శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగ స్వామిచరితం -౩

>> Sunday, May 13, 2012

తన ఎదుట ఉన్న దైవస్వరూపులైన స్వామివారి పాదాలను పట్టుకొని నమస్కరించి, తనకు సంక్రమించిన భయంకర వ్యాధి నుంచి విముక్తిని ప్రసాదించమని ప్రార్థించాడు. కరుణామయులైన స్వామీజీ గంగానదిలోని మట్టిని తెచ్చి తినమని చెప్పి, తాము స్నానానికి వెళ్లిపోయారు.
ఆ బ్రాహ్మణుడు భక్తిప్రపత్తులతో స్వామి చెప్పినట్లు చేసి, కొద్ది రోజులలోనే రాజయక్ష్మం రోగం నుంచి పూర్తిగా విముక్తుడై దివ్య తేజస్సును పొందాడు. అప్పటినుంచీ అతడు స్వామివారిని సాక్షాత్తు భగవంతునిగానే భావించి సేవ చేయసాగాడు. స్వామివారి పాదధూళిని పరిగ్రహించి, పాదసేవ చేసి, కృతార్థుడయినయితినని భావించేవాడు.
కొన్ని దినాలకు గణపతిస్వామి వేదవ్యాసాశాశ్రం వదిలి, హనుమాన్ ఘాట్‌లో నివసింపసాగారు. ఒక మహారాష్ట్ర మహిళ ప్రతిరోజు విశ్వనాథుని సేవించటానికి వస్తూ ఉండేది. దిగంబరులైన స్వామిని చూసి తిరస్కార భావంతో తొలగిపోతూ ఉండేది. గణపతిస్వామి వారు మాత్రం ఆమెను పట్టించుకొనేవారు కారు. ఒక రోజు ఆమె విశే్వశ్వరుని పూజ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది.
ఆ రాత్రి విశ్వనాథుడు ఆమెకు కలలో కనిపించి ‘‘నీవు ఏ కోరికను పొందవలెనని పూజ చేస్తున్నావో అది నాతో నెరవేరదు. ఏ స్వామివారిని నీవు తిరస్కరిస్తున్నావో ఆయనవల్లనే నెరవేరుతుంది’’ అని చెప్పాడు. అది విని ఆమె ఎంతో పశ్చాత్తాపపడి, తన మనస్సులో పరితపించసాగింది. స్వామివారిని అకారణంగా తిరస్కార భావంతో చూసినందుకు ఎంతో తప్పు చేసిట్లు భావించింది. కాని, స్వామివారు ఏమీ అనకపోవటంవలన తనపట్ల ఆయన దయచూపుతారని ఆశించింది.
మరునాడు ప్రొద్దున ఆమె హనుమాన్ ఘాట్‌కు వెళ్లి, స్వామివారి పాదాలమీదపడి క్షమించమని వేడుకొని- ‘‘నా భర్తకు కడుపులో ఒక పెద్ద పుండు ఉన్నది, దానిని నయము చెయ్యమని ప్రతిరోజు విశ్వనాథుని పూజిస్తున్నాను’’ అని విన్నవించుకొన్నది. ఆమె ప్రార్థనను విన్న స్వామివారు ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, దానిని అతని వక్షస్థలం మీద వ్రాయమని చెప్పారు. గణపతి స్వామివారికి ఆమె భక్తిప్రపత్తులతో నమస్కరించి, ఇంటికి వెళ్లి, వారు చెప్పినట్లు చేసింది. కొద్ది రోజులలోనే ఆమె భర్త పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు.
ఆ తరువాత గణపతిస్వామి హనుమాన్‌ఘాట్‌ను వదిలి, దశాశ్వమేధఘాట్‌వద్ద నివసింపసాగారు. రాంపూర్ నివాసి అయిన శివప్రసాద్ మిశ్రా అనే బ్రాహ్మణుని కుమారుడు పక్షవాతంతో బాధపడుతూ ఉండేవాడు. ఎన్నిమందులు వాడినా అది తగ్గలేదు. ఒకరోజున శివప్రసాద్ మిశ్రా తన కుమారుని తీసుకొని గణపతిస్వామివారిని దర్శించి, ఆ పిల్లవానిని స్వామిపాదాల చెంత ఉంచి, నయం చెయ్యమని ప్రార్థించాడు.
కరుణామయులైన స్వామీజీ ఆ బ్రాహ్మణుని మాటలు విని, ఆ పిల్లవానిని శిరస్సు నుంచి కాళ్లవరకూ చూశారు. ఆ తరువాత అతనిని స్పృశించి ఇంటికి తీసుకొని వెళ్లమని ఆదేశించారు. ఆ బ్రాహ్మణుడు స్వామివారి పాదధూళిని గ్రహించి, ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్లాడు. కొద్దిరోజులకే ఆ బాలుడు పక్షవాతం నుంచి విముక్తుడై ఆరోగ్యవంతుడైనాడు. ఈ విధంగా గణపతి స్వామివారి అసాధారణమైన ప్రతిభ ప్రచారమై నాలుగుదిక్కులా వ్యాపించింది. ఎందరో స్వామివారి వద్దకు వచ్చి, తమ కోర్కెలను తీర్చమని ఎన్నోవిధాల కోరుకునేవారు. అందువలన స్వామివారి పారిమార్థిక జీవనానికి విఘ్నం కలుగసాగింది. అందుకు స్వామీజీ వౌనవ్రతం పాటించడం ప్రారంభించారు. ఎవరితోనూ మాట్లాడేవారుకారు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఒకటిరెండు మాటలు మాత్రం మ్లాడేవారు. ఎవరు ఏది ఇచ్చినా కులగోత్రాలు లెక్కపెట్టక తినేవారు.
కాశీవాసులే కాక, ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు కూడా, విశ్వనాథుని అన్నపూర్ణను మణికర్ణికను దర్శించినపుడు ఎలాంటి తృప్తిని పొందేవారో, అట్లాగే ఈ మహాత్ముని దర్శించి కూడా ధన్యులమైనామని భావించేవారు.

-స్వామివారి అసలు పేర్లయిన త్రైలింగధరుడు- గణపతిస్వామి వంటివి వారికి తెలియకపోవడంవలన, త్రిలింగ దేశానికి చెందినవాడని తెలుసుకొని, ఆయనను త్రైలింగస్వామి అని పిలువసాగారు.

అన్నపానీయాల విషయం గురించి ఆయన ఏమీ పట్టించుకోకపోవటం వలన ఒకరోజున ఒక దుర్మార్గుడు సున్నం కలిపిన నీటిని ఆయన చేత త్రాగించేడు. స్వామి నిర్వికార చిత్తంతో దానిని త్రాగి, అతని ఎదుటనే మూత్రవిసర్జన చేసి, నీటిని సున్నాన్ని వేరుచేసి చూపించారు.
ఒక రోజున ఒక ధనవంతుడు ఇరవై తులాల బంగారు కంకణాలను చేయించి స్వామివారి చేతులకు తొడిగాడు. ఆ కంకణాలను దొంగిలించదల్చిన కొందరు దుష్టులు స్వామివారికి తెలియకుండా ఆయన చేత మద్యపానం చేయించారు. అయినా స్వామీజీ మూర్ఛితులుకాని, క్రుద్ధులు కానీ కాలేదు. పైగా వారి ఉద్దేశ్యాన్ని గ్రహించి, తన చేతికి ఉన్న కంకణాలను తీసి వారికి ఇచ్చివేశారు.
సాధారణంగా కాశీపట్టణానికి ధనవంతులు వచ్చేవారు. వారిలో చాలామంది త్రైలింగస్వామివారికి బహుమూల్యములైన వస్తువులను భూషణములను తెచ్చి సమర్పించుకొనేవారు. కాని ధనలోలురు, దుష్టులు అయినవారు వాటిని దొంగిలించేవారు. స్వామివారు మాత్రం దానిని గురించి పట్టించుకొనేవారు కాదు.
త్రైలింగస్వామి దిగంబరులై తిరుగుతూ ఉండేవారు. అందువలన కొందరు పోలీసులు ఆయనను పట్టుకొని పోయి జిల్లా న్యాయాధిపతిముందు నిలబెట్టారు. న్యాయాధిపతి అట్లా తిరగటానికి వీలులేదని శాసించాడు. ధోవతి కట్టుకోవాలని ఆదేశించాడు. స్వామీజీ దాన్ని పట్టించుకోలేదు. న్యాయాధిపతికి కోపం వచ్చి బేడీలు వేసి చెరసాలలో పెట్టమని ఆదేశించాడు. వెంటనే పోలీసులు ఆయనకు బేడీలు వేయటానికి దగ్గరకు వెళ్లగా, స్వామీజీ వారికి కనబడలేదు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు. వారు ఆ ప్రదేశమంతా దాదాపు గంటసేపు వెదికినా కనబడలేదు. ఆ తరువాత స్వామీజీ న్యాయాధిపతి ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. స్వామీజీ ఎట్లా మాయమయ్యారో, మళ్లీ ఎట్లా ప్రత్యక్షమయ్యారో వారికి అర్థం కాలేదు. అదిచూసి వారంతా ఆశ్చర్యచకితులైనారు. న్యాయాధిపతి కొంతసేపటికి తేరుకొని, స్వామివారు తమకు నచ్చినవిధంగా తిరుగవచ్చునని అనుమతినిచ్చాడు.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు మరొక అధికారి వచ్చాడు. ఆయన చాలా తీవ్రస్వభావం కలవాడు. ఒకరోజు ఆయన దృష్టి స్వామివారి మీద పడింది. స్వామీజీ దొంగ సాధువు అని తలంచి చెరసాలలో పెట్టి బంధించాడు. మరునాడు ప్రొద్దున ఆయనకు ఒక విచిత్ర సంఘటన కనిపించింది. అదేమిటంటే- స్వామీజీని బంధించిన చెరసాల అంతా బాగా నీళ్లతో తడిసి ఉండింది. చెరసాల తలుపుకు వేసిన తాళం అట్లాగే ఉండింది. కాని స్వామీజీ మాత్రం చెరసాల బయటివైపున అటూ ఇటూ పచార్లుచేస్తూ కనిపించారు. వెంటనే ఆ అధికారి- ‘‘నీవు చెరసాలనుంచి బయటకు ఎట్లా వచ్చావు? ఇంత నీరు చెరసాలలోకి ఎట్లా వచ్చింది?’’ అని అడిగాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి ‘‘అర్థరాత్రి నాకు మూత్రవిసర్జన చేయవలసి వచ్చింది. గదికి తాళంవేసి ఉండటంవలన గదిలోనే మూత్రవిసర్జన చేశాను.
ఉదయం కాగానే బయటకు పోవాలనే కోరిక కలిగింది. చూసేసరికి గది తలుపులు తెరిచి ఉన్నాయి. నేను బయటకు వచ్చేశాను. మీరు ఎవరి జీవితాన్నీ తాళంవేసి బంధించలేరని నిశ్చయంగా తెలుసుకోండి. ఒకవేళ ఆ విధంగా బంధించగలిగినా, వారిని మరణ సమయంలో బంధించి మరణం రాకుండా కాపాడగలరా? అంతకుముందు కూడా ఎవరూ మరణించరు. ఎవ్వరికీ అలాంటి శక్తి లేదు. మరి మీరు ఎందుకు అంతగా కోపగిస్తున్నారు?’’ అని అన్నారు. ఆ విచిత్ర సంఘటనను తన కళ్లారా చూసిన ఆ అధికారి అవాక్కయిపోయాడు.

  • తెలుగు అనువాదం: ఆచార్య హరిశివకుమార్ ఆచార్య రేగులపాటి మాధవరావు
  • 13/05/2012

ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.
ఒకరోజున ఖాలీస్‌పురా నివాసి అయిన దేవనారాయణ వాచస్పతి అనే పండితుడు స్వామివారిని భోజనానికి ఇంటికి తీసుకొనివచ్చాడు. భోజనం అయిన తరువాత త్రాగటానికి నీరు కావాలన్నారు స్వామీజీ. నీరు తేవటానికి వాచస్పతి ప్రక్క గదిలోకి వెళ్లాడు. తిరిగి రావడంలో కొంచెం ఆలస్యం అయింది. వాచస్పతి తిరిగి వచ్చేసరికి స్వామీజీ నీళ్లు త్రాగుతూ కన్పించారు. ఆ నీళ్ళు ఆయనకు ఎట్లా వచ్చాయో అర్థం కాలేదు. కాని తాను చేసిన ఆలస్యానికి ఎంతో సిగ్గుపడ్డాడు పండితుడు.
వంగ సంవత్సరం 1195లో ఒక హిందూ స్వతంత్ర రాజు సపరివారంగా కాశీకి వచ్చాడు. గంగానది పట్ల ఆయనకు ప్రగాఢమైన భక్తివిశ్వాసాలు ఉండటంవలన, వారంతా సపరివారంగా నడిచివెళ్లి దశాశ్వమేథ ఘాట్‌లో స్నానం చేయాలని అనుకొన్నారు. కాని రాణి సామాన్యంగా మరొకరి ముందుకు రావటానికి కాని, అసలు బయటకు రావటానికి కాని ఇష్టపడదు. అందువలన వారున్న ప్రదేశం నుంచి స్నానం చేయదలచిన రేవు వరకూ తెరలు కట్టారు. లోపలికి ఎవ్వరూ రాకుండా తెరలు అమర్చబడినాయి.
నియమిత సమయంలో రాజు- రాణి దాసీలతో కలిసి స్నానానికి వెళ్లారు. స్నానం చేయటానికి ముందు వారికి అక్కడ ఎవ్వరూ కన్పించలేదు. కాని స్నానం చేసి బయటకు వచ్చేసరికి దీర్ఘకాయుడైన ఒక దిగంబర పురుషుడు వారి ఎదుట నిలబడి ఉండటం కన్పించింది. రాణి ఆ దిగంబర పురుషుని చూసి సిగ్గుపడి, దాసీ జనంతో తన నివాస స్థలానికి వెళ్లిపోయింది. అదంతా చూడగానే రాజుకు విపరీతమైన కోపం వచ్చింది.
స్వామీజీని దండించడానికి మహారాజు భటులను పంపించాడు. భటులు అక్కడికి రాగానే, రాజుకు ఒక దివ్యరూపంతో స్వామి కనిపించారు. రాజు స్వామీజీని దండించక ఏవో ప్రశ్నలు వేశాడు. స్వామీజీ సమాధానం చెప్పలేదు. ఆ తరువాత స్వామీజీని పైకి పంపించమని ఆదేశించాడు. రక్షకభటులు స్వామీజీని పైకి తీసుకొని వెళ్ళారు. ‘‘మీరు ఇక్కడికి ఎందుకువచ్చార’’ని రాజు స్వామిని ప్రశ్నించాడు. స్వామి దానికి సమాధానం చెప్పలేదు. ఇదంతావింతగా చూస్తూ ఎందరో అక్కడ చేరారు. అందులో స్వామీజీ మహిమలు తెలిసినవారు కొందరు, ఆ మహానుభావునికి ఏ శిక్షా పడకూడదని మనస్సులో భావిస్తూ ఉన్నారు.
వారి కళ్లవెంట కన్నీరు కారుతున్నా రాజుగారి ఎదుట ఏమీ చెప్పలేక, లోలోపల చాలా దిగులు పడసాగారు. వారు ఒకరితో ఒకరు మెల్లిగా మాట్లాడుకున్నదానినిబట్టి రాజుకు ఆ దిగంబర పురుషుని గొప్పతనం తెలిసింది. స్వామీజీ యథార్థ స్వరూపం తెలుసుకున్న రాజు వారిని వదిలిపెట్టమని ఆజ్ఞాపించారు. అయినా ఇద్దరు ముగ్గురు రాజుగారి అనుయాయులు స్వామివారిని అవమానపరిచిన తరువాతనే విడిచిపెట్టారు.
ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్రలో ఒక భయంకర దృశ్యం కనిపించింది. జటాజూటము ధరించి, పులి చర్మం కట్టుకొని, త్రిశూలాన్ని ధరించిన ఒక వ్యక్తి భీషణాకారంతో, కళ్లు ఎఱ్ఱవి చేసి ఈ విధంగా అన్నారు. ‘‘ఓరి దురాచారీ! బుద్ధిహీనుడా! నీవు త్రైలింగస్వామి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి కూడా, ఆయనను అవమానపరిచి పంపించి, నా హృదయానికి చాలా బాధ కలిగించావు. దానికి తగిన శిక్షను నీవు అనుభవించవలసిందే. మూర్ఖుడా! నీవు ఇలాంటి పవిత్ర స్థలంలో ఉండదగిన వ్యక్తివికావు.
త్వరగా నీవు ఈ ప్రదేశాన్ని వదిలివెళ్లు. లేకపోతే నీకు క్షేమం లేదు’’ అని. ఆ భయంకర స్వప్నం కన్న రాజు నిద్రలో పెద్దగా అరిచాడు. ఆ అరుపు విని రాజపరివారమంతా అక్కడికి వచ్చి చూసేసరికి మహారాజు అచేతనంగా పడి ఉన్నాడు. ఆయన కనుగ్రుడ్లు పైపైకిపోతూ ఉండినాయి.అది చూసి గాభరా పడిన పరివారం, కారణం ఏమిటో తెలియక గొడవపడసాగారు. కొద్దిసేపటికి రాజుగారికి తెలివి వచ్చింది. అట్లా పెద్దగా అరవటానికి కారణమేమిటని పరిజనం రాజును ప్రశ్నించారు. కాని మహారాజు ఆ రాత్రి వారికేమీ చెప్పలేదు.

మరునాడు ప్రొద్దున సేవకులను పంపించి స్వామివారిని వెదకించాడు రాజు. స్వయంగా ఆయనవద్దకు వెళ్లి, పాదాలమీదపడి క్షమాపణ వేడుకొన్నాడు. చిదానంద నిర్వికారుడైన స్వామీజీ కోపం చూపకపోగా, ఆ రాజును క్షమించి విశ్రాంతిని ప్రసాదించాడు.
వంగ సంవత్సరం 1207లో స్వామీజీ దశాశ్వమేధఘాట్ వదిలి, పంచగంగా ఘాట్‌లోని బిందుమాధవుని వద్ద నివసింపసాగారు. అప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కారు. ఎక్కడికి వెళ్ళేవారూ కాదు. అప్పటినుంచీ అందరూ ఆయనను ‘‘వౌనీబాబా’’ అనేవారు. స్వామీజీ సంజ్ఞలతోనే అన్నిపనులూ నిర్వహించేవారు. చాలా అవసరమనిపిస్తే, ఒకరిద్దరు పుణ్యాత్ములతో ధార్మిక చర్చ చేసి, దాని అర్థతాత్పర్యములు వివరించేవారు. మనస్సులోని సందేహాలను తొలగించేవారు. అందరిపట్ల దయ చూపుతూ ఉండేవారు.
స్వామీజీతోపాటు అక్కడ మంగళదాస్ ఠాకూర్, ఆయన తమ్ముడు కృష్ణప్రసాద్ ఠాకూర్, వారి తల్లి అంబాదేవి కూడా ఉండేవారు. మంగళదాస్ స్వామీజీకి సేవలు చేస్తూ ఉండగా, అంబాదేవికి వారికి వంట చేసి పెట్టేది. వాళ్లకు ఉన్న ఒక ఆవుకు కృష్ణప్రసాద్ సేవ చేస్తూ ఉండేవాడు. స్వామీజీ వాళ్లందరినీ ఎంతో ప్రేమగా చూసేవారు.
మంగళదాస్‌తో స్వామీజీ సంజ్ఞలతోనే మాట్లాడేవారు. అందువలన మంగళదాస్‌కు కూడా సంజ్ఞలతోనే మాట్లాడటం అలవాటయింది. స్వామీజీ పడుకొనే గద్దెకు దగ్గరలో ఉన్న ఒక గోడమీద చాలా శ్లోకాలు వ్రాయబడి ఉండేవి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా విషయాన్ని గురించి చర్చించటానికి వస్తే, స్వామీజీ మంగళదాసును పిలిచి, ఆ శ్లోకాలలో ఒకదానిమీద వ్రేలుపెట్టి వ్రాయమనేవారు. మంగళదాసు దానిని వ్రాసి ఇచ్చిన వ్యక్తికి దానిని చదివి వివరించమని చెప్పేవారు. ఒకసారి ఇద్దరు బ్రహ్మచారులు వచ్చి ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి వివరణ అడుగగా, స్వామివారు తాను స్వయంగా వ్రాసిన ఇరవై - ముప్ఫై పుస్తకాలనుంచి అవసరమున్న ఒక పుస్తకాన్ని తెప్పించి, అందులో ఉన్న ఆ విషయాన్ని గురించి వివరించమని అనేవారు. ఇంకా ఏదైనా అత్యవసరమైన పరిస్థితిలో రాత్రివేళలో దానిని అర్థమయ్యేటట్లు బోధించేవారు.
స్వామీజీ ఆహారానికి కూడా నియమాలు ఉండేవి కావు. ఒక్క శేరు నుంచి ఒక్క మణుగువరకూ తినేవారు. ఒక్కొక్కప్పుడు అసలు ఏమీ తినేవారు కాదు. ఒక్కొక్కసారి అన్నం తినేవారు. మరొకసారి పాలు త్రాగేవారు. ఒక్కొక్కసారి ఎవరు ఏది ఇస్తే అది తినేవారు.
వంగ సంవత్సరం 1217 ఒకసారి ఉజ్జయినీ మహారాజు కాశీకి వచ్చాడు. ఒక రోజున ఆయన కాశీరాజు భవనం ఉన్న రామ్‌నగర్ నుంచి మణికర్ణికకు నావలో బయల్దేరాడు. ఆయన వెంట ఉన్న బ్రాహ్మణులు వేద పఠనం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఎదురుగా కొంచెందూరంలో త్రైలింగస్వామి నీళ్లపైన ప్రకాశిస్తూ కనిపించారు.
మహారాజు ఆశ్చర్యచకితుడై, ఆయన ఎవరని అడిగాడు. నౌకలో ఉన్న స్వామివారి భక్తుడొకడు ఈ విధంగా చెప్పాడు. ‘‘మహారాజా! ఆయన ఒక గొప్ప యోగీశ్వరుడు. నీటిమీదను, భూమిమీదను ఆయనకు సమానమైన అధికారం ఉన్నది. అసాధారణ గికశక్తిసంపద కల వహాపురుషుడు. ఇంత గొప్ప యోగిపుంగవులు వర్తమానకాలంలో మరెక్కడా కన్పించరు’’ అని అన్నాడు. అది విని మహారాజు ‘‘శరీరంలోని అంతశ్శత్రువులను అణచివేసినవారిని బయటి శక్తులు ఏమీ చేయగలుగుతాయి?’’ అని ప్రశంసించారు. ఆ మాటలు విన్న స్వామివారి భక్తుడు నావను స్వామివారి వద్దకు తీసుకొని వెళ్లమని చెప్పాడు. నావ దగ్గరకు వచ్చిందో లేదో, మహారాజు మనస్సులోని అభిప్రాయాన్ని గుర్తించిన స్వామివారు స్వయంగా నౌకలోకి ఎక్కారు.



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP