మణిద్వీప వర్ణన
>> Saturday, May 7, 2011
శ్రీదేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంది
(12వ స్కందంలో 10 - 12 అధ్యాయములు)
______________________________
కంచికామకోటి వారి వెబ్ సైటులో chapter 160
నుండి మణిద్వీప వర్ణనని తెలుగు అర్ధంతో చూడవచ్చును
http://www.kamakoti.org/
______________________________
ఈనాడు సాహిత్యం పుటల నుండి :
( http://www.eenadu.net/
శ్రీమాత నివాసం చింతామణి గృహం
విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని, శివాత్మక మణిద్వీప నివాసినీ అయిన ఆ
తల్లిని స్మరించుకోవటం ఎంతో శుభప్రదం. ఆ అమ్మ మణిద్వీపంలో ఎలా
అలరారుతోంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ
దేవీభాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా
మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది.
పరదేవత అయిన ఆ శ్రీమాత ప్రపంచాన్నంతటనీ పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం
నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది.
సర్వలోకోత్తమోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు సర్వపాపాలూ
నశిస్తాయని దేవీభాగవతం పన్నెండో స్కంధం వివరిస్తోంది. దుష్టశిక్షణ,
శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరీ మాత నివసించే
చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు
నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని
వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి.
వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో
కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే
సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు,
సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ
సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ
ఉంటాయి. చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు
ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే
ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని
ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన
అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం
కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా
ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన
చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు,
మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు
ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు
తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన
ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత
నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి
ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ
శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి
బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా
చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ
ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది.
ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ,
స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య,
విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను
నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక
నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప
తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి,
చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు
ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద
మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా
భువనేశ్వరీ మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి
అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ
అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను
వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి.
జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం
దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని
తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ
పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి
సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ
కథా సందర్భం ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి
గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.
- డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు
______________________________
మణిద్వీప వర్ణన ని ఒక కవి పద్యాల రూపంలో రచించి
గానం కుడా చేసారు (ఆడియో ప్రస్తుతం లభించడం కష్టం)
పిడిఎఫ్ ఫైలు లంకె :
http://www.4shared.com/
2 వ్యాఖ్యలు:
శ్రీ దేవీ భాగవతం, అందులో చెప్పబడిన మణిద్వీపం యొక్క వర్ణన పరమాద్భుతంగా ఉంటుంది. మా దగ్గర వచనరూప శ్రీదేవీ భాగవతం ఉందండి....
శ్రీ దేవీ భాగవతం, అందులో చెప్పబడిన మణిద్వీపం యొక్క వర్ణన పరమాద్భుతంగా ఉంటుంది. మా దగ్గర వచనరూప శ్రీదేవీ భాగవతం ఉందండి....
Post a Comment