శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సెల్ఫోన్ నిర్మాణం లోనూ ఆథ్యాత్మికరహస్యాలున్నాయా !

>> Thursday, March 3, 2011

” సెల్ ఫోన్ “

శాస్త్రజ్ఞునులు, తమ,తమ రంగాలలో అనేక పరిశోధనలు చేసి, ఎన్నో విషయాలను
తెలుసుకొని, వాటి ఆధారంగా సమాజానికి పనికివచ్చే ఎన్నో వస్తువులను,
పరికరాలను తయారుచేస్తుంటారు. ఉదాహరణకు: కంప్యూటర్; టీ.వి.; సెల్-ఫోన్
మొదలైనవి. అయితే, సెల్-ఫోను నుంచి లభించే ఫలితాన్ని పొందాలంటే, దానిని
ఎట్లా తయారుచేసారో అన్న శాస్త్ర పరిజ్ఞానం మనకు అవసరంలేదు; కేవలం దానిని
ఉపయోగించే జ్ఞానం వుంటే చాలు. అదే విధంగా, భగవంతుని పొందాలంటే, భగవంతుని
గురించి తెలిపే వేదాలు, ఉపనిషత్తులు అందరూ తెలుసుకొని వుండనక్కరలేదు. ఆ
శాస్త్రాల సారాన్ని, సంక్షిప్తంగా తెలిపే పూజా విధానాలు, ధ్యాన పద్ధతులు,
జపమంత్రాలు, భక్తి చేసే పద్ధతులను తెలుసుకొని, ఆచరించగలిగే పరిజ్ఞానం
వుంటే, కావలిసిన ఫలితాన్ని మనం పొందగలం. మనకున్న ఆసక్తిని బట్టి, ఏ
శాస్త్రమునైనా లోతుగా తెలుసుకోవటంలో ఎప్పుడూ సమస్య ఉండదు.

అనేక హిందూ ఆధ్యాత్మిక శాస్త్రాలలో భగవంతుని గురించి తెలిపే విషయాలు
ఎన్నో,ఎన్నెన్నో వున్నాయి. వీటిని తెలుసుకోవటానికి కొన్ని క్రమ
పద్ధతులుకూడా వున్నాయి. అంటే, పై స్థాయిని చేరుకున్న తరువాత తెలుసుకొనే
విషయాలను, క్రింది స్థాయిలో తెలుసుకోవటంవల్ల అంత లాభం వుండదు. కనుకనే ఒక
క్రమ పద్ధతిలో పొందటం అభిలషణీయం అని పెద్దలు చెబుతారు. ఈ క్రమ పద్ధతులు
ఎట్లా వుంటాయో క్రింద చూద్దాం. అంతకంటేముందు, పైన “సెల్‍ఫోన్” గురించి
కొంత చెప్పుకోవటం జరిగింది. సెల్‍ఫోన్ ని ఆన్ చేయగానే, “మెనూ” అని
కనిపిస్తుంది. ఈ మెనూని నొక్కగానే, ఫోనులో ఏ యే అంశాలున్నాయి అని
చూపిస్తుంది. ఒక్కొక్క అంశాన్ని ఎన్నుకున్నప్పుడు, ఆ అంశంలోని వివరాలను,
వివరంగా చూపించటం జరుగుతుంది. ఈ అంశాలుకూడా ఒక క్రమపద్ధతిలో అమర్చబడి, ఒక
దానితో మరొకటి సంబంధం కలిగివుంటాయి. సెల్‍ఫోన్ కి, భగవంతుని గురించి
తెలుసుకొనే పద్ధతులకు సంబంధం ఏమిటి అని మీకు సంశయం రావచ్చు. నిజం
చెప్పాలంటే, ఏ సంబంధమూలేదు. అయితే, నేను సెల్‍ఫోన్ లోని ప్రధాన అంశాలను
పరిశీలిస్తున్నప్పుడు, భగవంతుని ఆరాధించేటప్పుడు, మనం అనుసరించే
క్రమపద్ధతులు ఈ సెల్‍ఫోను లో కూడా శాస్త్రజ్ఞులు చొప్పించినట్లుగా నాకు
అనిపించింది. ఈ రెండు పద్ధతులలోవున్న సారూప్యాన్ని, కేవలం హాస్యంగా
చెప్పటమే ఈ వ్యాసం ఉద్దేశం. అంతేతప్ప, ఆధ్యాత్మిక విషయాలను తక్కువచేసి,
హేళనగా చెప్పటం నా ఉద్దేశం కాదు. మరి ఇంక ముందుకు పోదాం:–

(1): పంచాగం:- ఏదైనా ఒక మంచి పనిని చేసేముందు, మనం ఆ రోజు తిధి, వార,
నక్షత్రాలను, శుభ సమయాల్ని చూసుకొని, పనిని మొదలు పెట్టటం అనేది అనాదిగా
వస్తున్న ఒక ఆచారం. — సెల్‍ఫోన్ లో CALENDAR లో కూడా ఇటువంటి వివరాలే
చూపించటం జరిగింది. తరువాత..

(2): ఆరాధన వివరాలు:- మనకు ఎంతోమంది దేవతలున్నారు. ఒక్కొక్క
కార్యసిద్ధికి ఒక్కొక్క దేవతను ఆరాధిస్తూవుంటారు. కాబట్టి, ఏ దేవత; దేవత
పేరు; దేవత యొక్క స్థానం మొదలైనవి కొన్ని గ్రంధాలు ద్వారా ముందుగా
తెలుసుకోవాల్సి వుంటుంది. — సెల్‍ఫోన్ లో CONTACTS లోకి వెళ్తే, మనకు
కావాల్సిన వ్యక్తుల పేర్లు; చిరునామా మొదలైన వివరాలుంటాయి. ఆ తరువాత….

(3): దేవతా రూపాలు:- మనం ఆరాధించాలనుకున్న దేవతలయొక్క స్వరూపాలు గురించి
కొన్ని గ్రంధాలు ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా, సెల్‍ఫోన్ లో
GALLERY లో కూడా మనం ఎంచుకున్న ఫోటోలు కనిపిస్తాయి. తరువాత….

(4): ప్రయత్న సాధనాలు:- మనం ఆరాధించాలనుకున్న దేవతల రూపాలను ఎన్నుకున్న
తరువాత, ఆ రూపాలను మన మనసులో, పూజా మందిరంలో కనిపించేటట్లుగా
పెట్టుకుంటాం; ఆ దేవతలయొక్క కీర్తనలను వింటూవుంటాం; ఆ దేవతలను
పూజించటానికి ఒక సమయం నిర్ధారించుకొని, ఆ సమయానికే లేచి, పూజలు చేయటానికి
ప్రయత్నిస్తాం. — సెల్‍ఫోన్ లో APPLICATIONS లోకి వెళ్తే, అక్కడ camera;
Audio player; Alarm మొదలైనవి మనకు కనిపిస్తాయి. ఆ తరువాత.. ….

(5): అమరికలు:- మన మనస్సులో, మన పూజా మందిరంలో స్థాపించుకున్న దేవతా
రూపాలు, మనకు ఏ విధంగా, అంటే, దర్శనీయంగా వుండాలి అని ఊహించుకొని,
తదనుగుణంగా ( విగ్రహా ) ఆరాధనని కొనసాగిస్తాం — సెల్‍ఫోన్ లో SETTINGS
లోకి వెళ్తే, Display; Lights, Tones మొదలైనవి కనిపిస్తాయి. ఆ తరువాత ….

(6): జ్ఞాన భాండాగారం:- ఇది చాలా ముఖ్యమైన విషయ స్థితి. మనకు నచ్చిన
దేవతా రూపాన్ని ఎంచుకొని, ఆరాధన చేయటం మొదలు పెట్టిన తరువాత, ఆ దేవతపై
మనకు కలిగే నమ్మకాన్నిబట్టి, ఆ దేవతను గాఢంగా ఆరాధించటంకోసం, కొన్ని మూల
మంత్రాలను తెలుసుకుంటాం; ఆ దేవతను ఏ విధంగా పిలవాలి; ఏ విధంగా ఆ దేవతను
సాక్షాత్కరింపచేసుకోవాలి అనే విషయ జ్ఞానాన్ని మూల శాస్త్రాల ద్వారా
తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం — సెల్‍ఫోన్ లో STORES లోకి వెళ్తే, Short
cuts; Connectivity; Call; Acess మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి. తరువాత
….

(7): అంతర్జాలము:- భగవంతుడు సర్వాంతర వ్యామి. ఇందుగలడు, అందులేడని
సందేహము వలదని భక్త ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పాడు. కాబట్టి,
భగవంతుడితో ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా సంధానం చేయటానికి ప్రయత్నించాలి. —
సెల్‍ఫోన్ లోకి వెళ్తే, INTERNET దర్శనమిస్తుంది. దీని ద్వారా మనం
ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవచ్చు. తరువాత .. ..

(8): కర్మల పట్టిక:- భగవంతుడి దగ్గర మన పూజలు; భక్తి, శ్రద్ధలకు
సంబంధించి అన్ని వివరాల చిట్టా వుంటుంది. — సెల్‍ఫోన్ లో, LOG లోకి
వెళ్తే, మన సంభాషణల; సందేశాల వివరాల చిట్టా వుంటుంది. ఆ తరువాత .. ..

(9): సందేశం: సర్వాంతరవ్యామి అయిన భగవంతుడికి, మన మనసు అనే ” అంతర్జాలం
ద్వారా, అప్పటివరకు మనం చేసిన పూజలు, వ్రతాలు, భక్తి ప్రార్ధనల చిట్టాను
వివరిస్తూ, ” హే భగవాన్, ఇన్ని పూజలు, వ్రతాలు భక్తితో చేసాను; అయినను,
నీవు నాకు ఇంకా దర్శనమీయ రాలేదు; కరుణించలేదు, రక్షించు “, అని భక్తితో
సందేశం పంపిస్తాం. సెల్‍ఫోన్ లో, MESSAGE లోకి వెళ్తే, ఇటువంటి సందేశాలనే
పంపించవచ్చు. ఆ తరువాత ఆఖరిగా … ..

(10): జీవ సంభాషణలు:- ఆర్తితో భగవంతుడికి పంపే మన భక్తి సందేశం,
మనోవాయువేగంతో అక్షరుడైన భగవంతుడికి ఎప్పటికప్పుడు సజీవంగా అందుతూనే
వుంటుంది. అందిన వెంటనే, ఆయన మనల్ని అందుకుంటాడు; ఆదుకుంటాడు. —
సెల్‍ఫోన్ లో AIRTEL LIVE అని కనిపిస్తుంది. అయితే, ఇది కేవలం AIRTEL
Service Provider లో మాత్రమే కనిపిస్తుంది. ” AIR – TEL – LIVE ” దీని
అర్ధం, మనం AIR ద్వారా, TELL అంటే, చెప్పదలుచుకున్న మాటలు, సందేశాలు,
LIVE అంటే జీవంతో పంపుతూ మనకు HELP సహాయం చేస్తూవుంటుంది అని
చెప్పుకోవచ్చు.

ఉపసంహారం:- పై వివరణల దృష్ట్యా, సెల్‍ఫోన్ ని జాగ్రత్తగా, మంచి పనులు
చేయటంకోసం మాత్రమే వాడండి. స్వస్తి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP