శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హయగ్రీవావతారం

>> Sunday, June 22, 2014

సకల చరాచర „సృష్టికి కర్త అయిన బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృిష్టికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు. బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో ప్రవేశించి రసాతలానికి చేరారు.

వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని అవి లేకపోతే తాను „సృష్టిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా, సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి. ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని విడిచి తన స్వరూపాన్ని పొందాడు.

రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ లక్ష్యంగా అవతరించింది.

[from surya daily]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP