శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పితృదేవతల ప్రతినిధి

>> Wednesday, October 3, 2012



పితృదేవతల ప్రతినిధి

పితృదేవతలకు ప్రాతినిధ్యం వహిస్తూ, పితృకార్యాలలో సమర్పించిన పిండాలను పైలోకాలకు చేరవేయడం ద్వారా మానవులకు, పితృలోకానికి మధ్య వారధిలా పనిచేస్తున్న వాయసం (కాకి) పర్యావరణ కాలుష్యం బారిన పడి క్రమేణా అంతరించిపోయే జీవుల జాబితాలో చేరబోతోంది! కాకితో పాటు, ఆ ప్రాణితో ముడివడి ఉన్న మన ఆచార వ్యవహారాలు కూడా గతి తప్పే ప్రమాదం కనిపిస్తోంది.

శ్రీమద్రామాయణంలో కాకిని గూర్చిన ఘట్టాలు రెండు కనిపిస్తాయి. సుందరకాండలో ఆంజనేయుడు లంకా నగరానికి ఎగరబోతూ తనదైన దృష్టితో ఆకాశాన్ని చూశాడు-‘ఎంత ఎత్తులో ఉందా’ అని. అంతే! నేల నుండి ఆకాశం వరకూ ఆయనకి 7 ఎత్తులు కనిపించాయి (ఆద్యః పంథాకులింగానాం... ద్వితీయో బలిభోజానామ్...).

మొదటి ఎత్తులో పిచ్చుకలు, రెండో ఎత్తులో కాకులు, మూడో ఎత్తులో భాస పక్షులు, నాల్గో ఎత్తులో డేగలు, ఐదో ఎత్తులో గద్దలు, ఆరో ఎత్తులో హంసలు, ఏడో ఎత్తులో గరుడుడు ఎగరగలరనుకున్నాడు. రెండో ఎత్తులో ఎగిరితే తనని కాకితో సమానమనుకుంటారని భావించాడు. అలాగే మిగిలిన ఎత్తుల్లో కూడ. నేల నుండి ఆకాశాన్ని ఎత్తులో కొలవాలంటే అది పక్షుల ఎగురుదల ఆధారంగా నిర్ణయించాలని చెప్పాడన్నమాట ఆంజనేయుడు.

అంతేకాదు. కాకికి ఆహారాన్ని వేయాలంటే ఐదు అంతస్థుల మేడమీద కాకుండా అది రెండో ఎత్తులో ఎగరగలిగిన పక్షి కాబట్టి, ఆ ఎత్తులో అంటే డాబా మీద అనుకోవచ్చు. అక్కడ పెట్టాలన్నమాట.

ఈ మాత్రమే కాదు. కాకి రూపంలో పితృదేవతలు ఆహారాన్ని స్వీకరించడానికి వస్తారు కాబట్టి, పితృదేవతలు మనని నిత్యమూ పలకరిస్తూ ఉంటారని భావించాలి. అందుకే ఇప్పటికీ పెద్దలు ‘కాకి ముద్ద’ అంటూ భోజన ప్రారంభంలో అన్నంతో అన్ని పదార్థాలనూ కలిపి ఒక గోడమీద పెట్టొచ్చి, ఆ మీదట భోజనానికి ఉపక్రమిస్తారు. మనవాళ్లు కాకికిచ్చిన ప్రాధాన్యమిది. శ్రీమద్రామాయణంలోని మరో ఘట్టం. సీతారాములు జలక్రీడలాడి ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నారు. రాముడు, సీతమ్మ తొడమీద తలపెట్టి నిద్రిస్తున్నవేళ ఒక కాకి ఎగురుతూ వచ్చి సీతమ్మ స్తనాన్ని గీరింది. అంతలోనే ఎగిరిపోయింది. ఎక్కడ తాను కదిలితే స్వామికి నిద్రాభంగమౌతుందోననే భయంతో సీతమ్మ తన వడ్డాణాన్ని అతి జాగ్రత్తగా తీసి కాకిని కొట్టబోయింది.

రాముడు నిద్రలేచి, ‘‘సీతా! ఎగిరిపోతున్న కాకిని అది కూడా వడ్డాణంతో కొట్టబోతున్నావా?’’ అంటూ పరిహాసమాడి, మళ్లీ అంతలోనే నిద్రలోకి జారిపోయాడు. మళ్లీ అదే కాకి వచ్చి అక్కడే గీరేసరికి సీతమ్మ వక్షస్థలం నుండి కారిన రక్తపు బొట్టు, రాముని నుదుటిమీద పడింది. అంతే! రాముడు క్రోధతామ్రాక్షుడయ్యాడు. దగ్గరగా ఉన్న దర్భని తీసి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని పఠించి దానిమీదికి వేశాడు. బ్రహ్మాస్త్రం బాధకి తట్టుకోలేక, ఆ కాకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకెళ్లి ఎవరూ శరణునీయలేకపోతే తిరిగి రాముని పాదాలమీదే పడి శరణు వేడింది.

‘ప్రయోగించిన నా ఆయుధం వ్యర్థపోదు’ అని చెప్పిన రాముడు, ఆ బ్రహ్మాస్త్రం ద్వారానే కాకి కన్ను పోయేలా చేశాడు. అంతే! అప్పటినుండీ కాకి ఏకాక్షి (ఒకే కంటితో చూడగలదు) అయింది. ఈ వృత్తాంతమంతా సీతమ్మ లంకకొచ్చిన ఆంజనేయునికి చెప్పి, ఒక కాకిమీద బ్రహ్మాస్త్రాన్ని విడిచిన రామునికి దాదాపు సంవత్సరకాలం లంకలో ఉంటున్న సీతను రక్షించాలంటే ఉపాయమే దొరకలేదా?’ అని రోదించింది.

ఇంతకీ విశేషమేమంటే ఆ కాకి నిజమైన కాకి కాదు. ఇంద్రుని పుత్రుడైన జయంతుడు. నిద్రిస్తూన్న కాలంలో కూడా రామునికి అస్త్రమంత్రం గుర్తుందా? గుర్తుకొస్తుందా? అది ఫలిస్తుందా? అని పరీక్షించడం కోసం దేవతలు పన్నిన పన్నాగమిది. దీనికి కారణం లంకలో రాక్షసులంతా రాత్రి మెలకువతో ఉండేవాళ్లు. రాముడు నరజాతికి చెందినవాడై రాత్రి నిద్రించేవాడు కాబట్టి!

ఇక్కడ మరో విశేషమేమంటే కాకి అల్పపక్షి కానే కాదు. పితృదేవతలకి ప్రతినిధి. ఇంద్రపుత్రుడంతటివాడి వేషాన్ని తనలో ఇముడ్చుకోగలిగినదీ. ఇది నిజం కాబట్టే బ్రహ్మాస్త్రానికి ఆంజనేయుడైనా కట్టుబడ్డాడు కాని, కాకి కట్టుబడకుండా రాముని పాదాల మీద వాలి శరణు కోరింది, కోరగలిగింది.

ఎన్నో సామెతలు, లోకోక్తులు

- కాకిలా కలకాలం ఉండటం కంటే హంసలా ఆర్నెలలు జీవిస్తే చాలు!

- తెల్లారితే చాలు కాకిలా ఊరంతా తిరుగుతాడు.

- కాకిపిల్ల కాకికి ముద్దు (అందంగా లేడని తెలిసినా తల్లి ఏవగించుకోదు. ఈ సామెత కాకితో మాతృప్రేమని పోల్చింది.)

- ఊరికే కాకిలా అరవకు.

- వెధవ కాకిగోలా నువ్వూను - నోర్ముయ్యి.

- కాకికేం? కారడవిలోనైనా జీవిస్తుంది.

- వెధవ కాకిగూడంత ఇల్లు కట్టుకున్నాడు చచ్చీ చెడీ. (అంత అల్పంగాను, గాలొస్తే పడిపోయేలా, కాకిగుడ్డు పిల్ల కాగానే గూడుని కాకి పడగొట్టేస్తుంది కాబట్టి అతి తాత్కాలికంగా కట్టాడని భావం.)

- కావు కావు (రక్షించు, తిండిపెట్టి రక్షించు) అని అరుస్తుందిట కాకి.

- కాకికేం? సంస్కృత పక్షి అది (కాకః - కాకి. మిగిలిన పక్షులకి సంస్కృతంలో మరో పేరుండచ్చు గాని కాకికి అలా కాదు).

- వాడు కాకి పళ్లు (కాక దంతాలు) లెక్కపెడతాడు. (కాకికి పళ్లుండవు. లేనిదాన్ని ఉన్నట్లుగా అనుమానపడే వ్యక్తిని గూర్చి...)

మంచి శ్లోకం

విధి రేవ విశేష గర్హణీయః

కరట! త్వం తవ కస్తవాపరాధః?!

సహకారతరౌ చకార యస్తే

సహవాస స్సరలేన కోకిలేన!!

ఒక విద్యార్థికి గురువు వేదపాఠాన్ని చెప్తూంటే, ఆ పక్కనున్న చెట్టుమీది కాకి ‘కా! కా!’ అంటూ ఘోరంగా అరవసాగింది. దాంతో గురువుగారు పై శ్లోకాన్ని చెప్పారు.

భారతంలోని కథ

ఒక కాకికి ఎంగిలి అన్నం మెతుకులు తినడంతో బాగా బలుపు వచ్చి బొంతకాకిగా అయింది. మిగిలిన కాకులన్నీ దాని శరీరాన్ని చూసి భయపడుతూ ఉండేవి. ఓసారి హంస ఎగురుతూంటే దాంతో పందెం వేసుకుంది ఈ కాకి. కొంత ఎత్తు ఎగిరాక, ఆయాసంతో దప్పికతో నేలన పడింది. అర్జునుడు హంస, కర్ణుడు కాకి వంటివారని పోలుస్తూ భీష్ముడు చెప్పిన కథ ఇది.

కాకి లేనిదే కైవల్యం లేదు

నిద్ర లేవగానే తిండికి వెంపర్లాడే లక్షణం కాకిది. అందుకే అలాంటి లక్షణమున్నవాణ్ని కాకితో పోలుస్తారు. ఈ కారణంగానే దేవుడికి ప్రథమార్చన జరగ్గానే ధ్వజస్తంభం వద్ద ఆహారాన్ని వేస్తారు. దీన్ని ఎక్కువగా కాకులే తింటాయి. ఇక శ్రాద్ధ కార్యక్రమాల్లో ‘వికిరపిండ’మని ఒకటుంటుంది. మరణించిన తన పితరుల్ని తలుచుకుని, వారికే నివేదిస్తున్నట్లుగా పెట్టే పిండం (అన్నం ముద్ద) ఇది. ‘గద్ద/కాకి రూపంలో వచ్చి తినవలసింది’ అని ప్రార్థిస్తూ గోడమీద పెడతారు దీన్ని (గృధ్ర వాయస రూపేణ భక్షతామ్).

శ్రీమద్రామాయణంలో ఆంజనేయుడు సీతమ్మ వద్దకి రాగానే సీతమ్మకెదురుగా ఉన్న చెట్టు ఆకుల మధ్య ఉన్న పక్షి చక్కగా కూయడం ఆరంభించింది. (పక్షీ చ శాఖా నిలయః ప్రవృత్తః... సుస్వాగతాం వాచ ముదీర యానః...) పక్షి కూత శుభవాక్యాన్ని వినడానికి నాందిగా భావించేదిందుకే. ఈ కారణంగానే ‘కాకి అరుస్తోంది. ఏ చుట్టాలొస్తారో చూద్దాం’ అనే మాట లోకానికొచ్చింది. చుట్టాలొస్తే ఆ పిండి వంటల ముక్కలు తనకీ లభిస్తాయి కదా! ఒకసారి ఇటు తిరిగి అరిచి, మరోసారి మరో దిక్కుకి తిరిగి అరిచి (‘చుట్టాలూ రండి’ అన్నట్లు, ‘మీరొస్తున్నట్లు చెప్పానులెండి’ అన్నట్లు) కాకి చక్కని కనువిందు చేస్తుంది కాసేపు దాన్ని అర్థం చేసుకుంటే.

కాకి గుడ్డు, కోకిల గుడ్డు చూడ్డానికి ఒకేలా ఉంటాయి. దాంతో కోకిల తెలివిగా తన గుడ్లని కూడా కాకి గూట్లోనే దాస్తుంది. కాకి పొదిగాక, మెల్లగా ఆ గుడ్లు పగిలాక కోకిల గొంతు విప్పి అరవగానే తన పిల్ల కాదని తెలిసీ తెలియడంతోనే కాకి కోకిల పిల్లల్ని తరిమేస్తుంది. కనిపించడానికి అందరూ మిత్రుల్లానే చుట్టాల్లానే ఉంటారు గాని వసంతకాలం వచ్చాక కాకీ కోకిలల భేదం తెలిసినట్టుగా మనకి సహాయపడవలసి వచ్చిన వేళ ఎవరు నిజమైన మిత్రులో శత్రువులో తెలుస్తుందంటారు పెద్దలు.

‘ఓ కాకీ! నీ తప్పేమీ లేదు. అరుచుకో. ఇంకా అరుచుకో. కోయిల నీ గూట్లో పెరిగిన కారణంగా అరుస్తూంటే నువ్వూ అరవాలని అరుస్తున్నావు. కోయిలకీ నీకూ ఒకే గూటిని, అలాగే ఒకే తీయ మామిడిచెట్టు కొమ్మనీ ఆధారంగా చేసిన ఆ బ్రహ్మ ఉన్నాడే ఆయన్ని తిట్టాలి. ఇది నీ తప్పు కాదు’ అని శ్లోకార్థం.

- డా॥మై.శ్రీ.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP