శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దర్శనమే నిదర్శనం

>> Monday, September 24, 2012

దర్శనమే నిదర్శనం


మహాత్ముల దర్శనం, స్పర్శనం, సంభాషణం లభిస్తే, అవి సాధకుడి సాధనపైన చిరుముద్ర వేస్తాయి. సందేహాలు క్రమంగా సమసి, సంశయం నశించి, సాధన సరళము, స్వచ్ఛము, తీవ్రము అవుతుంది. ఇది ప్రారంభ దశలో ఉన్న సాధకుడికి లభించే ప్రాప్తి. అప్పటికే కొంత సాధన చేసి, ఆత్మవిచార మార్గంలో ఉన్న వారికి, మహర్షిని దర్శించినపుడు, వారితో సంభాషించిన తొలిక్షణాలు ఎంతో విలువైనవి. అపుడు కలిగే అనుభూతులు సాధన తీవ్రం కావటానికో, తేలిక కావటానికో, ముడి విడి పడటానికో ఉపయోగించి, వారి వారి సాధన సంపూర్ణమయ్యే దిశలో నడుస్తుంది.

మహర్షితో మహాత్ముల తొలి దర్శనాలు చిరస్మరణీయాలు. శ్రీస్వామి రాందాసు అప్పటికే శ్రీకృష్ణ దర్శనం పొంది, నిరంతర సంచారంలో ఉన్న భక్తాగ్రేసరుడు. ఆ సంచారంలో భాగంగా వారు తిరువణ్ణామలై చేరుకున్నారు. అప్పటి ఆయన మానసిక పరిస్థితి పసిబాలుడి స్థితి వంటిది. మాతృవాత్సల్యం కోసం పరితపిస్తున్న శైశవవేదన. దారీ తెన్నూ ఎరుగని పరిస్థితి. అటువంటి సందర్భంలో వారికి మహర్షి దర్శనం లభించింది. ప్రథమ దర్శనమే స్వామి రాందాస్‌లో నిర్గుణ పరబ్రహ్మను అనుభవించగల అనుభూతిని, విశ్వమహాచైతన్యపు స్పర్శను కలిగించినది.

ఫలితంగా ఆయన కూడా అరుణాచలంపైన ఒక గుహలో కొంత కాలం ఉన్నారు. ఆ కాలమంతా ఆయన చేసుకున్నది ఎడతెడని రామనామం. భిక్షాటనంలో దొరికిన బియ్యాన్ని వండుకుంటూ, శరీరాన్ని ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ, రామ నామస్మరణ కొనసాగించారు. ఇరవై రోజుల తర్వాత, ఆయన కనుల ముందు తేజోమయ చైతన్యం సాక్షాత్కరించింది. బాలుడి స్థితిలో ఉన్న స్వామి రాందాసు భావోద్వేగానికి లోనై, కనిపిస్తున్న దానినంతా రామమయంగా అనుభూతి చెందటం జరిగింది. తాదాత్మ్యత సైతం ఒక మూలవాసనే. మహర్షి దర్శనం, ఆయనకు మూలవాసనాక్షయాన్ని అనుగ్రహించింది.

ఆచరణకు నోచనిది నిరర్ధకమే!
మరొక అన్వేషి కుంజుస్వామి. రమణులను వెదుక్కుంటూ అరుణాచలం చేరుకున్న సాధకుడు. కుంజుస్వామి చేరుకున్న రోజే భగవాన్ పరిచారకుల్లో ఒకరు మరణించటం, ఆ కారణంగా అందరూ, పోయిన వ్యక్తి గురించి దుఃఖిస్తుంటే భగవాన్, "ఎందుకు విచారం? ఒకరు పోయారు. మరొకరు వచ్చారు. 'జ' అంటే పుట్టేది; 'గత్' అంటే పోయేది. అదే జగత్. దాని లక్షణమది. పొగలవద్దు. దిగులు పడవద్దు. కుంగవద్దు'', అంటూ కుంజుస్వామికి ఆహ్వానం పలికారు. మిగిలింది నిశ్శబ్దం. అందరూ వెళ్లిపోగా, తానూ భగవాన్ ఇద్దరూ మిగిలిన సందర్భం.

భగవాన్ గంజి కాచి, ఒక పళ్లెంలో పోశారు. పక్కనే ఉన్న బుట్ట ఎత్తగానే, నాలుగు కుక్కపిల్లలు బయటకు వచ్చి గంజి తాగటానికి సిద్ధమైనాయి. ఇదంతా మౌనంగానే సాగింది. ఇంతలో భగవాన్, మౌనం వీడి, "వాటిని పట్టుకో. గంజి వేడిగా ఉంది. అవి తాగలేవు'' అన్నారు. కుంజుస్వామి వాటిని పట్టుకున్న తర్వాత, కొంత సేపటికి, "ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టు'' అన్నారు భగవాన్. అదే తొలిపాఠం! పట్టుకున్న వాటిని క్రమంగా వదిలిపెట్టాలి. ఒక్కొక్క దాన్నీ, వదలాలి. గుర్వాజ్ఞ లభించే దాకా వేచి ఉండాలి. లభించగానే ఆచరించాలి.

ఇవే కుంజుస్వామి పొందిన మౌన వ్యాఖ్య, ఉపదేశం, ఆదేశం! అయినా జీవుణ్ణి వాసనలు వదిలి పెట్టవు. ఒక రోజు మహర్షి ఏకాంతంలో ఉండగా, కుంజుస్వామి తన అభిరుచుల్ని వారికి విన్నవించుకుందామనుకున్నాడు. ప్రవచనాలు చెప్పటం, జపం చేసుకోవటం, వేదాంతాన్ని అధ్యయనం చేయటం. ఈ విషయాలను చెప్పి, నన్నేం చేయమంటారని అడిగాడు. భగవాన్, "కైవల్య నవనీతం చదివావు కదా! ఎం చెబుతున్నదది? ఆత్మవిచారణ చేయి. జనన మరణ చక్రం నుంచి బయట పడేస్తుందది. నేనెవరన్న ప్రశ్న వేసుకో. అంతర్ముఖుడివికా. మనసును హృదయంతో కలుపు.'' అంటూ మౌనం వహించారు. అధ్యయనం వేరు. అనుష్ఠానం వేరు. ఆచరణకు నోచనిది నిరర్థకమే. కుంజుస్వామికి ఆ విధంగా సాధనోపదేశం చేశారు.

భగవాన్‌పై ఆరాధన
ఆర్థర్ అస్‌బార్న్ అనుభవం మాత్రం భిన్నం. భగవాన్ హాల్లోకి వస్తున్న దృశ్యమే, అస్‌బార్న్ ప్రథమ దర్శనం. అప్పటికే అస్‌బార్న్ కుటుంబం, అరుణాచలంలోనే ఉన్నది. ఈయనకు మాత్రం ఇదే మొదలు. మహర్షి వస్తూనే, అస్‌బరన్ వైపు చూసి, మందహాసం చేసి, అస్‌బార్న్ కొడుకుతో, "ప్రార్థనలన్నీ ఫలించాయి. మీ తండ్రి వచ్చారు.'' అన్నారు. కరుణాపూరకమైన ఆ మాట అతనికి ఆనందం కలిగించింది. అప్పటికంతే! వారాలు గడుస్తున్నాయి. దయా పూరిత వాతావరణం ఏదో తెలియని ఆనందాన్ని కలిగిస్తున్నది. దాన్ని మించిన గాఢానుభూతులు మాత్రం లేవు.

ఆయన దివ్యత్వాన్ని గ్రహించే శక్తి తనకు లేదనుకుంటున్నాడు అసబరన్. ఇంతలో కార్తీకదీపోత్సవ సమయం వచ్చింది. మహర్షి ముందు కూచున్నాడు అస్‌బరన్. మహర్షి ఒక్కసారిగా తమ చూపుల్ని, అసబరన్ వైపు మరల్చి, అతనిపై నిలిపి, నిశితంగా చూస్తూ ఉండిపోయారు. "చెప్పవలసినదంతా చెప్పాను. గ్రహించుకోలేదే? అంటున్నాయ్, దివ్యనేత్ర యుగళి. ఆ క్షణం నుంచి భగవాన్ పట్ల అతని ఆరాధన, ప్రేమ, భక్తి, గౌరవం పెరగటం ప్రారంభమైంది. "నేను ఎవరు? '' అనే విచారణ తీవ్రమైంది. అది భగవాన్ అనుగ్రహించిన వీక్షణ దీక్ష ప్రభావమే. సమర్పణ, శరణాగతి, పరిప్రశ్న, భావన, నిరంతర విచారణ వంటివన్నీ అస్‌బరన్ సాధించుకున్న అనుగ్రహాలు.

అన్నీ అడగకుండానే భగవాన్ దేహపరిత్యాగానంతరం, అన్‌బరన్ అరుణాచల రమణుల మీద ఎన్నో రచనలు చేశాడు. ఎవరెవరి ప్రాప్తి, సాధనా తీవ్రత, అర్హతలను బట్టి గురువు అనుగ్రహిస్తుంటాడు. మహాత్ములు జ్ఞానిని దర్శిస్తే, సాధన పూర్ణమవుతుంది. మాన్యుడికి, సాధన తీవ్రమవుతుంది. సామాన్యుడికి సేవా రూపంలో సాధనామార్గం దొరుకుతుంది. అనుగ్రహం ఎప్పుడూ ఉన్నది. దానిని పొందగల అర్హతను సంపాదించుకోవాలి. నిజానికి మన ప్రయత్నం లేకుండానే గుర్వనుగ్రహం మనల్ని నడిపిస్తుంది. అట్లా అని మన ప్రయత్నం మానకూడదు.

భగవంతుడి ప్రణాళికలో ఎవరెవరు ఏ భూమిక నిర్వహించవలసినదీ నిర్ణయం జరిగే ఉంది. అవకాశం లభించినపుడు, అందుకుని, జన్మను సార్ధకం చేసుకోవాలి.

- వి.యస్.ఆర్. మూర్తి
andhrajyothy.daily

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP