శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాలయ పక్షం

>> Sunday, September 21, 2014

మహాలయ పక్షం
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి.

పితృకర్మలు:
తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్యనాడైనా చేసితీరాలి. దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుం దామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుం చుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

కర్ణుడి అన్నదానం:
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించిందిఅని అశరీరవాణి పలుకులు వినిపించాయి.కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

కనీసం కూరగాయలయినా:
మహాల య పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం. ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం, గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనకు మనసు నిండుతాయి.

విశిష్ట దినాలు:
భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితౄఎ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.
ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయి న వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూ ర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు.

అశుభకాలం:
ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశు భమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వ చ్చే కర్కాటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షి ణాయనం వానలు, బురద, చిమ్మచీకటితో భయం కరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

భాద్రపదమాసం జలమయం:
అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు. పితురులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతా పితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహా లయ పక్షమం ఆమాసపు అమావాస్యతో ముగుస్తుంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP