శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడంటే ఎవరు ? [ఆరవ భాగం]

>> Thursday, April 17, 2014

lhttp://durgeswara.blogspot.in/2014/02/blog-post_10.html
ముందటి భాగాలకోసం పై లింక్ చూడండి


చాలా బాగా వివరించారు.  మొదట్లో చదివేటప్పుడు శివుడు ఒకటి, నేను ఇంకొకటి; విష్ణువు ఒకటి, నేను ఇంకొకటి లాంటి భావన ఇచ్చి చివరలో అహం బ్రహ్మాస్మి అనే మహా వాక్యం తో ఒక నిండు తనం ఇచ్చారు.  

ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనే విషయం ప్రకటించి నప్పటికీ ఆ భావనలో మనము ఉండలేక పోతున్నాము.  ఒకవేళ కొందరు ఆ స్థితి లోకి వెళ్ళ గలిగి నప్పటికీ బహిర్ముఖులం అయి వెంటనే లౌకికం లోకి మారి పోతున్నాము. నిజానికి అహం బ్రహ్మాస్మి అన్న భావన యదార్థం, నిత్యం, శాశ్వతం; లౌకికం అన్నది స్వాప్నికం.  కాని దీవిని రివర్స్ లోనే మనము, మన భావనలు ఉండి పోతున్నాయి.  దీని నుండి బయటకు రాలేక  అందులోనే కొట్టుకుంటున్నాము.  

దానికి కారణం మనము ఆత్మ తత్వాన్ని నిజంగా అనుభవించ లేక పోతున్నామా  లేక temporary గా అనుభవించి నప్పటికీ ఆ స్థితిని నిలుపుకోలేక బహిర్ముఖులము అయి పోతున్నామా.  ఈ విషయమై విచారణ చాలా ముఖ్యం.  
--
"నాయనా! సాయిరాం! ఓ బండ రాయిని తీసుకో! - దానికి గరిమనాభి ఉందా? లేదా?"

"ఉంటుంది"

"చూపించు!"

"ఎలా చూపిస్తాం? అది కనిపించేది కాదు.  గుర్తు పెట్టి చూపిద్దామన్నా పగల గొడితే మారిపోతుంది"

"గుర్తు పెట్టినా, పెట్టక పోయినా, ఉన్నదన్నది ఖాయమేనా?"

"అందుకు సందేహమేముంది?"

సుబ్రహ్మణ్యం గారు నా చేతి గాజును అడిగి తీసుకుని ఓ కాగితం మీద పెట్టి, తన బాల్ పాయింట్ పెన్నుతో గుండ్రంగా గీశారు.

"సరే గానీ సాయిరాం! ఇదేమిటి?"

"నన్ను మరీ చిన్న పిల్లాణ్ణి చేస్తున్నారు.  అది వృత్తమని తెలియనిదెవరికి?" సాయిరాం జవాబిచ్చాడు.

"మరి దీనికి కేంద్రం ఉందా? లేదా?"

"ఉంటుంది"

"చూపించు!"

సాయిరాం పెన్నుతో ఒక చుక్క పెట్టాడు.

"చుక్క పెట్టనప్పుడు కేంద్రం ఉన్నట్టా? లేనట్టా?"

"చుక్క పెట్టినా, పెట్టకపోయినా, వృత్తం అన్నాక కేంద్రం ఉంటుంది"

"శభాష్! ఇదే కేంద్రంగా ఎన్ని వృత్తాల్ని గీయచ్చు?"

"వేర్వేరు వ్యాసార్థాలతో అనంతంగా గీయచ్చు"

"అన్నింటికీ కేంద్రం మరి అదేనా?"

"అంతే కదా!"

"కొంచెం దూరంగా మరో చుక్క పెడతాను.  దాని చుట్టూ ఎన్ని వృత్తాలు గీయచ్చు?"

"అనంతంగానే"

"దట్సాల్ సాయిరాం! ఈ ఉపమానంలోనే నీకు సమాధానముంది.  మనిషి మనిషికీ ఒక కేంద్రముంది.  వాస్తవానికి ఆ కేంద్రమే ఆ మనిషి.  కన్నో, కాలో, జుత్తో లోపించినా సదరు మొత్తానికి కేంద్రం ఆ మనిషే.  వృత్తాలు ఎన్ని రూపాలుగా మారతాయో చూడు.  
మీ పిల్లలు ఓ వృత్తం. దానికి తండ్రి అనే కేంద్రం నువ్వవుతావు. 
మీ దుకాణం ఒక వృత్తం.  దానికి షాప్ కీపర్ అనే కేంద్రమవుతావు. 
ఇలా అనేక వ్యాసార్థాలతో, అనేక వృత్తాలకు నువ్వే కేంద్రం. 
ఒకరు ఇంకొకరి ప్రసంగా శైలిని అభిమానిస్తున్నారు అంటే వారి ప్రసంగా వైభవాన్ని మననం చేస్తున్నారు.  తన మనసులో ఆ ఆలోచనలు ఆవృత్తమవుతున్నాయి.  ఆ మనోచర్య ఓ వృత్తం.  అదే వృత్తి అయింది.  అప్పుడు స్వామీజీ అభిమాని అనే కేంద్రంగా ఆ వ్యక్తీ మరో విశేషణాన్ని పొందుతోంది. 
నువ్వు ఏ మంత్రాన్ని, విధానాన్ని, నియమాన్ని, సాధనను తీసుకున్నా అది ఓ వృత్తమే.  లేదా ఒక (మనో)వృత్తే. చుక్కని గుర్తు పెట్టనంత మాత్రాన దానికి కేంద్రం లేకుండా పోదు.  ఉన్న దానిని చేరిపెసినా చెక్కు చెదరదు.  దానిని నువ్వు కత్తులతో కోయలేవు.  నిప్పుతో కాల్చలేవు.  ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఎదో ఒక దానిని ధ్యానిస్తూనే ఉన్నారు.  అంటే ఎదో ఒకటి మనో కేంద్రంగా చేసుకుంటున్నారు.   అంటే, దానికి అభిమానులు అవుతున్నారు.  అంటే, వారు దానిని సేవిస్తున్నట్లే.  పూజిస్తున్నట్లే.  దైవం అని పేరు పెట్టక పోయినా దానిని దైవంగా చేసుకున్నట్లే.

జంతువులకు భిన్నంగా నీకంటూ ఓ మనోవృత్తి ఉన్నంతవరకు, నీ మనసు ఒక గర్భ గుడి.  దానిలో నువ్వు ప్రతిష్ఠించినా, ప్రతిష్ఠించక పోయినా, గుర్తించినా, గుర్తించక పోయినా ఎదో ఒక కేంద్రముంది.  అలా ఎదో ఒక దానిని ఆరాధించే తత్త్వం మానవుడిలో ఉన్నంత కాలం నిరీశ్వర వాదానికి అస్తిత్త్వమూ లేదు.  నిరీశ్వర వాదీ లేడు.  ఉన్నాడని అన్నా అది అర్థం పర్థం లేని ఓ లేబుల్ మాత్రమె.  ఎందుకంటే ఈశ్వరుడు లేదని నువ్వు అంటున్నా, నిరీశ్వర వాదం నీ మనో వృత్తి కాబట్టి, ఆ వాదాన్ని దైవంగా నీ మనసులో ఆరాధిస్తున్నట్లే.

పురందర దాసు, వేమన, చలం అంతా అలా చేసిన వారే.  ఒకరు లోభాన్ని, మరొకరు వ్యామోహాన్ని, ఇంకొకరు స్వేచ్చని ఈశ్వరుడుగా చేసుకుని ఆరాధించిన వారే.  చివరకు, హృదయమనే కోవెలలోని గర్భగుడిని గుర్తించిన వారే.  అక్కడ ప్రాకృతికంగా తిష్ఠ వేసిన వాటిని పసిగట్టిన వారే. అవన్నీ భ్రాంతులని తెలుసుకున్న వారే.  అవి జారుడు మెట్లని తెలిసి, తాము వాటిమీద ప్రయాణిస్తున్నట్లుగా గమనించి, ఉలిక్కిపడిన వారే.  అక్కడ ఓ వెంకటేశ్వరుడో, వైరాగ్యమో, సత్యమో ప్రతిష్ఠితమై, వాటితో తాదాత్మ్యం చెందినా వారే.  అలా వెలుగు దారికి మళ్ళి, 'ఎరుక' కలిగినట్లుగా గుర్తింపు పొందిన వారే.

వారిలో ఇంతటి పరిణామానికి కారణమైనదేమిటో నువ్వు తెలుసుకోగలవా? వారి చిత్త శుద్ధి.  అంటే, తెలిసి అయినా, తెలియక అయినా సత్యాన్ని తమ హృదయపు కోవెలలో కేంద్రంగా చేసుకుని వారు ఆరాధించారు.  దానికి ప్రతిఫలంగా సత్య దేవత అనుగ్రహం వారికి సిద్ధించింది.  పశు ప్రవృత్తి నుంచి మహనీయులుగా ఎదగడానికి ఈశ్వరారాధన దోహదం చేస్తుందని నేను అన్నది అందుకే.  అలా జరిగిన వారు భారత దేశంలో కోకొల్లలు.

విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లుగానే వృత్తం ముందా? కేంద్రం ముందా? అనే ప్రశ్న కూడా ఉంది.  అయితే, అదేమీ చిక్కు ప్రశ్న కాదు.  రోగాలు, మందులకు సంబంధించిన భావనలు, శాస్త్రాలు, అనుభవాల చుట్టూ ఓ వ్యక్తి మనోవృత్తి తిరుగుతుంది.  దానితో వైద్య విద్యార్థి అనే కేంద్రం అతడిలో ఏర్పడుతుంది.  సాధన సిద్ధించడంతో వైద్యుడు అనే కేంద్రంగా వికసిస్తుంది.  తర్వాత, ఆ కేంద్రం చుట్టూరా రోగులు, చికిత్సలు అనే వృత్తాలు ఏర్పడతాయి.  ఇదొక పరిణామ ప్రక్రియ.  జంతువులకు భిన్నంగా మనిషిలో జరిగే వికాస వేడుక.  సూర్యుడి చుట్టూ సౌరమండలం ఏర్పడి, గ్రహాలు సంచరిస్తున్నట్లుగానే, దివ్య ప్రజ్ఞా కేంద్రం చుట్టూ సృష్టి ఏర్పడి, దానిలో మనబోటి జీవ ప్రజ్ఞలన్నీ మేఘాల్లా తిరుగుతున్నాయి.  గ్రహగతులు ఒక విధానం ప్రకారం, జోస్యానికి అందేలా, శాస్త్రీయంగా ఉండడం నీకు తెలుసు.  కారణం అవన్నీ నిర్ణీత పద్ధతిలో ఒక కేంద్రం చుట్టూ తిరగడం.   జంతువులు, క్రిములు కూడా తమవైన ఒక విధానం చుట్టూ తిరుగుతున్నాయి.  ఒక్క మనిషి మనో వృత్తే అమీబా లాగా, పాములాగా పిచ్చి పిచ్చిగా మెలికలు తిరుగుతోంది.  బహుశా ఏది తనకు శ్రేష్టమైన కేంద్రమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ సరైన నిర్మాణం లేని గాలిపటంలా గిరికీలు కొడుతోంది.

నీ మనో కేంద్రాన్ని గురించిన స్పృహ నీకు కొరవడితే, ప్రాకృతికంగా ఎదో ఒకటి అక్కడ చేరుతుంది.  పట్టించుకోకుండా వదలి వేసిన గదిలో బొద్దింకలు చేరినట్లుగా దీనిని అర్థం చేసుకోవచ్చు.  ఏదీ చేరకుండా మాత్రం ఉండదు.  మద్యం నీకు బాధల నుంచి విముక్తినో, సంతోషాన్నో, ధైర్యాన్నో ఇస్తుందనే భావం నీ మనో కేంద్రంలో పడవచ్చు.  కాలక్రమంలో దానిని విడువకుండా ఉండలేక పోతున్నావని అంటే, నీ గుండెలోని గర్భ గుడిలో మద్యాన్ని ప్రతిష్టించుకుని, దానికి పూజారి వయ్యావని అర్థం.  నువ్వు సిగరెట్ ని వదలలేక పోతున్నావని అంటే, నీ హృదయ కేంద్రంలో పొగాకుని ప్రతిష్టించి, ఆరాదిస్తున్నావని అర్థం.  నీకు ధనార్జన ఒక వ్యసనమయింది.  నువ్వు దానినే దైవంగా నెత్తి కేక్కించుకున్నట్లు లెక్క.  అన్ని అనర్థాలూ నివారణ కావాలంటే, నీ హృదయ కేంద్రంగా సత్య దేవత ప్రతిష్టితం కావాలి.  ధర్మ దేవత ఆవిష్కరణ కావాలి. అప్పుడే నిరర్థకత నుంచి సార్థకత వైపు జన్మ మళ్ళుతుంది".

సాయిరాం కలగ జేసుకున్నాడు.  "సత్యాన్ని సత్యమనీ, ధర్మాన్ని ధర్మమనీ అంటే సరిపోతుంది కదా! సత్య దేవత అనీ, ధర్మ దేవత అనీ పేర్లు పెట్టడమెందుకు? దానినే సశాస్త్రీయత నుంచీ, హేతువాదం నుంచి ఛాందసానికి మారిపోవడమని నేనంటాను.  ఏది ఏమైనా, నా రైలు బండికి వేళ మించి పోతోంది.  నేను సెలవు తీసుకోక తప్పదు.  డిబేట్ లో మీరు ఓడారని అననులెండి" అతడు నవ్వుతూ అన్నాడు.

"సాయిరాం! పెదాలకే పరిమితమయ్యే ధర్మం బొమ్మల కొలువులో పెట్టిన మామిడి పండు బొమ్మ లాంటిది.  పారాడే పిల్లలు దానిని తినడానికి ప్రయత్నిస్తారు.  కృత్రిమమైనది విషమని వాళ్లకు తెలియదు.  ఇక పాండితీ ప్రకర్షకు పరిమితమైన ధర్మం చెట్టున వేలాడుతున్న మామిడి కాయల గుత్తి లాంటిది.  అదీ అలంకార ప్రాయమే.  కానీ చక్కగా పండి, కంచంలోకి వచ్చి, పొట్టలోకి చేరి, వంట బట్టి, పోషించి, తృప్తినిచ్చి, వడదెబ్బను పోగొట్టి, తృప్తిని కలిగించిన పెద్ద మామిడి పండు రసం కథే వేరు.  అలా పెదాలను, ఆలోచనా కేంద్రాన్ని దాటి, దివ్యమైన హృదయ సామ్రాజ్య సింహాసనం మీద కొలువై, జీవన చైతన్యంలోకి శుష్టుగా వ్యాపించిన ధర్మాన్నే ధర్మదేవత గా గౌరవిస్తాము.  అలాగే సత్య దేవత, వగైరా, వగైరా.  మాయలు చేసే మనో కేంద్రాన్ని దాటి హృదయ కేంద్రాన్ని చేరుకోవడమే ఆధ్యాత్మిక సాధన.

సాయిరాం! నాకూ రైలుకి టైమయింది.  అయినా ఒకటి చెబుతాను.  నువ్వు చేసినది డిబేట్ కానే కాదు.  కేవలం అతి సామాన్య సంభాషణ.  ఒకప్పుడు నేనూ నీలాగే వాదించే వాడిని.  అందువల్ల కావచ్చు, నీ మీద ప్రత్యేకమైన అభిమానం కలిగింది.  ఒకప్పటి నా వాదనలతో పోలిస్తే నీవి చీమ చిటికెలు.  ఎటొచ్చీ, సత్యం అవగతమవుతున్న కొద్దీ ఎంత విలువైన కాలాన్ని కోల్పోయినదీ గుర్తించాను.  నవతరం అలా సమయాన్ని వృథా చేసుకోవలసిన అవసరం లేదని చెప్పదలచాను.  ఓ అయిదారు గంటల సమయాన్ని వెచ్చించి, భారతీయ ఆథ్యాత్మిక శాస్త్రంలో ఓ డజను యల్. కే.జి. స్థాయి పాఠాలను వింటే చాలు.  మూల సూత్రాలు అవగతమవుతాయి.  ఒక వైఖరికి రావడానికి అవసరమైన పునాది పడుతుంది.  చక్కటి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది.  మంచి డిబేట్ చేయగలుగుతావు.  నా మాటలు ఇంకా వినాలనే ఉత్సాహం నీకు కలగని పక్షంలో నేను ఓడిపోయినట్లే.  అలాంటి ఉత్సాహం కలిగితే మాత్రం దూరం అడ్డురాకూడదు.  బెస్టాఫ్ లాక్! సీ యు!"

ఈ వాదోప వాదాలపై తీర్పును పాట్హకుల నిర్ణయానికే వదలి వేస్తున్నాను.

సేకరణ   కె.బి. నారాయణ శర్మ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP