శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భోజన విధానం

>> Monday, June 23, 2014

భోజన విధానం - విద్వాన్ కాశీభట్ల సుబ్బరామ శర్మ

భగవంతుడిని ఉపాసించే సమయంలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, పరిశుద్ద వస్త్రాన్ని కట్టుకుని, సావధాన చిత్తంతో వ్యవహరిమ్చినట్లుగానే, భోజనం చేసే సమయంలో కూడా అంత శుచిగానూ, శాంతం గానూ వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి.  అవి చెప్పిన భోజన నియమాల ప్రకారం తలమీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని, పాగా చుట్టుకుని భుజించ కూడదు.  కుర్చీ మీద కూచుని భుజించకూడదు.  భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు.  తోలు మీద కుర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతిలో ధరించి కానీ భుజించ కూడదు.

పగిలి పోయిన పళ్ళాల్లో భుజించ కూడదు. 
కలసి భోజనం చేయాల్సిన సందర్భాలలో ఇతరులు తనకోసం నిరీక్షించేలా చేయకూడదు. 
కలసి భోజనం చేస్తున్నపుడు ముందస్తుగానే ముగించి, ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు.
ఏక వస్రంతో భుజిమ్చారాదని అంటుంది దేవల స్మృతి. 
ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరి చూపులూ పడేట్లుగా భుజించ కూడదు.  తలుపులు వేసుకోవాలి.  కనీసం పరదాలు వేసుకోవాలి. దృష్టి దోషం ఎంతటి వారిని అయినా కుంగదీస్తుంది. 
బజార్లలో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు.  వాటిపై ఆకలిగొన్న మనుషులు, పశువులు మొదలైన వాటి దృష్టి పడి ఉండవచ్చు.  పడవలో, భుజించ రాదనీ ఆపస్తంబ మహర్షి రాశారు. 
అలాగే చాప మీద కూచుని కూడా భుజించ కూడదు.  అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్ళన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని బ్రహ్మ పురాణం పేర్కొంది.
చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి, బయటకు తీసి తిరిగి తినరాదు.
ఆవు నెయ్యితో తడప కుండా ఆహారాన్ని తినకూడదు.
విక్రయాన్నం తినకూడదని శంకలిఖిత స్మృతి శాసించింది.  నేడు హోటళ్ళలో తినేవన్నీ విక్రయాన్నాల కిందకే వస్తాయి.  ఒకసారి వండిన దాన్ని, కొంతసేపటి తర్వాత తిరిగి వేడి చేసి, వడ్డించడం లాంటివి ఈ హోటళ్ళలో పరిపాటి.
మౌనంగా, సుఖంగా భుజించాలని శాస్త్రం చెబుతోంది.  ప్రశాంత చిత్తంతో భుజించాలి.  భుజించేటప్పుడు కామ క్రోధాదులు, హింసా వైరాల వంటి వాటికి మనసులో చోటుండ కూడదు. 
భుజించేటప్పుడు మాట్లాడ కూడదు.  అయితే ముద్ద ముద్దకూ భగవన్నామం చెబుతూ తినాలని పెద్దలు చెప్పారు.
భుజించడానికి ముందే అన్నం నుంచి కొంత భాగాన్ని తీసి, వేరుగా పెట్టాలి.  దానిని ఆవుకో, పక్షికో తినిపించాలి.  అలాగే కుక్కలకు కూడా అన్నం పెట్టాలి. 
మొదటగా ప్రాణులకు పెట్టె భుజించాలి.  భూతబలి వేయాలి. 
అతిథులకు, అభ్యాగతులకు ఆహారమిచ్చి సంతృప్తి పరచాలి.
సన్న్యాసులకూ, సాదువులకూ ఆహారమివ్వాలి.
పసిపిల్లలకు, వృద్ధులకు, అనాథ లకు, దీనులకు భోజనం పెట్టాలి.
ఆకలే అర్హత.  ఆకలి గొని వచ్చిన వారెవరికైనా ఆకలిని తీర్చి, కడపట భుజించడమే గృహస్తు ధర్మం.

మాంసాహారం తమోగుణాన్ని కలిగిస్తుంది. తమోగుణం రాక్షసులది.  మనం మానవులుగా ప్రవర్తించాలి.  క్రమంగా దేవతలం కావాలి. 
ప్రాణులను హింసించడం వల్ల మాత్రమె మాంసం లభిస్తుంది.  ఇది మహా పాపం.  ఏ ప్రాణినీ హింసించ వద్దని వేదం, పురాణాలు చెబుతున్నాయి.  అహింసే ధర్మాలన్నిటిలోకీ ఉత్తమమైన ధర్మం.
ప్రాణులకు ఏ విధంగానూ కష్టం కలిగించక పోవడమే అహింస అని శంకర భగవత్పాదుల నిర్వచనం.  సమస్త జీవులకూ అభయమివ్వడమే అహింస అని మరొక భాష్యం.
హింసింపరాని ప్రాణులను తన జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు, తన శరీరాన్ని పుష్టిగా చేసుకోవడానికీ, తన సుఖాన్ని పెంచుకోవడానికీ హింసించే వాడు బ్రతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానం.  అటువంటి వానికి సుఖం ఎప్పటికీ కలుగదు అంటుంది మనుస్మృతి (5-45). 
ప్రాణిని చంపడానికి అనుమతినిచ్చేవాడు, చంపబడిన ప్రాణి శరీరాలను ముక్కలు ముక్కలు చేసే వాడు, మాంసాన్ని అమ్మేవాడు, కొనేవాడు, వండే  వాడు, వడ్డించే వాడు, తెచ్చే వాడు, భుజించే వాడు వీరంతా ఘాతకులే, మహాపాపం చేసే వారే అని కూడా అంటుంది మనుస్మృతి (5-51).
"పశువులను నేను బరువులు మోయదానికీ, భూమి దున్నడానికీ సృష్టించాను.  వాటితో ఆ పనులను చేయించుకొంది.  నేల నుండి పుట్టిన వాటినే భుజించండి.  వరి, గోధుమలు, ఇత్యాదులను, కాయగూరలను, కంద మూలాలను, పండ్లను భుజించండి.  భుజించడానికి అల్లా ఇచ్చిన పదార్థాలు ఇవే" - అని షేక్ షాదీ ఆజ్ఞాపిస్తున్నారు.
ఏ జీవికీ దుఃఖం కలిగించరాదు.  జీవహింసను మించిన పాపం ఏదీ లేదు. 
దేనిని నువ్వు బలి పేరుతొ చంపుతున్నావో, ఆ జీవుల మాంసం, రక్తం భగవంతుని సమీపానికి పోజాలవు.  అతని దగ్గరికి పోయేది హత్య వలన కలిగే పాపం మాత్రమె.  అహింసను సంపూర్ణంగా పాటించడమే అతని స్వీకారం, అంగీకారం అంటుంది ఓ ఆయత్.
"మాంస భక్షణం, మదిరా పానం మంచి పనులు కావు.  అట్టి పనులు ఎన్నడూ చేయవద్దు" అంటుంది మరో మతం. 
ఇలాంటివి చాలా చూపవచ్చు.  భోజన నియమాలను పాటించడం వల్ల ఆయుషు పెరుగుతుంది.  ఆరోగ్యం కలుగుతుంది.  సమస్త శ్రేయస్సులూ కలుగుతాయి.
ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP