సమర్థుడి ఆశ్రయం
>> Friday, June 3, 2011
- అప్పరుసు రమాకాంతరావు మనిషికి వివేకం, విచక్షణ అవసరం. హీనమైన కోరికలతో ఆశ్రయిస్తే సమర్థుడైనా సరే ఆశ్రిత రక్షణ చేయలేడు. పర్ణశాలలో ఉన్నప్పుడు సీత బంగారు జింకకోసం శ్రీరాముణ్ని ఆశ్రయించింది. ఫలితంగా శ్రీరాముడితో వియోగం ఏర్పడింది. విభీషణుడి కథ మనకు తెలిసిందే. సొంత అన్నను కాదని శ్రీరాముడి ఆశ్రయం పొందాడు. యశోవంతుడు, సమర్థుడు కానప్పుడు తన రక్త సంబంధీకులను సైతం త్యజించాలని రామాయణంలోని ఘట్టాలు తెలుపుతున్నాయి. మహాపురుషుల ఆశ్రయాన్ని స్వీకరించినవారికీ గొప్పతనం అబ్బుతుంది. ఎటువంటి ఆధారం లేని శబరి శ్రీరాముడి ఆశ్రయాన్ని స్వీకరించి మహాత్మురాలిగా మారింది. మహాపురుషులూ ఒక్కొక్కసారి తమకన్నా చిన్నవారి ఆశ్రయం పొందాల్సి వస్తుంది. గోదావరి నదిని దాటాల్సిన సందర్భంలో గుహుడి సహాయాన్ని శ్రీరాముడు అర్థించాడు. మహాభారతంలో భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు లాంటి వీరులూ అసమర్థులైన కౌరవుల ఆశ్రయంలో ఉంటూ ప్రాణాలు కోల్పోయారు. బలహీనుడైన విరాటరాజు యశోవంతుడైన ధర్మరాజు (కంకుభట్టు)కిచ్చిన ఆశ్రయంవల్ల గోగ్రహణంలో కౌరవులను ఓడించగలిగాడు. రాధేయుడు హీనాశ్రయం వల్ల హీనస్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సమకాలీన సమాజంలోనూ గొప్పవారిని, హృదయవైశాల్యం కలవారినీ, నీతిమంతులనే ఆశ్రయించక తప్పదు. సంపదలు విరివిగా లభించినా హీనుల ఆశ్రయం తగదని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. మన అవసరాలు తీరడంలో ఆలస్యం జరిగినా సమర్థులే మనకు మేలుచేస్తారు. సంపదలు కలిగి హీనుడైన మిత్రుడికన్నా సిరులు లేని యశోవంతుడు వివేకవంతుడైన శత్రువు మేలని చాణక్యుడు చెప్పిన నీతివాక్యం అన్నివేళలా ఆచరణీయం! |
0 వ్యాఖ్యలు:
Post a Comment