శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాకొంపలోకి రావద్దు ఫో ! అన్నాడు మా అయ్య .ఈ మహాశివరాత్రి రోజు

>> Tuesday, March 1, 2011


చేతులారంగశివుని పూజింపడేని ..నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యము మనసున దలుపడేని ..పుట్టనేటికి తల్లుల కడుపుచేటు

ఇలాంటి చదువులు నేర్పితివి ? నిన్నువదలకూడదని పలువురు పెద్దలచే చెప్పిస్తివి? నమ్మి నీదగ్గరకొస్తే ,నాఇంట్లో అడుగు పెట్టొద్దంటుంటివి ?

అందులోనూ ఇది మాహాశివరాత్రి . పరపకృపాళువైన నీ ఆనందతాండవం లోకాలను మైమరపించేరోజట .
ఈరోజు నన్ను నీదరికి చేరకుండా ఆంక్షలు విధించావు. ఇంకేం కృపాళువో నువ్వు !
నేను చేసిన దోషమేమిటో గాని నాకైతే తెలియదు . అడిగేస్థాయినాకు ఎలాగూ లేదనుకో చెప్పేగొప్పతనం నీకువున్నదికదా ! చెప్పవచ్చునే ?


నన్నుఈ శివరాత్రి రోజు నీఇంట్లోకి రావద్దంటావా ? లోకంలో ఇంతమందిరాగా నేనెక్కువయ్యానా నీకు ?
అయినా మనకొంప వైభవం లోకానికి తెలుసుకదా ! కొండలూ బడలేగదా !ఏమన్నాయక్కడ దోచుకు పోవడానికి .ఆక్రమించడానికి ? ఏదో ఒకమూలన కూర్చోకపోయానా ! నీకేం ఇబ్బంది?

ఇలా నిషేదాజ్ఞలు విధిస్తావా ? ఎంతకాలం నీ బింకం అదీ చూస్తా ? నీ వీక్నెస్ నాకు తెలుసు .నే నేడిస్తే నువ్వు చూళ్ళేవు . ఏదో పోనీలే శుభమా అని పండుగచేపించుకుంటున్నాడు .మధ్యలోఈ ఏడుపులు పెడబొబ్బలతో మనం అల్లరి చేయడం ఎందుకులే అని ఊరుకుంటూన్నా గాని,లేకుంటే నాఏడ్పు ప్రారంభించితే వచ్చినవాల్లంతా తలా ఓమాటంటారు నిన్ను .ఏమిటయ్యా ఇంతపెద్దోనివి అలా పిల్లల్ని ఏడిపిస్తావు అని. నీపరువే పోద్ది .

హమ్మా ! సేవకులంటే అంత లెక్కలేదా నీకు ? . ఈరోజేదో !పదిమంది వస్తున్నారుకదా ని మమ్మల్ని మరచిపోతున్నావేమో? రేపు వీళ్లంతా వెళ్లాక నీ ఇల్లెవడు కడగాలి ? బండలెవడు తుడవాలి ?
..ఇదే ఈవిషయం మా అమ్మకు చెబితే ఏమయ్యుండేది నీ పరిస్థితి ? తండ్రివి కదా ఎందుకులే అని వదిలేస్తున్నాను .

కాకపోతే నేను తప్పుచేశానేమో ! చేస్తే చేసి ఉండవచ్చు . తప్పులుచెయ్యటం నాకు సహజం కదా ? అదీ నీకోసమే . నేను తప్పులుచెయ్యాలి, అయినా నువ్వు కరుణించాలి అప్పుడుకదా ,నీ గొప్పతనం లోకానికి తెలిసేది ? మనలో మాట
స్వామీ ! తప్పులు చేసినోళ్లనల్లా నువ్వు తిరస్కరిస్తే నీకు మిగిలేదెవరు చెప్పు ? ఎక్కడన్నా పదిమందిని చేర్చుకుంటారు నలుగురిలో నాదింత పెద్దకుటుంబమని చూపుకుంటారు. ఇలా ఉన్నవాల్లను దూరం గాపెడతారా ఎవరైనా !
అసలే మనకు వైకుంఠం నుంచి కాంపిటీషను ,ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఉన్నవాళ్లు జారిపోనివ్వకుండా ? అయ్యో ! ..నీకిలాంటి లౌక్యాలుకూడా తెలియకపోతుండె .అందుకే జనం నిన్ను అమాయకుడనేది

ఏదో వాగానని కోప్పడమాక . నాబాధకూడా నీ గూర్చే . ఇప్పుడిలా ఇంత అవసరమైన రోజున నన్ను ఇంట్లోకి వద్దంటివి. రోజులెలా ఉన్నాయి ? పిల్లలను బయటకు స్వేచ్చగా ఇలా గాలికొదిలే రోజులా ఇవి ?నాకేం ! హాయిగా బలాదూరు తిరుగుతాను పనెగ్గొట్టి . ఆతరువాత నువ్వే .అయ్యో! వీణ్ణి అనవసరంగా బయటకు పంపానే ? ఏచెడు సావాసాలు పడతాడో నని దిగులు పడతావు. మరి తండ్రివికదా ! నీకామాత్రం ప్రేమ సహజం . అందుకని నన్నిలా ఇంకెప్పుడు బయటుంచమాక .సరేనా .


[ తెచ్చి ఈమాయలో పడవేసి .. ఎక్కడో బంధువుల ద్వారా "సూదకం "అనే నెపం పెట్టి .ఈ శివరాత్రికి తనదగ్గరకు రాకుండా నిషేధించిన నాతండ్రి పై కోపంతో ఇలావ్రాసుకుంటున్నాను . మీరెవరన్నా ఆయనదర్శనానికి వెళ్లినప్పుడు నాబాధఓసారి చెప్పండి]
మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

13 వ్యాఖ్యలు:

కొత్త పాళీ March 1, 2011 at 4:46 PM  

నమకం ఒక్కసారి మననం చేసుకోండి.
As a wise pundit said - Rudradhyaya details the imminence and omnipresence of the Lord and profusely illustrates the upanishadic statement - "సర్వం ఖల్విదం బ్రహ్మ"
ఆయన ఎక్కడలేడు? ఆలయం అనేది ఒక వంక అంతే.

చిలమకూరు విజయమోహన్ March 1, 2011 at 4:53 PM  

"సూదకం " మాకు కూడా అయితే
మహాశివరాత్రి రెండురోజుల ముందుగా మాకు పూర్తి కానిచ్చి మాలాంటి గోలోక వైకుంఠ భక్తులను ఆయన రాత్రికి మమ్మల్ని ఆహ్వానించారు. :)

Rao S Lakkaraju March 1, 2011 at 5:04 PM  

చేతనయినట్లు తలుచుకుంటే చాలు. అయినా ఆరోజు తలుచుకోకుండా ఎలా వుంటాము ?

Snkr March 1, 2011 at 5:28 PM  

తెలియక అడుగుతాను... శ్మశానంలో వుంటూ, కపాలాల్లో తినే రుద్రునికి కూడా సూదకాల పట్టింపులు వుంటాయాండి? :)

Rao S Lakkaraju March 1, 2011 at 5:40 PM  

రుద్రుడు చేసే సేవలకు సూదకాల పట్టింపులు ఉండవేమో గానీ రుద్రునికి చేసే సేవలకి సూదకాల పట్టింపులు ఉంటాయనుకుంటాను.

సుజాత March 1, 2011 at 5:43 PM  

సాయి లీలామృతంలో ఎక్కిరాల భరద్వాజ గారు "మనసులో దుఃఖం లేకపోతే ఎటువంటి అశౌచం సోకదనీ, పూజలేమీ ఆపక్కర్లే"దనీ అంటారు ఒకచోట.

అయినా సరే... ఇప్పుడే శివాలయానికి బయల్దేరుతున్నాను, మీరన్నమాటలు చెప్పి వస్తాన్లెండి !

Snkr March 1, 2011 at 5:45 PM  

రావు గారు, మరి కొద్దిగా వివరంగా చెప్పండి.

Rao S Lakkaraju March 1, 2011 at 5:59 PM  

రుద్రునికి దైవత్వం ఉంది ఆయన చెయ్యాల్సిన పనులకు ఆటంకం ఉండదు. మానవమాత్రులం మనకి అటువంటి immunity లేదు కదా పెద్దలు చెప్పినట్లు చేయుటయే సబబు కదా అని నా భావన.

Snkr March 1, 2011 at 6:19 PM  

శివుని మీద అద్భుత పదవిన్యాసం, ఈరోజు మీకోసం:

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే(2)
వలరాజు పగవాడే
వనిత మోహనాంగుడే(2)
కొలువై ఉన్నాడే

పలు పొంకమగు చిలువల
కంకణములమర
నలు వంకల మణిరుచులవంక తనర(౩)
తలవంకనలవేలు
తలవంకనలవేలు కులవంక నెలవంక(2)
వలచేత నొసగింక వైఖరి మీరంగ
కొలువై ఉన్నాడే...........

durgeswara March 1, 2011 at 7:19 PM  

ఇంతమంది బంధువులు నాకు స్వాంతనచేకూరుస్తున్నారు.ధన్యవాదములు.

ఇక మనం సామాన్యమానవులం . మనజీవనవిధానం,మన మానసికస్థాయి లోనే మనం నడవాలి. పెద్దలు చాలాలోతుగా ఆలోచించి పెట్టినవి ఆచారవ్యవహారాలు. కనుక అవి పాటించవలసినదే .అవిషయాన్ని పరమాత్మ గీతలో నర్మగర్భంగా హెచ్చరిక చేశారుకూడా . మహాత్ములు ఒక్కోసారి లోకాతీతస్థితికి వెళ్ళి చెప్పేమాటలు అవి వాళ్లస్థాయివాల్లకే గాని మనకు కాదు. మహాత్ములు అశుద్ధం పక్కనకూర్చుని కూడా ఏ మనోవికారాలు లేకుండా ఉండగలరు . మనం ఎంతచదివినా ,ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఆస్థాయిని చేరలేము. కనుక మనం పెద్దలు నిర్ణయించిన బాటన నడవాల్సిందే. ఎవరి నిర్ణయం వారిదైతే ధర్మం కల్లోలమవుతుంది.
బాధ వ్యక్తిగతం .ఏమో ఏపాఠాలు నేర్పడానికి ఇవన్నీ కల్పిస్తాడో హరి .చెప్పలేం .

శివ చెరువు March 1, 2011 at 7:44 PM  

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

చింతా రామకృష్ణారావు. March 1, 2011 at 8:50 PM  

ఆ పరమ శివుని వద్దకు మీరేవిధంగా చూచినా వెళ్ళే పనే లేదు. అందుకే అతడలాగన్నాఁడు. ఎలాగంటారా!
మీ గుండే అతనికి గూడై, గుడియై మీ మానసారాధనే నిత్యం పొందుతూ, పొంగుతూ ఉండేది ఆశివుడు. అతని అదృష్టం ఏమిటంటే కోపంతో నువ్వే దూరంగా పో నానుంచి అని మీరు అనలేదు. అలా అనుంటే అతనికి దిక్కేంటి?
మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః
సౌచాసౌచములు మనో భావాలు మాత్రమే. హృదయానికి అసౌచంటదు. హృదయారాధనను ఆశివు~డే కాదుకదా ఆశివాణి కూడా కాదన లేదు. మీరేమీ బాధ పడకండి. బాధపడుతున్నారంటే ఇంకా మీ హృదయంలో మలినం ఉందని గ్రహించండి. గుడికే వెళ్ళాలని భావించకండి. అలా వెళ్ళాలని ఉందంటే ఇంకా అపరిపక్వ స్థితిలో ఉన్నట్టు మిమ్ములను మీరు గ్రహించండి.
పరమేశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు.

మందాకిని March 1, 2011 at 9:34 PM  

చింతా వారికి ధన్యవాదాలు.
ఈ రకంగా బాధపడే వారందరికీ శిరోధార్యమయిన చక్కటి మాటలు చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP