శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వేదమే లోకానికి జగద్గురువు

>> Monday, July 22, 2013

తల్లి, తండ్రి తరువాత గురువే మనకు ప్రత్యక్ష దైవం. అందుకే గురువును త్రిమూర్తి స్వరూపంగా ఎంచి పూజించాలి.
‘గు’ - సిద్ధిని ప్రసాదించే సిద్ధి వినాయక స్వరూపం ‘ర’ - పాపాన్ని హరించే హర (శివ) స్వరూపం ‘ఉ’ - అవ్యక్తం. సర్వవ్యాపి. అంటే విష్ణు స్వరూపం.
శాంత స్వభావం, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్కులజుడు, వినమ్రుడు, పవిత్ర వేషము కలవాడు, సదాచార సంపన్నుడు, పేరు ప్రఖ్యాతులపై విమోహం కలవాడు, శుచిగా ఉంటూ నిత్యం శౌచం పాటించేవాడు, సమర్థుడు, బుద్ధిమంతుడు, శిష్యుని కోసం బాబా శ్రమించేవాడు, బ్రహ్మచర్య, గృహస్థాద్యాశ్రమాలను పాటించేవాడు, నిరంతర ధ్యాన పరాయణుడు, మంత్ర తంత్రములను ఎరిగినవాడు, సరైన వేళలో సరైన వారియందు ఆగ్రహానుగహములు కలవాడే అసలైన గురువు. గురుపరంపర మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అందుకే మన పురాణేతిహాసాల్లో తల్లి, తండ్రి, గురువు.. ఈ ముగ్గురినే ప్రత్యక్ష దైవాలన్నారు.
నిఖిల ప్రపంచానికి జగద్గురువు భగవంతుడు. శ్రీకృష్ణుని మించిన జగద్గురువు మనకు లేరు. ఆయన గీతను యుద్ధ రంగంలో బోధించిన శాంతమూర్తి. మానవ జీవిత సర్వస్వమనదగిన భగవద్గీతను లోకానికి అందించినందునే శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా సంబోధిస్తారు. అర్జునునికి జ్ఞానం బోధించటానికి రణరంగ క్షేత్రాన్ని ఎంచుకోవటం కృష్ణుని స్థితప్రజ్ఞతకు నిదర్శనమైతే, అర్జునుని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును యుక్తిగా బోధించటం ఆయనలోని జగద్గురతత్త్వానికి ప్రతీక.
అసలు జగద్గురువు భగవతి ఆదిపరాశక్తి. శ్రీహరిని విష్ణుసహస్ర నామాల్లో ‘గురుఃగురుతమః’ అని వర్ణిస్తారు. అంటే విష్ణువు కూడా గురువే. ఇక, లలితా సహస్ర నామాల్లోనూ ‘గురుమూర్తిః గురుప్రియ, గురుమండల రూపిణీ’ అని లలితాదేవిని కీర్తిస్తారు. లలితా దేవిని ‘సంప్రదాయేశ్వరి’ అని కూడా స్తుతిస్తారు. సంప్రదాయం అంటే గురువులు శిష్యులకు అందించే ఒక జ్ఞాన పరంపర. అంటే ఆచార వ్యవహారాలు, విద్య ఇత్యాది జ్ఞానాన్ని గురువుల నుంచి శిష్యులు సంప్రదాయానుసారంగా నేర్చుకోవాలి. గురుకృప లేనిదే పుస్తక జ్ఞానం వ్యర్థం. జ్ఞానం గురువును ప్రత్యక్షంగా సేవించి నేర్చుకోవాల్సిందే కానీ గ్రంథాలు చదవటంవల్ల రాదు. గురుశుశ్రూష చేసిన శిష్యులు తరువాత కాలంలో తాము గురువులై మరికొందరు శిష్యులను బోధించగలరు. ఇదే గురుశిష్య పరంపర.
గురువు, శిష్యుడు వేరు కారు. ఇద్దరూ పరమాత్మ స్వరూపులే. తనకంటే శిష్యుడు వేరని కానీ, తనకంటే శిష్యుడు తక్కువని భావించేవాడు గురువు కాదు. తన ఆత్మనే శిష్యునిగా భావించేవారే ఉత్తమ గురువులు. పూర్వం ఇటువంటి ఉత్తమ గురువులు ఉండేవారు. తనకంటే శిష్యుడు విద్యాధికుడు కావాలని, అతని జ్ఞానం ముందు తను వెలవెలబోవాలని గురువులు కుతూహలపడేవారు. అంటే శిష్యులు తన శుశ్రూషలో తనను మించిపోవాలని భావించేవారన్నమాట. తనకు నచ్చిన విద్యను, నేర్చుకున్న జ్ఞానాన్ని కించిత్తు కూడా దాచుకోకుండా శిష్యులకు బోధించేవారు. గురువులు ఉత్తమశిష్యులు కోసం, శిష్యులు ఉత్తమ గురువుల కోసం వెతికేవారు.
అసలు భారతదేశమే ఒక జగద్గురువు. అపారమైన గురుపరంపరకు నిలయమైన ఈ పుణ్యగడ్డ ప్రపంచానికే గురువు వంటిది. ఇక్కడ పుట్టిన వేదం కూడా జగద్గురువే. మంత్రం పుట్టినదే గురు ముఖతా. మంత్రాలకు మూలకారణం ప్రప్రథమ గురు సార్వభౌములు. మోక్షానికి మూలం జ్ఞానం. జ్ఞానానికి మూలం మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడికి మూలం పంచాక్షరీ మంత్రం. ఆ మంత్రానికి మూలం గురువచనం. ఇక్కడ గురువు అంటే వేదం లేక వేద శాస్త్ధ్య్రాయనం చేసిన గురువు. అటువంటి గురువునే వెతికి పట్టుకోవాలి. గురువుకన్నా మిన్నగా ఏదీ లేదు. అటువంటి గురు దర్శనం, గురు పాదాభివందనం పాపనాశనం. అజ్ఞాన నివారకం. జ్ఞానప్రదం.


  • - కుమార్ అన్నవరపు
  • 22/07/2013

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP