సర్వదేవ నమస్కారం...
>> Friday, June 17, 2011
- చక్కిలం విజయలక్ష్మి భగవంతుడు భావనామాత్ర సంతుష్టుడు. భక్తుడికి ఒక ఆలంబననిచ్చి, అతనికి దానిమీద భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగితే- దాన్ని ఆధారం చేసుకుని సాధనలు చేస్తే, భగవంతుడిగా భావిస్తే... ఆ ప్రేమను, తపనను, ఆర్తిని 'తనకై' అన్నట్లుగానే స్వీకరిస్తాడు. ఆనందిస్తాడు. ఆశీర్వదిస్తాడు. మనం గుర్తించగలగాలిగానీ ఎల్లెడలా ఈశ్వరుని ఐశ్వర్యం, విభూతులు, ప్రతినిధులు మనను తరింపజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఎందరో సుపుత్రులు తల్లిదండ్రుల్ని సేవించి తరించారు. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలు చుట్టిన ఫలం పొంది తమ్ముడి మీద గెలుపొందాడు. అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసి సేవించిన శ్రవణకుమారుడి కథ అందరెరిగినదే. సాక్షాత్ శ్రీకృష్ణుడే బయటికి రమ్మని పిలిచినా తల్లిదండ్రుల సేవ ముగించాకే వస్తాననీ, అంతవరకు ఆగమనీ విశ్రమించేందుకు ఇటుకను చూపిన పాండురంగని కథా మనకు తెలియనిది కాదు. అలాగే తులసిని పూజించి పూజించి పునీతురాలైపోయిన రుక్మిణీదేవి ఆ తులసిదళంతోనే శ్రీకృష్ణుని తూచుకుని భక్తిస్వాధీనం చేసుకుంది. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. సూర్యనమస్కారాల ప్రాశస్త్యం తెలియని భారతీయుడుండడు. గతి తప్పని బాధ్యతా నిర్వహణనూ, అలుపెరుగని గమనసామర్థ్యానికీ సూర్యుడి తరవాతే ఎవరైనా. శ్రీరాముడంతటివానికే సూర్యస్తుతి 'ఆదిత్య హృదయ స్తోత్రం' విజయాన్ని సాధించిపెట్టిన ఘనత సాధించింది. జీవపోషకుడూ, కాలనిర్ణాయకుడూ భాస్కరుడు. ఆయన రానిరోజు ప్రపంచమే అంధకారబంధురమైపోతుంది. స్వయం ప్రకాశమానుడైన ఆదిత్యుడు మానవాళికి ప్రత్యక్ష దైవం. ఆరోగ్యప్రదాత. విజయకారకుడు. అలాగే గురువులు, జ్ఞానులు, నదులు, పర్వతాలు, వృక్షాలు, వల్మీకాలు, గోమాత... ఇవన్నీ, వీరందరూ దేవుని ప్రతిరూపాలు. దైవాంశలూ విభూతులూ ఐశ్వర్యాలు. ఈ దైవ విభూతుల్ని విశ్వసిద్దాం. పూజిద్దాం. తరిద్దాం. భగవంతుడు తన ప్రతిరూపాల ద్వారా, విభూతుల ద్వారా అందించిన ఈ ప్రత్యక్ష దైవాలను నిర్లక్ష్యం చేయవద్దు. 'సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి.' |
2 వ్యాఖ్యలు:
చాలా బాగా చెప్పారండి. మన సనాతన ధర్మం బోధించిందే అది. ఎక్కడో దేవుణ్ణి వెతుక్కోనక్కరలేదు. మనలో ఉన్నాడు, మన చుట్టూనే ఉన్నాడు. జంతుజాలాన్నీ, చెట్టు చేమల్నీ, దేవుడు సృష్టించిన ప్రతి జీవిలోనూ భగవంతుడిని దర్శించగల గొప్పతనం మన సనాతన ధర్మంలోనే ఉంది. మనకి ఉపయోగపడే ప్రతిది పూజించతగినదని, నమస్కరించతగినదనీ చెప్తుంది. మన సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే, అర్థం చేసుకుని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత:
chaala baagaa chepparu. dhanyavaadhamulu.
Post a Comment