సంగీతం- మోక్షసాధనం
>> Tuesday, June 28, 2011
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
చతుర్విధ పురుషార్థ సాధనలో ధర్మమోక్ష సాధనలు రెంటినీ ప్రతిపాదించిన మాధ్యమం సంగీతమే. ఆళ్వారులెందరో జానపద గీతశైలిలో మధురగాన సుధను వసుధపైన ప్రవహింపజేశారు. భక్తతుకారాం, కబీర్‌దాసు భక్తిగానం చేసి తరించారు. రామదాసు పద్యగేయ రచన చేసి రాముని కైంకర్యంచేసి హృదయంగమంగా గానం చేసి చరితార్థుడైనాడు. విరహభక్త కవయిత్రి గోదాదేవి రచించిన తిరుప్పావై చిరస్మరణీయం. భక్తజయదేవుని అష్టపదులు శ్రీకృష్ణ తత్వాన్ని సాక్షాత్కరింపజేసిన అమృతరసగుళికలు. శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ప్రస్తుతిస్తూ 32వేల కీర్తనలు రాసి గానంచేసి అచ్చమైన తెలుగుభాషను ఆంధ్రులకు ప్రసాదించిన అమృతమూర్తి పదకవితాపితామహుడు అన్నమాచార్యుడు. అశ్వమేధ క్రతువులు నిర్వహించిన సందర్భాల్లో దేవతలను సంతృప్తిపరచేందుకు వీణావాదనం చేసినట్లు కాత్యాయన శ్రీతసూత్రం, శతపథ బ్రాహ్మణం పేర్కొన్నాయి. అపరాంతక, ఉల్లోప్య, మకరి ముద్రక మొదలైన పురాతన గీతమాలికలు మోక్షసాధనకు తగిన మూలికలుగా యాజ్ఞవల్క్య మహర్షి అభివర్ణించాడు. సదాశివ బ్రహ్మేంద్రస్వామి 'పిబరే రామరసం' అంటూ భక్తిరసగాన మహిమను వివరించాడు.
విభిన్నరాగాలుగా విభజితమైన భారతీయ సంగీతంలో ఎన్నో ఓషధీగుణాలున్నాయి. ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క సమయంలో ఆలాపించడంవల్ల వ్యాధుల నివారణ సుసాధ్యమని సంగీత విద్వన్మణులు తీవ్ర పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఈ కోణంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. శ్రుతిపక్వమైన సంగీతం వింటే శారీరక, మానసిక ఆరోగ్యం ఆనందం చేకూరి ఆయువు పెరుగుతుందని సంగీత శాస్త్రకోవిధులు నిరూపించారు. చక్కని సంగీతం వింటూంటే శ్రమ అలసట తొలగిపోయి ఆయుర్ వృద్ధి జరుగుతుందంటారు. రక్తపోటు తగ్గుతుందంటారు. మనసులో సంయమనాన్ని నింపి, అవికార స్థితిని కల్పించి పారలౌకిక దిశానిర్దేశం చెయ్యడమే భారతీయ సంగీత ప్రధానలక్ష్యం. రాగద్వేషాలను హరించి ఆనందదాయకమైన ఆధ్యాత్మిక వేదికపైన హృదయాలను సుప్రతిష్ఠితం చేయడమే సంగీతాశయం. ప్రపంచంలోని సంగీతాలన్నింటిలోనూ ఒక్క భారతీయ సంగీతమే మోక్షసాధనకు సంపూర్ణంగా సహకరించేదంటారు. భగవిజ్జిజ్ఞాసువులకు, ముముక్షువులకు సప్తస్వర కలశం ప్రధానమైన మాధ్యమం. సంగీతసుధ లలిత సంగీతం, సంకీర్తనం, భజన, హరికథ బుర్రకథ, యక్షగానం మొదలైన పాయలు పాయలుగా ప్రవహించి రసజ్ఞులను పునీతం చేస్తున్నది.
2 వ్యాఖ్యలు:
అద్భుతంగా వర్ణించారు!!
This is 100% true
Post a Comment