ఆత్మానుభవం అంటే...?
>> Monday, August 27, 2012
ఆత్మానుభవం అంటే...?

శుద్ధ చైతన్య స్వరూపం ఆత్మానుభవం కలిగిన జ్ఙాని, ఈ సత్యాన్ని తెలుసుకున్న కారణంగా, సమస్త కార్యకలాపాలకు కేవలం సాక్షిగా ఉంటాడు. అందువల్ల జ్ఞానికి బంధం, బంధన, సంయోగం, వియోగం, భేదం, స్వప్నం, జాగ్రద అనే అసంఖ్యాక ద్వంద్వాలలో ఏ ఒక్కటీ ఉండదు. దాని ఫలితంగా జ్ఞాని, నిరంతరమూ ఎరుకలో ఉంటాడు. గుణత్రయ, కాలత్రయ, అవస్థాత్రయాతీతుడైన జ్ఞాని, నిజంగా శుద్ధ చైతన్య స్వరూపమే. మనల్ని మనం తెలుసుకోవటానికి బయటి వస్తువేదీ అక్కర లేదు. అక్కరకు రాదు. 'నేను' అన్న అహాన్ని నిర్మూలించుకోగలిగితే, అంతా ఆత్మగానే కనబడుతుంది. "అహాన్ని నాశనం చేసుకోవటమే అసలు సాధన. అహ మెరుగని వాడిని ఆశ్రయిస్తే శరణాగతి సంపూర్ణంగా పొందితే, అహం నశిస్తుంది. అందుకే రమణులు, "అరుణాలచలమనుచు స్మరియించువారల, అహము నిర్మూలింపు మరుణాచల!'' అంటారు.
అరుణస్థాయి అంటే... మనం అరుణస్థాయిని, అచలస్థితినీ చేరుకోవాలి. ఋణం లేని స్థితే అరుణస్థాయి. ఋణం ప్రాపంచిక పరమైనది కాదు. సచ్చిదానందస్థితే అరుణస్థాయి. మనసు ఇంద్రియాలకు లోబడినందున, నిత్యమూ చలించటం దాని లక్షణం కనుక మనసును నియంత్రించుకోగలిగితే, అది అచలస్థితిని పొంది, నెమ్మదిస్తుంది. 'అరుణాచల' మంటే అర్థమది. ఘనీభవించిన కరుణ, సచ్చిదానందమైన అరుణస్థాయిని, అణగిన మనోభూమిక అచలస్థితినీ అనుగ్రహించగల అరుణాచల అనే పంచాక్షరిని ఆశ్రయించి, స్మరిస్తూ ఉంటే, అహం నిర్మూలింపబడుతుంది. స్మరణ అంతా అజపమే. మననమంతా మనోవృత్తే. హృదయమే అరుణాచలం. దానిపై నిరంతర ధ్యానం కొనసాగిస్తే అహం నిశిస్తూనే ఆనందం వెల్లివిరుస్తుంది. కావాల్సినదల్లా వినయపూర్వక సమర్పణే!! ఈ ప్రయాణంలో, ఈ సాధనలో అణగిన మనసే ఉన్నది. మనసింకా మలగలేదు. ధ్యానం చేస్తున్నాం అంటున్నంత కాలం మనోవృత్తులు ఉండనే ఉంటాయి. అవి దృశ్యాలను కల్పిస్తూనే ఉంటాయి. కల్పనలన్నీ వాస్తవంగా అనిపిస్తయ్.
ఒక భక్తురాలు, భగవాన్ సన్నిధిలో ఉన్నపుడు, వారు ఆమెకు ఒక పసిపాపవలె అనిపించారు. ఆ ఆనుభవాన్నే రుమణులతో ప్రస్థావించినప్పుడు, "అదంతా నీ మనసు కల్పించిన దృశ్యమే'' అన్నారు. 'భగవాన్ యందున్న గాఢాభిమానమే అటువంటి అనుభవాన్ని ఇచ్చింది. పట్టించుకోకండి' అంటూ సూచించారు. "ఇది ఆధ్యాత్మిక అనుభవం కాదా'' అని ఆమె ప్రశ్నించినపుడు "ఎట్లా అవుతుంది. చూస్తున్న మీరు, చూడబడుతున్న రమణులు, దీనివలన ఏర్పడిన దృశ్యము ఉండనే ఉన్నాయి. అంటే మనసు ఇంకా బలంగానే ఉన్నపుడు, దృశ్యం ఆత్మానుభవం కాదు. దృశ్యం దృశ్యమే'' అని రమణులు స్పష్టం చేశారు.
అదే ఆత్మానుభవం "మీరు మా దేశానికి రావాలి! అని ఆమె అన్నపుడు, భగవాన్ "భౌతిక రూపాన్ని భావించటం వల్ల దేశ కాలాలకు పరిమితం ఏర్పడుతుంది. మీరు భారతదేశంలో ఉన్నారా? భారతదేశం మీలో ఉన్నదా? నిద్రిస్తున్నపుడు మీరు మీ దేశంలో ఉన్నారు. తెలివిరాగానే 'నేను' హాయిగా నిద్రపోయాను అంటున్నారు. ఆ అంటున్నదెవరు? ఆ నిద్ర సుఖాన్ని అనుభవించిందెవరు? నిద్ర కరిగిపోయినా, అనుభవం మిగిల్చిన సుఖం ఇంకా మీలోనే ఉన్నదే. కనుక నిద్రా, అదిచ్చిన హాయి, మెలకువ, అది కొనసాగిస్తున్న అనుభూతి అంతా మీదే. అంతా మీరే. మీరు కాని మరొకరెవరున్నారు? ఆ స్థితే ఆత్మానుభవం! అంతే గాని ధ్యానంలో కలిగే అనుభవం ఆత్మానుభవం కాదు'' అని ముగించారు. ఆ రూపమే, స్వరూపం! ఆత్మకు రూపం లేదు. అది చైతన్య భూమిక. అదే మన స్వరూపం. అది ఆది, అనాది. అది నిత్యం, శాశ్వతం. అదే సత్యం. అదే ఆనందం. అదే అసలు. మిగిలినవన్నీ పైపై కనిపిస్తున్నవే. దృశ్యాలు దాటకపోతే సాధన సమసిపోతుంది. ఆలోచనకు ఆలోచనకు మధ్య ఉన్న విరామకాలమే కాలం. అక్కడ ఉన్న ఎడమే ప్రదేశం. ఆ ఎడాన్ని ఎరుకతో విస్తరించుకోగలిగితే, అనుభవమూ లేదు. అనుభూతీ లేదు. ఉన్నదంతా నిరామయస్థితే!
0 వ్యాఖ్యలు:
Post a Comment