ఆత్మవిశ్వాసమే శ్వాస
>> Saturday, September 22, 2012
ఆత్మవిశ్వాసమే శ్వాస
మానసికబలం జీవితానికి నూతనత్వాన్నీ, నిత్యత్వాన్నీ యిస్తుంది. మానసిక దుర్బలత్వం నిత్యప్రయాసను, అమితమైన దైన్యాన్నీ మనిషిలో పాదుకొల్పుతుంది. మానసిక దుర్బలత్వం శారీరక వైకల్యం కన్నా దుర్భరమైన, దుస్సహమైన విషయం.
మనిషి జీవించడానికి ఉచ్ఛ్వాసనిశ్వాసాలు ఎంత ముఖ్యమో కార్యోన్ముఖుడై పురోగమించడానికి, విజయదుందుభి మోగించడానికి ఆత్మవిశ్వాసం అంతే ఆవశ్యకం. ఆత్మ విశ్వాసం అంటే ఒక మనిషికి తన మీద తనకున్న నమ్మకం అని చెప్పవచ్చు. భావి భాగ్యోదయానికి వెలుగునిచ్చే ఉజ్జ్వల ప్రభాతకిరణం మనిషి ఆది నుంచీ ప్రోది చేసుకునే ఆత్మవిశ్వాసం. మనిషికి తన మీద తనకున్న విశ్వాసమే తాను ముందుకు నడవడానికి ఆలంబన, ఆధారం. ఆత్మవిశ్వాసమనే సంపద తెచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా మనలను మనం పటిష్టపరుచుకుని విశిష్టమైన విజయం దిశగా ప్రశస్తమైన అడుగులు వెయ్యాలి. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ అవసరమైన దివ్యౌషధం తన మీద తనకున్న నమ్మకం.
ఆత్మవిశ్వాసం కొరవడితే...
ఆత్మవిశ్వాసం అణువణువునా నింపుకున్న మనిషి జీవితంలో ఎప్పుడూ పున్నమి వెన్నెల జల్లులే కురుస్తాయి. విశ్వాస రాహిత్యంతో సదా చరించేవాడికి విధిగా అమావాస నిశీధే నిధిగా మారి వ్యధా భరితుణ్ని చేస్తుంది. అంతే కాదు, తన శక్తిని సదా తక్కువగా తలపోసే వాడికి భవిత శూన్యమై, పతన ద్వారం వేపు పయనిస్తాడు. ద్విగుణీకృతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన మేధావుల జీవిత గా«థల సంపుటీకరణమే ప్రపంచ గతిని ప్రగతివేపు, సదాశయాల సుగతివేపు నడిపాయని చెప్పక తప్పదు.
నాగరికతా పరిణామ క్రమంలో మానవజాతిని మున్ముందు తోసుకువచ్చిన క్రియాశక్తి ఆత్మవిశ్వాసమే. విశ్వయవనికపై మహోన్నత పాత్రను పోషించిన వారందరూ నిండైన ఆత్మవిశ్వాసమే ఆభరణంగా, అమరగుణంగా జీవితాన్ని నెరపినవాళ్లు అన్నది చరిత్ర పుట్లో సువర్ణాక్షర లిఖితం. తన మీద తనకు విశ్వాసం లేనివాడు జీవించే శవంతో సమానం అంటాడు స్వామి వివేకానంద. శరీరాన్ని గానీ, ఆత్మవిశ్వాసాన్ని గానీ, ఆధ్యాత్మికతను గానీ బలహీనపరచే దేన్నైనా విషంలా తిరస్కరించమని వివేకమైన ఆయన సందేశం.
అతివిశ్వాసం అనర్థదాయకం
వ్యక్తి సాధించలేనిది ఒకటి ఉంటుందని భావించడం కంటే ఘోరమైన తప్పిదం మరొకటి ఉండదు. ఒక రకంగా అది అతనికి శాపం, అవనికి భారం. అంతే కాదు, తనను, తనతో జీవించే ఇతరులను అశక్తులుగా ఎంచుకోవటం కంటే అతిశయించిన పాపం మరొకటి ఉండదనీ చెప్పవచ్చు. వ్యక్తికి ఆత్మబలమే జీవనం. బలహీనత మరణ సదృశం. మనోబలం శుభదాయకం, శ్రేయోదాయకం. మానసికబలం జీవితానికి నూతనత్వాన్నీ, నిత్యత్వాన్నీ యిస్తుంది. మానసిక దుర్బలత్వం నిత్యప్రయాసను, అమితమైన దైన్యాన్నీ మనిషిలో పాదుకొల్పుతుంది.
మానసిక దుర్బలత్వం శారీరక వైకల్యం కన్నా దుర్భరమైన, దుస్సహమైన విషయం. ఈ భూమండలంలో ఏదైనా ఉన్నత స్థానాన్ని అధిష్టించాలని ఆశిస్తే ఆ స్థితిని పొందినట్లే విశ్వసించాలి. కొంతమంది సామర్థ్యం నీటిబుడగ ప్రాటయంలో ఉండవచ్చు. కొంతమందిలో అది ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతూ ఎంతో అందంగా భాసించవచ్చు. కానీ, ఈ రెండింటికీ అనంతమైన సాగరమే ఆధారమని గ్రహించాలి. వీరిద్దరినీ భిన్నమైన వాళ్లుగా వేరు చేసేది కేవలం వారిలో నెలవైన ఆత్మవిశ్వాసము స్థాయి మాత్రమే. ఈ స్థాయీ భేదమే ఒక వ్యక్తిని ఉత్తమునిగా, ఉన్నతునిగా నిలిపితే, మరొకణ్ణి దుర్బలునిగా, అధమునిగా నిలుపుతుంది.
వీరవనితలు ఎందరో...
ప్రపంచ చరిత్రలో, భారత ఇతిహాసాల నుంచి ఈనాటి వరకు ఆత్మవిశ్వాసమే పూనికగా జీవిక సాగించిన వాళ్లు చాలామందే కనబడతారు. ఈ కోవలో వనితలూ చాలామందే మనకు తేజోమయంగా తారసపడతారు. ఝాన్సీ లక్ష్మీభాయి, రుద్రమదేవి వంటి ధీరవనితలు తమ ధైర్యస్థైర్యాలతో తరువాతి తరం వారికి పథ నిర్దేశకులుగా మార్గదర్శనం చేశారు. ఝాన్సీలక్ష్మి తన అసహాయ శూరత్వంతో ఆంగ్లేయులనెదిరించిన విధం అత్యంత సంభ్రమంగా ఉండి, చరిత్ర మిగిల్చిన చతురతలా అమితమైన విభ్రాంతిని కలిగిస్తుంది. తన కుమారుణ్ణి వీపునకు కట్టుకుని తెల్ల దొరలను ఎంతో తెగువతో ఆమె ఎదిరించిన తీరు శ్లాఘనీయమే కాక, భారత నారీరత్నాలు బేలగా నిలిచే అబలలు కారని, స్థైర్య స్ఫూర్తి నిలువునా మూర్తీభవించిన సబలలేనని విశ్వాసికి ఘంటాపథంగా చాటి చెప్పింది.
ఇలాగే, ఎందరో మహనీయులు, మహిత జీవనులు ఆత్మవిశ్వాసమనే వజ్రాయుధంతో తమకు ఎదురయ్యే ఆటంకాలను తృణప్రాయంగా ఖండించి తమ గమ్యం వేపు వడివడిగా అడుగులేశారు. ఆత్మవిశ్వాసం నిలువునా నింపుకున్న జీవికి లేదు ఎందునా క్షయం! సర్వకాల సర్వావస్థల్లో అతని జీవిక అమృతప్రాయమైన అక్షయం! ఏ కార్యం తలపెట్టినా, ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసాడే జీవికి జయం సిద్ధించడం నిశ్చయం! ఆత్మవిశ్వాసం మనవ హృదయపు అధరంపై విరిసే మనోహరమైన దరహాసం! ఆత్మవిశ్వాసమే శ్వాసగా ముందుకు సాగే వ్యక్తికి జీవితమంతా మధుమాసం!
- వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు
0 వ్యాఖ్యలు:
Post a Comment