శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడంటే ఎవరు? [ఐదవ భాగం]

>> Monday, February 10, 2014



[ ముందటి భాగాలకోసం ఈ లింక్ చూడండి]https://draft.blogger.com/blogger.g?blogID=2668918242718835328#editor/target=post;postID=2560771508213318554;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=18;src=postname



"నాయనా సాయిరాం! నీ వాదనలో రెండు ప్రశ్నలున్నాయి.
1. ప్రకృతి, దైవమూ సరిసమానం కావా?
2. నిరీశ్వర వాదం చేసిన పాపమేమిటి?

రెండు ప్రశ్నల సమాధానాలూ పరస్పర పరిపూరకాలు కూడా.  అయితే, ఒకదాని తర్వాత మరో దానికి వద్దాం! మొదట నా ప్రశ్నకు జవాబు చెప్పు.  గడ్డిని ఆహారం అంటావా?  ఆహారం కాదని అంటావా?"

"అదేం ప్రశ్న సార్.  గేదేలకది ఆహారం.  మనకది కాదు."

"ప్రకృతి గురించి నేనూ అదే అంటున్నాను.  ప్రకృతి ఒకరికి ఒకటి.  మరొకరికి మరొకటి.  జీవులకు పోషకాహారం చాలా ముఖ్యమని హేతువాదం అంగీకరిస్తుంది.  కానీ, జీవి అయిన గేదెకు పోషకాహారమైనది మరొక జీవే అయిన మనిషికి ఎందుకు కాదో వివరించలేదు.  కేవలం అది అలా ఉంది.... అంతే;  అంటుంది.

కానీ మన ప్రాచీన తత్వ వేత్తలు అలా ఆగిపోలేదు.  ఏ జీవి ధర్మాన్ని అనుసరించి ఆ జీవి ఆహార విహారాలు ఉంటాయని గ్రహించి, దీనిలో ధర్మం అనే డైమన్షన్ ఉందని గుర్తించారు.  ఆ డైమన్షన్ మీద, అనేకానేక కోణాలలో వారు గ్రహించిన అనంతమైన జ్ఞానమే వేద వాజ్మయంగా విస్తరించింది. 

కేవల పండితుడికి ప్రాకృతికంగా అన్నమూ, మలమూ రెండు పదార్థాలే, శక్తి సంపుటాలే.  అన్నం మనిషికి శక్తినిస్తే, మలం నుంచి బయో గ్యాస్ తయారవుతుంది.  సత్యానికి వస్తే, మానవులకు భరింపశక్యం కాని మలం, పందులకు విందు భోజనం.  అంటే, మానవుడు ధర్మాన్ని విస్మరిస్తే అన్నానికీ, మలానికీ తేడ ఉండదు.    పులి ధర్మాన్ని మనిషికీ, మనిషి ధర్మాన్ని పులికీ వర్తింపజేయాలేం.  ధర్మాన్ని విస్మరించి ప్రకృతిని ఆరాధించడం అజ్ఞానం.  అయితే, ఈ ధర్మం స్వతస్సిద్ధమైనదే తప్ప, మానవ కల్పితమైనది కాదు.  ప్రకృతిలో కుష్టు రోగమూ ఉంది, ఆరోగ్య జీవనమూ ఉంది.  కుష్టు రోగిలో కూడా దేవుడున్నాడని పండితులు అంటారు తప్ప, కుష్టు రోగం కూడా దైవమేనని ఆరాధించరు.  ప్రకృతిలో ఆరోగ్యం ఉంది.  రోగమూ ఉంది.  డివినిటీ (దివ్యత్వం) ఉంది.  క్రిమినాలిటి (నేరతత్వమూ) ఉంది.  సత్సంతానాన్ని ధర్మబద్ధంగా కనడం దివ్యత్వం.  బలవంతం చేయడం నేరం.  స్వచ్చతను దైవం అంటాం.  కల్తీని దైవం అని నెత్తిన పెట్టుకొం.  ప్రకృతిలో సత్యం, అసత్యం రెండూ ఉన్నాయి.  మనం సత్యాన్ని ఆరాధిస్తాం.  ప్రకృతిలో చావు, బతుకు రెండూ ఉన్నాయి.  మనం చావుని కావలించుకోం.  ప్రకృతిలో చీకటి, వెలుతురూ రెండూ ఉన్నాయి.  మనం వెలుతురును ఇష్టపడతాం.  ప్రకృతినీ, దైవాన్ని వేర్వేరు చేసి చూపేదే 'ధర్మం'.  ఈ ధర్మాన్నే దైవంగా గుర్తిస్తాం.  ప్రక్రుతి, దైవం సరిసమానం కావని చెప్పడానికి ఈ మాత్రం సరిపోదా?"

"వినియోగ దృష్టిని బట్టే దేవుడు, భగవంతుడు అనే కొణాలు అని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా"

"నీ మాటే నిజమైతే, దేవుడు మానవ సృష్టి కిందకి వస్తాడు.  నువ్వన్నట్లుగా మానవుడు సృష్టించిన దేవుళ్ళు కూడా ఉన్నారు.  కానీ, మానవ వికాసాన్ని జాగ్రత్తగా గమనించు.  అప్పుడే జ్ఞానోదయానికి అవకాశముంటుంది.  మొదటగా, వినియోగ దృష్టి కేవలం మానవుడి ప్రాకృతిక లక్షణం.  అందుకే, భయపడుతున్న దశలో శిశువు భగవంతుడిని 'అభయ ప్రదాత' గా ఆరాధిస్తాడు.  అంటే నువ్వన్నట్లుగా అవసరార్థమే భక్తుడవుతాడు.  దానిలో తప్పు లేదు కూడా.  కానీ, ధైర్యమే భగవంతుడని తెలుసుకుంటున్న కొద్దీ ఎదుగుతాడు.  ఆనందపడతాడు.  ధార్మికుడు కావడానికి అవసరమైన పరాక్రమాన్ని పొందుతాడు.

దాని తర్వాత, ధనాశ మానవుడి మరో ప్రాకృతిక లక్షణం.  దానిలో భాగంగానే లాభంలో ఫది శాతం హుండీ లో వేస్తాననే లాంటి మొక్కులు మొక్కుకుంటాడు.  ఆ డబ్బు కొందరికి ఉపాధినివ్వడం మంచిదే.  కానీ, సత్యాన్ని, ధర్మాన్ని, లోక కళ్యాణాన్నీ వంచించని రీతిలో మాత్రమె ఆ పది శాతమూ ఖర్చు కావాలి.  లేకపోతె మానవాళికి అరిష్టమే.  అటునుంచి చూస్తె, ఈ చెల్లింపు స్వచ్చందంగా మాత్రమె ఉండాలి.  బలవంతంగానో, ఎమోషనల్ బ్లాకు మెయిలింగ్ తోనో దానిని నిర్మిస్తే పచ్చి మోసమే.  అలాంటి రాబడి ధర్మాదాయం కాలేదు.  కాగా పరిణతి చెందుతున్నకొద్దీ, తన 'అదృష్ట దాత' అయిన దైవమె తనకు కూడా సృష్టికర్త అని గుర్తించి, తనని తానె సమర్పించుకోవడం ద్వారా సాధకుడు జ్ఞాని అవుతాడు.  జ్ఞానం మీద ప్రేమ కూడా మానవుడి లక్షణమే.  అందుకే దైవాన్ని 'జ్ఞాన ప్రదాత' గా అతడు ఆరాధించనారంభిస్తాడు"

"అది కూడా వినియోగ దృష్టే కదా"

"అంతా కాదు.  మన మహర్షులు నడచిన దారిని తెలుసుకోవడానికి నువ్వు మొదట ఈ చిన్న తరగతులను దాటాలి.  ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములునైన మునులు నిష్కారణమ హరి భజన చేయు చుందురు.  నారాయణుడట్టి వాడు నవ్య చరిత్రా అని తేట తెల్లం చేస్తాడు పోతన. దీనిలో నిష్కారణమ అనే అంశం ఎంతో కీలకమైనది.  ప్రకృతిలోని ప్రజ్ఞకు గల అనంతమైన, అఖండమైన, అపురూపమైన, అసమానమైన మహిమను గమనిస్తూ, దాని లీలావిభూతిని నిష్కారణంగా ఆస్వాదిస్తూ, తనను తానూ మరచే వాడే దైవ సాధకుడని పోతన ఆ పద్యం ద్వారా విశదం చేస్తున్నాడు.  ఆ రుచి తెలిసిన వారు మరి ఇక ఏ రుచినీ ఇష్టపడరని కూడా చెబుతున్నాడు.  మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు, నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము, అరగునే సాంద్ర నీహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద, చింతనామృత పాన విశేష మత్త, చిత్తమేరీతి ఇతరమ్ము చేర నేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేల - అంటాడు ప్రహ్లాదుడి పాత్రద్వారా. 

జ్ఞాన మార్గంలోకి ఎదిగినప్పటి నుంచి నువ్వు తప్పు పడుతున్న వినియోగ దృష్టి ఉండదు.  మనిషి సృష్టించిన దైవం నుంచి, మనిషిని సృష్టించిన దైవానికి ఎదగడమే జ్ఞానోదయం.  ఆ స్థితిలో దివ్య సౌందర్యాన్ని చూసి పరవశమవుతూ అసామాన్యుడు సైతం వివశుడయ్యే మహా సౌందర్యారాధన మాత్రమె అక్కడ ఉంటుంది.  రాజీ లేని రీతిలో ధర్మాన్ని ఆచరించడం ఒక్కటే జీవితానికి చేతనయ్యే స్థితి నెలకొంటుంది."

"మీరు మొదట్లో దేవుడంటే శబ్దమనీ, విగ్రహమంటే దానికి లిపి లాంటిదనీ అన్నారు.  కొంతసేపటి క్రితం దేవుడంటే ప్రజ్ఞ అన్నారు.  తర్వాత దివ్యత్వం అన్నారు.  మరోసారి ధర్మం అన్నారు.  మధ్యలో ఒకసారి ధైర్యమనీ, ఇంకోసారి జ్ఞానమనీ అన్నారు.  ఇందాక సత్యం అన్నారు.  క్షణం క్రితమేమో దేవుణ్ణి నిష్కారణంగా కొలవాలని అన్నారు. ఇప్పుడేమో సౌందర్యం అంటున్నారు.  దేవుడు ఇన్ని రకాలుగా ఉంటాడా? చిన్న తరగతులలో ఒకటిగా, పెద్ద తరగతులలో మరొకటిగా మారిపోతుండడమే ఆ దేముడి ప్రత్యేకతా? దేవుడంటే అసలు ఏమిటని అంటారు?" సాయిరాం ప్రశ్నించాడు.

"సరైన ప్రశ్న దగ్గరకే వచ్చావు" సుబ్రహ్మణ్యం గారు సాయిరాంను అభినందించారు.
(ఇంకా ఉంది     ............. )

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP