శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హింస అహింస విచక్షణ

>> Sunday, March 20, 2011


[- అప్పరుసు రమాకాంతరావు]
హింస చేయటం వదలి అహింసే పరమధర్మంగా మెలగాలని నీతిసూత్రాలు బోధిస్తున్నాయి. అహింసా ధర్మాన్ని అనుసరించి క్షమ, శాంతి, దయ కలిగి ఉండాలి. అహింస కోసం, శాంతి, క్షమతో ప్రవర్తిస్తే ఎదుటివారి దృష్టిలో అసమర్థుడిగా జీవించే హీనపరిస్థితి కలిగే అవకాశం ఉంది. సర్వదా క్షమ, సర్వదా తీక్షణత్వం శ్రేయస్కరం కాదు. ఈ కారణం చేతనే పండితులు క్షమకు ఉపవాదాన్ని చెప్పారు. హింస అనాచరణీయమనే నీతి సర్వకాలాల్లోనూ యోగ్యం కానేరదు. మన దారిన మనం వెళ్తోంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి అనవసరంగా మనల్ని బాధిస్తే శాంతం వహించడం అసమర్థత కిందికే వస్తుంది. శాంతంగా ఉండేవాణ్ని భార్యాపుత్రులు సైతం అపహాస్యం చేస్తారని ప్రహ్లాదుడు తన మునిమనమడైన బలి చక్రవర్తికి బోధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మనకు లౌక్యత గురించి తెలుపుతుంది.

ఒక మహా నాగసర్పం భయంకరమైన విషకోరలతో పెద్దపడగతో బుసలు కొడుతూ ఆ దారిన వెళ్లే ప్రతి మనిషినీ కాటు వేసి చంపాలని ప్రయత్నించేది. పాముందనే భయంతో ప్రజలందరూ అధిక శ్రమకోర్చి చుట్టు దారిలో ప్రయాణించేవారు. ఒకరోజు ఆ నాగసర్పం సంచరించే దారిగుండా ఒక ముని నడుస్తూ అడవి వైపు వెళ్లసాగాడు. మనిషి నడుస్తున్న శబ్దం గమనించి నాగసర్పం ఆ మునిని కాటు వేయడానికి జరజరా రాసాగింది. దాని రాకను గమనించిన ముని 'నాగరాజా! నన్ను కాటువేయాలని వస్తున్నావు కదా! కాస్త ఆగు! నేను చెప్పేది విను' అన్నాడు. తనను గమనించగానే భయపడి పరుగెత్తే జనాన్ని చూసిన విషసర్పం, ముని పవిత్రతనూ ఆయన ధైర్యాన్నీ గమనించి ఆగిపోయింది. అప్పుడు ముని ఆ విషసర్పానికి కొన్ని మంచి మాటలు చెప్పాడు.

'నాగరాజా! గత జన్మలో ఇంతకన్నా శ్రేష్ఠమైన జన్మ ధరించిన నీవు, కొన్ని పాపకర్మల వల్ల నాగుగా జన్మించావు. నీకు ద్రోహం చేయని వారిని కాటువేస్తూ, ఈ జన్మలో మరింత పాపాన్ని మూట కట్టుకొంటున్నావు. ఇక ముందు నీవు ఎవరికీ హాని చేయనని వాగ్దానం చేస్తే వచ్చే జన్మ మళ్లీ శ్రేష్ఠమైన జన్మ లభించేట్లు దీవిస్తాను' అన్నాడు. నాగుపాము తలవంచి 'మునివరా! నాకు జ్ఞానోదయం కలిగించావు. ఇకపై నేను ఎవరికీ హాని తలపెట్టను, కాటువేయను' అని వాగ్దానం చేసింది. ఆ పామును దీవించి ముని వెళ్లిపోయాడు.

అప్పటి నుంచీ నాగసర్పం ఎవరికీ హాని చేయకుండా బతకసాగింది. అతి త్వరలోనే చాలామందికి పాము విషయం తెలిసిపోయింది. అది చాలా మంచితనంతో అమాయకంగా, అపాయం తలపెట్టకుండా జీవిస్తోందని అందరూ గమనించారు. దాంతో పిల్లలు, పెద్దలు నాగసర్పాన్ని ఆటపట్టించడం ప్రారంభించారు. రాళ్లతో కొట్టడం, కర్రలతో గాయపరచడంవల్ల సర్పానికి దేహం నిండా పుళ్లూ తీవ్రగాయాలయ్యాయి. మునికి ఇచ్చిన వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పాము బాధలను సహిస్తూ గాయాలపాలై జీవనం గడుపుతోంది.

కొన్నాళ్లకు ఆ ముని అడవినుంచి గ్రామంవైపు వెళ్తూ ఆ నాగసర్పాన్ని గమనించాడు. ఒంటినిండా గాయాలతో, బాధతో నాగసర్పం బలహీనంగా, దీనంగా పడిఉంది. ముని ఆశ్చర్యపోతూ, 'ఎందుకిలా గాయాలయ్యాయి' అని అడిగాడు. ఆ పాము జరిగిందంతా చెప్పి 'ఇతరులకు హాని తలపెట్టి, హింసకు పాల్పడవద్దన్నారని మీరు బోధించడంవల్ల నేను ఎవరికీ ఏమీ చేయడంలేదు' అన్నది.

అప్పుడా ముని 'పిచ్చిదానా! నిన్ను హాని తలపెట్టవద్దనీ, కాటు వేయవద్దనీ చెప్పాను కాని, నీ స్వాభావిక నైజమైన 'బుస' కొట్టడం వద్దన్నానా!' అంటూ చక్కాపోయాడు.

కనుక, మనిషి ప్రతిఘటన అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎంతవరకు మంచిదంటే- తననూ, తనవారినీ హానికి గురిచేస్తున్న వారిపై క్రోధం వహించక తప్పదు. ఇదే ప్రాతిపదికపై భారతయుద్ధం సందర్భంలో యుద్ధం చేయాల్సిందిగా గీతాచార్యుడు ఫల్గుణుడికి బోధించాడు. తనకు అవమానం జరిగినా రోషం కలగని వానితో స్నేహం ఉన్నా, ద్వేషం ఉన్నా ప్రయోజనం సమమేనని కిరాతార్జునీయంలో భారవి చెప్పాడు.



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP