శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

9. ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?

>> Sunday, June 23, 2013

9.  ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము.  భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము.  మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము.  ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.

ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది.  అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే.  పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది. 

ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది?ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు.  అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము.  భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదత ను తెలుపుతుంది.  ఆంగ్ల భాషలో కూడా సరైన, సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్ / రాంగ్ సైడ్ అనే పదాలు వాడతారు.  అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము  వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. 
మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం.   ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము. 

భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి.  నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువు గాక!  ఈ భావముతో మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము.  తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.

సంప్రదాయ పద్దతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము.  ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము.  మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే 
ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక!

(తరువాత శీర్షిక - మొక్కలని, చెట్లని పవిత్రముగా భావిస్తాము ఎందుకు?)

1 వ్యాఖ్యలు:

ranivani June 24, 2013 at 10:43 AM  

బావుందండీ చక్కగా విడమర్చి చెప్పారు .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP