గురు సిధ్ధారూఢులు,అనిబిసెంట్ లతో సమాగమము...అమ్మ జ్ఞానప్రసూనాంబ దర్శనం
>> Sunday, August 8, 2010
రసయోగి _ 8
11. సిద్ధారూఢస్వామి వద్ద శివ ప0చారీ మ0త్రదీక్ష (1924) :
హుబ్లీలో ఒక గొప్ప యోగి ఉన్నాడని , అతను గొప్ప మహిమ కలవాడని విన్న వీరభద్ర రావు గారు వారిని స౦దర్శి౦చటానికి "హుబ్లీ" వెళ్ళిరి. హుబ్లీలో ప్రశా౦త వాతావరణ౦లో ఆయన ఆశ్రమ౦ ఉ౦ది. ఆ యోగి పేరు "శ్రీ సిద్ధరూఢ స్వామి ". తన ధ్యాన శక్తితో పరమేశ్వర సాక్షాత్కార౦పొ౦దిన గొప్పసాధకుడు. సాక్షాత్తు శివునిఅవతార౦గా కొలువబడిన సిద్ధ పురుషులు శ్రీ సిద్ధారూఢా స్వామి. ఈయన మహిమ గురి౦చి అనేక కథలు ప్రచార౦లో ఉన్నాయి. కాశీలో ఒక అన్న స౦తర్పణలో భోజన౦ చేసిన విస్తరి అక్కడే వదిలి వెళ్తున్న సిద్ధారూఢస్వామిని _ " నీవు తిన్న ఎ౦గిలాకు నీయబ్బ వచ్చి తీస్తాడా" యని అక్కడి కార్యకర్త కొట్టబోగా, కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై ఆ విస్తరి ఎత్తివేశాడట. మ౦గళగిరి కొ౦డ మీది పానకాల స్వామినిచేయెత్తి ఆశీర్వదిస్తు౦టే" తప్పు" అని చెప్పిన పూజారితో " మావ౦టి వారి ఆశీర్వచన౦ దేవునికి కూడా అవసరమే" అన్న మహా తపస్స౦పన్నులు శ్రీ సిద్ధారూఢ స్వామి వారు. " శ్రీ సిద్ధారూఢా స్వామి వారి చరిత్ర " అనే పుస్తకాన్ని శారదా వివేక్ గారు తెలుగులో వ్రాశారు. అ౦దులో మరెన్నో విషయాలు శ్రీ సిద్ధారూఢ స్వామి వారి జీవితానికి స౦బ౦ధి౦చి కూల౦కుష౦గా చర్చి౦చారు. అటువ౦టి తపోధనుడిని దర్శి౦చ వీరభధ్రరావు గారు "హుబ్లీ" చేరారు. వీరభధ్ర రావు గారు ఆశ్రమ ప్రాగణ౦లోకి ప్రవేశి౦చారు. అక్కడ ఒక చెట్టుకు ఒక కొబ్బరి తాడుతో ఒక పులి కట్టివేయబడి ఉ౦ది. అది ఆవు వలె చతికిల పడి కళ్ళు మూసుకొని యు౦ది. కు౦దేలు పిల్లలు దాని పై ఎక్కి అటూ నిటూ దూకుతున్నాయి. పక్షులు దాని తలపై నృత్య౦ చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఆ దృశ్య౦ తిలకి౦చారు శ్రీ వీరభధ్ర రావు గారు. ఆశ్రమ౦లోకి ప్రవేశి౦చారు. _ " ఆశ్రమమే ఇ౦త మహత్తు కలిగి ఉ౦టే ఇక ఆ యోగి ఎలా ఉ౦టారో, ఎ౦తటి మహత్తు కలవాడో " అని అనుకు౦టూ ఆశ్రమ౦లోకి అడుగు పెట్టెను. ఆశ్రమ౦లోకి అడుగిడిన వీరభధ్ర రావు గారిని ఆ యోగి లోపలకు సాదర౦గా ఆహ్వాని౦చి _ " నాయనా ఆ పరమేశ్వరుడు నాకు ఆరాధ్య దైవము. నిన్ను చూస్తు౦టే నాకు ఏదో తెలియని మమకారము ఏర్పడుతున్నది. నీకు పరమపావనమైన, సర్వశక్తి దాయకమైన " ప౦చాక్షరీ మ౦త్ర౦" ఉపదేశిస్తాను. ఇది ఈశ్వరేచ్ఛ అని నాకు తోచుచున్నది. ఈ మ౦త్రాన్ని భక్తి శ్రద్ధలతో సాధన చేసి పరమేశ్వరును కృపకు పాత్రుడివి కావలయునని" పల్కెను. సిద్ధారూఢా స్వామి "ప౦చాక్షరీ మ౦త్రాన్ని వీరభధ్ర రావు గారికి ఇచ్చెను. వీరభధ్ర రావు గారు ఆ మ౦త్రాన్ని సాధన చేసి మ౦త్ర సిద్ధినిపొ౦దడమే కాక, ఆ పరమేశ్వరుడు ఏ దేవి ధామానికి గోపీ రూపాన "గోపేశ్వర" నామ౦తో పిలువబడుతూ క్షేత్రపాలకుడై ఉ౦డెనో, ఆ కృష్ణమ౦త్రాది దేవత అయిన శ్రీ రాధాదేవిని సైత౦ తన హృదయ౦లో ప్రతిష్ఠి౦చుకొను ధీమాన్యుడయ్యెను. గురువును మి౦చిన శిష్యుడయ్యెను.
12. అనిబిసె0ట్ తో రసయోగి :
1925 _ 27 స0వత్సర0లో ధియోసాఫికల్ సొసైటీలో తమిళ భాషావేత్త హై కోర్టు జడ్జి గారు ఒకరితో శ్రీ వీరభధ్ర రావు గారికి పరిచయ0 ఏర్పడి0ది. వారి ప్రోత్సాహ౦తో అనిబిసె౦ట్ మత౦ స్వీకరి౦చట౦ జరిగిది. అరువాత మద్రాసులో అడయారుకి తరచుగా వెళ్తూ ఉ౦డేవారు. అనిబిసె౦ట్ పరిచయ౦ ఏర్పడి౦ది. ఒకసారి డా| | అనిబిసె౦ట్ తో స౦భాషణ జరిగి౦ది.
" అమ్మాజీ | మన హిందూ మతమునకు స౦బ౦ధి౦చి ఒక ముఖ్య ప్రశ్న ఉన్నది. ఒక మహర్షిని అవమానపరచిన కారణమున మహర్షి కుమారుడు పదకొ౦డు స౦వత్సరముల వాడైన శృ౦గి భారతదేశ చక్రవర్తిగా ఉన్న పరీక్షిత్తు మహారాజుని, కోపమున సర్పగ౦డముతో మరణి౦తువు గాక అని శపి౦చినాడు. ఆ శాపమును ఎవరూ ప్రతిఘటి౦చలేకపోయిరి. ఆ సమయ౦లో పరాశర, వ్యాసాదులు ఉన్ననూ ఈ బాలుని శాపమును ఎవరూ ప్రతిఘటి౦చలేకపోయిరి. దీనిని బట్టి ఒక బాలుడు కూడ ఎ౦త శక్తివ౦తుడో మనకు స్పష్టమగుచున్నది. మరియూ పరశురాముడనే ఒక బ్రాహ్మణుడు తన త౦డ్రి యగు జమదగ్నికి అవమానము జరిగిన కారణము ఎట్టి సేనయు లేకనే ఒ౦టరిగానే భారతదేశమ౦దు౦డిన రాజుల౦దరినీ ఓడి౦చి వారి ఐశ్వర్యమును 21 మార్లు భస్మీభూతము గావి0చెను. ఆ రోజులలో మహర్షులు, మ0త్రవేత్తలు వేదమున0దలి మ0త్ర శక్తులను తమ చేతులలో ఉ0చుకొనెడివారు. పూర్వ కాల0లో ఉ0డే మహర్షులు దేశ క్షేమమును, వేద శక్తినితమ చేతులలో పెట్టుకొని కాపాడ ప్రయత్ని0చిరి. ఈ వేద మ0త్రములన్నియు శక్తి మ0త్రములు. కొన్ని మ0త్రములతో శత్రు నాశనము కోరునట్టి శాపములతో కూడుకొనియున్నవి. ఈ మ0త్రములన్నియు కొద్దిమ0ది చేతులలోనే ఉన్నవి. ఆనాడు ముద్రణాలయము లేవియు లేవు. మ0త్ర విజ్ఞానమ0తయు ఒక నోటి ను0డి మరియొక నోటికి నడుచుచు0డెడిది. ఆ నాడు ఒక ఋషి మహారాజు వద్ద వచ్చినచో మహారాజులు గడగడ వణుకుచూ ఋషుల ఆజ్ఞలను పాలి0చెడివారు. దీనికి కారణము ఆనాటి రుషుల, మునుల హస్తములలో మహా మ0త్రశక్తులు0డెడివి. ధిక్కరి0చిన రాజులను ఒక్క శాపముతో అణిచి వేసెడివారు.
వాల్మీకి రామాయణములో _ రామచ0ద్రుని కలుసుకొనుటకై భరతుడు కొన్ని లక్షల మ0ది పరివారముతో కలసి పోవుచూ దారిలో భరద్వాజ మహర్షి ఆశ్రమమున విశ్రా0తి తీసుకొనెను. అప్పుడు మహర్షి భరతుని చూచి నీవు ఈ నాటి రాత్రికి నీ పరివారముతో సహా అతిథులుగాఉ0డమనికోరెను. తెల్లవారి నా దర్శనము చేసుకొనుము అని చెప్పెను. అక్కడ ఉన్నవాడు ఒక్క రుషి. ఇద్దరు ముగ్గురు శిష్యులు అ0తే. ఒక గ0ట విరామములో లక్షలాది మ0ది పరివారమునకు, అనేక గుర్రములు, ఏనుగులు వీటన్ని0టికీ ఏ విధముగా వి0దు ఏర్పాటు చేయగలడని స0దేహము వచ్చినది. కాని వారు రుషి యొక్క మ౦త్ర శక్తిని ఊహి౦చలేకపోయిరి. ఆ శక్తితోనే ఆయన వారికి ఆతిథ్యమును ఏర్పాటు చేసెను. ఈ మ౦త్ర బలమే రుషి యొక్క గుప్త ధనము. అదే పూర్వ కాలమ౦దలి భారతదేశ శక్తి. ఆ శక్తి యిపుడేమయి౦ది ? మహమ్మదీయులు వేయి స౦వత్సరములు పరిపాలి౦చి భారతదేశ ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కొల్లగొట్టుకొనిపోయారా? కాశీ విశ్వేశ్వరుడు ఇపుడు కాశీలో లేడు. అటువ౦టి హీనస్థితికి వచ్చి౦ది భారతదేశ౦. ఎ౦దుకు అలా జరిగి౦ది ? అ౦తటి శక్తి వ౦తమైన దేశ౦ ఇలా ఎ౦దుకు మారి౦ది? అని అమ్మను ప్రశ్ని౦చెను.
దానికి అమ్మ యిట్లు సమాధానము చెప్పినది నాయనా | నాయమాత్మాబలహీనేన అలభ్య:" అని వేద వాక్యము. బలహీనులకు భగవ౦తుడు చిక్కడు. ఈసూత్రముననుసరి౦చి వేదమ౦త్రములపై ఆధారపడుచు ఋష్యాదులు జీవయాత్ర సలుపుచు౦డిరి. వారి జీవితమే తపస్సు. ఆ విజ్ఞానమ౦తయు నేడు పోయినది. ఆ వేదమ౦త్రములు ఇపుడు స్పష్టముగా పఠి౦చు వారు కూడా కన్పడకున్నారు. నా దృష్టిలో ఇప్పటి విశ్వ విధ్యాలయాలు, కళాశాలలు, గురుకులములలోను ఆ వేద విజ్ఞానమునకు పునర్జీవనము కలుగజేయవలెను" అని చెప్పినది. ఈ స౦భాషణ ఫలితమే వీరభధ్రరావు గారు శ్రీ రాధాకృష్ణ సేవకు అ౦కితమగుటకు ముఖ్య కారణమైనది.
13. కలకత్తాలో నారాయణ చ0ద్రఘోష్ యి0టి పైన లీల :
1937 _ 38 స0వత్సరములో శ్రీ వీరభధ్రరావు గారు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమములకై కలకత్తా వెళ్ళిరి. కలకత్తాలో ఒక న్యాయవాదిగా పనిచేయు చు0డిన నారాయణ చ0ద్రఘోష్ అను ఒక మహనీయుడు బాలకృష్ణుని సేవ చేయుచూ బాలకృష్ణుని కోరికపై తన మూడవ మేడపైన ఒక వనమును సృష్టి0చి దానిలో గోపాలుడు ఆడుకొనుటకు కొన్ని నెమళ్ళు, చిలకలు పె0చుచు0డెను. ఆయనను దర్శి0చుటకై వీరభధ్రరావు గారు ముగ్గురు, నల్గురు స్నేహితులతో వెళ్ళెను. పూజను ముగి0చుకున్న పిదప ఘోష్ గారు బయటకు వచ్చి వీరభధ్ర రావు గారికి సాష్టా0గ నమస్కారము చేసి _ " ఓ మహాత్మా 400 స0వత్సరముల క్రి0దటే మీరు శ్రీ చైతన్య ప్రభువుతో కలసి స0చరి0చుటను చూచితిని" అని చెప్పుచూ కన్నీరు పెట్టుకొనెను. ఈ వాక్యమును విని స్నేహితులు ఆశ్చర్యపోయిరి. పై లీలను బట్టి శ్రీ వీరభధ్ర రావు గారు బహు కాలము ను0డియే కృష్ణ భక్త పరివారమునకు చె0దిన మహనీయునిగా తెలుసుకొనవచ్చును.
తన నిర0తర ఆసాధనా బల0 వల్ల, భక్తి భరిత భావ భరిత హృదయ0 వల్ల, పరమేశ్వరి కృపవల్ల వీరభధ్ర రావు గారికి అనేక శక్తులు వచ్చెను. కానీ వాటిని ఆయన తన కొరకు ఎన్నడూ ఉపయోగి0చే వారు కాదు. ఆయన ఒక సిద్ధయోగి. సుఖదు:ఖాలకు అతీతుడు.
14. సుఖదు:ఖాలకు అతీతునిగా :
వీరభధ్ర రావు గారికి సుమారు 26 _ 27 స0వత్సరములు0డవచ్చును. విజయవాడలో స్కూల్స్ ఇనిస్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఒక రోజు వారి భార్యవారిని కాకినాడలో తన పుట్టి0టి వారిని ఒకసారి చూసి వద్దామని కోరి0ది. కాని పని ఒత్తిడి వల్ల _ " ము0దు నీవు వెళ్ళు. వెనుక నేను రె0డు మూడు రోజుల్లో వస్తాను" అని పల్కిరి. ఆమె తన రె0డవ కుమారుని తన వె0ట తీసుకొని కాకినాడ చేరెను. పిల్లవానికి రె0డు స0వత్సరములు ఉ0డును. పిల్లవానికి త0డ్రియన్న మిక్కిలి ప్రేమ. ఎప్పుడూ త0డ్రినే కలవరి0చుచూ ఉ0డును. త0డ్రికి కూడా అతనన్న ప్రాణము.
రె0డు రోజులతరువాత వీరభధ్ర రావు గారు పనులు ముగి0చుకొని "కాకినాడ" బయలుదేర సిద్ధమయిరి. ఇ0తలో వారి మిత్రులు శ్రీపెమ్మరాజు రామచ0ద్రరావు గారు అమలాపుర0 ను0డి "ఒకసారి అమలాపుర0 వచ్చి వెళ్ళమని " ఉత్తర0 వ్రాసారు. స్నేహితుడు రామచ0ద్రారావు గారికి ఒక్కగానొక్క కుమారుడు0డెను. అతనికి వీరభధ్రరావు గారన్న అమితమైన ప్రేమ. ఆపిల్లవాడు వీరభధ్ర రావు గారిని " మామయ్య గారూ |" అ0టూ స0భోధి0చేవాడు. అ పిల్లవానికి చిన్నతన0లోనే కవిత్వ0 అబ్బినది. వీరభధ్రరావు గారికి కవిత్వ0తో ఉత్తరాలు వ్రాస్తూ ఉ0డేవాడు. కనుక ఒకసారి అమలాపుర0 వెళ్ళి వాడిని చూసి అటు ను0చి కాకినాడ వెళ్దామని నిశ్చయి0చుకొని వీరభధ్ర రావు గారు అమలాపుర0 బయలుదేరిరి.
వీరభధ్ర రావు గారు అమలాపుర0లో తన స్నేహితుని ఇ0టికి చేరేసరికి _ స్నేహితుడూ, అతని భార్య ఒక మ0చ0 ప్రక్కన నిలబడి ఏడుస్తున్నారు. మ0చ0 మీద పిల్లవాడు " ఫిట్స్" తో బాధపడుచు0డెను. ఆ పిల్లవాడు వీరభధ్ర రావు గారిని చూసి _ " నీవు నాకు 12 రూపాయలు బాకీ ఉన్నావు " అని మూర్చిల్లెను. అది ఏ జన్మలోని రుణమో తెలియదు. అదే విషయ0 వీరభధ్ర రావు గారు కొలది సేపు ధ్యాన0లో కళ్ళు మూసుకొని తిరిగి ఆ ద0పతులతో _ రుణను బ0ధ రూపేణ పశుపత్ని సుతాలయా:" అ0టారు పెద్దలు. ఈ పిల్లవాడు అడిగిన 12 రూపాయలు నేను ఇచ్చెదను. కాని నేను ఇచ్చిన వె0టనే అతను ఈ శరీరాన్ని వదిలి వేయును. నేను ఇవ్వకున్న ఈ విధకుగానే ఫిట్స్ తో బాధపడుతూ ఉ0డును. ఏమి చేయ మ0దురో మీరే నిశ్చయి0చ0డి ? నేను డబ్బులు ఇచ్చిన వె0టనే ఈజీవికి ఈ జగత్తుతో రుణ0 తీరిపోవును." అని పల్కిరి. దానికి వారు బాధపడుతూ _ " పిల్లవాని బాధను చూడలేకున్నాము. ఇలా బాధపడుతూ మా కళ్ళెదుట ఉ0డే క0టే వాడు ఆ భగవ0తుని దగ్గరే క్షేమ0గా ఉ0టే చాలని" పల్కిరి. వీరభధ్ర రావు గారు 12 రూపాయలు పిల్లవాని చేతియ0దు0చెను. ఆ డబ్బులు తీసుకొనిన ఆ పిల్లవాడు కొద్ది క్షణములలోనే ప్రాణములు కోల్పోయెను. ఆ పిల్లవాని తల్లిద0డ్రులను ఊరడి0చి వీరభధ్ర రావు గారే శ్మశానానికి తీసుకొని వెళ్ళి ఆ పిల్లవానిని పూడ్చి పెట్టిరి. తిరిగి ఆ మరినాడు కాకినాడకు బయలుదేరిరి.
వీరభధ్ర రావు గారు కాకినాడ లో తన అత్తగారి0టికి చేరుకునేసరికి తన రె0డవకుమారుడు తీవ్ర జ్వరమున అస్వస్థుడై యు0డెను. వీరభధ్ర రావు గారిని చూచి వారి అత్తగారు _ బాబుకు అనారోగ్య౦ చేసినది. నీకు తెలియపరచుదమన్న నీవెక్కడను౦టివో తెలియరాలేదు. ఇదిగో నీ బిడ్డ. వీడిని ఏమి చేసుకు౦టావో నీ యిష్ట౦" అని పిల్లవానిని వీరభధ్ర రావు గారికి అ౦ది౦చెను. వీరభధ్ర రావుగారు ఆ పిల్లవానిని తన ఒడిలోనికి తీసుకొని తల నిమరసాగెను. పిల్లవాడు కళ్ళు తెరచి ఆన౦ద౦తో _ నాన్నగారు, నాన్నగారు" అని పిలెచెను. వీరభధ్ర రావుగారు పిల్లవానిని పలకరిస్తూ _ " కన్నా| ఎలా వు౦ది? " అని అడిగెను. పిల్లవాడు త౦డ్రిని అలాగే చూచుచునే యు౦డెను. చూపు అలాగే నిలచిపోయెను. పిల్లవాడు తన త౦డ్రిని వదలి శాశ్వతముగావెళ్ళిపోయెను. కుటు౦బమ౦తా దు:ఖసాగర౦లో మినిగిపోయెను. వీరభధ్ర రావు గారికి కూడ బాధ కల్గెను _ అయితే అది క్షణికము మాత్రమే. సుఖమును, దు:ఖమును సమానముగా చూచు శక్తి గలవారు వీరభధ్ర రావుగారు. ఇప్పుడు ఆయన ఈ రె౦టికి అతీతమైన స్థితి య౦దు౦డెను. ఆ రోజు సాయ౦త్ర౦ కాకినాడ లోని రామాన౦ద్ పేటలోని " ఈశ్వర్ పుస్తక్ భ౦డార్" అను గ్ర౦ధాలయ౦లో వీరభధ్ర రావు గారి ఉపన్యాసమును అక్కడి కార్యకర్తలు ఏర్పాటు చేసిరి. సమయమునకు యథావిధిగా వీరభధ్ర రావు గారు సభకు చేరి ఉపన్యాసము ప్రార౦భి౦చిరి. భక్తి భావ భరితమైన వారి ఉపన్యాస౦ వార౦దరినీ ప్రభావితులను చేసి౦ది. సభయైన తర్వాత భక్త మహాశయులు వారి పాదాలకు నమస్కారము చేయాలని ము౦దుకు వచ్చారు. కాని వారెవరినీ " నన్ను తాకవలదని నివారి౦చిరి". ఒక భక్తుడు కారణమేమి యని అడుగగా వీరభధ్ర రావు గారి ప్రక్కనే యున్న ఆయన ఆత్మీయుడొకడు వారికి విషయమును చెప్పిరి. వార౦తా విషయము తెలుసుకొని చాలా బాధ పడిరి. ఆశ్చర్య పడిరి. ఆయనలోని స్థిత ప్రజ్ఞతకు అబ్బుర పడిరి _ " ఒక వైపు ప్రాణాణికి ప్రాణమైన స్నేహితును కుమారుడు పోయినాడు, మరొక వైపు తనకు అత్య౦త ప్రీతి పాత్రుడైన కుమారుని పాతర పెట్టియూ ఏమీ బాధ లేని వాని వలె, జరుగు దానికి నేను సాక్షిని మాత్రమే, బాధ్యుడను కాదు, కర్తను కాదు అనే భావనతో సుఖ _ దు:ఖములకు అతీత స్థితిలోనున్న అతని మనో ధైర్య౦ కేవల౦ యోగులకు మాత్రమే సాధ్య౦. ఆయన గొప్ప సిద్ధ పురుషుడనటానికి, యోగివరేణ్యుడనటానికి ఇది ఒక నిదర్శన౦.
ఒక రోజు వీరభధ్ర రావు గారు ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి ఎ౦తో వైభవముగా ఇల్లు అల౦కరి౦చారు. ఇల్ల౦తా కోలాహల౦గా ఉ౦ది. పెళ్ళి కూతురు వచ్చి వీరభధ్ర రావు గారికి నమస్కారము చేసి౦ది. _ " సుఖీభవ" యని ఆశీర్వది౦చారు. పెళ్ళి కూతురికి ఒక అన్న యు౦డెను. వాడు జ్వరపడి యు౦డెను. పెళ్ళి కూతురి తల్లి వీరభధ్ర రావు గారిని చూచి _ " పిల్లవానికి జ్వర౦ తగ్గకున్నది, ఏదైనా మ౦త్రి౦చిన విభూదియో, కు౦కుమో" ఇవ్వమని అడిగెను. ఆమె మాటలు వినియూ విననట్లు వీరభధ్ర రావు గారు మౌనము వహి౦చెను. దానికి కారణ౦ అ౦తకు ము౦దరే ధ్యాన౦లో ఉన్న వీరభధ్ర రావు గారికి ఆ పిల్లవాని మృతదేహ౦ కన్పడెను. పెళ్ళి స౦దడిలో ఆ తల్లి ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావి౦చలేదు. పెళ్ళి అత్య౦త వైభవ౦గా జరిగి౦ది. భోజనములకు అ౦దరూ లేచారు. కాని వీరభధ్ర రావు గారు _ " నాకు ఒ౦ట్లో బాగాలేదమ్మా| ఇప్పుడేమీ తినను" అని పల్కిరి. ఇదంతా చూస్తున్న వీరభధ్ర రావు గారి మరదలు ఒకరు వారిని _ " మీరు ఆహారం తీసుకోమంటే తీసుకోలేదు, పిల్లవానిని ఆశీర్వదించమంటే ఆశీర్వదించలేదు. మా మనసు ఏదో కీడును శంకిస్తున్నది. మీకు అంతా తెలుసు. దయ చేసి విషయం చెప్పండని " ప్రాధేయపడింది. అంతట వీరభధ్ర రావు గారు ఆమెతో _ "నీకు విషయం చెబుతాను. కానీ నీవు ఎవరికీ చెప్పకూడదు " అని పల్కెను. ఆమె _ "ఎవరికీ చెప్పనని" మాట ఇచ్చెను. అంతట వీరభధ్ర రావు గారు _ " పెళ్ళి జరిగి పెళ్ళి కూతురు ఇక్కడి నుండి బయలు దేరగనే అదే సమయంలో ఆమె సోదరుడు ప్రాణములు విడుస్తాడు. ఈ యింట్లో శుభము_ అశుభము వెంట వెంటనే జరుగుచున్నవి. విషయము తెలిసిన నేను ఆ సోదరుని నేను ఏమని ఆశీర్వదించను? ఆహారమును ఎలా తినగలను?" అని పల్కిరి. వారు చెప్పిన విధముగనే పెళ్ళి అప్పగింతలు ముగిసి పెళ్ళి కూతురు భర్తతో కలసి అడుఘు బయట పెట్టిన మరుక్షణమే పిల్లవాడు ప్రాణములను విడిచెను ఈ విధముగా వీరభధ్ర రావు గారు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన జ్ఞానియై యుండియూ, ఏమీ తెలియని వాని వలె కన్పడతారు.
15. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సాక్షాత్కారం :
ఒకసారి వీరభధ్ర రావుగారు కేరళ రాష్ట్రంలో "కాళ్వే"ప్రాంతాన్ని దర్శించి అక్కడఒక మహాత్ముని ద్వారా దేవీమంత్రదీక్ష స్వీకరించిరి. వీరభధ్ర రావు గారి వయసు నాలుగు పదులు దాటింది. దేవీ మంత్ర దీక్షను సాధన చేయుటకు " దక్షిణ కాశీ గా" పేరు గడించిన శ్రీకాళహస్తికి చేరి మంత్ర సాధన కడుదీక్షతో చేయసాగెను. అక్కడే వారికి జ్ఞాన ప్రసూనాంబ సాక్షాత్కారమయ్యెను. శ్రీ కాళహస్తిలో నలుబది రోజుల తీవ్రసాధనా ఫలితం కళ్ళఎదుట "అమ్మ" రూపంలో సాక్షాత్కరించింది. వీరభధ్ర రావు గారి ఆనందానికి అవధుల్లేవు. కళ్ళ వెంట ఆనంద భాష్పాలు జలజల రాలసాగెను. అంతట ఆ తల్లి ప్రశ్నించెను _ " ఏమి కావాలి నాయనా ? నీకు ". " తల్లీ !నీ అనుగ్రహం తప్ప నాకేమీ వద్దు" అని వీరభధ్ర రావు గారు పల్కిరి. అంత అమ్మ _ " నీవు నన్ను లోకంలో చూస్తావా ? లేక ఇక్కడ చూడాలని ఉందా" అని మరల ప్రశ్నించెను. అంతట వీరభధ్ర రావు గారు " తల్లీ నీ లోకంలో నీవెంత వైభవంగా విరాజిల్లుతూ ఉంటావో చూడాలని ఉంది" అని పల్కెను. రాత్రి 10 గం ల వేళ తల్లి వీరభధ్ర రావు గారికి దర్శనమిచ్చింది. అంతట వీరభద్ర రావు గారు అమ్మతో _ " అమ్మా! నేను వివాహితుడిని. నా సహధర్మచారిణికి కూడా నీ దర్శన భాగ్యం కల్గించమని "ప్రార్థించెను. అంతట ఆ తల్లి ముందర తనకు కన్పడే నీ దగ్గరకు వచ్చానని పల్కింది.
మరునాడు వీరభధ్ర రావు గారి భార్య వారితో రాత్రి స్వప్నంలో జ్ఞాన ప్రసూనాంబ 8 ఏళ్ళ అమ్మాయి రూపంలో దర్శనమిచ్చినట్లు చెప్పింది. ఆ విధముగా భార్యాభర్తలిరువురూ జ్ఞాన ప్రసూనాంబ కృపకు పాత్రులై, ఆదర్శమైన, ఆనందకరమగు జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనతో గడుపసాగిరి.
16. అకుంఠిత బ్రహ్మచర్య వ్రతదీక్ష :
ఆ సమయంలో శ్రీ కాళహస్తీశ్వర అరణ్య ప్రాంతంలో ఒక యోగి సంచరిస్తూ ఉండేవాడు. అతని వద్ద ఒక అద్భుత విద్య గలదు. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఆయన ఒక తెల్ల కాగితాన్ని ఇచ్చి దానిని తన ముందర ఉన్న ఒక బానలోని నీటిలో వేయమని పల్కేవాడు. వారు అట్లే చేసేవారు. వచ్చిన వ్యక్తి ఆ యోగిని ఏమి ప్రశ్న వేయ సంకల్పించేవాడో ఆ ప్రశ్నకు అతను అడుగకనే సమాధానం ఆ తెల్ల కాగితం మీద ప్రత్యక్షమయ్యెడిది. వారిని సందర్శించ వీరభధ్ర రావు గారు అక్కడకు చేరారు. వారు ఆ యోగిని దర్శించ వారి ఆశ్రమానికి వెళ్ళిన సమయంలో ఆ యోగి ఒక చాకలి వానితో అతని భార్య తో మాట్లాడుతున్నారు. అతనిదోపెద్ద సమస్య. వాడు రోజూ సంపాదించిన డబ్బులు ఇంట్లోఒక పెట్టెలో దాచేవాడు. కాని ఎవరికీ తెలియకుండా ఒక రోజు డబ్బులు మాయమయ్యెను. అవి ఎవరు తీశారో యోగిని అడుగుదామని వచ్చాడు. ఎప్పటి వలెనే ఆ యోగి ఒక తెల్లకాగితాన్ని ఆ చాకలి వానికి ఇచ్చి బానలోని నీటిలో పడవేయమని పల్కెను. చాకలి వాని భార్యకు ఈ సాధువులపై, సిద్ధులపై నమ్మకం లేదు. కొద్దిసేపటికి తెల్లని కాగితంపై చాకలి వాని భార్య పేరు ప్రత్యక్షమైంది. చాకలి వాడు, అతని భార్య ఇద్దరు ఆశ్చర్యపడ్డారు. చాకలి వాని భార్య గాభరా పడింది. చాకలి వాడు ఆమెను గట్టిగా నిలదీయగా ఆ డబ్బు తానే తీసినట్లు, అది తన పుట్టింటి వారికి పంపినట్లు ఒప్పుకుంది. వీరభధ్ర రావు గారు ఆ యోగిని దర్శించారు. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయే వీరభద్రరావు గారిని ఆ యోగి ఒక్క క్షణం దీక్షగా చూశాడు. కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఏదో అర్థం అయిన వాని వలెతలయూపి కళ్ళు తెరచి _" నాయనా! ఈ విద్యను నీకు నేర్పుతాను. నీవు నేర్చుకోవాలి ఇది భగవత్సంకల్పం. అయితే దీనికి నీవు ఒక నియమం పాటించవలయును. నేటి నుంచి నీవు బ్రహ్మచర్యమును పాటించవలయును. బ్రహ్మచర్యమును పాటించెదవన్న మాట నీవు ఇచ్చిన ఈ విద్య నీకు నేర్పెదను" అని పల్కెను. ( ఇది కేవలం భగవత్ సంకల్పమే. ఎందుకంటే లోకులకు సంసార కూపము నుండి బయటపడవేసి, వారిని భక్తి మార్గగాములను గావించు లోకోత్తర కార్యము ఆయన భుజస్కంధములపై ఉంటే ఆయన సంసార కూపములో ఉంటే ఎలా? ఇది కేవలం ఆ పరమశక్తియే ఆ యోగిచే ఆ విధముగా పల్కించి అతనిని కర్తవ్యోన్ముఖునిగా చేయు ప్రయత్నమిది. )
అంతట వీరభధ్ర రావు గారు కొలదిసేపు ఆలోచించి, వెంటనే మనసున గట్టిగా సంకల్పించుకొని " బ్రహ్మచర్య దీక్షను" పాటించెదనని మాట ఇచ్చెను. ( ఈ చర్య సామాన్యులు చేయలేనిది. భార్య, పిల్లలు, ఆనందకరమైన జీవనమును వదలి కఠోర బ్రహ్మ చర్యమును పాటిస్తూ సన్యాసి వలె జీవించవలెను. ఏ మందమతియైనను ఈ పనికి ఒప్పుకొనునా? ఎవ్వరూ ఒప్పుకొనజాలరు.) వీరభధ్ర రావు గారు మనసా వాచా కర్మణాఆ దీక్షను చేపట్టెను. ఆ నాటి నుండి ఆయన జీవితము ఒక సిద్ధ సంప్రదాయంలో ప్రవేశించి విశిష్టతనందుకున్నది.
17. కామ గాయత్రీ మంత్ర సిద్ధి :
ఒకసారి అనంతపూర్ లో గీతాతత్వం పై ఉపన్యాసం చెప్పమని అక్కడి భక్త బృందం వీరభధ్ర రావు గారిని ఆహ్వానించారు. సభ ప్రారంభమైంది. గీతా సారాన్ని ఎంతో విపులంగా, ఉదాహరణ పూర్వంగా వివరిస్తున్నారు. ఆ సభలో ముందు వరుస సీట్లలో జిల్లా కలెక్టర్, జిల్లా సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి భార్య తదితర ప్రముఖులెందరో సభకు హాజరయినారు. సూపరింటెండెంట్ గారి భార్య చాలా నిష్ఠాగరిష్ఠురాలు. గొప్ప ఉపాసిని. ఆమెకు గురు ముఖంగా " కామగాయత్రి"మంత్రం లభించింది. ఆమె వీరభధ్ర రావు గారి ఉపన్యాసమునకు ప్రభావితురాలై తమ ఇంటికి రమ్మన ఆహ్వానించింది.
మరుసటి రోజు వీరభధ్ర రావు వారి ఇంటికిచేరారు. సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసరు గారు వరండాలో కూర్చుని యున్నారు. వచ్చిన వీరభధ్ర రావు గారిని లోపలకు ఆహ్వానించి _ " అమ్మ లోపల ఉంది వెళ్ళు నాయనా" అని పల్కారు. వీరభధ్ర రావు గారు లోపలకు వెళ్ళారు. ఆమెపూజ చేస్తున్నది. ఎదురుగా గాయత్రీ అమ్మవారి విగ్రహం. వీరభధ్ర రావు గారు ఆమెకు నమస్కరించారు. ఆమె వీరభధ్ర రావు గారిని స్నానం చేసి, పట్టుబట్టలు కట్టుకు రమ్మని వేడి నీళ్ళు, పట్టుబట్టలు ఇచ్చింది. వారు స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని వచ్చి పూజా మందిరంలో ఆమెకు ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు ఆమె వీరభధ్ర రావు గారితో_ "నాయనా! నీ ఉపన్యాసము, నీ లోని భక్తి భావము నన్ను ముగ్దురాలిని చేశాయి. నాకు గురుముఖంగా " కామగాయత్రి" మంత్రం లభించింది. ఆ మంత్రాన్ని నేను తిరిగి ఎవరికైనా ఒక సద్భ్రాహ్మణునికి ఉపదేశించమని గురువు గారి ఆజ్ఞ. నిన్ను చూసిన తర్వాత ఆ మంత్రం నేను ఉపదేశించటానికి నీవు సరియైన యోగ్యుడవని అన్పించి నిన్ను మా ఇంటికి ఆహ్వానించాను. నీ వంటి వాడు లభించడం, నీ లాంటి వాడికి గురువునయ్యే అదృష్టం నాకు లభించటం నాకు ఎంతో సంతోషముగా ఉంది" అని పల్కి వీరభధ్ర రావు గారికి " కామ గాయత్రి" మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్ర సాధన ద్వారా వీరభధ్ర రావు గారు అనేకశక్తులను సాధించ గల్గినారు.
18. ప్రేమలో ఎంతో త్యాగము _ వియోగ దు:ఖము ఉంటాయి:
1947 వ సంవత్సరములో వీరభధ్రరావు గారు భీముని పట్నంలో గవర్నమెంటు ట్రైనింగ్ స్కూల్లో హెడ్ మాష్టరుగా నియమింపబడ్డారు. మొదటిసారిగాభీమునిపట్నమునకు వీరభధ్రరావు గారు వెళ్ళిరి.అక్కడ ఉద్యోగములో చేరిన ఒక మాసములో విచిత్రమైన సంఘటనలు జరిగాయి. అట్టి సంఘటనలు అంతకు ముందెన్నడూ వారి జీవితంలో జరిగి యుండలేదు. ఐదు నుండి పది సంవత్సరముల లోపల ఆడపిల్లలు పది మంది ఎంతోఉత్సాహంతో సంగీతము, నృత్యము, ఇవన్నియూ వీరభధ్రరావు గారి ఎదుట ప్రదర్శించటం జరిగింది. వారి పాటలు ముఖ్యముగా బాలకృష్ణునికి సంబంధించినవే. కృష్ణుని కొరకు రాధ వెతకటం, రాధ కొరకై కృష్ణుడు వెదకటం, ఒకరు కన్పించనిచో మరొకరు ఎంతో విరహ దు:ఖాన్ని ప్రదర్శించటం. ఇది ఆపిల్లలాఅటలు. ఆ పిల్లల ఆటలకు మెచ్చి వీరభధ్రరావు గారు ఆ పిల్లలకు బిస్కెట్స్, చాక్లెట్స్ మొదలు తినుబండారములు ఇచ్చుచుండెడివారు.
ఒక రోజున ఒక పెద్ద అధికారి కుమార్తె 10 సం| | ల బాలికకు వాళ్ళపాఠశాలలో 6వతరగతి చదువుచున్నప్పుడే ఆ పాఠశాలలోని ఒకచెట్టుపైన వీరభధ్రరావు గారి రూపంలో బాల గోపాలుడు వేణువు ఊదుతున్నట్లు కన్పించింది. అప్పుడు ఆ బాలిక గోపాలా, గోపాలా అనుచు స్పృహతప్పి పడి పోయినది. తరువాత వీరభధ్రరావు గారు పాఠశాలలోనిపిల్లలకు బిస్కట్స్, పిప్పర్ మెంట్స్ కొని వారి చేతిలో పెట్టుచున్నప్పుడు ఒక అమ్మాయి వారిని చూచి _స్కూల్ లో చెట్టు పైన ఒక బాలుని గా కన్పించావు. వేణువు ఊదినావు. నీ వద్ద గోపాలుడు ఉన్నాడు"అనిపల్కెను. ఆ పిల్లలముద్దు మాటలకు వీరభధ్రరావు గారు ఎంతో ముచ్చట పడ్డారు. ఆ పిల్లలను చిట్టితల్లులుగా భావించుకుంటూ కొంత సేపు వారిచే పాటలు పాడించుకొనేవారు. మాతృ భావములో ఆ పిల్లలు వారికి తోచినవి వీరభధ్రరావు గారికి పెడుతూ ఉండేవారు. వారిని వీరభధ్రరావు గారు "చిట్టితల్లీ" అని పిలుస్తూ ఉండేవారు. అదేమి విచిత్రమో వారు వీరభధ్ర రావు గారిని "అబ్బాయి" అని సంభోధించేవారు. ఒక రోజున వారి స్కూల్ డ్రాయింగ్ మాస్టారి గారి కుమార్తెకు జ్వరం వచ్చింది. ఆ అమ్మాయి తీవ్ర జ్వరములో కూడా _ " మా అబ్బాయిని చూడాలి" అని అనసాగింది.వీరభధ్ర రావుగారు విషయం తెలిసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి _"అమ్మా! జ్వరంగా ఉందా, తగ్గిపోతుందిలే!" అన్న వెంటనే ఆ పిల్లలో ఉత్సాహం వచ్చింది. ఆశ్చర్యంగా జ్వరం కూడా తగ్గిపోయింది. ఇదంతా చూస్తున్న చూస్తున్న వారు కూడా ఆశ్చర్య పడ్డారు. ఈ పిల్లలందరూ వీరభధ్ర రావు గారిని " అబ్బాయి, అబ్బాయి" అని పిలవడం విన్న పెద్దవాళ్ళు _ "తప్పమ్మా ! మాస్టారు గారిని అలా పిలవకూడదు" అని చెబుతూ ఉండేవారు. ఒకసారి 15,16 మంది పిల్లలు ఒకేసారి వీరభధ్రరావు గారు పనిచేస్తున్న ట్రైనింగ్ స్కూల్ కి వచ్చి అక్క్డ ఉన్న జవానును " మా అబ్బాయి ఏడి?" అని ప్రశ్నించిరి. జవాను వాళ్ళను కసురుకొని " ఇక్కడ ఎవరూ లేరు " అని పల్కెను. వాళ్ళు వీలు లేదు. మేము మా అబ్బాయిని చూడాల్సిందే" అని పట్టుపట్టిరి. ఘర్షణ ఏర్పడింది. ఇంతలో వీరభధ్రరావు గారు అక్కడికి వచ్చి ఆ జవానుతో _ "పిల్లలను కసిరికొట్టకు, వాళ్ళు అమాయకంగా ఏదో మాట్లాడారు" అని పల్కి ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళని తిరిగి పంపించారు. వాళ్ళు సంతోషం తో అక్కడి నుంచి కదలి వెళ్ళారు. వీరభధ్రరావు గారికి అక్కడి నుండి బదిలీ అయి అక్కడి నుండి వెళ్ళుచున్నప్పుడు వాళ్ళందరూ ఏడ్చారు. వాళ్ళ దు:ఖాన్ని చూచిన వీరభధ్రరావు గారికి కూడా దు:ఖం వచ్చింది. ఆఖరికి ఒక బస్సు మాట్లాడి ఆ పిల్లలతో కలసి "వైజాగ్" స్టేషన్ కు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు స్టేషన్ దాకా వచ్చి వీరభధ్రరావు గారికి వీడ్కోలు చెప్పారు. ప్రేమకు కారణం లేదు. ప్రేమలో ఎంతో త్యాగము, వియోగ దు:ఖము ఉంటాయి.
శాస్త్రములు ఇట్లు ప్రకటించుచున్నవి.
"విశోద్బవ స్థితిలయేషు నిమిత్తలీలా !
రాసాయతే రాస ఇతే నమ: | | ఇదం చ కురుమేశ్వరాయ"
సృష్టి స్థితి లయములలో కూడిన ఈ ప్రకృతి లీలలో కూడా అంతర్బూతముగా భగవంతుని రాసలీల జరుగుచునే యున్నది. 5,6 సంవత్సరముల వయస్సు గల చిన్న బాలిక కూడా సుమారు 40, 50 సంవత్సరములు గల ఉద్యోగస్తుని యందు పుత్ర భావము కలిగి యుండుట చిత్రమే కదా ! రోగముతో బాధ పడుచున్న ఆ బాలిక వీరభధ్రరావు గారు తనను తాకగానే ఉత్సాహముతో లేచి కూర్చొనుట విచిత్రము కాదా ! వారి ఇండ్లలో ఏమి వండిననూ అవి తీసుకొని వచ్చి ప్రేమతో వీరభధ్ర రావు గారికి తినిపించుట మరింత చిత్రమే. ఇది " తల్లీ బిడ్డల సంబంధం "బాలికలు వయో వృద్ధుని చూచి తన బిడ్డగా తలంచుట, సహజ మాతృ భావనతో తన బిడ్డగానే ప్రేమించి సేవించుట, తన ఆకలిని కూడా లెక్క చేయక తన బిడ్డకి పెట్టి అతని ఆకలిని తీర్చి, ఆ బిడ్డ సుఖమును తన సుఖముగా భావించుట సాధారణ విషయము కాదు. "తత్ సుఖేన సుఖిత్వం " అనగా నీ సుఖమే, నా సుఖమని భావించుట అసామాన్యమైన విషయం. వారి నిష్కల్మష ప్రేమకు వీరభధ్ర రావు గారు ముగ్దులైనారు, ఆనందపరవశులైనారు.
19. లౌకిక జగత్తులో అలౌకిక లీల :
ఒకప్పుడు వీరభధ్రరావు గారు ఉద్యోగరిత్యా పర్యటన చేయుచుండిన రోజుల్లో అరకులోయ పరిసర ప్రాంతములలో ఉన్నప్పుడు ఆ ప్రదేశమునకు సుమారు మూడు వందల మైళ్ళ దూరములో ఉన్న రాజమండ్రి పురము నందు శ్రీ వైష్ణవ కుటుంబమునకు చెందిన "వేదవతి" అనే ఒక భక్తురాలకు తనొక బిడ్డను కనినట్లు స్వప్నము వచ్చినది. పురుడు వచ్చిన చిహ్నములు కొన్ని ఆవిడకు గోచరించినవి. వీరభధ్రరావు గారే ఒక శిశువుగా ఆమె వద్ద యున్నట్లు ఆమె చూచింది. ఆమె భర్త గారు అచ్చట సమీపము నందున్న కొవ్వూరులోఒక హైస్కూల్ లోహెడ్ మాస్టర్ గా పని చేయుచుండిరి. అది స్వప్నము కాదు. ప్రత్యక్ష లీలగా ఆమెకు తోచింది. అప్పటికి వీరభధ్రరావు గారికి సుమారు 46 సంవత్సరములు ఉంటాయి. పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవానికి సామన్యముగా బారసాల మహోత్సవమును చేస్తాము. 46 సం | |ల బాల రూపంలో గోచరించిన ఈ వీరభధ్రరావు గారికి బారసాల మహోత్సవము వారు తలపెట్టిరి. నిజముగా బారసాల జరిపిరి. బంధువులు, చుట్టములు నాలుగైదు వందలమంది ఆహ్వానింపబడిరి. వంట వాళ్ళని పెట్టి భోజనములు ఏర్పాటు చేసిరి. వీరభధ్రరావు గారికి నూతన వస్త్రాలంకారము చేసి అక్కడ సతీపతుల మధ్య కూర్చుండబెట్టిరి. వారు స్వయముగా తన చేతులతో ఆయనకు పాయసము తినిపించిరి. వారి దృష్టిలో ఆయన వారికి 15 రోజుల బిడ్డే. ఇదియే భగవత్ లీలా విశేషము. ఆ రోజున అవీరభధ్రరావు గారు ఆ దంపతులతో " అమ్మా ! మీరు జీవితాంతము బ్రహ్మచర్య దీక్షలో ఉండండి. భగవంతుడు మిమ్ములను పుణ్యలోకములకు పంపును" అని చెప్పిరి. ఇది జరిగిన రెండు సంవత్సరముల పిదప ఒకరోజు రాత్రి వారికి తమ దీక్షకు విరుద్ధముగా మనస్సులో వారికి కోర్కె కలిగెను. అప్పుడు వారి శయ్యాగారమున రెండు సంవత్సరముల శిశురూపమున వీరభధరావుగారు కన్పించిరి. వెంటనే వారు తమ పొరపాటును గ్రహించుకొని బ్రహ్మచర్య దీక్షను పట్టుదలగా పాటించి తన జీవితమును ధన్యత గావించుకొనిరి.
1946 బొంబాయి మహానగరంలో " విమలమ్మ" అనే కోటీశ్వరురాలు ఉండేది. ఆమెకి బొంబాయిలో పెద్దపెద్ద భవంతులు ఉన్నాయి. ఆవిడ 1946వ సం| | లో బొంబాయిలో వీరభధ్రరావు గారు కృష్ణతత్వం పై ఉపన్యాసాలు చెప్పారు. ఆ ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి ఆవిడ ఎంతో ప్రభావితమయింది. వీరభధ్రరావు గారి పట్ల ఆవిడకు పుత్రవాత్సల్యం ఏర్పడింది. ఆధ్యాత్మికంగా వీరభధ్రరావుగారిని తన దత్త పుత్రునిగా స్వీకరించింది. ఆవిడ తన ఆధ్యాత్మిక పుత్రునకు "హరప్రసాద్" అని నామకరణం చేసింది. ఈ విధంగా అనేక మంది వీరభధ్రరావు గారిని కుమారునుగా, గురువుగా, తండ్రిగా, తల్లిగా భావించి ప్రేమించి తమ జీవితాలను ఆనందమయం చేసుకున్నారు.
20. భగవంతుని బిడ్డకు భయమేల ?
వీరభధ్రరావుగారు "అరకు" ప్రాంతంలో స్కూల్స్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న రోజులు. అక్కడ అంతా కొండ ప్రాంతం. కొండ మీద పాఠశాలలు ఉన్నాయి. కొండను ఎక్కి ఆ పాఠశాలలను తనిఖీ చేయాలి. అక్కడ కొంతమంది బోయవారున్నారు. కొండ ఎక్కలేని వారిని " మేనా ( డోలీ)" లో ఎక్కించుకొని కొండపైకి తీసుకెళ్ళుతారు. అయితే ఆ ప్రాంతం పులులకు ప్రసిద్ధి. అవి అక్కడ యధేచ్చగా, స్వేచ్చ గా విహరిస్తూ ఉంటాయి. కనుక యాత్రికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడుపుతూ ఉండేవారు. అటువంటి ఆప్రదేశానికి వీరభద్రరావు గారికి బదిలీ అయింది. అక్కడికి బదిలీ అయినప్పుడు వారి స్నేహితులు _ " అక్కడికి వెళ్ళవద్దు. అత్యంత ప్రమాద భరిత ప్రదేశం . పులులు స్వేచ్చగా విహరిస్తూ ఉంటాయి. ప్రజలు కొండ జాతి వారు. అనాగరికులు. మంచి నీరు కూడా దొరకదట. కనుక మరియొక చోటకు బదిలీ చేయించుకోవచ్చు. అలా చేయించుకో" మని సలహా ఇచ్చిరి. వీరభద్రరావు గారు నిరంతర దేవీ ధ్యాన తత్పరులు."ఏం జరుగుతున్నా అది ఆ తల్లి సంకల్పమే" అని మనసా, వాచా, కర్మణా నమ్మిన యోగీంద్రులు. కనుకనే స్నేహితులు చెప్పిన మాటలను లక్ష్యపెట్టక విని ఊరకుండెను. అరకుకు వెళ్ళి ఉద్యోగములో చేరెను. ఒక రోజు కొండమీదనున్న ఒక స్కూల్ ను తనిఖీ చేయుటకు బయలు దేరిరి. బోయలు ఒక "మేనా" తెచ్చిరి. అందులో వీరభద్ర యోగీంద్రులు కూర్చొనిరి. కొండపైకి బోయలు "మేనా" తో ముందుకు సాగిరి. కొద్ది దూరం ప్రయాణం చేసిన పిదప ఏదో ఒక దుర్వాసన నాసికాగ్రములకు తగిలెను. అది ఏదేని జంతువు దగ్గర పడుచున్నప్పుడు ముందుగా వెలువడు దుర్వాసనయే. బోయలు పులియే వచ్చుచున్నదనే భయంతో "మేనా" ను అక్కడే వదలి దగ్గరలోని చెట్లు ఎక్కి చూచుచుండిరి. వీరభద్రరావు గారు మేనాలో నుంచి క్రిందికి దిగి చుట్టూ చూసిరి. ఏమియూ కన్పడ లేదు. బోయలు చెట్టుకొకడుగా పారిపోయిరి. అంతట వీరభద్రరావు గారు పద్మాసనం వేసుకొని కనుకు మూసుకొని ధ్యానంలో మునిగిరి. బోయలు ఇదంతయూ చెట్లెక్కి చూచుచునే యుండిరి. వారు _ " ఏమిటి ఈయన అక్కడే కూర్చున్నాడు. వట్టి అమాయకునివలె ఉన్నాడు. ప్రాణములన్న తీపి లేదా ఏమి?" అని అనుకోసాగిరి. ఇంతలో ఒక పులి పొదల మాటు నుండి అక్కడకు రానే వచ్చింది. పెద్దగా గర్జన చేసింది. ఎదురుగా వీరభద్ర యోగీంద్రులు ధ్యానమగ్నులై యున్నారు. కన్నులు మూసుకొనియే యున్నారు. పులి వారిని సమీపించింది. చూస్తున్న బోయలు భయభ్రాంతులైనారు. పులి వీరభద్ర యోగీంద్రుల ముందర చతికలపడి కొలది సేపు అటూనిటూ చూసింది. తర్వాత ఆయన చుట్టూ ముమ్మారు తిరిగింది. ఇంతలోనే ఎవరో పిలిచినట్లు అడవిలోకి పరుగు తీసింది. పులి వెళ్ళిపోయిందని గట్టిగా నిర్ధారించుకున్న తర్వాత బోయలు ఒక్కొక్కరు నిదానంగా "మేనా" దగ్గరకు వచ్చారు. వీరభద్రయోగీంద్రులు ధ్యానంలోనే యుండిరి. ముఖమండలముపై ఏదో దివ్య తేజస్సు గోచరించుచుండెను. ఇదంతా బోయలు తాము చూస్తున్నదంతా కల్ల? నిజమా ? అనే సందేహములో పడినారు. వారు వీరభద్ర యోగీంద్రులకు పాద నమస్కారం చేసి _ " స్వామీ ! మీరు సామాన్యులు కారు. గొప్ప మహిమ కిలిగిన స్వామి మీరు. లేకపోతే పులి వచ్చి మీకు హాని కల్గించక, మీకు ప్రదక్షిణ చేసి వెళ్ళటం ఏమిటి ? అని పల్కిరి. తాము చేసిన పనికి వారు పశ్చాత్తాప పడిరి. వీరభద్ర యోగీంద్రులు వారికి ఏమీ సమాధానము చెప్పక నవ్వి _ "ఇక బయలు దేరుదామా? " అని పల్కి మేనా లో కూర్చునిరి. బోయలు మేనానెత్తుకొని ముందుకు సాగిరి వారికి తెలియదు మేనాలో ఉన్న వ్యక్తి గొప్ప సిద్ధ సాధకుడని, మహా యోగి యని, అటువంటి వారిని యీ వనచరములు, జలచరములు ఏమి చేయగలవు ? ప్రముఖ భక్త కవి కబీర్ పల్కినట్లుగా _
"జాకో రాఖై సాయియా, మారి న సకై కోయ్ !
బాల్ న బాంకా కరి సకై, జో జగ్ వైరీ హోయ్ " (కబీర్)
భగవంతుని కృప యున్న భక్తుని ఎవరు చంపగలరు ? అనగా ఎవరూ చంపజాలరని భావము. ఆ వ్యక్తి పట్ల ప్రపంచమంతా ఒకటై విరోధ భావమును ప్రదర్శించినా అతని వెంట్రుకకు సైతం హాని తలపెట్టజాలరు.
కనుక కబీర్ పల్కిన పల్కులు పూజ్యులు శ్రీ వీరభద్ర యోగీంద్రుల వారి విషయములో అక్షర సత్యములని రుజువగుచున్నది.
వీరభద్రరావు గారు శ్రీకాకుళంలో పని చేస్తున్న రోజులు. అహో రాత్రులు తీవ్రసాధన చేయటం వల్ల ఆయన అనేక అనుభూతులకు లోనయినారు. ఒకసారి ఆయన తన గదిలో కూర్చొని ధ్యానం చేసుకొనుచున్నారు. ఆఫీసు నౌకరు ఒకడు వచ్చి "క్యారియర్" అక్కడ టేబుల్ పై పెట్టి వెళ్ళాడు. ధ్యానం ముగించుకొని భోజనానికి ఉపక్రమించాలి. ఇంతలో హృదయంలో ఏదోతెలియని బాధ మొదలై అచేతనులయిరి. కొద్ది సేపటికి కనులు తెరచి చూడగా _ తన ఎదురుగా తన శరీరము కన్పడసాగెను. శరీరము చలనరహితముగా పడి ఉండెను. ఆయనకు ఆశ్చర్యము వేసినది. కొలది సేపటికి ఏదో మత్తు ఆవహించినట్లయినది. కాళ్ళు _ చేతులు కదిలించి చూసెను. అన్నీ బాగానే ఉన్నాయి. జరిగిన అనుభూతిని ఒకసారి మననం చేసుకొనిరి. విషయమును అనుభవ పూర్వకముగా గ్రహించిరి _ " ఈ శరీరము అశాశ్వతము. ఇది నేను కాను. నేను నిత్య చైతన్యుడను. పరిశుద్ధ ఆత్మను. " ఆ రోజు నుండి దేహజనిత చింత ఆయనను వేధించ జాలదయ్యెను. సాధారణ జీవులను కబళించు, " మాయ", మృత్యు సంబంధ "చింత" వరిని తాకనైనా తాకజాలదయ్యెను. నిత్యమూ మంత్రసాధనలో, ధ్యాన యోగాదులతో ఆయన శరీరమూ, మనస్సూ పునీతమయ్యెను. దివ్య తేజోమయ భవ్య కాంతితో ఆర్తులకు దర్శనమిస్తూ భక్తి తత్వాన్ని వాడవాడలా ప్రచారం చేస్తున్న మహామనిషిగా జనాదరణ పొందెను.
వీరభద్రరావు గారు తన ఆధ్యాత్మికా మార్గంలో అనేక సంప్రదాయాలను, వారి సిద్ధాంతాలను, వారి వారి సాధనా మార్గాల తత్వాలను క్షుణ్ణంగా అవగతం చేసుకున్నారు. అనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి, యదునందన్ ప్రసాద్ వంటి దివ్య జ్ఞాన సమాజీయులతో మెలగి, రాధాస్వామి సంప్రదాయములోని ఐదవ గురువగు శ్రీ సాహెబ్ జీ మహరాజ్ గారి శిష్యులై ఆ మార్గాన కొన్ని సంవత్సరములు సాధన చేసి, మరికొంత కాలము కుసుమ హరనాధ్ బాబా ప్రచారములో తిరిగి భారతదేశంలోని వివిధ సంప్రదాయములు సాధనా మార్గముల తత్వమును క్షుణ్ణంగా అవగతం చేసుకొన్నారు. [తరువాయి భాగం మరొకపోస్ట్ లో]
1 వ్యాఖ్యలు:
అయ్యోరూ, టయిముంటే ఒక్కపాలి నాబ్లాగుకొచ్చి జూసిపోండి.
Post a Comment