శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బిల్వపత్రం ఒక ఆధ్యాత్మిక సాధనం

>> Thursday, July 25, 2013

బిల్వపత్రం ఒక ఆధ్యాత్మిక సాధనం

July 25, 2013

బిల్వపత్రం మహత్తు గురించి, అది శివునికెంత ప్రీతికరం అన్న విషయం గురించి, బిల్వాష్టకం విశదీకరిస్తుంది. మరి, బిల్వానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ పత్రాన్ని ఎందుకంత పరమ పవిత్రంగా భావిస్తారు? నిజానికి, వేల లక్షలాది సంవత్సరాలుగా బిల్వవృక్షాన్ని పరమపవిత్రంగా భావించడమే కాదు, ఆ పత్రం లేకుండా శివపూజకు సంపూర్ణ త సిద్దించదన్న భావన జనావళిలో బలంగా ఉంది

మూడేసి దళాలు కలసి ఒకేదళంగా ఉండే బిల్వపత్రం ఎన్నో ' త్రయాల'ను గుర్తుకు తెస్తుంది. సృష్టి స్థితి లయాలు, సత్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలు 'అ-ఉ-మ' అనే మూడక్షరాల సంపుటితో శివతత్వ సారాన్ని ప్రతిధ్వనించే 'ఓం' కారం. అలాగే శివుని మూడు కళ్లు ( త్రినేత్రాలు),ఆ పరమేశ్వరుని దివ్యాయుధమైన ' త్రిశూలం' వీటన్నిటినీ బిల్వపత్రం గుర్తుకు తెస్తుంది. పురాణ, ఇతిహాసాలు చెప్పే ఈ విశేషాలను అలా ఉంచితే, మన జీవితానికి సంబంధించినంత వరకు బిల్వానికి ఎందుకంత ప్రాధాన్యత ఉందో సద్గురు వివరిస్తారు. ఒక పత్రం కన్నా మరో పత్రాన్ని ఎందుకంత పవిత్రమైదిగా భావిస్తారు? ఇది కూడా ఒక రకం పక్షపాత వైఖరేనా? ప్రతిదీ ఈ నేల నుంచి మొలిచిందేగా? మరెందుకు ఆ వ్యత్యాస భావన? ఆ మాటకొస్తే వేపపండు, మామిడి పండు కూడా ఈ భూమినుంచి వస్తున్నవే అయినా వాటి రుచి వేరు వేరుగా ఉంటోంది కదా! వాన పాముకీ మరో కీటకానికీ, మనకూ మరో మనిషికీ మధ్య అంతరం ఉండటానికి ఇవే కారణాలు కదా! అన్నింటికీ మూలం ఒకటే అయినా, వాటి నుంచి వచ్చిన వాటిలో వ్యత్యాసాలు ఉంటాయి. అది సహజం. ఆధ్యాత్మిక పథాన జనం సాగుతున్నప్పుడు ప్రతి విషయంలోనూ వారు ఒక సహాయం కోసం చూస్తారు. ఎందుకంటే ఇది వారికి ఏమాత్ర ం తెలియని తోవ. భారతీయ సంస్కృతిలో భాగంగా మనవాళ్లు మనకు ఆసరాగానిచ్చే ప్రతి చిన్న అంశాన్నీ ఎంతో నిశితంగా గమనించారు. లోతుగా ఆలోచించారు. చివరికి పూలు, పళ్లు, ఆకులను కూడా వారు వదల్లేదు.

ఇక బిల్వపత్రం విషయానికి వస్తే, దాన్ని అంత పవిత్రంగా భావించడానికి తమవైన కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అది మహాదేవునికి పరమ ప్రియమైనదంటూ దాదాపు అన్నిసందర్భాల్లోనూ అంటూ వచ్చారు. నిజానికి దాన్ని గొప్పదిగా భావించబడటానికి అది శివునికి ప్రీతికరం కావడం వల్లేమీ కాదు. అది శివునికి ఇష్టమైనదని మనం చెబుతున్నామంటే, 'శివం'గా, 'శివతత్వం'గా మనం పేర్కొంటున్న దివ్యత్వానికి, ఈ బిల్వపత్ర తరంగాల అనుకంపనలు చాలా దగ్గరగా ఉంటాయని చెబుతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో మనం చాలా వాటిని ప్రత్యేకమైనవిగా గుర్తించాం. అలా గుర్తించిన వస్తువులనే సమర్పణ చేస్తుంటాం. ఎందుకంటే ఆ దివ్యత్వంలో ఆ అనుబంధాన్ని సాగించేందుకు అవే మన సాధనాలు. బిల్వపత్రంతో శివునికి పూజ చేసిన తర్వాత ఆ పత్రాన్ని మనం అక్కడే వదిలేయడం లేదు. పూజ తర్వాత ఆ పత్రాన్ని మహా ప్రసాదంగా స్వీకురించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ దివ్య ప్రకంపనలను అన్నింటికన్నా హెచ్చుగా తమలో ఇముడ్చుకోగల శక్తి ఆ దళానికి ఉంది కనుక. ఆ బిల్వపత్రాన్ని శివలింగం మీద ఉంచి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించి వెంట తీసుకువెళ్లినట్లయితే, శివశక్తి ఆ«ధ్యాత్మ తరంగాలను ఆ దళం చాలా కాలం తనలో నిక్షిప్తంగా ఉంచుకోగలదు. అంటే ఆ దివ్యశక్తి తరంగాలు మీ వెన్నంటే ఉంటాయన్న మాట.

కావలిస్తే శివునికి బిల్వపత్రం సమర్పించి ఆ తర్వాత దాన్ని స్వీకరించి మీ చొక్కా జేబులో ఉంచుకుని అటూ ఇటూ పచార్లు చేసి చూడండి. అది మీలో ఎంతో మార్పు తీసుకురావడాన్ని, మేలు కలుగచేయడాన్ని మీరే గుర్తిస్తారు. మీ ఆరోగ్యం, క్షేమం, చివరికి మానసిక స్వస్థత. ఒకటేమిటి? ఇలా సర్వవిధాలా మేలు కలగడాన్ని గమనిస్తారు. చెప్పుకుంటూ పోతే ప్రజానీకం వాడుకుంటున్న ఇలాంటి వస్తువులు, పదార్థాలు ఎన్నో. ఇలా ఎన్నింటినో పరమ పవిత్రమైనవిగా ఈ భారతావనిలో ఎన్నడో గుర్తించారు. ఇవేమీ దేవతలకు సంబంధించినవి కావు. ఇవన్నీ 'దివ్యత్వం'తో సంబంధం పెట్టుకునేందుకు, సంపర్కం కలిగంచుకునేందుకు, మన శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ప్రక్రియలు, సాధనాలు మాత్రమే.
 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP