శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చింతకు విరుగుడు చింతనే!

>> Wednesday, August 21, 2013


  పుట్టడం, బతకడం, సంసారం, మరణం, బాల్యం, వృద్ధాప్యం, కర్మలు, కష్టాలు, సంతోషం... ఇవన్నీ జీవుడనుభవించే చింతలే. వీటన్నిటికీ మూలం మనసే! మానవుడు మనోమయుడు. కనుక మనసు ద్వారా తన చింతనలను నిరంతరం జీవనయానంలో ఎత్తు పల్లాలుగా అనుభవిస్తుంటాడు. ఆధ్యాత్మ స్పృహ ఉన్నవాడు చింతను చింతనగా మార్చుకుని చివరికి ధన్యుడవుతాడు. సంఘటనలు, సన్నివేశాలు, దృశ్యాలు భిన్నంగా ఉన్నా మానవుడు అనుభవాలు, స్పందనలు, కొన్నిసార్లు ఒకే విధంగానూ, మరికొన్ని సార్లు భిన్నభిన్నంగానూ ఉంటాయి. అనుకోకుండా దుస్సంఘటన జరిగినప్పుడు కలిగే భయం తీవ్రంగా, గాఢంగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ భయం పలచనవుతుంది.
విమాన ప్రమాదమో, రైలు ప్రమాదమో జరిగినదన్న దుర్వార్త వినగానే ఆయ్యో అంటాం. అందులో మనకు తెలిసినవారున్నారని తెలిస్తే అయ్యయ్యో అంటాం. మనవారే ఉంటే, మనకే ఎందుకింత అన్యాయం జరిగిందని విచారిస్తాం. రోదిస్తాం. ఇదంతా మనోక్రీడ. పుట్టిన దగ్గర నుంచీ గిట్టేవరకూ కలిగే చింతలన్నీ మరపు మడతల్లో మిగిలిపోతాయి. ఎప్పటికప్పుడు అన్నీ వింతగా తోస్తుంటాయి.
ప్రపంచమంతా దుఃఖారామమై, దాటనలవికాని దుస్తర సముద్రంగా, తొలగని చీకటిగా మనసు అనుభవంలోక తెచ్చుకుంటుంది. కాస్త తెరిపి పడగానే వెలుగు రేఖలు కనిపించి, తిరిగి ఆశామయంగా మనసు స్థిమితపడుతుంది. జీవితాన్ని కొంత అనుభవించినవాడు, జీవనానుభవం ఆధారంగా వాస్తవికతను అంగీకరించనివాడు, ఇన్ని విధాలుగా జీవితాన్ని దర్శిస్తాడు. పసి బాలిక ఇంత గంభీరంగా ఆలోచించడమంటే, ఆమె కేవలం బాలిక కాదనే అర్థం. ఎవరికీ అందని, అంత సులభంగా మనసు గ్రహించలేని, అతీత స్థితి ఆమెది అయి ఉండాలి. ఆ స్థితి మాటల్లోనో, చేతల్లోనో, చూపులోనో బయటపడకుండా ఉండలేదు. గ్రహించగలిగినవారు ఉండాలి అంతే!
మాతృశ్రీ బాల్యంలో ఈ స్థితులు అనంతంగా ఆవరించి ఉన్నాయి. పసి తల్లిగా ఆమె ఈ ప్రపంచాన్నీ, అందులో మసలే వ్యక్తుల్నీ, ఏర్పడే సందర్భాల్నీ, ఆయా సన్నివేశాలతో ప్రతిస్పందించే, ప్రతిఫలించే మానవ స్వభావాలను గమనిస్తే, అమ్మ మూలాలు, స్థితులు కొంత అర్థమవుతాయి.
ఒక ముసలి అవ్వ దగ్గర జీడిపప్పు కొనుక్కుని, అందులో సగం తిరిగి అవ్వకే ఇచ్చినప్పుడు, పక్కన ఉన్నవారు, "అవ్వకివ్వడం దేనికి'' అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు అమ్మ ఇచ్చిన సమాధానం ఒక తల్లి మాత్రమే ఇవ్వగలిగింది. ఇంతకీ అమ్మ సమాధానం ఏమిటి? "అవ్వ అమ్ముకోగలదే కానీ, తినలేదు కదా? అవ్వకెవరు పెడతారు? అందుకే ఇచ్చాను.'' ఎంత దయాస్ఫురణ! అంతటితో ఆగకుండా, "ఎందుకని మీకనిపించింది. ఇందుకు అని నాకనిపించింది. మనసుకున్ని కోణాలో!'' అన్నారామె తాత్వికంగా.
పంచితే తరిగిపోతుందనుకోవడం చింత. పంచితే పెరుగుతుందనుకోవడం కూడా చింతే! నిజానికి మనసుకు తెలిసింది చింతే!! ఒక బిచ్చగాడు, అతని మనవడు, అమ్మకు తారసపడినప్పుడు, తర్వాతి కాలంలో మనవడిని పోగొట్టుకున్న బిచ్చగాడిని చూసి ఎవరో, "నీ బాధ తీర్చపోయినాడు. బాధపడకు'' అన్నప్పుడు అమ్మ పలికిన, స్పందించిన తీరు పరమాద్భుతం. అదొక చింతనా భూమిక! "మనవడి మరణం, తాతకు బాధ! వాడి మరణానికి ముందంతా ఉన్నది వాడి బాధే! ఈ పరిస్థితిని గమనించిన లోకానిదీ బాధే. ఏదీ మన చేతిలో లేదన్న ఆలోచన కలుగగానే బాధ తీరుతోందే.''
ఊరుకోకపోవడం మనసు లక్షణం. పట్టించుకోవటం దాని సహజ గుణం. బాధను, చింతను అది వాస్తవిక దృష్టితో ఆలోచించగలగటం చింతన. ప్రతిస్పందనలన్నీ అధ్యాత్మ సమీరాలు కావు. కానక్కరలేదు. అదే సందర్భాన్ని, సన్నివేశాన్ని కేవలం మానవీయ స్పందనగానే కాక, వాస్తవిక దృష్టితో దర్శించిన తీరు తాత్వికమే. మనవడిని పోగొట్టుకొని దుఃఖిస్తున్న తాతతో, "ఎందుకేడుస్తున్నావు? నీకు ఆసరా పోయిందనేగా. పెంచుకున్నది నీ తృప్తి కోసం. నీ హాయి కోసం పెంచావు. అకస్మాత్తుగా కష్టం కలిగిందని ఏడుస్తున్నావే. నీ మనవడికి పెట్టుకోవటంలో ఆనందం, తృప్తి ఉన్నాయి కనుక నీ కోసమే చేశావు. శవ దహనం జరగదేమోనని కదా నీ దుఃఖం'' అన్నది.
మానవుడు ఏం చేసినా తన ఆనందం కోసం మాత్రమే చేస్తాడు. ఎవరినో ప్రేమించడమూ తన సంతోషం కోసమే. చింత జీవలక్షణం. చింతన సంస్కారగత దివ్య సాధనం. ఆత్మోన్నతికి రాచబాట, సూటిబాట. ఒక పసిబాల తన మాతృత్వాన్ని ఆవిష్కరించిన సందర్భాల కదంబమే అమ్మ బాల్యం. అది ఎల్లలెరుగని చింతనా స్థితి!
 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP