మనీషాపంచకమ్
>> Monday, February 21, 2011
అవతారమూర్తి సైతం మానవదేహం ధరించి వచ్చినప్పుడు సత్వ, రజో, తమో గుణాలతో ఉంటాడు. కాల, కార ్య, కారణ, కర్తవ్య నిమిత్తంగా ఉంటాడు. ఎంత సర్వజ్ఞుడైనా, జగత్తుకు ఏదైనా మహాపరిసత్యం బోధించదలచినప్పుడు, సాధారణ మానవుని వలె ప్రవర్తిస్తారు. శ్రీరాముడు యోగ వాశిష్ఠాన్ని శ్రద్ధగా ఆలకించాడు. శ్రీకృష్ణుడు విష్ణుసహస్రనామాన్ని నిష్ఠగా విన్నాడు. అలాగే శంకర భగవత్పాదులు పరబ్రహ్మస్వరూపమై కూడా అద్వైత బోధను ఇలాగే అందుకున్నారు. ఆ సందర్భం రమణీయం. మనోహరం. హృదయంగమం.
అద్వైతం... అమరం
శిష్య సమేతంగా వెళుతున్న శంకరుల కంటికి కటికవాడు ఒకడు కనిపించాడు. అతని వెంట నాలుగు శునకాలున్నాయి. జాత్యభిమానాన్ని ప్రకటిస్తూ శంకరులు "తొలగు..తొలగు'' అన్నారు. దేనిని తొలగమంటున్నారు? దేహాన్ని తొలగమనడం అంటే మీదీ దేహమే. నాదీ దేహమే. రెండూ అన్నమయాలే. రెండూ పంచభూతాల వల్ల ఏర్పడినవే. ఇక తేడా ఎక్కడ ఉంది? పోనీ జ్ఞాన దృష్టితో చూసినా నీలో ఆత్మ ఉంది. నాలోనూ అదే ఉంది. కనుక బ్రాహ్మణ, చండాల అని దేనిని చూసి అంటున్నారు? సూర్యడు గంగాజలం పైనా, మురికి కాలువలోని నీటిపైనా ఏకకాలంలో ప్రసరించడం లేదా? ఆత్మ అంటే అద్వైత భావనే కదా? ఇక తొలగిపోవలసింది ఏది? అన్నాడు ఆ చండాలుడు.
శంకరుల హృదయాన్ని ఈ ప్రశ్నలన్నీ జ్ఞాన కిరణాల వలె తాకాయి. బ్రాహ్మణుడు - "చండాలుడు అనే భావాన్ని, పావనుడు - పాపి అనే భేద భావాన్ని, ద్వంద్వాలను విడిచి సమత్వాన్ని, సమభావాన్ని, సమదృష్టిని ఆచరిస్తాను. మహోదాత్తమైన దివ్యబోధనందించిన మీరు ఈశ్వరులే తప్ప వేరొకరు కాదు''. అంటూనే "అంతే కాదు సర్వ సృష్టిని ఆత్మ స్వరూపంగా చూడగలిగిన వాడు, నిశ్చిత జ్ఞాని అయినవాడు, ఎవరైనా సరే నాకు గురుసమానుడు. సర్వకాలాలా నాకు ఆరాధనీయుడే'' అన్నారు శంకరులు.
ఆ ఎరుకే జ్ఞానం
"బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఉన్న చైతన్యమే సమస్త జీవకోటిలోనూ ఉంది. అన్ని కాలాల్లో ఈ భావంతో వెలుగుతున్న తత్త్వజ్ఞుడు నాకు పరమ గురువే. నాకు మాత్రమే కాదు. జగత్తు అంతటికీ గురువే'' అన్నారు భగవత్పాదులు. అంతే కాదు తన ఎదుట నిలబడి, దర్శనాన్ని అనుగ్రహించినది సాక్షాత్తూ ఆ పరమశివుడే అని గ్రహించారు శంకరులు. భేదభావం నశించిన స్థితే మనీష. తిరుగులేని, మరువరాని మహాపరిసత్యం. నిశ్చితమైన, స్థిరమైన భావం. ఆ విషయాన్నే శంకరులు తన మనీషా పంచకంలో తేటతెల్లం చేశారు. భేదభావం లేకపోవడమే అద్వైతం. భౌతిక స్థితిలో రెండూ కనిపించినా, అధిభౌతిక స్థితిలో రెండూ ఒకటేననే స్థిరచింతన కలిగినా, ఆధ్మాత్మిక స్థితిలో, రెండంటూ లేవని, ఉన్నది ఒకటేనని ఎరుక కలగడమే జ్ఞానలబ్ధి.
సిద్ధత, శుద్ధత, వాటికి తోడు వినయమూ తోడైతే, ఆనంద తారకస్థితిని అందుకోవడం ఎంత సులభం?
ఆ స్థితిని అనుభవించడం ఎంత సుందరం?
ఆ స్థితిలో ఆత్మానందం కలగడం ఎంత శివం?
ఆ స్థితిలో సంస్థితం కావడం ఎంత సత్యం?
ఒకే స్థితిలో అన్నిటినీ, అన్ని స్థితులలో వాటిని మనిషాయత్తంగా అనుభవించగలగడం సాధ్యమేనని, జ్ఞానస్వరూపులైన శంకరులు నిరూపించారు.
- వి.ఎస్.ఆర్, మూర్తి,
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త.
1 వ్యాఖ్యలు:
శంకర భగవత్పాదులు ఈ సన్నివేశాన్ని తన అనుభవంగా మాన్యులకూ, సామాన్యులకూ సజీవ సత్యంగా కనిపించే విధంగా వివరించారు. ఈ అపురూప నగ్న సత్య జ్ఞాన బోధనా సన్నివేశాన్ని శ్రీమాన్ మూర్తిగారు అద్భుతంగా వివరించారు. వారికి , శ్రీమాన్ దుర్గేశ్వరరావుగారికీ నా ధన్యవాదములు. ఐతే ఆ మనీషా పంచకాన్ని యథా తహంగా , ఉంటే తెలుగు అనువాదంతో హరి సేవ ద్వారా ప్రకటిస్తే మరీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
http://andhraamrutham.blogspot.com
Post a Comment