శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మమ్మల్ని నమ్ము!

>> Tuesday, May 31, 2011


మమ్మల్ని నమ్ము!
- అప్పరుసు రమాకాంతరావు
నమాలీ! ఇలా పిలుస్తే పలుకుతావా? మా మానస మందిరంలో నిన్ను శంఖు చక్ర పద్మవిలాసునిగా నిలుపుకొన్నాం. సర్వం కృష్ణార్పణమస్తు అనుకొని అన్నీ నీకే సమర్పిస్తున్నాం. అంతటా వ్యాపించి ఉన్నావని నమ్మి నిన్నే వేడుకొంటున్న భక్తులం. అయినా ఇంకెన్నాళ్లు మధుసూదనా... మా ఎదురుచూపులు! తల్లి జఠరంలో ఉంటూ తొమ్మిది నెలల చీకటి జీవనం గడిపాం. జననంకోసం తల్లడిల్లే మమ్మల్ని ఆత్మతో అనుసంధానం చేసి పంచభూతాలతో కూడిన ప్రపంచంలోకి ప్రవేశింపజేశావు. హృషీకేశా! అదిగో అక్కడినుంచి మా చుట్టూ మాయ ఆవరించింది. చారుహాసుడవూ చతుర్భుజుడవూ కనుక నీతోపాటు అవతరించిన మాయను మటుమాయం చేయగలిగావు! మరి మేము? ఆ మాయలోనే పెరుగుతున్నాం. మా బాల్యమంతా అమ్మ చెంతనే గడిపాం. కూపస్థ మండూకంలా అమ్మే లోకంగా భావించి ఆనందంగా గడిపాం. ఈ మానవ జీవితంలో... అదేనా నిజమైన ఆనందం? కానే కాదు తండ్రీ! కేశవా! బాల్యాంకం అలా గడిచేపోయింది. మేము పొందినది ఆనందమో మాయానందమో తెలియదే!

యౌవనఛాయలు అంకురించాక మాలాంటి శక్తియుక్తి సంపన్నులు లేరనే గర్వం ఆవహించింది. ఇదేం మాయ శ్రీవత్సాంకా! యౌవనంలో మోహాన్ని అంకురింపజేశావు! తారసపడిన కన్యలందరూ విరహిణులుగా కనిపించారు. ఎదురుపడిన యువకులందరూ మనోహరులుగానే భాసించారు. ఏమైతేనేం? పెళ్ళిళ్లు చేసుకొన్నాం. దేహబంధం మరింత పెరిగింది. పుత్రులు, సుతలే ప్రపంచమనుకొన్నాం. మోహంతో గర్వం అధికమైంది. అసూయ ఆవరించింది. ఇతరుల ధనాన్ని చూసి అసూయపడ్డాం. ఇతరుల ఆనందాన్ని నిరసించి వారిని శత్రువులుగా చేసుకొన్నాం. భవనాలు సిరిసంపదలు సుఖాలే జీవితమనుకొన్నాం. అన్నీ... అన్నీ శాశ్వతమే అనుకొన్నాం. అయినా నీది కాదు వసుదేవసుతా తప్పు! ఇది కాదురా నాన్నా జీవితం అని చెప్పడానికి కష్టాలు సృష్టించావు. మా కళ్లముందు ఆనందంగా తిరుగాడిన తల్లిదండ్రులకు ముదిమిని కల్పించావు. వాళ్ల నునుపు మేనులో ముసలిఛాయలు ఆవరింపజేశావు. వారి అందాలు చర్మపు ముడతల్లోకి ఇంకిపోయాయి. వారి ఆనందాలు రోగాలమాటున కరిగిపోయాయి. చివరికి మమ్మల్ని విడిచి వారు వెళ్లిపోయినప్పుడైనా మేము తెలుసుకోలేకపోయాం కృష్ణా! జాగ్రత్తపడమని నీవు పంపిన సంకేతాలను గ్రహించలేకపోయాం. రెక్కలొచ్చి కన్నవాళ్లందరూ పక్షుల్లా ఎగిరిపోయి మేమున్న కొమ్మలను విడిచి వేరే శాఖలను ఆశ్రయించారు. వెచ్చగా పొట్టకు అదుముకున్న బుజ్జాయి పెద్దవాడై మరో గూడును చూసుకొని పొట్టను తన్ని వెళ్లిపోయాడు. రమ్మంటే వస్తాడా? యౌవనంలో మేం చేసినట్లే మా పిల్లలూ ప్రవర్తిస్తున్నారు. అదిగో... ఇప్పుడు జ్ఞాపకం వచ్చావు... పూర్ణచంద్ర నిభాననుడవు కనుక నీ చల్లని వెలుగును గ్రహించాం. యశోదానందనా! మేము అరిషడ్వర్గాలను కలిగిఉన్న మానవులం, కఠినులం. ఈ జీవిత చరమాంకంలో బతికి ఉండీ మరణించినవారితో సమానమై జీవిస్తున్నాం. ఒకరి కోసం ఒకరం బతుకుతూ మా దాంపత్య జీవితంలో పాపపుణ్యాలను బేరీజు వేసుకొంటున్నాం. మాలో కొందరం భార్యను కోల్పోయి, మరికొందరు భర్తను కోల్పోయి అనాథలుగా జీవిస్తున్నాం.

యాదవ శిరోరత్నా! జ్ఞానోదయం కలుగుతుందో లేదో తెలియకున్నాం కానీ... అనుభవాలు నేర్పిన పాఠాలవల్ల కరికి వరదుడిలాగా ఇక మాకు నీవే పరాప్రకృతివి అని గ్రహించాం. సర్వమూ నీ శరీరంనుంచే ఆవిర్భవించాయని నీవు బోధించిన గీత ద్వారా తెలుసుకొన్నాం. మాలోని పరమాత్మవు నీవే! నిన్ను పూజిస్తున్నాం. స్మరిస్తున్నాం. పూజలు స్మరణలు సనాతనమైనవి కావు కదా! సనాతనమైన నారాయణా... నీవే అంతర్యామివి! మేము, వర్షం కురిసిన తరవాత పర్వతాగ్రంనుంచి జాలువారిన ధారలం. సముద్రంలాంటి నీలో చేరలేని నిర్బలులం కావచ్చు. విష్ణూ! ఈ ప్రపంచమంతా సత్యం, రజస్సు, తమస్సు అనే మూడు ప్రకృతిగుణాలతో నిండి ఉందని మహానుభావులెవరో చెప్పగా విన్నాం. ఈ గుణాలన్నీ ఈ ముదిమి వయసులో కూడా మా అంతరంగాల్లో అంతర్లీనంగా ఉన్నాయేమో? ఆ తరంగాల్లో కొట్టుకొనిపోకుండా కాపాడు తండ్రీ!

పురుషోత్తమా! పంచభూతాలతో కూడిన ఈ విశ్వంలో ఏమీలేదని గ్రహించాం. మళ్లీ ప్రసాదించిన దేహాన్ని ధర్మసాధనంగా వినియోగించుకొని నిన్ను చేరే ప్రయత్నం చేస్తాం. నిజం తండ్రీ! మమ్మల్ని నమ్ము!!



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP