ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఓ చక్కని వ్యాసం..... 'మంద'మతుల మాటలివి!
>> Saturday, August 6, 2011
'మంద'మతుల మాటలివి!
కడప ఎం.పి. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అగ్రనేత ఎల్.కె.అద్వానీ సమక్షంలో, సుష్మాస్వరాజ్‌తో సహా బి.జె.పి. సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించడం దేనికి సంకేతం?! కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించి స్వంత పార్టీ పెట్టుకుని, కారణాలు ఏవైనా అత్యధిక మెజారిటీతో గెలిచి, లోక్‌సభలో అడుగు పెట్టినందుకు జగన్‌ను అభినందించడం ద్వారా బి.జె.పి. నాయకులు ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు? కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థి రాజకీయ పక్షంగా మాత్రమే చూడాలి కానీ, ఆ పార్టీని ఎదిరించిన వారందరినీ సమర్థించాలని బి.జె.పి. భావిస్తే భవిష్యత్‌లో తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది.
సమాజంలో నిరాశా నిస్పృహలతోపాటు ఆరాటం పెరిగిపోయినప్పుడు గుంపుస్వామ్య (మాబోక్రసీ) ధోరణులు ప్రబలుతాయి. విషయ అవగాహన లేకుండా, ఆవేశాలకు లోనై, విచక్షణ ప్రదర్శించకపోవడాన్ని గుంపుస్వామ్యం అంటారు. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో గానీ, జాతీయ స్థాయిలో గానీ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ గుంపుస్వామ్య ధోరణులే! లోక్‌పాల్ బిల్లు విషయంలో అన్నాహజారే బృందం వ్యవహరిస్తున్న తీరు, 14 ఎఫ్ తొలగించకుండా ఎస్.ఐ. రాత పరీక్షలు నిర్వహించవద్దంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థులు ఆందోళన చేయడం ఈ కోవలోనివే. అవినీతి ఆరోపణలపై రేపోమాపో సి.బి.ఐ. విచారణ ఎదుర్కొనే అవకాశమున్న కడప ఎం.పి. జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభలో ప్రమాణ స్వీకారాన్ని బి.జె.పి. సభ్యులు బల్లలు చరిచి స్వాగతించడం విచక్షణారహిత చర్యలకు పరాకాష్ఠ.
ముందుగా అన్నాహజారే బృందం వ్యవహారాన్ని తీసుకుందాం. పౌర సమాజం పేరిట ఈ బృందంలో ఉన్నవాళ్లు మన రాజ్యాంగ నిర్మాతలకంటే గొప్పవారు కాదు. అయినా, వారు తమ మాటే చెల్లుబాటు కావాలన్న మంకు పట్టుతో వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. దేశంలో అవినీతి భరించలేని స్థితికి చేరుకోవడంతో పౌర సమాజం నుంచి అన్నా హజారే బృందానికి అనూహ్య మద్దతు లభించిన విషయం వాస్తవం. అయితే, హజారే బృందం చేస్తున్న వాదనల్లో హేతుబద్ధత ఎంత? ఒక్క లోక్‌పాల్ బిల్లు వచ్చినంత మాత్రాన దేశంలో అవినీతి ఆగిపోతుందా? అనేది ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్రాల్లో అవినీతి వల్ల ఇబ్బంది పడుతున్నది సాధారణ ప్రజలు.
అయితే, లోక్‌పాల్ బిల్లు గురించి మాత్రమే మాట్లాడుతున్న వాళ్లు, రాష్ట్రాల్లో అవినీతిని అదుపు చేయడానికి, పటిష్ఠమైన అధికారాలతో కూడిన లోకాయుక్త వ్యవస్థల ఏర్పాటు గురించి మాట్లాడకపోవడం విచారకరం. కర్ణాటకలో లోకాయుక్త దర్యాప్తు కారణంగానే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవలసి వచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. పార్లమెంట్‌లో సభ్యుల ప్రవర్తనను కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తేవాలన్న హజారే బృందం డిమాండ్‌లో విచక్షణ లోపించడమే కాదు, మనకు నియంతలు కావాలన్న అభిప్రాయాన్ని అది ధ్వనింపజేస్తున్నది. ప్రజాస్వామ్యవ్యవస్థలో పార్లమెంట్ నిర్ణయం అంతిమం.
అయితే పార్లమెంట్‌లో చేసే చట్టాలు, తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, వాటిని సమీక్షించే అధికారాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టుకు కట్టబెట్టారు. అలాగే న్యాయ వ్యవస్థలో అవినీతిపరులుంటే వారిని అభిశంసన ద్వారా తొలగించే అధికారాన్ని పార్లమెంట్‌కు ఇచ్చారు. అంటే, వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు పాటించారు. అయితే హజారే బృందం మాత్రం న్యాయ వ్యవస్థతో పాటు, పార్లమెంటులో సభ్యుల ప్రవర్తనను కూడా లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నది. ఈ డిమాండ్ చేస్తున్న హజారే బృందం, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంది.
లోక్‌పాల్‌గా నియమితుడైన వ్యక్తి భవిష్యత్తులో నియంతలా వ్యవహరించడని గ్యారెంటీ ఏమిటి? లోక్‌పాల్ సభ్యులు ఆశ్రిత పక్షపాతానికి పాల్పడరని గ్యారెంటీ ఏమిటి? తమపై వచ్చే అభియోగాలపై విచారణ జరిపే అధికారాన్ని ఒకే ఒక వ్యవస్థకు కట్టబెట్టడం వల్ల అటు పార్లమెంట్ సభ్యులు గానీ, ఇటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గానీ స్వేచ్ఛగా వ్యవహరించగలరా? ప్రజా ప్రతినిధులతో ఏర్పాటైన పార్లమెంట్ కంటే, చట్టం ద్వారా ఏర్పాటయ్యే వ్యవస్థకు సర్వాధికారాలు కట్టబెట్టాలనడంలో ఔచిత్యం ఎంత? దేశ రాజకీయాలు ప్రస్తుతం ఎంతగా కలుషితం అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులలో అభియోగాల నుంచి ఏ ప్రధానమంత్రికీ మినహాయింపు ఉంటుందని భావించలేం.
ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకువస్తే దేశంలోనే రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. మౌలికమైన ఈ అంశాల గురించి ఆలోచించకుండా అటు హజారే బృందం, వారికి మద్దతు ప్రకటిస్తున్న పౌర సమాజంపై... గుంపుస్వామ్య ప్రభావం పడినట్టే భావించవలసి ఉంటుంది. పార్లమెంట్‌లో సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉంటున్నదని అనుకుంటే, అటువంటి వారిని ఎన్నుకోకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయాలేగానీ, ఒకే వ్యవస్థకు సర్వాధికారాలు కట్టబెట్టాలని కోరడం ఏమాత్రం సమర్థ్ధనీయం కాదు.
ఇక, 14 ఎఫ్ నిబంధన తొలగింపు విషయమై జరుగుతున్న ఆందోళననే తీసుకోండి. ప్రస్తుతం ఎస్ఐ రాత పరీక్షలు, 14ఎఫ్‌తో సంబంధం ఉన్న హైదరాబాద్ జోన్‌కు జరగడం లేదు. అయినా, ఆ నిబంధనను తొలగించకుండా పరీక్షలు నిర్వహించడానికి వీలులేదని రాజకీయ పార్టీల నాయకులు ప్రకటించడం, వారి ప్రభావంతో విద్యార్థులు ఆందోళనకు దిగడం, 14 ఎఫ్ తొలగించకుండా పరీక్షలు నిర్వహిస్తే సహించేది లేదని మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ప్రకటనలు చేయడాన్ని ఏమనాలి? హైదరాబాద్ జోన్‌లో ఉద్యోగావకాశాలు లేని తెలంగాణ జిల్లాల్లో విద్యార్థులు కూడా ఆందోళన చేయడం ఆశ్చర్యంగా ఉంది.
అంటే, భావోద్వేగాలకు గురైనప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ పరిణామం సూచిస్తున్నది. కడప ఎం.పి. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అగ్రనేత ఎల్.కె.అద్వానీ సమక్షంలో, సుష్మాస్వరాజ్‌తో సహా బి.జె.పి. సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించడం దేనికి సంకేతం?! కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించి స్వంత పార్టీ పెట్టుకుని, కారణాలు ఏవైనా అత్యధిక మెజారిటీతో గెలిచి, లోక్‌సభలో అడుగు పెట్టినందుకు జగన్‌ను అభినందించడం ద్వారా బి.జె.పి. నాయకులు ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు? కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థి రాజకీయ పక్షంగా మాత్రమే చూడాలి కానీ, ఆ పార్టీని ఎదిరించిన వారందరినీ సమర్థించాలని బి.జె.పి. భావిస్తే భవిష్యత్‌లో తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది.
కర్ణాటకలో తమకు కంట్లో నలుసుగా మారిన గాలి జనార్దనరెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వైఖరి అవలంబిస్తే పరిస్థితి ఏమిటి? 2జి స్కాం వంటి అవినీతి కుంభకోణాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించుకున్న బి.జె.పి. నాయకులు, ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడిగా పేరొంది, సి.బి.ఐ. విచారణ ఎదుర్కొనే అవకాశమున్న జగన్‌ను ఎలా సమర్థించగలరు? మతం గురించి, ధర్మం గురించి మాట్లాడే బి.జె.పి. నాయకులు ఇటువంటి అవకాశవాద రాజకీయాలను ఎలా సమర్థించుకోగలరు? అవినీతిపరులకు సాదర స్వాగతం చెబుతూ, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే నైతికత బి.జె.పి.కి ఎక్కడిది? ప్రజలు గొర్రెల మంద అని అంటారు.
అదే సమయంలో గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అని కూడా సామెత ఉంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల జగన్‌కు ప్రజల్లో ఆదరణ లభిస్తూ ఉండి ఉండవచ్చు! అంతమాత్రాన వ్యక్తుల నిబద్ధత, నీతి నియమాలతో సంబంధం లేకుండా కౌగిలించుకోవడమేనా? ప్రజల్లో విచక్షణ లోపిస్తే వారిని సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత నాయకులపై లేదా? కర్ణాటకలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బి.జె.పి. నాయకులు విస్మరించినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటకలో బి.జె.పి.కి ఒకే విధమైన అనుభవం ఎదురైంది. అయినా రెండు పార్టీలకూ బుద్ధి రాలేదు. గాలి జనార్దనరెడ్డి వంటి వారిని, వారి అండ ఉన్న యడ్యూరప్ప వంటి వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవడానికి అనుమతించిన బి.జె.పి. అగ్ర నాయకత్వం, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నది.
పార్టీ ఆదేశాలను శిరసావహించవలసిన యడ్యూరప్పకు, అగ్ర నాయకత్వాన్నీ ముప్పతిప్పలు పెట్టగల బలం ఎక్కడి నుంచి వచ్చింది? అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో ఎం.ఎల్.ఎ.లను మచ్చిక చేసుకోవడం వల్లనే తల్లి వంటి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడానికి సైతం ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు కర్ణాటకలో సిద్ధపడ్డారు. చివరకు యడ్యూరప్పను కాళ్లావేళ్లాపడి దారిలోకి తెచ్చుకున్న బి.జె.పి. కేంద్ర నాయకత్వానికి, ఇప్పుడు కర్ణాటకలో అసమ్మతి ముప్పు పొంచి ఉంది. క్రమశిక్షణకు మారుపేరుగా బి.జె.పి. గురించి ఒకప్పుడు చెప్పుకొనే వారు. ఇప్పుడు అధికారం కోసం అవకాశవాద విధానాలకు పాల్పడటం వల్ల రాష్ట్రాల్లో నాయకులను అదుపు చేయలేని స్థితిలో బి.జె.పి. కేంద్ర నాయకత్వం చిక్కుకుంది. మన రాష్ట్రం విషయానికే వస్తే, రాజశేఖరరెడ్డి మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి గుణపాఠాన్నే నేర్పాయి.
రాజకీయ పార్టీల నిర్వహణకు నిధులు అవసరమే! స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆయా పార్టీలపై అభిమానంతో ప్రతిఫలాపేక్ష లేకుండా పారిశ్రామికవేత్తలు, ఇతరులు (తోచినంత మేర) నిధులను విరాళంగా ఇచ్చేవారు. ఆ తర్వాత దశలో ప్రతిఫలాన్ని ఆశించి నిధులు ఇవ్వడం ప్రారంభమైంది. తర్వాత క్రమంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలనే గుప్పిట్లో ఉంచుకునే స్థాయికి ఎదిగారు. ఈ పరిస్థితి ఎక్కడివరకు వెళ్లిందంటే ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లుగా అవతరించిన వ్యాపారులు, కాంట్రాక్టర్లు పార్టీ అగ్ర నాయకులకే పరోక్షంగా లంచాలు ఇవ్వడం ప్రారంభించారు.
చివరకు పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే, రాజకీయాలలోకి వెళ్లడం ద్వారా కాంట్రాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా మారవచ్చునన్న అభిప్రాయం ప్రస్తుతం ఈ దేశ యువతలో కూడా చోటుచేసుకుంటున్నదంటే అందుకు ఆయా పార్టీల అధినేతలే కారణం. పార్టీ అవసరాలకే కాకుండా స్వంత అవసరాల కోసం కింది స్థాయి నాయకుల నుంచి కేంద్ర స్థాయి నాయకులు డబ్బు తీసుకోవడం ప్రారంభమైనప్పుడే, పార్టీ యంత్రాంగంపై వారు పట్టు కోల్పోవడం కూడా మొదలైంది. కర్ణాటకలో యడ్యూరప్ప తదితరులు ఎదురు తిరిగినప్పుడు అధికారాన్ని వదులుకోవడానికి బి.జె.పి. సిద్ధపడకపోగా, ఆయన ముందు సాగిలపడటానికి కారణం ఇటువంటి లాలూచీ వ్యవహారాలే! ఇనుప ఖనిజాన్ని అక్రమంగా, అడ్డగోలుగా దోచుకున్నారని అభియోగాలు ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డి వంటి వారిని వదులుకోవడానికి బి.జె.పి. జాతీయ నాయకత్వం సిద్ధపడక పోవడానికి లాలూచీ వ్యవహారాలే కారణం. మన రాష్ట్రంలో కూడా జలయజ్ఞం సందర్భంగా, కమీషన్ల రూపంలో భారీ మొత్తంలో నిధులు చేతులు మారాయి.
అయితే ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కమీషన్ల రూపంలో వసూలుచేసిన ఈ నిధులలో సింహభాగాన్ని రాజశేఖరరెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను సంతృప్తి పరచడానికి పంపించే వారు. ఢిల్లీ పెద్దలకు నిధులు అందించే బాధ్యతను కూడా ఆయన కాంట్రాక్టర్లకే అప్పగించేవారు. రాష్ట్రం నుంచి నిధులు అందుకున్న ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో రాజశేఖరరెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పార్టీకి కాకుండా తనకూ, తన కుమారుడికి విధేయులైన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వాలని గత ఎన్నికల సందర్భంగా రాజశేఖరరెడ్డి చేసిన సిఫారసులను కేంద్ర నాయకులు కళ్లు మూసుకుని ఆమోదించడానికి ఈ లాలూచీ వ్యవహారమే కారణం.
ఆనాటి పాప ఫలితాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం అనుభవిస్తోంది! దొందూ దొందుగా మారిన కాంగ్రెస్ - బి.జె.పి. అధిష్ఠానవర్గ పెద్దలు ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించని పక్షంలో, ఆ పార్టీల అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆషాఢ భూతులను అదుపు చేయకుండా కాసుల కోసం కక్కుర్తిపడితే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయం అలా ఉంచితే, ఈ రాష్ట్ర ప్రజలను దేవుడే రక్షించాలని ఎం.పి.గా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహనరెడ్డి గంభీరమైన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటనలో వాస్తవం లేకపోలేదు. తాను, తన తండ్రి కలిసి ఈ రాష్ట్ర ప్రజలను తాయిలాలకు అలవాటు చేసి, విచక్షణ లేకుండా వ్యవహరించేలా చేశారు కనుక నిజంగానే ఈ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి! అవినీతిని ప్రశ్నించవలసింది పోయి సమర్థించే పరిస్థితికి రాష్ట్ర ప్రజానీకాన్ని తీసుకు వచ్చిన ఘనత తండ్రీ కొడుకులకే దక్కుతుంది.
ప్రజల్లో వివేచన లోపించిందన్న వాస్తవం మనందరికంటే జగన్‌కు, ఆయన పార్టీ నాయకులకే బాగా తెలుసు. అందుకే జరగరానిది ఏమైనా జరిగి, జగన్ జైలుకు వెళితే పార్టీని నడపడానికి విజయమ్మ ఉన్నారని ఎం.పి. మేకపాటి రాజమోహనరెడ్డి వంటి వారు ప్రకటించగలుగుతున్నారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సి.బి.ఐ. విచారణకు హైకోర్టు ఆదేశించే అవకాశాలు ఉండటంతో, జగన్‌ను అరెస్టు చేస్తారని ఆయన పార్టీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. అంటే జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న విషయాన్ని మిగతా వారికంటే ఆయన పార్టీ నాయకులే ఎక్కువగా నమ్ముతున్నట్టు కనిపిస్తున్నది. తమ నాయకుడు జైలుకెళితే ప్రజల్లో మరింత సానుభూతి వస్తుందని జగన్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
జగన్ జైలు కెళ్లి, విజయమ్మ ప్రజల్లో తిరిగితే, తమ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి కుండపోతై కురుస్తుందని వారు అంచనా వేస్తున్నారు. అంటే, తమ రాజకీయ స్వార్థం కోసం జగన్ జైలుకు వెళ్లాలని వారు మనసులో గట్టిగా కోరుకుంటున్నారని అర్థం చేసుకోవలసి ఉంటుంది. రాజకీయాలు ఇంతగా దిగజారిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలను దేవుడు కూడా బాగు చేయగలడా? అన్న సందేహం కలుగుతున్నది. ఇటీవల ఒక మిత్రుడు నన్ను కలిశాడు. తన కుమారుడు చదువు పూర్తి అయినా ఉద్యోగంలో చేరడానికి ఇష్ట పడటం లేదనీ, 'ఉద్యోగం చేస్తే ఏమి వస్తుంది? జగన్ పార్టీలో చేరితే, కాలం కలిసొచ్చి అధికారంలోకి వస్తే, బాగా సంపాదించుకోవచ్చునని అంటున్నాడు' అని ఆ మిత్రుడు వాపోయాడు.
నిజమే! ఇది నా మిత్రుడికి మాత్రమే ఎదురైన అనుభవం కాదు. ప్రస్తుత యువతలో అత్యధికులు ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రజల ఆలోచనా విధానం ఇంతగా పుచ్చి పోయిన తర్వాత, జగన్ వంటి పౌండ్రక వాసుదేవులే శ్రీకృష్ణుడి అవతారంగా చలామణి అవుతారు. అవినీతిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్న హజారే బృందం గానీ, రాష్ట్రంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ వంటి వారుగానీ, లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థల ఏర్పాటుతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా కృషి చేయాలి. ప్రజల్లో వివేకంతో కూడిన చైతన్యం రానంతవరకు ఎన్ని వ్యవస్థలు ఏర్పడినా ప్రయోజనం శూన్యం.
- ఆర్కే
5 వ్యాఖ్యలు:
టీవీ లో చూసిన చాలా మందికి కడుపులో త్రిప్పినట్లయిందంటే నమ్మండీ....బీజేపీ ఎంత దిగజారిపోయే రాజకీయాలకు తెర తీస్తుందో???కాంగ్రెస్స్ ను ఎదిరించే నైతికతను కోల్పోవడం లేదా??
http://kvsv.wordpress.com/2011/08/04/%E0%B0%85%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82/
సరేనండి ఆ బిల్లేదో పాస్ అయ్యింది అనుకుందాము. లోక్పాల్ వచ్చాడు, హజారే బృందం కోరిన అధికారాలన్నీ ఆ లోక్పాల్ కి ఇచ్చారు. ప్రధాన మంత్రిని కూడా ఈ లోక్పాల్ పరిధిలోకి తెచ్చారు.
కాని లోక్పాల్ సవ్యంగా ఉంటాడని నమ్మకం ఏమిటి. ఆ ఒక్క వ్యక్తీ నిజాయితీగా ఉంది దేసలోని రాజకీయ నాయకులందరి గురించిన ఆరోపణలు సవ్యంగా దర్యాప్తు చేయిస్తాడా? అత్యున్నత న్యాయ స్థానానికి సంబంధించిన న్యాయ మూర్తులు (చీఫ్ జస్టిస్ తో సహా) కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ ఉంటే, ఈ లోక్పాల్ మడికట్టుకు కూచుంటాడా? ఈ లోక్పాల్ సవ్యంగా పనిచెయ్యకపోతే ఏమిటి గతి.
ఈ అవినీతి నిర్మూలన కింది స్థాయి నుంచి జరగాలి. పౌరులు తమకు కావాల్సిన పనులను లంచం ఇవ్వకుండా చేయించుకోగలిగిన ఓపిక, స్థైర్యం, మానసిక స్థితి ఉండాలి. ఊరికే అవినీతి అంతం అవ్వాలి, అవ్వాలి అనిఅరిస్తే అది పోదు. ముందు ఎవరికీ వాళ్ళు తమతోనే మొదలు పెట్టాలి. లంచం తీసుకోవటం ఎంత నేరమో, ఇవ్వటం కూడా అంటే నేరం. ఇచ్చేవాడు పది రూపాయలు ఇస్తున్నాడు అంటే, వాడికి ఆ పది రూపాయలకు పదింతలు లాభం ఉంటేనే కదా ఇచ్చేది. మరి వాడి అవినీతిని పట్టుకునేది ఎలా.
ఎతా వాతా, సమాజంలో పౌరుల మానసిక స్థితి పరిపక్వత చెందాలి. అవినీతి అంటే ఎక్కడో లేదు. సమాజంలో ప్రతి మనిషి లోనూ ఉన్నది. ఆత్మా విమర్శ చేసుకుని తమలోని ఆవినీతిని ఎవరికీ వారు తొలగించుకోగలిగిన నాడే అది అంతం అవుతుంది కాని, ఈ బిల్లులు, నిరాహార దీక్షలు, ఆ శిబిరాల్లో గెంతులు, నినాదాలతో అవినీతి పోదు.
కొన్ని నెలల క్రితం, ఇదే విషయం మీద "అవినీతి ఎక్కడ లేదు" అన్న పేరుతొ నేనొక వ్యాసం వ్రాసాను. ఈ కింది లింకు సహాయంతో చదువగలరు.
http://saahitya-abhimaani.blogspot.com/2011/04/blog-post_10.html
శివరామ ప్రసాదు కప్పగంతు గారు, మీ నిరాశావాదం, నిస్పృహ బాగానేవుంది కాని ఒకటి రానీయవండి, ఇట్లాంటి మోకాలు అడ్డేప్రయత్నాలు చాలా జరుగుతోన్నాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే లోక్‌పాల్ అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక కమిటీ. అందులో 10మంది సభ్యులు వుంటారు. ఒక కుర్చీదారుడు(Chairman) వుంటారు. న్యాయవ్యవస్థను తప్పించి, న్యాయవ్యవస్థ లోని అవినీతిని శిక్షించేందుకు న్యాయపాల్ లాంటిది వుండాలి. అన్నివ్యవస్థలను ఒకే పాల్ కిందికి తేవాలని పట్టుబట్టడాన్ని, కాంగ్రెస్ తన కవచంగా వాడుకుంటోంది.రాజకీయ అవినీతి ఒక్కటి తగ్గినా అది లోక్పాల్కు గొప్ప విజయమే. న్యాయవ్యవస్థను బయట వుంచడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది.
కొన్ని సంవత్సరాల వరువాత ఇవ్వాళ మళ్ళీ నా కామెంట్ చూసాను. "ఎతా వాతా, సమాజంలో పౌరుల మానసిక స్థితి పరిపక్వత చెందాలి. అవినీతి అంటే ఎక్కడో లేదు. సమాజంలో ప్రతి మనిషి లోనూ ఉన్నది......"
నేను వ్రాసినదే కరెక్ట్ అయ్యింది. అన్నా హజారే చొక్కా పట్టుకుని పైకి ఎగబాకిన ఊసరవెల్లి, ఇవ్వాళ అతి పెద్ద అవినీతి/నల్ధనవ్యతిరేక చర్య మోడీ ప్రభుత్వం తీసుకుంటే వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకని!?
Post a Comment