శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

10. మొక్కలని, చెట్లని పవిత్రముగా భావిస్తాము ఎందుకు?

>> Monday, June 24, 2013

10. మొక్కలని, చెట్లని పవిత్రముగా భావిస్తాము ఎందుకు?
ప్రాచీన కాలము నుంచీ భారతీయులు మొక్కలనీ వృక్షాలనీ పవిత్ర భావన తో పూజిస్తున్నారు.  ఆయా ప్రదేశము లందలి వృక్ష, జంతు స్థావరాలన్నింటినీ పవిత్ర భావనతో గౌరవిస్తున్నారు.  ఇది ఒక మూఢ ఆచారము లేక అనాగరిక చర్య కాదు.  ఇది భారత సంస్కృతి యొక్క జ్ఞానాన్ని, దూరదృష్టిని మరియు మంచి సంస్కారాన్ని తెలియ పరుస్తున్నది.  పురాతన భారతీయులు ప్రకృతి మాతను పూజించారు.  ఆధునిక మానవుడు ప్రకృతిని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

మనము మొక్కలనీ, వృక్షాలనీ ఎందుకు పవిత్రంగా భావిస్తాము?మనలో జీవ శక్తి గా ఉన్న భగవంతుడే మొక్కలు, జంతువులు మొదలైన అన్ని ప్రాణులలోను వ్యాపించి ఉన్నాడు.  అందువలననే మొక్కలైనప్పటికీ, జంతువులైనప్పటికీ వాటి నన్నింటినీ పవిత్రమైనవి గా పరిగణిస్తాము.  ఈ భూమి మీద మానవుడి జీవితము మొక్కలపై మరియు వృక్షాలపై ఆధారపడి ఉంది.  అవి మన మనుగడకు అవసరమైన ఆహారము, ప్రాణ వాయువు, వస్త్రాలు, వసతి, ఔషధాలు మొదలైన ప్రాణాధార వనరులను అందిస్తున్నాయి.   మన పరిసరాలకు సుందరత్వాన్ని కలిగిస్తున్నాయి.   ఏమీ ఆశించకుండా మానవుడికి సేవచేస్తూ మనము జీవించడానికి వాటి జీవితాల్ని అర్పిస్తున్నాయి.  త్యాగానికి ఉదాహరణగా నిలబడి ఉన్నాయి.  ఫలభరితమైన చెట్టు పైకి రాయి విసిరితే ఆ చెట్టు బదులుగా ఫలాన్ని ఇస్తున్నది.

నిజానికి భూమి మీద మానవుడికన్నా ముందే వృక్ష జంతు సమూహాలు నివసించేయి.  ప్రస్తుతము వాటి పట్ల మానవుని కఠిన వైఖరి వలన వన్య ప్రాంతాలు నాశనము చేయడము వలన ఎన్నో రకాల వృక్షజాతిని నశింప చేయడము వలన ప్రపంచము తీవ్రమైన భయాన్దోళనలకు గురి అగుచున్నది.  మనము వేటికి  విలువ ఇస్తామో వాటినే రక్షించుకొంటాము.  అందుకే భారత దేశములో మొక్కలను వృక్షాలను పవిత్రమైనవిగా గౌరవించడము చిన్నప్పట్నుంచే నేర్పబడుతుంది.  అప్పుడే స్వతహాగా వాటిని మనము రక్షించుకొంటాము.

ఏ కారణముచేతనైనా ఒక చెట్టును నరుక వలసివస్తే పది చెట్లను నాటాలని భారతీయ పవిత్ర గ్రంధాలు చెప్తున్నాయి.  మనకు ఆహారము, వంటచెరకు వసతి మొదలైన వాటికి అవసరమైనంత వరకు మాత్రమే మొక్కల వృక్షాల భాగాలను వాడుకోవాలని చెప్పబడింది.  అంతే కాకుండా చెట్టును నరికిన పాపము రాకుండా ఉండాలంటే ఒక మొక్కను లేక చెట్టును కోయబోయే ముందు క్షమాపణ అడగవలసిందిగా కూడా చెప్పబడుతున్నది.  మొక్కలు, వృక్షాలు చేసే త్యాగ సేవల గురించి మరియు వాటిని పోషించవలసిన మన బాధ్యత గురించిన కథలు చిన్నతనము నుంచే చెప్ప బడతాయి.  అద్భుతమైన ప్రయోజనకర గుణాలు కల్గిన తులసి, రావి మొదలైన మొక్కలు, వృక్షాలు నేటికీ పూజింప బడుతున్నాయి.

దేవతలు మొక్కలు మరియు వృక్షాల రూపములో ఉన్నారనే నమ్మకము వలన అనేకులు వారి కోరికలను తీర్చుకొనుటకు మరియు భగవంతుడిని సంతోష పరచుటకు వాటిని పూజిస్తారు.
(తరువాత శీర్షిక - ఉపవాసం ఎందుకు చేయాలి?)

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP