శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సంతానమేమి లేకపోతె తమ సంబంధీకులనెవరినైనా గాని, అనాథ బాల బాలికలను గాని పెంచుకోవాలా? అక్కరలేదా?

>> Friday, March 7, 2014

సంతానమేమి లేకపోతె తమ సంబంధీకులనెవరినైనా గాని, అనాథ బాల బాలికలను గాని పెంచుకోవాలా? అక్కరలేదా?
మనకి పిల్లవాడి అవసరమే ఉంటె భగవంతుడే ఇచ్చి ఉండేవాడు.  మనకి పిల్లవాడి అవసరం లేదు.  కాబట్టి భగవంతుడివ్వలేదు.  కనుక మనం పెంచుకొని మనకి మనం ఆపద ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? సాధారణంగా పెంచుకొన్న పిల్లలు తల్లి దండ్రులకు దుఃఖమే కలిగిస్తూ ఉండటం కనిపిస్తోంది.  వారికి సేవ చేయటం లేదు.  అందుచే పెంచుకోక పోవడమే మంచిది.  కాని మానవతా ధర్మంగా అనాథ బాల బాలికలను చదివించాలి.  వారి సేవ చేయాలి.  వారి శరీర నిర్వహణానికి కావలసిన ఏర్పాటు చెయ్యాలి.

పుత్రులు లేకపోతె ముసలితనంలో మన సేవ ఎవరు చేస్తారు?
నిజానికి ప్రారబ్దం వల్ల ఎటువంటి సేవ జరగాల్సి వుందో, ఎంతటి సుఖశాంతులు లభించాలో అవి లభించనే లభిస్తాయి.  పుత్రుడుండనీ లేకపోనీ విరక్తులైన సాదువులకెంతటి  సేవ జరుగుతుందో అంతటి సేవ గృహస్థుల పిల్లలు చేయకపోవటం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.  ఇంతకీ పిల్లవాడు ఉంటేనే సేవ జరుగుతుందనే మాట లేదు.  పిల్లలున్న తల్లిదండ్రులకు మాత్రం ఆ పిల్లలు సేవచేస్తున్నారా? ఇప్పటి పిల్లలు తల్లిదండ్రుల "ధన సంపత్తి" కే తాము వారసులం అనుకొంటున్నారు.  శ్రాద్ధ తర్పణం వ్యర్థం, దండగ అనుకొంటున్నారంటే ఇలాంటి పిల్లలు సేవ చేస్తారా? వాళ్ళు కేవలం దుఃఖం కలిగించేవారే అవుతున్నారు.
పుత్రుడు లేకపోతె మరణించాక మనకి పిండప్రదానం ఎవరు చేస్తారు? అదిలేక పొతే మన గతి ఏమవుతుంది?
పిండోదక దానం వల్ల దానిని గ్రహించిన వారికి ముందు ముందు జనన మరణాలు కొనసాగుతాయి.  బాటసారి ఆకలి దప్పికల కారణంగా ఎక్కడో ఆగినా అన్నోదకాలు దొరికిన తరువాత మళ్ళీ తనదారిన ప్రయాణిస్తున్నట్టే ప్రేతాత్మలకు (మృతాత్మ లకు) పిండోదకాలు లభింపక పొతే ఒకచోట ఆగిపోవటం, అవి లభిస్తే మార్గాయాసం తీరి అక్కడనుంచి నడవటం జరుగుతుంది.  అంటే వారి పురోగమనం ముందుగ ప్రారంభమవుతుంది.  వారి జనన మరణ క్రమం కొనసాగుతుంది.  అంతే కాని వారికి ముక్తి లభిస్తుంది అని కాదు.

నిజానికి మోక్ష ప్రాప్తి లభించటం, శుభం జరగటం అన్నవి సంతానం చేతుల్లో కించిత్తు కూడా లేదు.  ముక్తి సంతానపుటాధీనంలోనే ఉంటె ముక్తి పరాధీనమైనదన్న మాట.  మరి మనుష్య జన్మకి స్వాతంత్ర్యం ఎక్కడుంది.  కల్యాణం(శుభం) లోను, మొక్షంలోను శరీరాసక్తే బాధాకరమైనప్పుడు మరి మరణానంతరం కూడా పుత్రుడి వల్ల పిండోదకాలాశించటం శుభామెలా కలిగిస్తుంది?  అది బంధనం లోనే పడేస్తుంది.  అందువల్ల తన క్షేమం కోరేవాడు పుత్రేచ్చ, లోకైషణ (లోకంలో ఆదర సత్కారాలు, మాన మర్యాదలు కోరటం), ధనేచ్చ ఈ మూడింటినీ త్యాగం చేయాలి.   ఎందుచేతనంటే ఈ మూడే పరమాత్మ ప్రాప్తికి బాధకాలు.

సంతతి కావాలనీ, పిండోదకాలు కావాలనీ కోరుకోనేవాడు జనన మరణ చక్రంలో పడి ఉండాలనుకొంటున్నాడన్న మాట.  ఎందుచేతనంటే ఎక్కడో జన్మ లభిస్తుంది.  అక్కడ పిండోదకాలు కోరతాడు.  జన్మే లేకపోతె పిండోదకాలెవరికి కావాలి?

పుత్రుడు లేకపోతె మేలు కలగదనుకోవటం బొత్తిగా తప్పు.  సంతానం కలగటం వల్లనే మంచి కలిగితే పందికి పదకొండు, పాముకి నూటెనిమిది పిల్లలు పుడుతున్నాయి.  వాటికి మేలు జరిగి తీరాలి.  ఇలాగే బహుసంతాన వంతులకి శుభం శీఘ్రంగా జరగాలి.  కాని అది జరగటం లేదు.

సంతానం కలిగినా, లేకపోయినా మానవుని మనస్సు కేవలం భగవంతుని యందె లగ్నమై యుండాలి.  భగవత్పరాయణుడై భగవద్భజన చెయ్యాలి.  పుత్రేచ్చ నశించక పొతే సంతాన హీనుడు బాల రాముణ్ణి, బాల కృష్ణుణ్ణి తన పుత్రుడిగా భావించి వారిమీద తన వాత్సల్యం పెంచుకోవాలి.  ఆ పుత్రుడు (భగవంతుడు) చేసే సేవ కన్నబిడ్డ చెయ్యనే లేడు.  ఆ పుతృడు ఇహ పర కార్యాలన్నీ చేసి పెడతాడు.

గార్హస్థ్యంలో పిల్లల పెంపకం, పోషణ, వివాహాదులు మొదలుకొని అనేక చిన్తలుంటాయి.  ఆ చింతలనుంచి బయట పడటమెలాగా?
ప్రతి ప్రాణీ తన ప్రారబ్దానికనుగుణంగానే జన్మిస్తాడు.  ప్రారబ్దంలో మూడు విషయాలున్నాయి. 
1) జన్మ;     2) ఆయుర్దాయము; 3) భోగం.

ఈ మూడింటిలోనూ ప్రాణికి జన్మ అయితే జరిగింది.  ఆయుర్దాయం - వారికి ఎంత ఆయువుంటే అంతవరకూ అది జీవిస్తుంది.   ఆ ప్రాణికి పరిస్థితులు కలగటం భోగం.  నిజానికి పరిస్థితి ఎవరినీ సుఖవంతుడినిగా గాని లేక దుఖితుడిని గా గాని చెయ్యదు.  కాకపోగా మానవుడే అజ్ఞానం వల్ల, పరిస్థితి చేత సుఖి గాని, దుఃఖి గాని అవుతుంటాడు.  కన్య పెద్దదయితే ఆ పరిస్థితుల్లో దాని వివాహాన్ని గురించి చింతించ కూడదు.  ఎందు చేతనంటే కన్య తన ప్రారబ్దం తెచ్చుకొనే పుట్టింది.  కనుక ఆమెకి అనుకూల పరిస్థితి గాని, ప్రతికూల పరిస్థితి గాని ఆమె ప్రారబ్దానుసారమే లభిస్తుంది.  తల్లిదండ్రులామే వివాహ విషయంలో ఆలోచించ వలసిందల్లా తమ పిల్ల సుఖంగా ఉండే చోటికివ్వటం (అటువంటి యింటికి పంపటం).  ఇటువంటి ఆలోచన తల్లిదండ్రుల కర్తవ్యమ్.  అంతే కాని మనం దాన్ని సుఖ వంతురాలినే చేస్తాం.  ఆమెకు మంచి కుటుంబం లభించి తీరుతుందనుకోవటం వారి చేతిలో పని కాదు.  కనుక కర్తవ్య పాలనం జరగాల్సిందే కాని చింతించ కూడదు.  

చింత వేరు, ఆలోచన వేరు.  చింత అనేది అజ్ఞానం (మూర్ఖత) నుంచి పుడుతుంది.  దానివల్ల అంతఃకరణం కలుషితం అవుతుంది.  క్రొత్త వికాసం కలగదు.  కాని విచారణ (ఆలోచన) వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది.  కాబట్టి ప్రతి పని ఎలా చెయ్యాలి? ఏ రీతిగా నిర్వహించాలి? అనే ఇలాంటి ఆలోచన మాత్రం చెయ్యాల్సిందే.  కాని, ఎప్పుడూ చింతించరాదు (దిగులు పడరాదు).  చింత లేకుండా ఆలోచిస్తే ఎదో ఒక ఉపాయం తప్పక లభిస్తుంది.

వార్ధక్యంలో పిల్లలు సేవ చెయ్యకపోతే ఏం చెయ్యాలి?
పిల్లల మీద మమకారం తొలగించుకోవాలి.  ఎవడూ సేవ చేయక (చూడక) పొతే ఇటువంటి అవస్తలో కుటుంబీకులవల్ల సుఖ సౌకర్యాలు పొందాలని ఆశపడటం దుఃఖ దాయక మవుతుంది.  "ఆశా హి పరమం దుఃఖం, నైరాశ్యం పరమం సుఖం" కనుక ఆ ఆశనే త్యజించాలి (విడిచి పెట్టాలి).  ఇట్టి అసౌకర్యంలో "తపోభావన" చెయ్యాలి.  ఏమని? "భగవంతుని గొప్ప దయవల్ల మనకి స్వయంగా తపస్సు చేసుకొనే అవకాశం లభించింది.  కుటుంబంలో వారే మనకి ఉపచారాలు చెయ్యటం జరుగుతుంటే మనం వారి మోహ మమకారాల్లో చిక్కుకు పోయే వాళ్ళం. భగవంతుడు అనుగ్రహించి మనల్ని అలా చిక్కుకు పోనియ్యలేదు" అని.

మానవుడు మోహ మమకారాల్లో చిక్కుకు పోవటమే అతని ఆధ్యాత్మికోన్నతికి బాధాకరం.  ఆ బాధను తొలగించిన వాడు చేసినది ఉపకారమే.  వీరు మనని బాధా రహితుల్ని చేస్తున్నారనుకోవాలి.  మనకి మేలు చేస్తున్నారు.  వారికి మన మీద చాలా గొప్ప దయ ఉందని భావించాలి.

జీవితమంతా ఉపచారాలు చేయించుకోవటానికి అలవాటు పడితే ముసలితనంలో అసమర్థతచే కుటుంబ సభ్యుల చేత పరిచర్యలు చేయించుకోవాలనే కోరిక ఎక్కువవుతుంది.  కనుక మానవుడు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి.  "నేను చేయించుకోవటానికి ఇక్కడికి రాలేదు.  అందరికీ సేవ చేయటానికి ఇక్కడికి వచ్చాను" అనుకోవాలి.  ఎందుచేతనంటే మానవ, దేవ, రుషి, ముని, పితృ, పశు, పక్షి, భగవదాదు లందరికి సేవ చేయటానికే మనుష్య శరీరం ఉంది.  కాబట్టి ఎవరివల్ల కూడా మనకి సుఖం, సౌకర్యం కలగాలని ఆశించకూడదు.  మొదటినుంచి మనం ఎవరి వలనా సుఖాలు, సౌకర్యాలు ఆశించకుండా ఉంటే ముసలితనంలో అవి లేకపోయినా దుఃఖం కలగదు.  మన మనస్సులో సేవ స్వీకార వాంఛ లేకపోవటంతో ఇతరుల మనస్సుల్లో మనకి సేవ చెయ్యాలనే కోరిక జాగృతమవుతుంది.

ప్రతి రంగం లోను త్యాగము యొక్క అవసరం ఉంటుంది.  త్యాగం వల్ల వెంటనే పరమ శాంతి లభిస్తుంది.  ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రసన్నంగా ఉండటం చాల గొప్ప తపస్సు.  తపస్సు వల్ల అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది.  సుఖ సౌకర్యాల వల్ల అది రాదు.  సుఖ శాంతులు కోరుకోవటంతో అంతఃకరణం కలుషిత మవుతుంది.  కాబట్టి మానవుడు సుఖం కోరక పోవటమే కాక తానూ త్రికరణ శుద్ధిగా మనసా, వాచా, కర్మణా ఇతరులకు సుఖం కలిగించాలి.

కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే మృతాత్మ కి శాంతి కలిగించేందుకు, మన శోకం దూరం చేసుకొనేందుకు ఏం చెయ్యాలి?
1) ప్రేతాత్మకి యథావిధిగా నారాయణ బలి, శ్రాద్ధ తర్పణాదులు చెయ్యాలి;
2) అతను గుర్తుకు వచ్చినప్పుడల్లా అతన్ని భగవచ్చరణాల్లో దర్శించాలి.
3) అతనికోసం గీతా పఠణం, భాగవత సప్తాహం, శ్రీరామ చరిత మానస్ (తులసీ దాస రామాయణం) యొక్క నవాహ్న పారాయణం, నామ జపం, కీర్తనం మొదలైనవి చెయ్యాలి.
4) అతని కోసం పేదపిల్లల కి మిటాయిలు పంచి పెట్టాలి.  తీయటి పదార్థాలు లభిస్తే పిల్లలు సంతోషిస్తారు.  వారు సంతోషిస్తే మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.  మనకూ తృప్తి కలుగుతుంది.

సత్సంగం, హరికథలు, భజనలు, దేవాలయాలు, పుణ్య తీర్థాలు మొదలైన వాటికి వెళ్లి ఆ శోకాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.  అంతే కాకుండా అటువంటి చోటికి తప్పకుండా వెళ్ళాలి.  వీటిలో కూడా సత్సంగానికి విశేషమైన మహిమ ఉంది.  ఎందుచేతనంటే సత్సంగం వల్ల అన్ని విధాలైన శోకాలు దూరమవుతాయి.

[from  kbn sharma  ]
 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP