శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆహిరి-రాగంపైన ఒక చిన్నకథ!

>> Saturday, July 27, 2013ఇది ఒక పెంకె సంగీతసాధకుడి కథ అని చెప్తారు.
శాస్త్రప్రకారం ఆహిరిరాగాన్ని ఉదయం పాడకూడదని పెద్దలమాట. (పాడితే పగటిపూట భోజనం దొరకదని నమ్మకం.) ఒక యువగాయకకిశోరం 'ఎందుకు కాదు?' - అని గురువుదగ్గర గొడవచేసి, ప్రొద్దున్నే నేర్పమని అడిగాడట. గురువు మాత్రం సాయంత్రపు కాలాల్లోనే నేర్పి, 'బాబూ! నీతో నేను ప్రొద్దున్న ఆలాపన చేయను, నీకు కావలసివస్తే విడిగా ప్రయత్నించుకో!' అన్నాడట!
ఇతగాడు ఏమైనా మాటను తప్పుగా ఋజువుచేయడంకోసం ఒకరోజున ప్రొద్దున్నే చద్ది-అన్నపు మూటని కట్టుకుని, ప్రక్క ఊరి పొలిమేరలకు వెళ్ళాడట. అక్కడ మూటను ఒక వెదురుచెట్టుకి కట్టి, తన సాధన మొదలుపెట్టాడట. అయితే, వెదురుచెట్లకి ఒక లక్షణం ఉంది - ప్రొద్దెక్కుతున్నకొద్దీ అవి పైపైకి లేచిపోతాయి! ఇతడు తన సాధనను పూర్తిచేసుకునేసరికి, మూట అందనంత ఎత్తుకి వెళ్ళిపోయిందట!

తన ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా భోజనం కావాలని అడుగుదామంటే - తిండిమాట అటుంచి, చీవాట్లు తినవలసివస్తుందనే భయంతో మనవాడు ప్రక్క ఊరికి వెళ్ళి, అసలు సంగతి చెప్పకుండా ఒకరింట్లో భోజనం కావాలని అడిగాడట. వాళ్ళు ' దానికేం బాబూ, నీ అదృష్టం బాగుంది, ఈ ఇంటాయనకి లేకలేక కొడుకు పుట్టాడు, ఈవేళ బారసాల, కాబట్టి విందుభోజనం దొరుకుతుంది నీకు’ అని చెప్పారట. మనవాడు పంక్తిలో కూర్చుని, తాను శాస్త్రాన్ని అబద్ధంగా ఋజువుచేయగలుగుతున్నందుకు సంతోషంతో అప్రయత్నంగా 'నా ముద్దుల ఆహిరీ!’ అన్నాడట! వీడి ఖర్మకాలి, ఆ ఇంటాయన భార్య పేరు కూడా ఆహిరే!

ఇది విన్న చాలామందికి కోపం వచ్చి, మనవాడిని చిత్తుగా తన్ని, సామాను గదిలో పడేశారట!

అలా సాయంత్రంవరకు అక్కడే పడి ఉన్నాడు మనవాడు. సాయంత్రం వీడి సంగతి జ్ఞాపకం వచ్చి, ఆ గదిని తెరిచి మళ్ళీ తన్నారట! వీడు అప్పుడు వాళ్ళని బ్రతిమాలి, సంగతంతా చెప్పాక, వాళు నొచ్చుకుని, అప్పుడు భోజనం పెట్టారట. అయితే, అప్పటికే పగలు ముగిసిపోయింది!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP