శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దివ్యానంద ప్రతీక- శ్రీకృష్ణచైతన్యుడు

>> Monday, April 9, 2012


కుల, మత, జాతి విభేదాలు లేక, ఏ విధమైన నియమనిష్ఠలు లేక, కఠినమైన సాధనలు లేక సులభంగా భగవంతుని పొందడానికి ఏకైక మార్గం భక్తి. జలాశయం విడిచి చేప ఎలా మనలేదో భగవంతుడిని విడిచి భక్తుడు క్షణమైనా ఉండలేడు. అలాగే ‘‘్భక్తుడి హృదయమే నా ఇల్లు. నేనూ భక్తుడూ ఒకటే’’నంటాడు భగవంతుడు. బెంగాల్‌లో జన్మించిన నిమాయి చైతన్యుడు భారతదేశమంతటా పర్యటించి వైష్ణవ సంప్రదాయకుడై కృష్ణ నామ, గాన, సంకీర్తనలను భక్తి పారవశ్యంతో భావోద్వేగంతో వ్యాపింపజేశాడు. దివ్యానందోన్మతుడై చేస్తున్న నృత్య సంకీర్తనలు భక్తకోటిని విశేషంగా ఆకర్షించాయి. శ్రోతల హృదయాలపై చెరగని ముద్రవేశాయి. భక్తిప్రపత్తులను దైవం పట్ల పునరుద్ధరించేందుకు మళ్లీ అవతరించిన శ్రీకృష్ణుడేనన్న భావనతో అందరూ కృష్ణ చైతన్యుడని పిలువసాగేరు.
బెంగాల్‌లోని నవద్వీపంలో పండిత జగన్నాథ శచీదేవి దంపతులకు 1485లో ఫాల్గుణ పూర్ణిమనాడు నిమాయి చైతన్య జన్మించాడు. చైతన్య శరీరం బంగారు కాంతితో మెరిసిపోతుండడంవల్ల గౌరా రంగుడని పిలిచేవారు. పెద్ద కుమారుడైన విశ్వరూపుడు సన్యాసిగా మారిపోవడంతో తండ్రి జగన్నాథ పండితుడు దిగులుపడిపోయాడు. చిన్న కొడుకు చైతన్యుడు కూడా అదే మార్గంలో పయనిస్తుండడం మరీ కుంగదీసి ఆయన అకాల మరణానికి కారణమైంది.
చైతన్యుడు పుట్టిన నవద్వీపం జ్ఞాన విజ్ఞాన కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. తర్క మీమాంస శాస్త్రప్రవీణులకు అది ఆటపట్టు. ఆరేళ్ల వ్యవధిలోనే చైతన్యుడు సర్వశాస్త్ర పండితుడనిపించుకున్నాడు. తర్కశాస్త్ర ప్రవీణుడై దిగ్విజయ పండితుడైన కేశ కాశ్మీరీని వాదనలో ఓడించాడు. చైతన్యుడి మొదటి భార్య లక్ష్మీప్రియ పాముకాటుతో చనిపోయింది. తదుపరి ఉన్నత కుటుంబంలో పుట్టిన రూపవతి, సౌశీల్య అయిన విష్ణుప్రియను వివాహమాడాడు. తన తండ్రి అస్థికలు గంగలో నిమజ్జనం చేసేందుకు గయకు వెళ్లిన చైతన్యుడి జీవితం అక్కడే మలుపు తిరిగింది. కృష్ణ్భక్తుడైన ఈశ్వరపురి అనే గురువు చైతన్యుడికి దీక్ష ఇచ్చి కృష్ణ మంత్రోపదేశం చేశాడు. చైతన్యుడు కృష్ణచైతన్యుడై దివ్యోన్మత్త స్థితికి చేరుకున్నాడు.
నృత్య గాన సంకీర్తనలతో మహామంత్రమైన ‘‘హరే కృష్ణ హరే కృష్ణ .. హరేరామ హరేరామ రామరామ హరే హరే’’ను వివిధ రూపాల్లో జపిస్తూ శ్రోతల్ని తన్మయుల్ని చేసేవాడు. అప్పటికి చైతన్య వయస్సు 22 ఏళ్లు. కృష్ణనామ సంకీర్తనల్ని బిగ్గరగా పాడుకుంటూ మిగతా భక్తులతో, శిష్యులతో ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. అనూహ్యంగా చైతన్యుడి జీవితంలోకి మరో స్వామీజీ ‘కేశవన్ భారతి’ ప్రవేశించాడు. చైతన్యుడు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాస దీక్షను తీసుకోవాలని కృతనిశ్చయుడయ్యాడు. ‘కేశవన్ భారతి’తోబాటు చైతన్యుడు మధురలోని బృందావనానికి వెళ్లాడు. ఈ విషయం తెలిసిన తల్లి తరఫు బంధువులు, మిత్రులు బృందావనం వెళ్లి బలవంతంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడినుంచి తల్లితో కలిసి పూరీలోని జగన్నాథ ఆలయానికి చేరుకున్నాడు. ఇక్కడే చివరి 25 ఏళ్లు గడిచాయి. ఆ కాలంలో 6 సంవత్సరాలు దక్షిణ భారతదేశ పర్యటనకు వెళ్లాడు. వైష్ణవ సంప్రదాయాన్ని, కృష్ణ భక్తిని ప్రచారంచేస్తూ, వేలాది మందిని శిష్యులుగా చేసుకున్నాడు. ‘‘జై శ్రీకృష్ణ చైతన్యప్రభూ.. నిత్యానందా’’ అని పాడుకుంటూ భక్తులు, శిష్యులు తండోపతండాలుగా ఆయనను అనుసరించేవారు. 13వ శతాబ్దికి చెందిన కృష్ణలీలాశుకుడు (బిల్వమంగళుడు) మధురాతి మధురమైన గీతాలతో రచించిన ‘‘శ్రీకృష్ణ కర్ణామృతం’’ గ్రంథాన్ని పురుషపురం (అంబలాపుళ- కేరళ)లో చూసి పఠించి ఆనందడోలికల్లో తేలిపోయాడు.
అప్పుడే విజయనగర రాజ దర్బారులో ప్రవేశం కూడా లభించింది. తిరుగు ప్రయాణంలో అలహాబాద్‌లోని బృందావనం చేరుకోవడం జరిగింది. కృష్ణావతారంలో జరిగిన లీలలు వివరిస్తూ ఆయా ప్రదేశాలను భక్తులకు, శిష్యులకు చూపించాడు. కృష్ణచైతన్యను రాధాదేవి అవతారంగా కొందరు, రాధాకృష్ణుల సమైక్యావతారంగా మరికొందరు భావిస్తారు. పూరీ వచ్చిన తర్వాత తన ప్రేమానందాల్లో పాలుపంచుకున్న రామానందరాయ్, స్వరూప దామోదర్‌లు గత జన్మలో రాధాదేవి చెలికత్తెలైన లలిత, విశాఖలుగా గుర్తించాడు. సన్యాసాశ్రమ దీక్షలో చైతన్యుల ఆరోగ్యం క్షీణింపసాగింది. నిరంతరం ధ్యాన సమాధి స్థితుల్లో వుండేవాడు. ఆహారం పట్ల ధ్యాస వుండేదికాదు. అతీత దివ్యానంద స్థితిలో 12 ఏళ్లు జీవించి చైతన్య మహాప్రభువు పూరీ జగన్నాథుడిలో లీనమయ్యారు.
- స్వరోచి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP