శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మాఘమాసం వచ్చేస్తోంది .

>> Thursday, February 3, 2011

ఇక రెండురోజులలో మాఘమాసం ప్రారంభం, అత్యంత శక్తివంతం ప్రభావ వంతం, శక్తి
పూజలు, విష్ణు పూజలు, సౌర వ్రతాలు, శివ పూజలు అభిషేకాలు, శ్రీపంచమి,
మాఘపాదివారాలు, రథసప్తమీ వ్రతం, భీష్మాష్టమి, భీష్మేకాదశి, మార్కండేయ
జననం, మహా శివరాత్రి, మాఘ స్నానాలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో అద్భుత
విషయాలు కలిగి మానవమాత్రులు అతి సులభంగా తరించ గలిగే ఎన్నో వ్రతాలు,
నోములు, ఉపాసనా విధులతో కూడిన మాఘ మాసం ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా పొందు
పరచడానికి చేసే ప్రయత్నమే ఇది. ఇక్కడ పొందు పరచే విషయాలు అక్కడా ఇక్కడా
వెతికి సంకలనం చేయబడ్డవి అంతర్జాలం (Internet), గ్రంధములు, పెద్దల ద్వారా
తెలుసుకున్నవి.

వసంత పంచమితో మొదలు
"మాఘమాసేతు సంపూజ్య కర్తవ్యః సుమహోత్సవః
ఆయముత్సవో వసంతోత్సవః"
అంటే మాఘశుద్ధ పంచమినాడే వసంత ఋతువు ప్రారంభమవుతుందనీ, వసంత పంచమి
నామాన్ని అనుసరించి ఇది ఋతువుల పండుగని తెలుస్తోంది. చదువుల తల్లి శ్రీ
సరస్వతీదేవి జన్మించిన అత్యంత పుణ్యప్రదమైన మాసం "మాఘమాసం"
శ్రీ అనగా సంపద. ‘జ్ఞాన సంపత్ప్రద' అయిన సరస్వతిని ఆరాధించడానికి విశేష
ఫలప్రదమైన పంచమిని ‘శ్రీ పంచమి' అని, ‘వసంత పంచమి' ‘మదన పంచమి' అని కూడ
అంటారు. ఆరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం సర్వశ్రేష్ఠకరమనీ, ‘శ్రీ'
అనగా లక్ష్మి పరమైన భావన ఉన్నందున శ్రీ పంచమినాడు లక్ష్మీదేవిని మంద
కుసుమాలతో పూజించడం శుభప్రదమని, సరస్వతీదేవి జన్మదినం మాఘశుద్ధ పంచమి
కనుకనే శ్రీ పంచమిని సరస్వతీ జయంతిగా కూడా జరుపుకుంటారు.
‘సరః' అంటే కాంతి అని, సరస్వతీ అంటే కాంతినిచ్చేది అని అర్థము. జ్ఞానం
ప్రసాదించే తల్లి కనుకనే శ్రీ పంచమిని వసంత పంచమి అని అంటారు.
సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి, సరస్వతి పద్మాసనస్థయై ఉంటుంది. పద్మం
జ్ఞానానికి సంకేతం కాబట్టి వాగ్దేవి జ్ఞానప్రదాయినిగా వుంది. జ్ఞానశక్తి
చేత బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేస్తాడు. కనుక సరస్వతి బ్రహ్మదేవునకు
అర్ధాంగియైనది.
చతుర్భాహువులతో శోభిల్లే సరస్వతీదేవి ఒక చేతిలో గ్రంథాలు అదే బుద్ధి. మరో
చేతిలో జపమాల అదే మనస్సు. బుద్ధిజ్ఞాన రూపమై జ్ఞానశక్తిని వ్యక్తం
చేసినప్పుడు మనసు క్రియారూపమై క్రియాశక్తిని బహిర్గతం చేసి కార్యరంగంలో
ప్రవేశిస్తుంది. మనోబుద్ధులు ఏకమైన స్థితిలో మనో హృదయాలు కలవడంచేత
మహత్తరమైన జీవనగీతం ఆలపించబడుతుంది అదియే వీణానాదం.
‘‘మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపిచ
పూర్వేహ్ని సమయం తృత్యా తత్రాహ్న సంయతః శుచిః"
అంటే మాఘ శుక్ల పంచమినాటి ఉషోదయ కాలాన స్నానమాచరించి, పూజామందిరంలో
పూజాపీఠంపై నూత్న వస్త్రాన్ని పరచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదళ
పద్మాన్ని లిఖించి, వాగ్దేవి ప్రతిమనుంచి, కలశస్థాపన చేసి, దేవి
సన్నిధిలో కలం, పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజగావించి,
సరస్వతీదేవిని షోడశోపచార, అష్టోత్తరాలతో పూజించాలి. నివేదనగా ఆవుపాలతో
చేసిన పాయసం సమర్పించాలి.
శ్రీ పంచమిరోజున విద్యారంభం, విద్యాభ్యాసం, చేయడం శుభప్రదమని
అక్షరాభ్యాసాలు చేయించడం, విద్యార్థినీ విద్యార్థులు తమ పుస్తకాలను
సరస్వతీదేవి ముందుంచి పూజించడంవల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది. పిల్లలు
చదువుల్లో బాగా వృద్ధిచెందుతారని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.
శ్రీ పంచమినాడు విశేషంగా సరస్వతి క్షేత్రమైన ‘బాసర’లో సరస్వతీదేవి ఆరాధన---
మహోత్సవం గొప్పగా జరుపుతారు. - కావ్యసుధ

------------------------------------------------------------------------------
శ్రీగురుభ్యోన్నమః

భాగవతులందరికీ నమస్సులు



శ్రీ నారద పురాణము,ఉత్తర భాగము, , మోహినీ చరిత్రములోని కాష్టీలోపాఖ్యానమునందు కల మాఘ మహాత్యము అనే ముప్పైఒకటవ అధ్యాయము నుండి సేకరించినది.



ఈ క్రింది శ్లోకము రోజు స్నానము చేయునప్పుడు చదవటం మాఘమాస స్నాన పూర్ణ ఫలితాన్ని కలుగచేస్తుంది. సూర్య భగవానుని స్నానం చేస్తూ ఈ క్రింది విధంగా ప్రార్థించడం ద్వారా పూర్ణ మాఘమాస స్నానా ఫలితాన్ని, అనంతమైన ఇతర ఫలితాలని ఇస్తాడని నారద పురాణం పేర్కొంటోంది.



యదనేక జనుర్జన్యం యజ్ జ్ఙానాజ్ఙానతః కృతమ్! త్వత్తేజసా హతం చాస్తు తత్తు పాపం సహస్రధా!!

దివాకర జగన్నాధ ప్రభాకర నమోస్తుతే! పరిపూర్ణ కురుష్వేదం మాఘస్నానం మమాచ్యుత!!



భావము:అనేక జన్మలలో తెలిసీ తెలియక చేసిన కర్మల వలన కలిగిన పాపములెన్నో కలవు, నీ తేజస్సు చే ఆ అనంతములైన పాపములు హతములగును (గాక). హే దివాకరా! జగన్నాధా! ప్రభాకరా! నీకు నమస్కారములు! ఓ అచ్యుతా నా పాపములను హరించి నా ఈ మాఘస్నానమును పరిపూర్ణము కావింపుము.





మాఘ స్నానానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? నారద పురాణం పేర్కొన్న ప్రకారం దేవతలు తమ తమ శక్తులను/ తేజస్సులను ఈ మాసంలో జలములందు నిక్షేపం చేస్తారు అందువల్లనే మాఘ మాసంలో స్నానం అతి శ్రేష్ఠం. (స్నానమనేది శారీరక శుద్ధి కొఱకు కాదు ధర్మ సేవనమునకు)



నదీ స్నానం నది కి అభిముఖంగా చేయాలి, ఇతర స్థలాలో ఐతే (ప్రస్తుతం మన స్నానపుగదులలో అనుక్కుందాం) సూర్యునికి అభిముఖంగా చేయాలి. స్నానానికి ముందు గంగేచ యమునేచైవ.... శ్లోకంతో గంగాది తీర్థములను ఆవాహన చేసి (మమోపాత్త........ స్నానమహం కరిష్యే అంటూ సంకల్పం కూడా చెప్పుకోగలిగితే మేలు) ఆ నీటితో స్నానం చేయాలి.



సూర్యోదయమునకు ముందే స్నానము చేసి సూర్యుడు ఉదయించులోగానే సూర్యుని ప్రార్థించాలి (సంధ్యావందనాదులు, సూర్య స్తోత్రములు, ఆ సంధ్యావందనాది అధికారం లేని వారు సూర్య స్తోత్రాదులు)



మాఘస్నానం, మాఘ వ్రతం అతి మహిమాన్వితం, నారద పురాణం ప్రకారం ఎన్నో ఉన్నత లోకాలను, మోక్షమును కూడా ప్రసాదించగలదు మాఘం



రేపటి నుండే మాఘం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇంతే పొందుపరుస్తున్నాను. ఎవరైనా దీనిని ఉపయోగించుకోడానికి వీలు ఉంటుంది అని తొందరగా పెట్టడానికి ఈ మాత్రమే పొందు పరచడం జరుగుతోంది. రేపటికల్లా మాఘ మహాత్మ్యం మొత్తం (నారద పురాణంలోనిది పైన చెప్పినది) పొందు పరచటానికి ప్రయత్నిస్తాను.



-మీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ


[సత్సంగము గ్రూప్ లో ఉంచిన వ్యాసము మరికొంతమందికి చేరాలని ఇక్కడ ఉంచాను]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP