శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భయాన్నే భయపెట్టాలి

>> Monday, May 2, 2011

భయాన్నే భయపెట్టాలి
- డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి
'ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తల ఎత్తుకుని ఉండగలడో... అలాంటి స్వర్గతుల్యమైన స్వేచ్ఛా ప్రపంచంలోకి, భగవంతుడా, నా ఈ దేశాన్ని మేల్కొల్పు' అని విశ్వకవి రవీంద్రుడు దైవాన్ని ఎంతో హృద్యంగా ప్రార్థిస్తాడు తన 'గీతాంజలి'లో. జీవితంలో సజీవమైన మృత్యువు ఏదైనా ఉందంటే అది 'భయం' అని చెప్పాలి. పాపం ఎక్కడుంటే భయం అక్కడే ఉంటుందని పెద్దలంటారు. మొహమాటం, పిరికితనం, సంకోచం, జంకు, బెదురు, దడ- ఇవన్నీ భయానికి లక్షణాలు. జీవితంలో భయానికంటే భయంకరమైంది మరొకటి లేదు. భయమే దుఃఖం. భయమే నరకం.

కొందరికి మరణమంటే భయం. ఇంకొందరికి నలుగురి ముందు ఉపన్యసించాలంటే భయం. మరికొందరికి చీకటన్నా, ఏకాంతమన్నా భయం. కీటకాలు, సరీసృపాలు, విషజంతువులు... ఇలా మనుషుల భయానికి కారణాలెన్నో. మనసు మర్మాలు తెలిసిన నిపుణులు భయాన్ని రెండు రకాలుగా విశ్లేషిస్తారు. ఒకటోది వాస్తవమైన భయం, రెండోది కల్పిత భయం. విషయాన్ని భూతద్దంలో చూసినట్టుగా పెద్దగా ఊహించుకొని అనవసరంగా భయపడటమన్నమాట! భయానికి సంబంధించిన అవగాహన లేమి, భయాన్ని కలగజేసే గతానుభవాలు, మనిషిని నిర్వీర్యంచేసి పిరికివాడిగా తయారుచేస్తాయి. భయాన్ని మృత్యువుతో పోల్చుతారు స్వామి వివేకానంద.

వాస్తవానికి భయం అనేది మనిషికి జన్యుపరంగా సంక్రమించిన ఓ వరం. అది మనిషిలో సమపాళ్లలో ఉంటే కార్యాచరణకు ప్రేరణగా ఉంటుంది. మోతాదు మించితే మనిషిని కుంగదీస్తుంది. భారతంలో యుద్ధం చేయలేనని, తండ్రులను, తాతలను, మేనమామలను, బంధుమిత్రులను చంపలేనని అర్జునుడు భయపడతాడు. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినా అర్జునుడి మనసులోంచి భయం తొలగిపోదు. విశ్వరూప సందర్శనం అయిన తరవాతగాని అర్జునుడికి వాస్తవం బోధపడలేదు.

భయం మనిషి అదుపులో ఉంటే, జీవితంలో అతడు విజయాలు సాధించగలుగుతాడు. భయం అదుపులో మనిషి ఉంటే అపజయాల పాలవుతూ ఉంటాడు. భయాన్ని అదుపులో పెట్టుకోగలిగేవారు చొరవను అభివృద్ధి చేసుకోగలుగుతారు. చొరవను పెంచుకోగలిగే ఆత్మవిశ్వాసం, విజయం సాధించగలమనే నమ్మకం భయాన్ని అదుపులో ఉంచుతుంది. పరిస్థితులు, పరిసరాలు, సంఘటనలు వంటి వాటిలో భయం ఉండదు. మన స్పందనలో 'భయం' బయటపడుతుంది. ఓ పని కష్టంగా ఉంటుందని మనిషి భయపడడు. ఆ మనిషి భయపడతాడు గనుకే ఆ పని తనకు కష్టంగా తోస్తుంది.

భయం అనేది ఓ సంక్లిష్ట విషయం. భయం కలిగినప్పుడు మనస్తాపం ఎక్కువై మానసిక ఉద్రిక్తతతో పాటు అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా మనిషి జబ్బు పడే ప్రమాదముంది. అందుకే ఎవరైనా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థితిని రూపొందించుకోవాలి. అవమానాలకు కుంగిపోకూడదు. సన్మానాలకు పొంగిపోకూడదు. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను సమదృష్టితో చూడటం అలవరచుకోవాలి.

అవగాహన లేనివారు, పిరికివారు, అసమర్థులు, ఆత్మన్యూనత ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ప్రతి చిన్న విషయానికీ భయపడతారు. భయానికి మూలకారణమైన పరిస్థితులు విశ్లేషించి కారణాలు తెలుసుకోవాలి. భయం కలిగించే ఊహలకు కళ్లాలు వేయాలి. వాటిని అదుపులో ఉంచాలి. హేతుబద్ధంగా ఆలోచించలేకపోవడంవల్ల భయం ఎక్కువవుతుంది. భయం ఎక్కువ గలవారు తమకు తామే సహాయం చేసుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. దీనికి నిర్మాణాత్మక కృషి అవసరం. చిన్నపిల్లలు పరీక్షలంటే ఆందోళన చెందుతారు. విజయం సాధించడానికి ఆందోళన కొంతవరకు ఉపకరిస్తుంది. ఈ ఆందోళన మోతాదు మించితే మనిషికి పరిష్కారశక్తి దెబ్బతింటుంది.

సమర్థత, కోరికలను సమన్వయం చేయగలిగితే విజయం సాధించడం తేలికవుతుంది. మనిషి తన సమర్థత గురించి ఆలోచించకుండా కోరికలను విచ్చలవిడిగా స్వాగతిస్తే, ఆ మనిషికి ఆందోళన కలిగి- ఉన్న సమర్థత కూడా తగ్గుతుంది. అది భయానికి దారితీస్తుంది. అందుకే చీకటిని నిందించకుండా మానవ ప్రయత్నమనే దీపాన్ని వెలిగించాలి. భయాన్ని భయపెట్టేలా, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP