ఎవరు సద్గురువు?
>> Thursday, March 10, 2011
మహత్యాలన్నీ మాయకు సంబంధించినవే అంటారు మెహెర్‌బాబా. నకిలీ గురువులు చేసే మహత్యాలన్నీ మాయలో ఉన్న జనాన్ని ఇంకా మాయలోకి నెడతాయి. సద్గురువు మహత్యాలు చెయ్యడు. ఒకవేళ చేసినా వాటిని జనాన్ని మాయనుంచి బయటకు లాగడానికి మాత్రమే ఉపయోగిస్తాడు.
'మంచి ముత్యానికి, కృత్రిమ ముత్యానికి మధ్య తేడా మామూలు మనిషి కనిపెట్టలేడు. ముత్యాల వర్తకుడికి మాత్రమే అది సాధ్యం. అలాగే సద్గురువుకు, నకిలీ గురువుకు మధ్య తేడా మామూలు మనిషి కనిపెట్టలేడు. అవతార పురుషుడు గానీ, ఇంకో సద్గురువు గానీ ఆ తేడా కనిపెట్టగలడు.' అంటారు మెహెర్‌బాబా. వేదాంత గ్రంథాల్ని లోతుగా కాకుండా పైపైన చదివి మిడి మిడి జ్ఞానంతో వారు అలా తయారవుతారు.
వేదాంత గ్రంథ పఠనం వల్ల 'నేను భగవంతుణ్ణి' 'అహం బ్రహ్మాస్మి' అనడం సులభం. అవతార పురుషుడు, సద్గురువు కూడా 'నేను భగవంతుణ్ణి' అనే చెబుతారు. వీరు అలా చెప్పడం, వేదాంత గ్రంథాలు చదవడం వల్ల కాదు. బ్రహ్మమే తాము అయినందువల్ల. కొందరు వేదాంత గ్రంథాలు చదివి, అలాంటి బ్రహ్మానుభవం తమకు లేదని తెలుసుకొంటారు. అయినా వారు అమాయక ప్రజల ముందు ప్రగల్భాలు పలుకుతుంటారు. ఇది కపటం. కపటం అంటే ఏమిటి? తాను ఏది కాదో అదిగా కనబడటం. భగవదనుభూతి కలుగకపోయినా, కలిగినట్లు నటించడం.
కపటంతో కష్టాలు తప్పవు
ఎవరైనా నీమీద గొప్పదనం ఆపాదించి, నిన్ను ఆరాధించడం, దండలు వేయడం చేస్తున్నారనుకోవడి. అప్పుడు మీ అంతట మీకే తెలుస్తుంది, ఆ గొప్పదనానికి, గౌరవానికి మీరు అర్హులు కారని. అయినా సరే, అడ్డు చెప్పకుండా, మొదట్లో వీటినన్నింటినీ మీరు స్వీకరించారే అనుకుందాం. ఎందుకు అంటే అలా స్వీకరించడం మీకు సంతోషాన్ని కలుగజూస్తుంది కాబట్టి. కాని మీ అంతరాత్మ మిమ్మల్ని గుచ్చుతూ ఉంటుంది. ముందు ముందు జరగబోయే పరిణామాల గురించి మీరు ఆందోళన కూడా పడుతూ ఉంటారు. బలవంతంగా రుద్దబడిన ఈ గౌరవాల్ని స్వీకరిద్దామా వద్దా అనే సందిగ్ధపడతారు.
ఒక్కసారి గనక మీరు ఈ ఆపాదించబడిన గొప్పదనాన్ని అడ్డు చెప్పకుండా స్వీకరించినట్లయితే, ఇక ఆ పరిస్థితిలోంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. కొంత కాలానికి మీ అంతరాత్మ కూడా మిమ్మల్ని హెచ్చరించడం, బాధపెట్టడం మానుకుంటుంది. ఎందుకంటే దానికి మీరు అలవాటుపడిపోతారు. అప్పుడిక అది ఒక వ్యసనంగా మారుతుంది. అప్పుడు మీరు నిజమైన గురువుగానో, సాధువుగానో, సన్యాసిగానో నటించడం మొదలుపెడతారు. అలా ఎవరైతే కపటంగా ప్రవర్తిస్తారో వారు వారి దగ్గరకు వచ్చే భక్తుల సంస్కారాలన్నింటిని గ్రహిస్తారు. ఆ సంస్కారాల బరువు మోస్తూ వారు వచ్చే జన్మలో పడరాని కష్టాలు పడవలసి ఉంటుందని మెహెర్‌బాబా హెచ్చరించారు.
తేడా ఏమిటి?
నకిలీ గురువులు ఎక్కువగా సద్గురువులు తక్కువగా ఉన్న ఈ లోకంలో సద్గురువులను కనిపెట్టడానికి మెహెర్‌బాబా కొన్ని కొండగుర్తులు చెప్పారు. కపట సన్యాసులు, సాధువులు, గురువులు తమకే గాక చుట్టూ ఉన్న సమాజానికి కూడా హాని చేస్తుంటారు. కపట గురువుల మాయ మాటలకు వారి శిష్యులు లొంగిపోయి, వారు చేసే చిన్న చిన్న మహత్యాల్ని గొప్పగా చెబుతూ, అతిగా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెడుతుంటారు. మహత్యాలన్నీ మాయకు సంబంధించినవే అంటారు మెహెర్‌బాబా. నకిలీ గురువులు చేసే మహత్యాలన్నీ మాయలో ఉన్న జనాన్ని ఇంకా మాయలోకి నెడతాయి. సద్గురువు మహత్యాలు చెయ్యడు. ఒకవేళ చేసినా వాటిని జనాన్ని మాయనుంచి బయటకు లాగడానికి మాత్రమే ఉపయోగిస్తాడు.
నకిలీ గురువుల చుట్టూ హంగు, ఆర్భాటం ఎక్కువ. సద్గురువులు వీటికి దూరంగా సాదాసీదాగా ఉంటారు. నకిలీ గురువుల చుట్టూఎంత ఎక్కువగా జనం పోగయితే వారికి అంత గొప్ప. సద్గురువులు గుంపు కోసం వెంపర్లాడరు. నకిలీ గురువులు తమ పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడతారు. సద్గురువులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా, భగవంతునికి దగ్గరగా ఉంటారు. నకిలీ గురువులు ఎప్పుడూ ఏదో ఆందోళనలో మునికిఉంటారు. సద్గురువుల సాన్నిధ్యంలో ఎల్లప్పుడు ఆనందం వెల్లివిరుస్తుంటుంది. సద్గురువులను ఆశ్రయించినవారు ఆ ఆనందంలో పాలు పంచుకొంటూ ఉంటారు.
- దీవి సుబ్బారావు
[ఆంధ్రజ్యోతినుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment