాంబూలం లభిస్తుంది. కాబట్టి, భగవంతునితో శాశ్వతబంధాన్ని ఏర్పరచే సంపూర్ణ ఫలాలు అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం, సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలిపడిపోతున్నాయి. అటువంటి ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతునికి నివేదించడం అంట శ్రేష్ఠం కాడు. కాని, అరటిపండులో సావిత్రి విరాట్ మూర్తి శాపం వల్ల బీజంలేని చెట్టుగా ‘భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక, పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాలలోనూ అరటి పండ్లును ఇస్తాయి. అలా అరటిపండు పూర్ణఫలంగా విఖ్యాతిని పొందింది.
జంట అరటిపళ్ళు తినవచ్చా? తినకూదడా? దేవునికి సమర్పించ వచ్చా?
దేవునికి ఫలాలను సమర్పించుకుంటుంటాం, సాధారణంగా ఫలం అంటే అరటిపండో, మామిడి పండో, ఏదో ఓక పండును సమర్పించడమనే అర్థాన్ని తీసుకొంటారు కొందరు. కాని, ఫలం అంటే, దేవుని తలచుకొంటూ ఎంతోకొంత జపం చేస్తూ ఈరోజు జపానికి ఎంతెంత ఫలం అంటే తపః ఫలము వచ్చిందో? దానిని భగవంతునికి సమర్పించడమే. అలాంటి తపః ఫలాన్ని దేవునికి సమర్పించాలని శాస్త్రం చెబుతోంది. జంట అరటిపండ్లను దేవునికి అర్పించడం తప్పు అనే విషయం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి జంటగా కలిసిన అరటిపండ్లు ఇచ్చినా దోషం లేదన్నది మనకు అవగతమవుతోంది.

1 వ్యాఖ్యలు:

YJs July 6, 2015 at 12:56 AM  

దుర్గేశ్వర గారికి నమస్కారం.
అరటి ప్రాముఖ్యతను తెలియజేసినందుకు ధన్యవాదములు.

అన్ని ఫలాలూ దేవుని సృష్టి అని నేను నమ్ముతాను. అలాగే, పూజ చేయునప్పుడు అరటి మరియు కొబ్బరికి వున్న ప్రాముఖ్యత మరే ఫలాలకి లేదని కూడా గమనించాను.

నాది అధిక ప్రసంగం అని తీసి పారేయక సందేహ నివృత్తి చేయ ప్రార్ధన: భగవంతునితో శాశ్వతబంధాన్ని ఏర్పరచే సంపూర్ణ ఫలాలు అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం, సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలిపడిపోతున్నాయి. అటువంటి ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతునికి నివేదించడం అంట శ్రేష్ఠం కాడు.

మామూలుగా సపోటా, నారింజ, పనస తొనలు గింజలు చేత్తో తీసేసి తింటాము కదా, అలాంటప్పుడు అవి కూడా ఎంగిలి పడినట్లేనా?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP