మనల్ని నియంత్రిస్తున్నది ఎవరు?
>> Saturday, June 18, 2011
- నాయుని కృష్ణమూర్తి
ఈ ప్రశ్నలకు సమాధానం స్పష్టంగా చెప్పలేం. 'నువ్వీ చెడ్డపని ఎందుకు చేశావయ్యా?' అంటే, 'ఏమో! నా బుద్ధికి అలా తోచింది. చేశాను' అంటాం. 'మంచిపని ఎందుకు చేశా'వంటే కూడా అదే సమాధానం.
మన సమాధానంలో 'బుద్ధి' అనేది ఒకటి కారణంగా చెబుతున్నాం. ఈ బుద్ధి ఎక్కడినుంచి వచ్చింది?
మనలో మన కళ్లకు కొన్ని అవయవాలు కనిపిస్తాయి. చెయ్యి, కాలు, ముక్కు, నోరు లాంటివి. కళ్లకు కనబడని భాగాలు కూడా మనలో కొన్ని ఉన్నాయి. 'మనసు' కనబడదు, 'బుద్ధి' పనిచేస్తుంది కాని- అది ఎక్కడ ఉంటుందో తెలీదు. 'చిత్తం' ఒకోమారు ఒక్కోరకంగా అజ్ఞాపిస్తుంది. దాని ఉనికిని గ్రహించలేం. 'అహంకారం' ఎక్కడినుంచి పుట్టుకొస్తుందో అర్థం కాదు. ఈ నాలుగింటిని- మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం- అంతఃకరణం అంటారు. అంతఃకరణమంటే అంతరంగమే. మన హృదయమే!
కాబట్టి మనం ఉపయోగించే 'బుద్ధి' అనేది మన హృదయంలోని భాగమే.
బుద్ధికి ఎనిమిది గుణాలు ఉన్నాయి. 1. సేవ చేస్తుంది. 2. వింటుంది. 3. గ్రహిస్తుంది. 4. గుర్తు పెట్టుకొంటుంది. 5. వూహిస్తుంది. 6. పొరపాటు పడుతుంది. 7. అర్థం తెలుసుకొంటుంది. 8. తత్వజ్ఞానం పెంచుకొంటుంది.
'నా బుద్ధికి అలా తోచింది, చేశాను' అని- మనం చేసే మంచిని, చెడుని బుద్ధికి అంటగట్టేస్తున్నాం కదా! మనం చేసే మంచీ, చెడూ కేవలం బుద్ధివల్లనే జరుగుతున్నాయా?
బుద్ధితోపాటు మన అంతరంగంలో ఉన్న మనసు, చిత్తం, అహంకారం... అన్నీ కలిసి మనచేత పనులు చేయిస్తున్నాయి.
ఇవి స్వతంత్రంగా పనులు చేస్తాయా? దేనికదే విడివిడిగా నిర్వర్తిస్తాయా? వీటిచేత సమష్టిగా పనిచేయించే శక్తి ఏదైనా ఉందా?
అందరూ ఒకేరకంగా ఎందుకు ఆలోచించరు? ఒకే రకమైన పనులు ఎందుకు చెయ్యరు?
తరచి ఆలోచిస్తే మనకు బోధపడేది- ఒకరికి, ఇంకొకరికి మధ్య స్థాయీభేదం ఉందని. అంతఃకరణ స్థాయిని నిర్ణయించేది ఎవరు?
ఆ శక్తినే 'అంతర్యామి' అంటారు. మనలోపల అణువణువునా నిండిపోయి ఇంద్రియాలను నియంత్రించేది, వాటిచేత పని చేయించేది- అంతర్యామి.
జీవంలో ఉండే ఆత్మ అంతర్యామి. అంటే... జీవాత్మ ఇదే! పరమాత్మ కూడా ఇదే!
ఇక్కడా, అక్కడా అని భేదం లేకుండా మన సర్వస్వంలో నిండిన జీవాత్మను లేక పరమాత్మను దర్శించడానికి మనం చేసే ప్రయత్నమే తపస్సు.
రుషులు చేసిన తపస్సుకు ప్రయోజనం- లోని 'పరమాత్మ'ను దర్శించడం. మనం కళ్లు మూసుకొని చేసే ధ్యానం ప్రయోజనం కూడా అదే! 'మనల్ని మనం దర్శించుకోవడం'. ఆ దర్శనం జరిగితే జీవాత్మకు, పరమాత్మకు భేదం కనిపించదు. సృష్టికి మనకు భేదం ఉండదు.
అనంతమైన ఈ విశ్వంలో 'నేను' ఉన్నాను. 'నా'లో అనంతమైన విశ్వం ఇమిడి ఉంది!
0 వ్యాఖ్యలు:
Post a Comment