వూబకాయానికి రోబోపిల్‌తో విరుగుడు!
>> Monday, July 4, 2011
వైర్‌లెస్ సంకేతాలతో కరగనున్న కొవ్వు
భారత్‌లో శాస్త్ర, వైద్య రంగం మధ్య సమన్వయంలేదు
'న్యూస్‌టుడే'తో సింగపూర్ శాస్త్రవేత్త లూయీస్ ఫీ వెల్లడి
హైదరాబాద్ - న్యూస్‌టుడే
న్యూస్‌టుడే: రోబోటిక్ ఎండోస్కోప్‌లో వాడుతున్న 'రోబోటిక్ ఆర్మ్స్' ప్రత్యేకతలేమిటి?
లూయీస్ ఫీ: సింగపూర్ ప్రభుత్వం దాదాపు రూ.6 కోట్లు ఆర్థిక సహకారం ఇచ్చింది. నేను, డాక్టర్ లారెన్స్‌తో పాటు మరో ఆరుగురు నిపుణులు పనిచేశాం. ఎండోస్కోపీ చివరి భాగంలో 'రోబోటిక్ ఆర్మ్స్' రెండింటిని ఏర్పాటుచేశాం. 360 డిగ్రీల్లో తిరిగేలా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేశాం. వీటి మందం ఆరు మిల్లీమీటర్లు. 20కి పైగా అత్యాధునిక సెన్సర్ల సాయంతో ఇది పని చేస్తుంది. భవిషత్తులో ఒకసారి వాడి పడేసే రీతిలో.. రోబోటిక్ ఆర్మ్స్ మందాన్ని తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. ఒక్కో పరికరాన్ని రూ.2500 కన్నా తక్కువకే తీసుకురావాలనేదే మా లక్ష్యం. ఈ పరిశోధనలో సాంకేతికపరంగా మేము, వైద్యపరంగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులు సంయుక్తంగా పనిచేశాం. భవిష్యత్తులోనూ మరిన్ని పరిశోధనలు చేయాలనుకుంటున్నాం.
న్యూ: రోబోటిక్స్ రంగంలో మీ భవిష్యత్తు పరిశోధనలు ఏమిటి?
లూ: రోబోటిక్స్‌లో అనేక అంశాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఊబకాయం తగ్గించే అంశంపై ప్రస్తుతం 'రోబోటిక్ పిల్' రూపొందిస్తున్నాం. ఇది పూర్తిగా వైర్‌లెస్ సంకేతాలతో పనిచేస్తుంది. కడుపులోకి తీసుకున్నాక వైద్యనిపుణులు ఇచ్చే సంకేతాలతో అది తెరుచుకుంటుంది. అందులో నుంచి ఒక బెలూన్ బయటకు వచ్చి జీర్ణాశయంలోని ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. రెండు నుంచి నాలుగు వారాలపాటు కడుపులోనే ఉంటుంది. ఆ సమయంలో కొన్ని రకాల తరంగాలను పంపడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఈ విధానాన్ని జంతువులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. త్వరలో మానవులపైనా పరీక్షించి చూస్తాం. ఇది పూర్తిగా సురక్షితం. ఈ రోబోపిల్‌ను రూ.500 కన్నా తక్కువ మొత్తానికే ఇవ్వాలన్నది మా ఆకాంక్ష.
న్యూ: వైద్యరంగ పరిశోధనలపై మీ అభిప్రాయం?
లూ: శాస్త్రసాంకేతిక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఆ స్థాయిలో వైద్యరంగం అభివృద్ధి చెందడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, పేదలకు అందుబాటులో ఉండటంలేదు. ఈ అంతరం పోవాలి. ఇంజినీరింగ్, వైద్యరంగ నిపుణులు సమన్వయంతో కృషి చేస్తే తక్కువ ధరకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చు. భారతదేశంలో శాస్త్రరంగంలోనూ, వైద్యరంగంలోనూ నిపుణులు ఉన్నారు. ఇద్దరి మధ్య సరైన సమన్వయం లేదు. దీన్ని సాధించగలిగితే అద్భుతాలను ఆవిష్కరించవచ్చు.
ఈనాడు న్యూస్
0 వ్యాఖ్యలు:
Post a Comment