పతంజలి యోగసూత్రాలు
>> Friday, April 17, 2015
మన
సంస్కృతిలో పతంజలి యోగ సూత్రాలకు ఒక విశిష్టమైన స్థానముంది. ఈ సూత్రాలను
అర్థం చేసుకుంటే యోగం గురించి, మానవ జీవన విధానం గురించి ఉన్న రకరకాల
సంశయాలు తొలగిపోతాయి. ఈ యోగసూత్రాలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు
శ్రీ రవిశంకర్ అందిస్తున్న వ్యాఖ్యానం..
సూత్రం
అనే సంస్కృత పదానికి దారం లేదా తాడు అని అర్థం. వస్తువులను కలిపి ఉంచేది,
సూత్రం అంటే క్లుప్తంగా చెప్పబడినది, సూక్తి అనే అర్థంలో కూడా వాడుతారు.
యోగసూత్రాలను సంకలనం చేసినవాడు పతంజలి. యోగ సాధన అనుభవపూర్వకంగా ఎలా
చేయాలి, వాటి వెనుక గల ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి మొదలైన విషయాల్ని
క్లుప్తమైన సూత్రాల రూపంలో మనకు అందించాడు. గాలిపటం ఒకే దారపు పోగు(సూత్రం)
సహాయంతో ఆకాశంలో ఎగురుతూ ఆశ్చర్యకరమైన ఎత్తుకు చేరుకుంటుంది. మన జీవితమనే
గాలిపటానికి పతంజలి యోగసూత్రాలు దారాలవంటివి. ప్రతీ ఒక్క సూత్రమూ జ్ఞానం,
యోగ సాధన, విధానాలతో నిండి మనకు లభించింది. ఈ సూత్రాలు మన బుద్ధిని సరియైున
దారిలో పెట్టడం మాత్రమే కాదు, ఈ 21 వ శతాబ్దపు జీవనవిధానంలో మన శక్తిని
సంపూర్ణంగా ఉపయోగించుకునే మార్గాన్ని చూపుతాయి.
జ్ఞానదీపిక
జ్ఞానాన్ని
అందించేందుకు అత్యంత విశిష్టమైనది, అద్భుతమైనది అయిన ప్రక్రియ ఏమంటే
చెప్పదలచుకున్న దానిని ఒక కథగా మలచి చెప్పటం. కాబట్టి మనం ఇప్పుడు ఒక కథతో
మొదలుపెడతాం.
అనగా అనగా, చాలాకాలం క్రితం,
మునులు, ఋషులు అంతా కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు. విష్ణువు ధన్వంతరి
అవతారంలో ఆయుర్వేదం అనుగ్రహించి, రోగాలకు చికిత్సలను అందించినప్పటికీ,
ప్రజలు ఇంకా అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారని విష్ణుమూర్తికి తెలిపి,
ప్రజలు అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలో తెలుపమని శ్రీహరిని ప్రార్థించారు.
కేవలం శారీరకమైన అనారోగ్యమే కాదు. మానసికమైన, భావనాపరమైన అనారోగ్యానికి
కూడా చికిత్స అవసరమే కదా. కోపం, కామం, అసూయ, ద్వేషం మొదలైనవి అనారోగ్యాలే.
మరి వీటిని పోగొట్టుకోవటం ఎలా? దీనికి చికిత్స ఏమిటి?
శ్రీమహావిష్ణువు
వేయి పడగలు కలిగిన ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు. ఋషులు ఆయనను సమీపించగానే
ఆయన వారికి ఆదిశేషుని ఇచ్చివేశాడు. ఆదిశేషుడంటే జాగ్రదావస్థ. మెలకువకు
సంకేతం. ఆ ఆదిశేషుడే భూమిపై పతంజలిగా జన్మించాడు. ఈ విధంగా పతంజలి జన్మించి
మనకోసం యోగ జ్ఞానాన్ని అందించాడు. అవే పతంజలి యోగ సూత్రాలుగా ఖ్యాతి
పొందాయి. ఆ యోగ సూత్రాలు తెలుపటానికి కనీసం 1000 మంది ప్రజలు ఒకే చోట
కూర్చుని ఉంటేగాని చెప్పను అని షరతు పెట్టడంతో, వెయ్యిమంది ప్రజలు
వింధ్యపర్వతాలకు దక్షిణదిశగా సమావేశమైనారు. పతంజలి మరో షరతూ పెట్టాడు-
వింటున్న శిష్యులకు, అతనికి మధ్యగా ఒక తెర ఉంచాడు. ఆ తెరను ఎవరూ
తొలగించకూడదు. పాఠం మధ్యలో ఎవరూ లేచి వెళ్ళిపోరాదు. పూర్తయ్యేదాకా అందరూ
అక్కడే ఉండాలి. ఆ విధంగా పతంజలి మహర్షి అక్కడ కూర్చున్న వేయిమంది
శిష్యులకూ జ్ఞానప్రసారం గావించాడు. ప్రతీ ఒక్కరూ జ్ఞానాన్ని అందుకున్నారు.
అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తెరవెనుక, కనిపించకుండా గురువు- ఒక్కమాటైనా
మాట్లాడకుండా తమకు అందరికీ జ్ఞానం అందటం- గురువు తమలో ప్రతీ ఒక్కరికీ
విషయాన్ని అర్థమయ్యేలా ఎలా చేస్తున్నారా అనేది అద్భుతంగా అనిపించింది.
అందరూ అశ్చర్చచకితులై ఉండిపోయారు. వారిలో ప్రతీ ఒక్కరిలోనూ అద్వితీయమైన
శక్తి, అనిర్వచనీయమైన ఉత్సాహం ఎంత ప్రవేశించిందంటే, దానిని తమలో ఉంచుకోవటమే
కష్టమైంది. అయినా వారంతా క్రమశిక్షణను పాటించాల్సిందే కదా! అయితే వారిలో
ఒకడు చిన్నపిల్లవాడు. అతనికి హఠాత్తుగా లఘుశంకకు వెళ్ళాల్సిన అవసరం
ఏర్పడింది. అతడు బయటకు వెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా వెళ్ళి వచ్చేస్తే
సరిపోతుందిలే అనుకున్నాడు. ఇంతలో మరొకరికి ఉత్సుకత పెరిగింది. ‘‘తెర వెనుక
గురువుగారు ఏం చేస్తున్నారో చూద్దాం’’ అనుకున్నాడు.
ఆ పిల్లవాడు తెరవెనుకకు తొంగి చేసేడా? వచ్చేవారం తెల్సుకుందాం.
[from andhrajyothy.com]
0 వ్యాఖ్యలు:
Post a Comment