శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పరమాచార్య వాణి - అమృత సూక్తులు

>> Wednesday, May 8, 2013

Inline image 1
పరమాచార్య వాణి # 2

"ప్రతీ రోజూ మనం నిద్రించబోయే ముందు, ఈ రోజు నేను ఎవరికైనా సహాయ పడ్డానా అని మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. 63 మంది నాయనార్లలో ఒకరైన తిరునావుక్కరసర్ అనే నాయనార్ పాడిన తేవరంలో ఈ విధంగా చెప్పబడినది....'ఏ రోజైతే మనం భగవంతుడి నామాన్ని స్మరించమో ఆ రోజు మనం మరణించిన వాళ్ళతో సమానం, అసలు పుట్టనట్లే లెక్క'. అదే విధంగా ఏ రోజైతే మనం ఏ కొంచెమైనా కూడా మానవ/సమాజ సేవ చేయమో... ఆ రోజు మనం మరణించినట్లే/లేదా పుట్టనట్లే. ఇది ఎలా అంటే, ఎవరికైనా బంధు వర్గంలో ఎవరైనా శరీరం వదిలిపెడితే, వారికి మృతాశౌచం ఉంటుంది. వారికి కలిగిన మృతాశౌచం వల్ల పవిత్రమైన పుణ్య కార్యాలలో పాల్గొనే అధికారం లేదు. అలాగే మనం ఏ రోజైనా ఎవరికీ సహాయపడకుండా, కొంచెం కూడా పుణ్యానికి దగ్గరగా వెళ్లకపోతే, ఆ రోజు, మనమే స్వయంగా మరణించిన వాళ్లతో సమానము, ఆ అశౌచము వల్లనే మనం ఏ కొద్దిగా కూడా ఎవరికీ సహాయపడలేక పోయాము అని గుర్తు"

---------------------------------------------------------------------
 
పరమాచార్య వాణి # 3
Inline image 1

"స్త్రీలు ప్రతీ రోజూ తలస్నానం చేయనవసరం లేకుండా, పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుందని, మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదే మగవాడు అయితే, ప్రతీ రోజూ తప్పని సరిగా తలస్నానం చేయవలసినదే. స్త్రీలకి మాత్రం మన శాస్త్రం ఈ మినహాయింపు ఇచ్చినది. అలాగే ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత, ఆ గర్భంలో ఉన్న జీవి పూర్తి స్థాయిలో పెరిగిన తరువాత, ఆ గర్భిణీ స్త్రీ ఏ వ్రతములు, ఉపవాసములు చేసినా ఫలించవు అని శాస్త్ర వాక్యం. అంటే అలా నెలలు నిండిఉన్న తల్లిని కష్టపెట్టకుండా ఉండాలని శాస్త్రమే ఇచ్చిన మినహాయింపు.

అలాగే ఒక బ్రహ్మచారి తనకు ఎంత ఆహారం కావలన్నా తినవచ్చు, కానీ అది సాత్త్విక ఆహారం మాత్రమే అయి ఉండాలి. వ్రతములు, ఉపవాసములు బ్రహ్మచారులకు శాస్త్రం నిర్దేశించలేదు. ఇలా ఎందుకంటే, చిన్నతనములోనూ మరియు వృద్ధాప్యంలోనూ శరీరానికి సరిపడ పోషణ అవసరం. చిన్నతనంలో ఎదుగుదల కొరకు, వృద్ధాప్యంలో శరీరం నిలబడే ఓపిక కొరకు. అలాగే ఆరోగ్యం బాగుగా లేని వారి కొరకు కూడా శాస్త్రం అనేక మినహాయింపులను శాస్త్రం ఇచ్చినది.

ఈ విధంగా మినహాయింపులు శాస్త్రం అంగీకరించడం పక్షపాతంతో కాదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మనకి ఆచార అనుష్టానాల పట్ల ఎంత భక్తి విశ్వాసాలున్నా, వాటిని ఆచరించలేని దౌర్బల్య స్థితిలో ఒక్కోసారి ఉండవచ్చు, అప్పుడు ఈశ్వరుడు, ఆయన యొక్క అవ్యాజమైన కారుణ్యంతో, ఆచార అనుష్టానంలో కలిగే ఆ లోపాలని క్షమిస్తాడు. అందుకోసమే, శాస్త్రం మనకి కొందరికి, కొన్ని సందర్భాలలో/పరిస్థితులలో ఆ మినహాయింపులను సమ్మతించినది.

ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ పరిస్థితులలో శాస్త్రం ఆయా మినహాయింపులను ఇచ్చినదో, ఆ కష్టం తీరిపోయిన తర్వాత, మళ్ళీ మన ఆచారము అనుష్టానము యథావిధిగా కొనసాగాలి తప్ప.

కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కోసమో, కొందరు వ్యక్తుల కోసమో (ఉదాహరణ స్త్రీలకు పైన చెప్పిన స్నానం ఉదాహరణ..) శాస్త్రం సమ్మతించిన మినహాయింపులను, సార్వజనీకముగా స్వీకరించి, ఆచార అనుష్టానములను వదలరాదు".

------------------------------------------------------------------------------------------

పరమాచార్య వాణి # 3
Inline image 1
పంచభూత స్నానం
"స్నానం ఐదు రకాలుగా మన శాస్త్రంలో చెప్పబడినది. దీనినే పంచ భూతస్నానం అంటారు.  మనం సాధారణంగా స్నానం అంటే చెంబుతో నీళ్ళు తీసి తలమీద పోసుకోవడం అనుకుంటాము, కానీ అది స్నానమే కాదు. నదిలో మన తల పూర్తిగా మునిగేలా చేస్తే అది స్నానం అని శాస్త్రవాక్యం. దీనినే అవకహం అంటారు. ఇది మొదటి రకం స్నానం, ఇది వరుణ సంబంధమైనది.
రెండవరకం స్నానం విభూతి స్నానం, దీనిని ఆగ్నేయం అంటారు. ఇది అగ్ని సంబంధమైనది.
మూడవరకం స్నానం గోధూళి స్నానం, దీనిని వాయవ్యం అంటారు, ఇది వాయు సంబంధమైనది. అందుకే ఎప్పుడైనా గోవులు వెళ్ళేటప్పుడు వాటి వెనుకగా నడిస్తే, ఆ ధూళి గాలికి ఎగిరి మన మీద పడితే, అప్పుడు మనం వాయు స్నానం / గోధూళి స్నానం చేసినట్లు.
నాలుగవ రకం స్నానం దివ్యస్నానం, ఇది ఆకాశ సంబంధమైనది. అనగా ఎప్పుడైనా ఎండగా ఉండగానే వర్షం కూడా పడుతూ ఉంటే, ఆ వస్తున్న జలాలు దేవలోకం నుంచి వచ్చినట్లుగా శాస్త్రం చెప్పినది. ఆ సమయంలో మనం ప్రయత్న పూర్వకముగా వెళ్ళి, ఆ వర్షంలో నిలబడితే అప్పుడు మనం దివ్య స్నానం చేసినట్లు.
ఇక ఐదవ రకం స్నానం బ్రహ్మస్నానం. ఇది పృథ్వి సంబంధమైనది. మనం సాధారణంగా పూజలు, హోమాలు, అభిషేకాలు చేసే ముందు, ఒక కలశ స్థాపన చేసి, అందులోని జలాలలోకి గంగాది పుణ్య నదులను ఆవాహన చేసి, ఆ తర్వాత మంత్ర జపం పూర్తి చేసిన (ఉదకశాంతి మొ..) తర్వాత, మంత్రపూరితమైన ఆ జలాలను, దర్భలతో పూజ చేస్తున్న బ్రాహ్మణులు మన మీద జల్లుతారు. అలా దర్భల నుంచి మన మీద చిలకబడిన ఆ మంత్రపూరిత జలములచే మనం బ్రహ్మస్నానం చేసినట్లు".

పరమాచార్య స్వామి వారు పైన చెప్పిన శాస్త్ర వాక్కులతో పాటు, మరొక విషయం కూడా మన పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పారు, మనం సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఈ పంచభూత స్నానం తప్పనిసరిగా చేయాలి అని.
 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP