శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సింహాచలేశునికి అపచారం

>> Friday, April 6, 2012

సింహాచలేశునికి అపచారం


  • 06/04/2012
సింహాచలం, ఏప్రిల్ 5: శతాబ్దాల చరిత్ర కలిగిన సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవం సంప్రదాయ విరుద్ధంగా జరిగిందట. కంకణం కట్టుకోకుండానే బ్రహ్మాసనంపై కూర్చుని రెండవ ప్రధానార్చకుడు కల్యాణ తంతును జరిపించారట. ఆర్జిత సేవల్లో తప్ప వార్షిక ఉత్సవాలలో పూసపాటి వంశీయులు మినహా మరే ఇతరుల గోత్రనామాలు చెప్పే సంప్రదాయం ఇక్కడ లేదని చెప్పినా వినకుండా కార్యనిర్వహణాధికారి ఒత్తిడి చేయడం వలన సంప్రదాయ విరుద్ధమైన ఒత్తిడికి తలొగ్గడం వలన కల్యాణోత్సవంలో అపచారం జరిగిందని పశ్చాత్తాపంతో అర్చకులు అంగీకరించారు. కల్యాణం చేస్తున్నంత సేపూ మనసులో ఆవేదన అణచుకుంటూ అన్యమనస్కంగా జరిపించవలసి వచ్చిందని అర్చకుల ఆంతరంగాన్ని ఆలస్యంగా బయటపెట్టారు. కల్యాణం రోజున చోటుచేసుకున్న పరిణామాలు, ఈవో తీరుపై ఉద్యోగ వర్గాలు గురువారం సమావేశమై వాస్తవాలను బహిర్గతం చేశారు. వ్యవస్థాపక ధర్మకర్త ఆనందగజపతిరాజు, ప్రధానార్చకుడు మోర్త సీతారామాచార్యులను అవమానించేలా ఈవో ప్రవర్తించారని, అందుకు ఈవో క్షమాపణ చెప్పాలని వైదికులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. ధర్మకర్త కుటుంబానికంటే ముందే ఈవో సతీసమేతంగా రథం ఎక్కారని ఆనంద గజపతితో సమానంగా తనకూ మర్యాదలు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఉద్యోగులు వెల్లడించారు.
దేవాలయ సంప్రదాయాన్ని వివరించినా వినకుండా ‘చట్టం అలాగే చెప్పిందా అంటూ అయితే ఆయనకే ఆలయాన్ని రాసిచ్చేయండి’ అని ఆనంద గజపతిని ఉద్దేశించి ఈవో మాట్లాడారని ఉద్యోగులు చెప్పారు. ప్రధానార్చకుడిని ‘నువ్వు’ కల్యాణం చేయడానికి వీల్లేదంటూ ఏకవచనంతో సంభోదించారని, ఇది ‘నా ఆర్డర్’ అంటూ తన అధికార దర్పాన్ని ప్రదర్శించారని ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండవ ప్రధానార్చకుడు శ్రీనివాసాచార్యులను కల్యాణం చేయాలని ఈవో శాసించారని, దీంతో కంకణధారణ లేకుండానే కల్యాణం నిర్వహించారని అన్నారు. ప్రధానార్చకునికి జరిగిన అవమానంతో మనస్తాపానికి గురైన తామంతా కల్యాణంలో పాల్గొనకూడదని అనుకున్నా స్వామి వారి కార్యక్రమం ఆగడం ఇష్టం లేక కొనసాగించామని పేర్కొన్నారు. అవమానాన్ని భరించలేక ప్రధానార్చకుడు ఉద్యోగానికి రాజీనామాకు సిద్ధపడ్డారని, తామంతా ఆయనను వారించామని, ఈవో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాజీనామా చేస్తామని అర్చకులంతా స్పష్టం చేశారు. తమ గురువుకి జరిగిన అవమానం తట్టుకోలేక సమావేశంలో మాట్లాడుతున్న వైదికులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉద్యోగితో గుంజీలు తీయించిన ఇవో
ఇటీవల దేవస్థానంలో అకారణంగా ఓ ఉద్యోగితో గుంజీలు తీయించడాన్ని, పూలతోటలో దొంగతనం జరిగిన వ్యవహారంలో ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారంతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఈవోలను నోటి దురుసుగా ఈవో మాట్లాడిన అంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించుకున్నారు. ఉద్యోగుల పట్ల ఈవో చులకన భావంతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు అధికారులకు బానిసలు కాదని ఉద్యోగ సంఘం నేతలు అన్నారు. కొంతమంది ఉద్యోగులను కోవర్టులుగా పెట్టుకుని తమ మధ్య విబేధాలు రేపుతున్నారని ఉద్యోగ సంఘ నేతలు ఆరోపించారు. తమలో ఐక్యత లేకపోవడం వలనే అధికారుల ఆటలు సాగుతున్నాయని, అధికారులకు వత్తాసు పలకడం మానేసి ఆలయ అభివృద్ధికి అవసరమైన సూచనలు ఇస్తే బాగుంటుందని కొంతమంది ఉద్యోగులపై ఉద్యోగ సంఘం వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గతంలో ఏ ఈవోకి ఇవ్వనంత గౌరవాన్ని ఈయనకిచ్చామని ఉద్యోగులు తెలిపారు. దేవాలయంలో సంప్రదాయ విరుద్ధమైన పద్ధతులను చెప్పి ఇది ‘ నా ఆర్డర్’ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వైదిక పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేదం కన్నా, ఆచారం కన్నా సంప్రదాయం గొప్పదని, సంప్రదాయం ప్రకారం చేస్తే ఉద్యోగం తీసేస్తారా అంటూ స్థానాచార్యులు టి.పి. రాజగోపాలాచార్యులు ప్రశ్నించారు. అధికారుల ఒత్తిడితో పనిచేయలేక సంప్రదాయాలకు విఘాతం కలిగించలేక తాము తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నామని ఆయన అన్నారు.
ఇవోకు వ్యతిరేకంగా నినాదాలు
ఇవో వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులంతా నినాదాలు చేశారు. దేవస్థానం చరిత్రలో ఈవో మాయని మచ్చగా మిగిలిపోయారని ఉద్యోగులు విమర్శించారు. తక్షణమే ఈవోని పంపించి వేయాలని డిమాండ్ చేశారు. జరిగిన పరిణామాలను అనువంశిక ధర్మకర్త ఆనందగజపతిరాజు దృష్టికి తీసుకువెళ్తామని, అర్చక సంఘంతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఉద్యోగ సంఘం నేతలు స్పష్టంచేశారు. ఈ సమావేశంలో అనేకమంది ఉద్యోగులు ఈవో కారణంగా ఎదురైన సమస్యలను, అవమానాలకు గుర్తు చేశారు. సంఘం నేతలు ఎం. కృష్ణమాచార్యులు, శ్రీహరి, ఆనంద్‌కుమార్, మంథా కాళిదాసు, పాలూరి నరసింగరావు, ఈఈ శ్రీనివాసరాజు, ఆగమ పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణమూర్తి, అర్చకులు కె.కె. తిరువెంగళాచార్యులు, గోపాలకృష్ణమాచార్యులు, కర్రి సీతారామచంద్రాచార్యులు సమావేశంలో మాట్లాడారు. (చిత్రం) ఇవోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

1 వ్యాఖ్యలు:

కమనీయం April 6, 2012 at 10:54 AM  

అందుకే నేను religious endowments actని రద్దు చేసి దేవాలయాల్లో ప్రభుత్వ,రాజకీయ జోక్యం అధికారం రద్దు చేయాలని వ్రాసాను.Mr.Knapp అనే విదేశీయ రచయిత కూడా హిందూ దేవాలయాలయాలపై అధికారం చెలాయిస్తూ ,ప్రభుత్వ అధికారులు,రాజకీయనాయకులు దోచుకొంటున్నారని వ్రాసాడు.వీటిని కూడా చదవండి.(name of the article ;Looting of Hindoo temples)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP