శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

డాంభికం తో తలనొప్పులు

>> Saturday, February 15, 2014

  డాంభికం తో తలనొప్పులు

తనలో లేని లక్షణాలని చెప్పుకోవడం దంభం.  అదే డాంబికం.  భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ఇరవై విలువలలో రెండోది అదంభిత్వం.  అంటే డాంబికం లేకపోవడం.

మొదట మనం చూసిన ‘మానిత్వం’ లో కూడా గొప్పలు చెప్పుకుంటారు.  కానీ, ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉంది.  మానిత్వమున్న వ్యక్తిలో ఏవో కొన్ని సామర్థ్యాలు ఉంటాయి.  వాటిని గోరంతలు కొండంతలు చేసి, చెప్పుకోడానికి తాపత్రయ పడుతూ ఉంటారు.  కానీ, దంభం అనే అవగుణం ఉన్న వాడికి నిజంగా చెప్పుకోవడానికి ఏ సామర్థ్యమూ  ఉండదు.  విచిత్రమేమిటంటే ఏ గొప్పదనమూ తన వద్ద లేదని తెలిసినా కూడా తన గురించి తాను ఎక్కువగా చెప్పుకుని, అందరి దృష్టిని ఆకర్షించాలని తెగ తపన చెందుతుంతాడు.  చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, ఆగర్భ శ్రీమంతుడిలా చెప్పుకుంటూ ఉంటారు.  అలాగే, నాకు పలు భాషలు తెలుసుననీ, పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాసేశానని గొప్పలు చెబుతారు ఇంకొందరు.  నిజానికి, వేరే వారు వ్రాసిన పుస్తకాలకు డబ్బులిచ్చి, తమ పేరు పెట్టించు  కుంటారు. లేదా, గ్రంథ చౌర్యం చేసి, తమ పేరుతొ ముద్రించు కుంటారు.  ఎవ్వరూ ఇవ్వకపోయినా, కొన్ని బిరుదులను వారే తగిలించుకుని మురిసిపోతుంటారు.  అందరూ తనను ఆ బిరుదులతోనే గుర్తించాలని తెగ ఉక్కిరి బిక్కిరై పోతుంటారు.

ఇంతకూ, ఈ దంభం ఉన్న వారి గురించి లోతుగా పరిశీలిస్తే, వారిలో ఏ గొప్పా లేదన్న విషయం వారికి బాగా తెలుసు.  వారిలో వారికే నచ్చని, ఎవరూ మెచ్చని గుణాలున్నాయని కూడా వారికి ఇంకా బాగా తెలుసు.  అయినా, వాటిని కప్పి పుచ్చుకుని బయటకు ప్రగల్భాలు పలుకుతూ, చలామణి అయిపోదామని చూస్తుంటారు.  సందు దొరికినప్పుడల్లా వారి గురించి వారు డప్పు కొట్టుకుంటారు.

నన్ను అందరూ గుర్తించాలి.  లేదా కొందరైనా నన్ను పోగుడుతుండాలి.  అలా ఎంతకాలం కోరుకుంటారు.  అయినా, ఎదుటి వాళ్ళు కూడా ఎంత కాలం ఈ భజన చేస్తారు? వాళ్లకు మాత్రం విసుగు పుట్టదా?  ఈ విషయంపై ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే, క్రమేపీ దంభిత్వం తరిగి పోతుంది.

ఈ దంభిత్వంలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది.  ఎదుటి వారు తనని గొప్పగా గుర్తించాలని కోతలు కోస్తూ పోతారు.  ఉన్నవీ లేనివీ అన్నీ తన గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు.  ముందేం చెప్పారో మరచిపోయి రెండో సారి దానికి భిన్నమైన అంశాలను చెప్పి, ఎదుటి వారికి అడ్డంగా దొరికిపోయే ప్రమాదముంది.  ఈ కోతలు కోయడానికి కూడా జ్ఞాపక శక్తి పుష్కలంగా ఉండాలి.  లేకుంటే, యిట్టే పట్టుబడి పోయే ప్రమాదముంది.  ప్రగల్భాలు పలికేవాడు సమయం, సందర్భం చూసుకోవాలి.  అదే, అందరూ తనను గుర్తించాలనీ, పొగడాలనే ఆలోచనను అధిగమిస్తే చాలు అతడు ఇన్ని జాగ్రత్తలపై దృష్టి సారించనవసరం లేదు.  నిజం చెప్పే వాడిని నిద్రలో లేపి అడిగినా, ఒక్క మాటే చెబుతాడు.

కొందరిలో మానిత్వం, దంభత్వాలు ఉండక పోవచ్చు.  కానీ, వారిలో ఆత్మన్యూనతా భావం ఉండే అవకాశముంది.  పదిమందితో కలవలేకపోవడం, ఎదుటి వారితో నిస్సంకోచంగా మాట్లాడలేక పోవడం, పక్క వారితో బిడియంతో వ్యవహరించడం ఇవన్నీ కూడా వ్యక్తిలో ఆత్మన్యూనతా భావాన్ని ఎత్తి చూపుతాయి.  మానిత్వం, దంభిత్వంతో భేషజాలు పొడచూపుతాయి.  ఆత్మన్యూనతతో బిడియం తలెత్తుతుంది.  ఈ రెండు ఆథ్యాత్మిక సాధకుడికే కాదు, లౌకిక ప్రపంచంలో వ్యక్తిత్వ నైపుణ్యానికి కూడా అవరోధాలే.  వీటిని సరిగ్గా అర్థం చేసుకుని ఎదుగుదలకు పెద్ద పీట  వేయాలి!


గర్వాన్ని అధిగమించడం ఎలా?

​​
విజయానికి మూలం విశ్లేషించుకోండి?
గర్వాన్ని దూరంగా ఉంచడానికి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి.  అదేమిటంటే, మీ విజయానికి మూలం ఏమిటి? ఉదాహరణకు సామర్థ్యం అని అవతలి వారు కీర్తించారనుకుందాం.  అప్పుడు ఆ సామర్థ్యానికి మూలమేమిటని కూడా ప్రశ్నించుకోవాలి.  అవతలి వారు మనని రకరకాల పొగడ్తలతో ముంచెత్తి ఉండవచ్చు.  కానీ, అవన్నీ నిజమనే నమ్మకమేమిటి?  ఒకవేళ నిందించారనుకుందాం.  దానిని అంగీకరిస్తామా?  నిందలకు మూలం లేనిపోని కల్పనలైనప్పుడు, పొగడ్తలకు మాత్రం ఎందుకు కాకూడదు?  ఈ భ్రమ నుండి బయటపడాలంటే మనలో మనమే ప్రశ్న వేసుకోవాలి. ​

​ మనకు లభించిన అవకాశాలను మనం వినియోగించుకోగలమే కానీ, వాటిని సృష్టించుకోలేము.  ఎంతో ప్రతిభ ఉన్నా, మీ విజయానికి అదొక్కటే కారణం కాలేదు.  ఒక విజయం వెనుక ఎన్నో కారణాలున్నాయి.  అవేవీ మీరు సృష్టించ గలిగినవి కావు.  మీకు సమకూరిన కొన్ని అవకాశాల వల్ల విజయం సాధ్యమయింది.  ఈ రహస్యాన్ని గుర్తించినపుడు మీకున్న సామర్థ్యాన్ని గ్రహించి, ఆనందపడడంతో పాటు మీకు సహకరించిన అనేక ఇతర కారణాలకు మీరు కృతజ్ఞతతో ఒదిగిపోతారు.  ఎవరో మెచ్చుకోవాలన్న తపన కూడా క్రమేపీ మటుమాయమవుతుంది.

గర్వం వెర్రితనమే!
నాలో ఫలానా గొప్పదనం ఉందనీ, దానిని ఇతరులు మెచ్చుకోవాలని ఆరాటపడడం, అలా జరగనప్పుడు సంఘర్షణకు లోను కావడం ఇవన్నీ గర్వానికి మూలమని చెప్పుకున్నాం.  ఏదైనా గొప్పదనం ఉన్నా, దానికి గర్వించాల్సిన పనేమీ లేదు.  ఎందుకంటే, ఆ గొప్పదనానికి కారణం మీరు ఒక్కరే కాదు.  అసలైన కారణాలలోకి వెళ్ళే సరికి మనలో తలెత్తే కృతజ్ఞతా భావం సంఘర్షణలను పారదోలుతుంది.  ఈ భావన మనలోని గర్వాన్ని అధిగమించడానికి మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగుంది.  అదేమిటంటే, ఎదుటి వారి నుంచి గౌరవాన్ని పొందాలనుకోవడానికి కారణం అది మీకు తృప్తినివ్వడమే.  మీ సామర్థ్యం మీద మీకు పూర్తి నమ్మకం లేనప్పుడే, మీరు ఎదుటి వారి నుంచి పొగడ్తలను ఆశించి, దానివల్ల లభించే తృప్తిని కోరుకుంటారు.  మీ గురించి మీకు తృప్తి ఉన్నప్పుడు, ఇతరులు చేసే సన్మానాల అవసరమే ఉండదు.  ఆత్మ విశ్వాస లోపాన్ని గర్వంతో పెంచి పోషించుకుంటున్నామని పదే పదే గుర్తుచేసుకోవాలి.
సమర్థతకి స్వతః ప్రకాశం:
సామర్థ్యం కలిగి ఉండడం, దానిని వినియోగించుకోగలగడం మంచిదే.  కానీ, అది స్వతస్సిద్ధంగా ప్రకాశించాలి.  సువాసనలను వెదజల్లే అందమైన పువ్వులను విరగబూయించే చెట్టు, తానెక్కడున్నా, ఎవరు చూసినా, చూడకపోయినా,  తన పనిని తాను ఏ గుర్తింపు పొందాలనీ ఆశించకుండా నిర్వర్తిస్తుంది.  నేను విరగబూస్తున్నానొహో అని చాటింపు వేయించదు.  మీలోని ప్రజ్ఞాపాటవాలను, సామర్థ్యాలను మీరూ అలాగే వినియోగించాలి.  అవి మీకే ఎందుకు వచ్చాయి? దీనిపై ఎవ్వరూ సూటిగా సమాధానం చెప్పలేరు.  అందుకే దానిని భగవంతుని అనుగ్రహంగా భావించి, వినియోగించాలి. మీ విలువను గుర్తించిన వాళ్ళు మిమ్మల్ని గౌరవించవచ్చు, లేనివారు పట్టించుకోకపోవచ్చు.  దేనికీ చలించ కూడదు.
ఈ అవగాహనతోనే వ్యక్తి గర్వాన్ని సునాయాసంగా అధిగమించగలడు.  నిగర్వి లో సంఘర్షణలకు తావులేదు.  వెలితి అసలే కానరాదు.  నిర్మలంగా ప్రశాంత చిత్తుడై ఉంటాడు.  ఈ పరిణతి ఆత్మ జ్ఞానానికి ఊతమిస్తుంది. 
ఈ నిర్మలత లేని వ్యక్తిలో దంభం చెలరేగుతుంది.  అది వ్యక్తిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.

[ కె.బి. నారాయణ శర్మ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP