శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్యోన్యత

>> Friday, June 8, 2012

వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమాభిమానములు కలిగి వుంటేనే అన్యోన్యతగా చెప్పవచ్చు. అంతటితో సరిపోదు. సద్భావన, సదవగాహన, కష్టసుఖాలలో పాలుపంచుకోవడంలో పరస్పర సహకారం కలిగి వున్నప్పుడే అది నిజమైన అన్యోనత అవుతుంది. భిన్నభావములు గల వ్యక్తుల మధ్య అన్యోన్యత అసాధ్యం కావచ్చు. కాని ఒకే కుటుంబంలోని వ్యక్తులమధ్య అన్యోన్యత అత్యవసరమే అనక తప్పదు. అందు నాకుటుంబమందలి ఆలుమగలమధ్య అన్యోన్యత ఆ కుటుంబానికే కాదు పరిసర కుటుంబాలకీ ఆదర్శప్రాయం కాగలదు.
ఆలుమగల మధ్య అన్యోన్య దాంపత్యానికి సీతారాములు ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. ఒకరికి ఒకరై ఇద్దరు ఒకరై కలిమిలేములందు కష్టసుఖములందు సంయోగ వియోగములందున సీతారాముల అన్యోన్యత అనితర సాధ్యమనే చెప్పాలి. వనవాసానికి రాముడు ప్రయాణమైన సందర్భంలో తనూ పయనమయింది సీత. అడవుల నిడుమలు ఎన్నో, ఎనె్నన్నో అంటూ ఆమెను వారించాడు రాముడు. నీవెక్కడో నేనక్కడే. నీ కష్టమే నా కష్టం. నీ నీడనే నేనయినపుడు నన్నొదిలి ఎట్లా వెళ్లగలవంటూ తనకు భర్తకు మధ్యగల అన్యోన్యతను చెప్పకనే చెప్పింది.
రామునికి దూరమై లంకలో నిద్రాహారములు మరచి సదా రామనామస్మరణతో దుఃఖించే సీతను చూచిన హనుమంతుడు తనలో తాను ‘‘ఆహా! ఆశ్చర్యము. సీతా వియోగ దుఃఖంతో అక్కడ రాముడు, భర్త వియోగ దుఃఖంతో ఇక్కడ సీతమ్మ పరస్పరం ఒకరికై ఒకరు నిద్రాహారాలు మరచి శోక సంద్రంలో మునిగివున్నారే. శరీరాలు దూరమైనా, వీరి ఆత్మలు ఒక్కటై వున్నాయి. వీరి అన్యోన్యత అనితర సాధ్యమే కదా’’ అనుకుంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు.
ఆలుమగలే కాదు రామాయణ పరంగా చూస్తే దశరథుని కుటుంబమంతా అన్యోన్యతకు అద్దం పట్టేదే. మహారాజుకు ముగ్గురు భార్యలయినా సవతుల మధ్య పరస్పర సహకారం, సఖ్యత, ప్రేమాభిమానములు వారి అన్యోన్యతకు తార్కాణమే. ‘కైక’ విషయమై చెప్పుకుంటే ఆమె భావనలన్నిటివెనుక రామావతార లక్ష్యం దాగి వుంది. అంతే అది విధికృతం. కాని చిన్ననాటినుండి రామునిపట్ల అమితమైన ప్రేమను కనబరచిన కైక రామునిపట్లనే కాదు సవతుల పట్లనూ తన సహకారాన్ని ప్రదర్శించింది. అన్నదమ్ములయిన రామ లక్ష్మణ భరత శతృఘు్నలు నల్గురు అన్యోన్యతకు ఆనవాళ్లుగా మిగిలిపోయారు. రాజ్యాధికారం అందివచ్చినా, రాముడు గాని భరతుడుగాని తృణప్రాయంగా భావించి సోదరులమధ్య అన్యోన్యతను చాటి చెప్పారు. దాశరథులు నల్గురు ఒకరిపట్ల ఒకరు ప్రాణాధికంగా ప్రేమ కలిగి వున్నారు. అంతేకాదు కౌశల్య, సుమిత్ర, కైకేయిల ముగ్గురినీ తమ తమ తల్లులవలెనె గౌరవించారు. పూజించారు. అంతేనా, పురజనులతో మమేకమై వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ తమ అన్యోన్యతను చాటి చెప్పారు.
అన్యోన్యత విషయంలో రావణ, కుంభకర్ణ విభీషణాదులు పరస్పరం దూరమయ్యారు. వాలి, సుగ్రీవుల మధ్య అన్యోన్యత లేదు. ఈ నేపథ్యమే మనకు అన్యోన్యత యొక్క విలువలను స్పష్టం చేస్తోంది. ఆలుమగలే కాదు కుటుంబమంతా అన్యోన్యతనే పెట్టని ఆభరణంగా మలచుకుంటే అదే ఆదర్శ కుటుంబం కాగలదు. సుఖశాంతులతో వర్థిల్లగలదు. కాని నేడు జరుగుతున్నదేవిటి?
కొత్త కోడలు అత్తింటికి రాగానే అన్యోన్యతను ఆదరణను చూపక చిందులు, ఆమె తెచ్చిన సారె చీరెలందలి లోపాలు ఎత్తిచూపడం, అత్తలు ఆడబడుచులయితే అత్తగారంటేనే సూర్యకాంతం అనుకుంటూ అత్తను భావించి అత్తకు ఎదురుతిరగడం. ఫలితంగా ఆ ఇంట ఎవరికీ మనశ్శాంతులు లేకపోవడం అన్యోన్యతకు దూరమై ఆ కుటుంబమే ముక్కలై ఎవరికివారే అన్నట్లు విడిపోవడం నడుస్తున్న చరిత్ర. కలసివుంటేనే కలదు సుఖం అన్న నీతిని నమ్మి చరిస్తే అన్యోన్యత అనేది దానంతట అదే అల్లుకుపోతుంది.--- k.v.ramana rao

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP