జ్ఞాన సూర్యుడు
>> Thursday, June 2, 2011
నిర్వాణ శిఖరంపై మెరిసిన అమృత జ్యోతిర్నివహం. బోధివృక్షం ఛాయలో ధర్మమే తపస్సు చేసి పునీతమైంది. పాశవిక మరుభూమిలో మానవతా బీజం రాలింది. ఆ మానవతకు చరిత్ర బుద్ధునిగా నామకరణం చేసింది. ఆ మానవతలో పల్లవించిన దివ్యత్వాన్ని యుగాలుగా మానవాళి ప్రియాతిప్రియంగా ఆరాధిస్తూ వచ్చింది.
మానవాళికి కొత్తవెలుగు ఇవ్వడానికి జీవితాన్ని పణంగా పెట్టిన మహనీయుడు. సత్యాన్వేషణకు, మానవాళి విముక్తి కోసం స్వసుఖాలను త్యాగం చేసిన యుగపురుషుడు. అపరిపూర్ణమైన, నిండుతనం లేని మానవజీవితం కాలం రాకాసి హస్తాలకు అందని ఆనందం కోసం, ప్రపంచమనే చీకటి ప్రశ్నకు సమాధానం చెప్పగల జ్ఞానంకోసం యుగాలుగా అన్వేషిస్తున్నది. పరిపూర్ణత్వం కోసం, శాశ్వతత్వం కోసం జరిగే వేటలో బాధను జయించడమే కాదు, ఏనాటికీ అంతరించని ఆనందం సాధించాలన్న రెండు గమ్యాలు కలగలసి ఉన్నాయి. ఎంత సుఖాన్ని పొందినా చివరికి మిగిలేది దుఃఖం. ఇదీ ప్రపంచం. ఎన్నిజన్మలు గడిచినా అంతే.
ఉద్వేగాలు, ఉద్రేకాలు, అహంకారం, మనోచైతన్యంనుంచి దూరంగా వెళ్ళగలిగినవాడికి విముక్తి దగ్గరవుతుంది. ఉదాత్తమైన భావాలే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మనం ఏది కావాలనుకుంటే అదే అవుతాం. మనసు సునిర్మలమై, స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం మనల్ని నీడలాగా అనుసరిస్తుంది. అది మనల్ని వదిలి వెళ్లదు. మన గమ్యం నిర్వాణం. మన భావం, చైతన్యం ఆ ఔన్నత్యం చేరు కున్నప్పుడు- దుఃఖం, అహం వాటంతట అవే రాలిపోతాయి.
పెద్ద నక్షత్రం వైపు చిన్నగోళం సమీపించినప్పుడు, నక్షత్రం ఆకర్షణ శక్తికి లోనై ఆ గోళం నక్షత్ర పదార్థంలోకి వెళ్ళి కలిసిపోతుంది. ఆకాంక్షించే చైతన్యం నిర్వాణాన్ని గమ్యంగా నిర్దేశించుకున్నప్పుడు, మన ప్రయత్నం ఒక బిందువు వద్ద ఆగిపోయి నిర్వాణంలోకి దారి తీస్తుంది. మన భౌతిక, మానసిక చైతన్య చలనాలు మనం దాటలేని అడ్డుగోడలు కావు. వాటికి మించినవారం మనం. అవి మనల్ని రెండుగా చీల్చలేవు. నిర్వాణంనుంచి దూరం చేయలేవు.
నిర్వాణం శూన్యం కాదు. వేదాంతద్రష్టలు చవిచూసిన ఆనందమే అది. అయితే కోరికలు తీర్చుకోవడానికి విశ్వాధినేత అయిన భగవంతుణ్ని ప్రార్థించడం, ఆ కోరికలు తీరక మళ్ళీ జన్మలెత్తడం... ఇవి బుద్ధుడికి నచ్చలేదు. అన్ని పరిమితులనుంచి, అల్ప వాంఛల నుంచి అనంత, విశ్వతీర నిర్వాణస్థితిలోకి ప్రయాణించడానికి అడ్డుపడే తాత్విక సిద్ధాంతాలపట్ల ఆయన ఉదాత్త మౌనం దాల్చారు.
సామాన్య జీవితంలోని సౌందర్య రస స్పందనలకు దూరంగా నిష్క్రియాత్మకమైన, నిరాసక్తమైన, నిస్తేజమైన సందేశం బుద్ధుడు ఇవ్వలేదు. బుద్ధుడు తన ఆత్మను కాపాడుకోవడం కోసం, తన ఆత్మోపలబ్ధిలో మునిగిపోలేదు. వ్యక్తిగత విముక్తి సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఆ వెలుగులు పంచాడు. సౌందర్యం, వివేకం, సేవానిరతి- జీవజలాలు అందించే వెల్లువలా ప్రవహించాయి. కళలు, సముజ్జ్వల సమృద్ధి నిండిన నాగరికత ప్రభవించింది. బుద్ధుడు కేవలం తత్వవేత్త, నీతి సూత్రాలు వల్లించే ధర్మవేత్తకాదు. ఆధ్యాత్మిక కాంతిశిఖరాల్లో భాసించే ఒక క్రాంతదర్శి. కారుణ్య ప్రవక్త. వాత్సల్య తపస్వి.
దీనజనులపట్ల మానవాళి చరిత్రలో మొదటిసారిగా అపరిమితమైన, అవ్యాజమైన ప్రేమ, వాత్సల్యాలు ప్రదర్శించిన అవతారం బుద్ధుడనే చెప్పాలి. అశ్రువిలయంనుంచి వారిని విముక్తుల్ని చేయడమే ఆ ప్రేమ లక్ష్యం.
కేవలం ప్రవచనాలు మాత్రమే చేసి బుద్ధుడు ప్రసిద్ధికెక్కలేదు. ప్రపంచం కోసం ఏ క్షణమైనా ప్రాణాలు అర్పించడానికి సన్నద్ధంగా ఉండేవాడు. జంతు బలులను ఆపడానికి ఆయన ఎనలేని కృషి చేశాడు. 'ఒక గొర్రెను బలి ఇవ్వడంవల్ల నువ్వు స్వర్గానికి వెళ్లగలిగితే, మనిషిని బలి ఇస్తే అంతకన్నా నీకు ఎక్కువ మేలు జరుగుతుంది. కాబట్టి నన్ను బలి ఇవ్వండి' అని బుద్ధుడు ఒక రాజుతో అన్నాడు. రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు.
'జంతుబలి మూఢ నమ్మకం. బలికోరే దేవుడున్నాడని నమ్మడం కూడా మూఢ నమ్మకమే' అని అనగలిగిన అవతారం బుద్ధుడు. 'లోకంలో ఇంత దుఃఖం ఎందుకుంది? ఆ దుఃఖాన్ని నివృత్తి చేయలేని దేవుడు ఉన్నాడని నమ్మడం నన్ను సంతృప్తి పరచడం లేదు' అని బుద్ధుడు అన్నాడు. జగద్రక్షకుడై నిలిచాడు.
ఒక వెలుగు కిరణం మరో వెలుగు కిరణాన్ని మెచ్చుకొంటుంది. బుద్ధుడెవరో మరో క్రాంతదర్శికే తెలుస్తుంది.
0 వ్యాఖ్యలు:
Post a Comment