నేను! నేను!! నేను!!!
>> Sunday, May 22, 2011
- నాయుని కృష్ణమూర్తి
- 'నేను' ఈ కుటుంబానికి యజమానిని. అందరికీ తిండి పెడుతున్నాను. కాబట్టి నామాట ప్రతి ఒక్కరూ వినాలి. నన్ను ఎదిరించకూడదు. నన్ను తక్కువచేసి మాట్లాడకూడదు'
'నేను' కాబట్టి ఈ పనిని చెయ్యగలిగాను'
ఇలా 'నేను' ప్రతిరోజూ, ప్రతివ్యక్తి మాటల్లోనూ, చేతల్లోనూ వ్యక్తమవుతోంది. ఇది అవతలి వ్యక్తులు భరించలేని స్థాయికి కూడా వెళ్తుంది. వాళ్ళు భరించలేకపోవడానికి వాళ్ళలో కూడా 'నేను' అన్న అహంభావం ఉండటమే కారణం!
రహూగణుడు అనే రాజు తత్వజ్ఞానం కోసం కపిల మహాముని దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నది పల్లకిలో. పల్లకిని నలుగురు బోయీలు మోస్తున్నారు. పెద్దంత దూరం వెళ్లిన తరవాత బోయీలు అలసిసోయారు. ఒక్కొక్కరికి కాస్సేపు విశ్రాంతి ఇవ్వడానికి ఒక అదనపు బోయీ కావాలి. చుట్టూ చూశారు. దోవపక్కన చేనుకు ఒకడు కాపలా కాస్తున్నాడు. వాణ్ని తమకు సహాయంగా రమ్మన్నారు. అతడు వెంటనే వచ్చి పల్లకిని మోయడానికి సిద్ధపడ్డాడు. ఒక బోయీకి కాస్సేపు విశ్రాంతి లభించింది.
వచ్చిన కొత్తవ్యక్తి జడ భరతుడు. అహంకారం, మమకారం, మిథ్యాజ్ఞానం ఏమీలేనివాడు. భరతుడికి పల్లకి మొయ్యడం కొత్త. పల్లకిలో కుదుపులు మొదలయ్యాయి.
లోపల కూర్చొని ఉన్న రహూగణుడికి కోపం వచ్చింది. 'ఓరీ బుద్ధిహీనుడా! పల్లకి మొయ్యడం కూడా నీకు చేతకాదా? నిన్ను కఠినంగా శిక్షిస్తేగాని నీకు బుద్ధి రాదు' అని తిట్టాడు.
భరతుడు తలపైకెత్తి రాజు వంక చూస్తూ 'రాజా! నీ పల్లకి మోసే భారం నా శరీరానిదేగాని, అందులోని జీవుడిది కాదు. కాబట్టి నేను నీ పల్లకి మొయ్యడంలేదు. స్థూలత్వం, కృశింపు, వ్యాధులు, మనోవ్యధలు, ఆకలిదప్పులు, భయరోషాలు, జరామరణాలు, నిద్రాజాగరణలు, అహంకార మమకారాలు దేహంతోపాటు పుడతాయి. దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. 'ఈ దేహమే నేను' అని నేను అనుకోవడంలేదు. కాబట్టి నేను జీవన్మృతుణ్ని. యజమాని, సేవకుడు అనే సంబంధం విధికృతమైంది. ఆ వ్యవహారం శరీరానికే పరిమితం కాని జీవుడి వరకు రాదు.
రాజు అనే అహంభావంతో నువ్వు నన్ను శిక్షిస్తానంటున్నావు. ఉన్మత్తత, జడత్వం స్వభావంగా ఉన్న నన్ను నీ శిక్ష ఏం చేస్తుంది? స్తబ్ధుణ్నయిన నాపట్ల నీ ఆగ్రహం, శిక్ష రెండూ వ్యర్థమే!' అన్నాడు.
భరతుడికి మించిన గురువు ఉండడని రాజుకు తెలిసిపోయింది. దిగ్గుమని పల్లకి దిగి భరతుడి కాళ్లకు మొక్కి తత్వబోధ చెయ్యమని వేడుకొన్నాడు.
భరతుడిలాగా మనమందరమూ ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అంత స్తబ్ధులుగా ఉండి ఈ ఆధునిక ప్రపంచంలో జీవించడం కష్టం.
కాని కొంతవరకైనా జ్ఞానం సంపాదించుకొని, అహంభావాన్ని ఒకింత అదుపులో పెట్టుకోగలిగితే మనం మరికొంత సుఖంగా జీవించగలం. ఎదుటివాళ్లు కొంతస్వేచ్ఛగా వూపిరి పీల్చుకోగలుగుతారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment